పాలసీ మార్పుతోనే మద్యం స్కామ్!
- DV RAMANA

- Jul 22
- 2 min read

ప్రస్తుతం రాష్ట్రంలో అధికార కూటమి, ప్రతిపక్షం మధ్య మద్యం కుంభకోణంపై ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయి. రెడ్‌బుక్ పాలనలో భాగంగా తమ పార్టీ నేతలను లేని లిక్కర్ స్కామ్ లో ఇరికించడం ద్వారా చంద్రబాబు సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైకాపా ఆరోపి స్తుంటే.. బ్రాండెడ్ మద్యాన్ని తొక్కిపెట్టి చీప్ క్వాలిటీ లిక్కర్‌ను ప్రోత్సహించడం ద్వారా రూ.మూడువేల కోట్లకుపైగా కుంభకోణానికి గత జగన్ ప్రభుత్వం పాల్పడిరదని కూటమి సర్కారు ఆరోపిస్తోంది. రాజ కీయ ఆరోపణలు ఎలా ఉన్నా ఈ కుంభకోణాన్ని సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) దర్యాప్తు చేస్తూ అరెస్టుల పరంపర కొనసాగిస్తోంది. దీనిపై ఏసీబీ కోర్టులో ఇటీవలే 300కుపైగా పేజీల ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో మొదటిసారి మాజీ సీఎం జగన్ పేరును ఈ ఛార్జిషీటు లోనే ప్రస్తావించారు. మద్యం ముడుపుల అంతిమ లబ్ధిదారు ఆయనేనని అందులో ఆరోపించారు. 2024కు ముందు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం మద్యం వ్యసనాన్ని, అమ్మకాలను తగ్గించడా నికి చేస్తున్న ప్రయత్నాల ముసుగులో బ్రాండెడ్ మద్యం రాష్ట్రంలోకి రాకుండా చేసిందని.. దాని స్థానం లో వైకాపాకు అనుకూలంగా ఉన్న మద్యం తయారీదారులు ఉత్పత్తి చేసే నాసిరకమైన.. ఊరూపేరూ లేని బ్రాండ్‌లను ప్రవేశపెట్టడంతోపాటు మద్యం వ్యాపారాన్ని ప్రైవేట్ షాపుల నుంచి తప్పించి ప్రభుత్వ షాపుల ద్వారానే విక్రయించింది. మొత్తం ఈ వ్యవహారంలో ముడుపులే కీలకపాత్ర పోషించాయన్నది ప్రధాన ఆరోపణ. ఎన్నికల అనంతరం ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన ఎన్డీయే సర్కారు ఈ కుంభకోణం నిగ్గుతేల్చేందుకు సిట్‌ను నియమించింది. అయితే దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలకు అటు సిట్ గానీ ఇటు ప్రభుత్వం గానీ సమాధానాలు చెప్పడంలేదు. పైవేట్ వ్యక్తులు చేస్తున్న లిక్కర్ వ్యాపారాన్ని ప్రభు త్వమే చేపట్టాలన్న నిర్ణయంతోనే ఈ స్కామ్‌కు బీజం పడిరది. కానీ కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం ఉందా.. లేదా? అన్న విషయాన్ని అటు సిట్ నివేదికల్లో గానీ.. ఇటు ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రంలో గానీ లేదు. ఈ స్కామ్‌లో బాధ్యులను వేర్వేరు స్థాయిల్లో చూడాల్సి ఉంది. లంచాలు తీసుకోవడం, కుట్ర చేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటి నేరాలకు పాల్పడ్డారంటూ సిట్ ఛార్జ్ షీట్‌లో ప్రస్తావించిన నాయకులు, అధికారులు, ప్రైవేట్ వ్యక్తులపై అవినీతి నిరోధక చట్టం కింద విచా రణ జరుగుతోంది. ఆరోపణలు రుజువైతే వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు. ప్రభుత్వం తీసుకునే ప్రతి విధాన నిర్ణయానికి మొత్తం మంత్రిమండలి సామూహికంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కుంభకోణానికి కారణమైన మద్యం పాలసీని క్యాబినెట్ ఆమోదంతో అమలుచేసి ఉంటే.. దాని పర్యవ సానాలకు అప్పటి ముఖ్యమంత్రి నేతృత్వంలోని మొత్తం మంత్రివర్గం జవాబుదారీ అవుతుంది. మరో వైపు ఎక్సైజ్ ప్రాహిబిషన్ శాఖ పరిధిలో ఈ కుంభకోణం జరిగినందున ఆనాడు ప్రత్యక్షంగా ఈ శాఖ ను పర్యవేక్షించిన మంత్రి నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో జరిగిన వాన్‌పిక్ కుంభకోణంలో అప్పటి సంబంధిత శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ జైలు కెళ్లడమే దీనికి ఉదాహరణ. ఇది ప్రజాస్వామ్య సంప్రదాయం. పాలక పెద్దల తప్పిదాలే కాకుండా అధి కార వ్యవస్థ నిష్క్రియాపరత్వం కూడా శిక్షార్హమేనని చట్టాలు ఘోషిస్తున్నాయి. చట్టవిరుద్ధమైన ఆదేశాల ను అమలుచేయడం లేదా అక్రమాలు జరుగుతున్నప్పుడు నిర్లిప్తంగా ఉండిపోవడం కూడా నేరంతో సమానమే. ఆ దృష్టితో చూస్తే విధాన నిర్ణయాల రూపకల్పన, అమలులో కీలకపాత్ర పోషించిన, అక్ర మాలను అడ్డుకోవడంలో విఫలమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ అధికారులు కూడా మద్యం కుంభకోణానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాన్‌పిక్ స్కామ్‌లోనే ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి అరెస్టు కావడం, జైలుకెళ్లడం దీనికి ఉదాహరణకు చెప్పవచ్చు. సిట్ ఛార్జ్‌షీట్ ప్రకారం.. వైకాపా పెద్దలు డిస్టిలరీల యజమానులను బెదిరించి 12 నుంచి 20 శాతం కమీషన్లు గుంజారు. దీని సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాగా ఆ సొమ్ము ఇద్దరు ఎంపీల ద్వారా అప్పటి ముఖ్య మంత్రికి అందిందనేది ప్రధాన ఆరోపణ.. అంటే ఆయనే ప్రధాన లబ్ధిదారు. ఇది కొందరి అవినీతి మాత్రమే కాదు.. విధానాల రూపకల్పన ప్రక్రియనే దుర్వినియోగం చేసి, ప్రజా ప్రయోజనాలను ఫణం గా పెట్టి వ్యవస్థను స్వార్థానికి వాడుకున్న దుశ్చర్య. న్యాయస్థానంలో ఆరోపణలు రుజువైతే ఈ కుట్ర లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరూ బాధ్యత వహించక, శిక్ష ఎదుర్కోక తప్పదు.










Comments