పిల్లలను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయకండి..
- ADMIN
- Oct 28, 2024
- 1 min read

తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడేటప్పుడు కొన్ని సందర్భాల్లో తమకు తెలియకుండానే ఒక రకమైన బెదిరింపు వాక్యాలు వాడతారు. కొందరు ఇందుకు మినహాయింపు కావచ్చు. పేరెంట్స్ పిల్లలలో వారి లక్ష్యాలను గుర్తుచేస్తూ బాగా చదవాలనే ఉద్దేశంతో కొన్ని అనకూడని మాటలు మాట్లాడుతారు. వీటిని గమనించండి.
‘మన స్థాయి కాకపోయినా నిన్ను ఈ స్కూల్లో చదివిస్తున్నాను. ఏం చేస్తావో ఏమో’..
‘ఆశలన్నీ నీ మీదే. మనకు ముందూ, వెనుక ఎవరూ లేరు’.. ‘నాకు బతకాలనే లేదు, నీ గురించే బతకడం’..
‘డబ్బులు పోతే పోనీ, నువ్వు బాగా చదివితే చాలు’..
‘డబ్బులు కడుతున్నాం గదా, తిండి అయినా సరిగా తినలేవా’..
‘నువ్వు ఫెయిల్ అయితే మన పరువు గంగలో కలుస్తుంది’..
‘తమ్ముడు/అన్నయ్య/చెల్లెలు/అక్కయ్య గురుంచి బాధ లేదు, నువ్వు ఎలా గట్టెక్కుతావో ఏమో’..
ఇంకా వ్యవసాయం/వ్యాపారం బాగా లేదని, భూములు అమ్మేశామని, అప్పులు చేశామని పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడటం నేను గమనిస్తున్నాను. అవన్నీ వాస్తవాలే కావచ్చు. కానీ ఆ మాటలు పేరెంట్స్ ఆశించిన ప్రయోజనం చేకూర్చగలవా?
మీ చదువుల గురించి మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి మీరు విధిగా మంచి మార్కులు తెచ్చుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలి, మరో గత్యంతరం లేదనే భావనను కలిగించడం విపరీత పరిణామాలకు దారితీయవచ్చు.
మరీ ముఖ్యంగా హాస్టల్లో ఉంటున్న పిల్లల దగ్గరకు పేరెంట్స్ వచ్చినపుడు కన్నీళ్లు పెడుతూ పై మాటలు అనడం చిట్టి హృదయాలను పిండేయడమే అవుతుంది. పిల్లల భవిష్యత్తుపై పేరెంట్స్ ఆందోళన చెందడం సహజం. అయితే పాత తరం కంటే కొత్త తరం ఎంతో కొంత మెరుగైన జీవితాన్ని గడపడం కూడా అంతే సహజం. తల్లిదండ్రులు పిల్లలకు జీవితం పట్ల ధైర్యాన్ని ఇవ్వాలి. ‘లక్ష్యం పెట్టుకుని ప్రయత్నించు, వస్తే మంచిది, రాకపోతే అంతకంటే గొప్పది నీ కోసం ఎదురు చూస్తుందని’ భరోసా ఇవ్వండి. ‘నీ వెనుక ఒక కుటుంబం ఉంది, నీ జయాపజయాలలో మేమూ పాలుపంచుకుంటాం, ముందుకు వెళ్లు’ అని చెప్పి చూడండి.
- సీహెచ్ దుర్గాప్రసాద్
Comments