top of page

పోలవరానికి ‘ఇంకుడు’ ముప్పు!

Writer: DV RAMANADV RAMANA
  • ప్రధానంగా కోయిదా నుంచి పోలవరం మధ్యే ఈ సమస్య

  • నదీగర్భంలోని భూమి పొరల్లో ఇంకిపోతున్న నీరు

  • రోజుకు సగటున 28 టీఎంసీలు మాయం

  • దీనివల్ల భవిష్యత్తు ప్రాజెక్టుకు ఇబ్బంది

  • కేంద్ర జలసంఘం హెచ్చరించినా పట్టించుకోని ప్రభుత్వాలు

మన రాష్ట్రానికి ప్రధాన నీటి వనరులు గోదావరి, కృష్ణా నదులే. ఇంకా చాలా నదులు ఉన్నప్పటికీ వాటి వల్ల పరిమిత ప్రయోజనాలే దక్కుతున్నాయి. కారణం.. గోదావరి, కష్ణమ్మలా ఇది జీవనదులు కాకపోవడమే. వర్షాకాలంలో క్యాచ్‌మెంట్‌ (నదీపరివాహక ప్రాంతాలు) ఏరియాల్లో భారీ వర్షాలు కురిసినప్పుడు వరద రూపంలో నదుల్లోకి నీరు వస్తుంది. వర్షాలు తగ్గిపోగానే చాలా నదుల్లో నీరు ఎండిపోతుంటుంది. కానీ కృష్ణా గోదావరి నదుల్లో సీజనుతో సంబంధం లేకుండా తక్కువ పరిమాణంలో అయినా నీరు అందుబాటులో ఉంటుంది. అందుకే వీటిని జీవనదులు అంటారు. ఏటా లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ పాలిట జీవధారగా పేరొందిన గోదావరి ఇప్పుడు ఒక సమస్య ఎదుర్కొంటోందని నిపుణుల నివేదికలు హెచ్చరిస్తున్నాయి. అందే ఇంకుడు సమస్య. నదిలో నీరు ప్రవాహ సమయంలోనే భూమిలోకి ఇంకిపోతోందని, ఇది భవిష్యత్తులో ముప్పుగా పరిణమించవచ్చని అంటున్నారు. గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులకు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు నికర జలాలు అందుకుండాపోయే ప్రమాదం ఉందంటున్నారు. వర్షాకాలంలో వరదలతో ముంచెత్తే గోదావరికి ఈ సమస్య ఏమిటి? నమ్మదగినదిగా లేదని అనిపించవచ్చు. కానీ వరదలు సంభవించేది వర్షాకాలంలో మాత్రమే. మిగతా సీజన్లలో నదిలో నీరు అంతంతమాత్రంగానే ఉంటుంది. అది కూడా ఇంకిపోతే నదిపై ఆధారపడిన నీటిపారుదల, తాగునీటి పథకాలు వట్టిపోతాయని అంటున్నారు.

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

సాధారణంగా నదులన్నీ పర్వత ప్రాంతాల్లో పుట్టి వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ, ఆ మార్గంలో ఉన్న చిన్న చిన్న వాగులు, వంకలను.. ఆయా ప్రాంతాల్లో కురిసే వర్షాల నీటిని తమలో కలుపుకుంటూ పెద్ద నదులుగా మారుతుంటాయి. చివరికి సముద్రంలో కలిసిపోతుంటాయి. అధికశాతం నదులు వర్షాకాలంలోనే జలకళ సంతరించుకుంటాయి. మిగతా కాలాల్లో నీరులేక బోసిగా కనిపిస్తుంటాయి. చాలా నదుల నీరు భూమిలోనే ఇంకిపోతుంటుంది. ఆ కారణంగానే చాలా నదులు, ఏర్లు కాలగమనంలో కలిసిపోయి చరిత్రగానే మిగిలిపోతుంటాయి. ఇంకుడు స్థాయికి మించి వరద ప్రవాహం ఉన్న నదులు మాత్రమే అన్ని కాలాల్లోనూ నీటితో కళకళలాడుతుంటాయి. అటువంటి నదుల్లో దక్షిణ భారతదేశంలోని గోదావరి ప్రముఖమైనది. మహారాష్ట్రలోని నాసిక్‌లో పుట్టి ఆ రాష్ట్రంతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను సస్యశ్యామలం చేస్తున్న గోదావరి నదిలో మూడు రాష్ట్రాల్లోనూ పలు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్‌ ప్రాజెక్టులు, వందలాది గ్రామాలు, పట్టణాల పరిధిలో తాగునీటి ప్రాజెక్టులు నిర్మించారు. ఇప్పుడు మన రాష్ట్రంలో పోలవరం పేరుతో భారీ బహుళార్థసాధక ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. దీని ద్వారా సాగు, తాగు నీటితోపాటు విద్యుత్‌ ఉత్పాదన చేపట్టాలన్నది లక్ష్యం. కానీ గోదావరి నీరు ఇంకిపోతున్న పరిస్థితి ఉందని నీటిపారుదల రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా నదుల ఉపరితలంలో ఉన్న నీరు ఎండ వేడి కారణంగా కొంత ఆవిరి అయిపోతుంటుంది. అయితే అది చాలా తక్కువ పరిమాణం. అలాగే ప్రవాహ సమయంలో మరికొంత నీరు భూమి పొరల్లోకి ఇంకిపోతుంటుంది. అది సాధారణ స్థాయిలో ఉంటే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ గోదావరి నీరు సాధారణానికి మించి ఇంకిపోతోందని అధ్యయనాల్లో తేలింది.

మూడు దశాబ్దాల అధ్యయనం

గోదావరి నీరు భారీగా ఇంకిపోతున్న విషయాన్ని నీటిపారుదల ఇంజినీరింగ్‌ నిపుణులు ఆషామాషీగా చెప్పడంలేదు. సుమారు మూడు దశాబ్దాలపాటు గోదావరి నీటి పరిమాణాన్ని అధ్యయనం చేసి విశ్లేషించి దీన్ని నిర్థారించారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరిపి, నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. 1977 నుంచి 2006 వరకు అంటే గోదావరి నీటి ప్రవాహాన్ని అధ్యయనం చేసిన తర్వాత కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఈ నిర్ధారణకు వచ్చింది. పోలవరానికి 52 కిలోమీటర్ల ఎగువన ఉన్న కొయిదా నుంచి జరిపిన ఈ పరిశీలనలో ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో గోదావరి నీరు అదృశ్యమవుతున్నట్లు నిర్ధారించారు.

  • 1983 ఆగస్టు 15న కోయిదా వద్ద గోదావరిలో 58,616 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా అది దిగువన 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలవరం వద్దకు వచ్చే సరికి 40,176 క్యూసెక్కులకు తగ్గినట్లు గుర్తించారు.

  • నీటి పరిమాణం విషయానికొస్తే 1986లో కోయిదా వద్ద నదిలో 1,552 టీఎంసీల నీరు ఉండగా పోలవరం వద్దకు వచ్చే సరికి 1,345 టీఎంసీలకు తగ్గిపోయింది. అంటే ప్రవాహ సమయంలోనే 207 టీఎంసీల నీరు తగ్గిపోయినట్లు తేలింది.

  • అదే సమయంలో కోయిదాకు ఎగువన ఉన్న పేరూర్‌ గేజ్‌ నుంచి నీటి ప్రవాహంలో ఎటువంటి తగ్గుదల కనపించకపోగా వాగులు, వంకల కలవడం వల్ల నీటి పరిమాణం పెరగడాన్ని గుర్తించారు. పేరూర్‌ గేజ్‌ వద్ద 2,369 టీఎంసీ నీరు ఉండగా అది కోయిదాకు వచ్చేసరికి 3,218 టీఎంసీలుగా నమోదైంది. అంటే దాదాపు 849 టీఎంసీలు పెరిగింది. దీని ప్రకారం చూస్తే సమస్య అంతా కోయిదా నుండి పోలవరం వరకు ఉన్న ప్రవాహమార్గంలోనే ఉన్నట్లు నిర్థారించారు.

వరద తీవ్రతతో సంబంధం లేకుండానే కోయిదా, పోలవరం మధ్య ప్రతి ఏటా భారీ మొత్తంలో నీళ్లు అదృశ్యమవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వానికి చాలాకాలం క్రితమే నిపుణులు నివేదిక రూపంలో తెలియజేశారు. కోయిదా`పోలవరం మధ్య డ్యామ్‌లు, ఎత్తిపోతల పథకాలు లేవు. పైగా కొన్ని వాగులు, వంకల నుంచి అదనంగా నీరు చేరుతోంది. ఈ లెక్కన పోలవరానికి వచ్చేలోపు నీటి ప్రవాహం పెరగాలి తప్ప తగ్గకూడదు. దానికి భిన్నంగా రోజూ సగటున 28.25 టీఎంసీల నీరు మాయమవుతున్నదని నివేదికలో పేర్కొన్నారు.

ఆ నీరంతా ఏమవుతోంది?

నీటి పరిమాణం తగ్గడానికి కారణాలేమిటి? ఆ నీరు అంతా ఏమవుతోందన్న ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర జలసంఘం నిపుణులు కొన్ని కారణాలు వెల్లడిరచారు. గోదావరి ప్రవాహ సమయంలో పెద్ద మొత్తంలో నీరు భూమి లోపలి పొరల్లోకి(బిగ్‌ డీప్‌ బెడ్‌ ప్రొఫైల్‌) ఇంకి పోతున్నదని పేర్కొన్నారు. అయితే కోయిదా నుంచి పోలవరం మధ్య ఏ ప్రాంతాల్లో ఈ ప్రక్రియ జరుగుతోందన్నది నిర్దిష్టంగా గుర్తించి అక్కడ ఇంకిపోకుండా అరికట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నివేదికలో సూచించారు. పోలవరానికి 200 కిలోమీటర్ల ఎగువన ఉన్న ఖమ్మం జిల్లాలోని గుండ్లవాగు ప్రాజెక్టు వద్ద కూడా ఇదే రకమైన పరిస్థితి ఉన్న విషయాన్ని జలసంఘం ప్రస్తావించింది. అయితే పోలవరం ప్రాజెక్టుతో పోలిస్తే గుండ్లవాగు వద్ద భూమిలోకి ఇంకుతున్న నీటి పరిమాణం చాలా తక్కువ. ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని పూర్తిస్థాయిలో అరికట్టలేకపోయిన విషయాన్ని కూడా నివేదికలో ప్రస్తావించారు. ఈ రెండు ప్రాంతాల్లోనూ భూమి లోపలి పొరల నిర్మాణం దాదాపు ఒకేలా ఉందని పేర్కొన్నారు.

ఎత్తు పెరిగేకొద్దీ సమస్య తీవ్రం

పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల (150 అడుగులు) ఎత్తులో కడితే రోజుకు 32.5 టీఎంసీలు, 41.15 మీటర్ల(135 అడుగులు) ఎత్తులో కడితే రోజుకు 24 టీఎంసీిల నీరు గోదావరి నుంచి మాయమవుతుందని నివేదిక చెబుతోంది. ఈ అంశాలను పోలవరం డీపీఆర్‌లోనూ ప్రస్తావించినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తు కడితే రాష్ట్రంలో ముంపు ప్రాంతం బాగా పెరగడంతో పాటు పొరుగు రాష్ట్రాలతో సమస్యలు వస్తున్నాయి. అదే 41.15 మీటర్లకు పరిమితమైతే ఈ సమస్యలు గణనీయంగా తగ్గుతాయి. కానీ నదీ గర్భంలోనే భూమిలోకి నీరు ఇంకిపోవడం మాత్రం కొనసాగుతుంది. ఈ సమస్యను పరిష్కారానికి పోలవరం కుడి, ఎడమ కాలువల సామర్ధ్యాన్ని మరింత పెంచి, గోదావరిలో వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ నీటిని తీసుకోవడం వంటి ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని నిపుణులు చెబుతున్నారు. 45.72 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టును నిర్మిస్తే భూగర్భంలో పెను మార్పులు జరిగి దిగువన ఉన్న ధవళేశ్వరం ప్రాజెక్టుతో పాటు జనావాసాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

留言


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page