
లావణ్యకు నిండా పదమూడేళ్ళు లేవు... ఏడో తరగతి చదువుతుంది.. చిన్న బొద్దింకను చూస్తే పరుగుపెట్టి తల్లిని పట్టుకు ఏడ్చే వయసు... ఎవరూ లేని సమయంలో తన జడ రిబ్బన్‌తో హాస్టల్ గదిలో ఉన్న కిటికీ ఊచకి బిగించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ రోజు పొద్దున్న పేపర్లలో రొటీన్ క్రైమ్ వార్తల్లో యాధవిదిగా ఈ వార్త కూడా భాగమైపోయింది. ఓ సింగల్ కాలం వార్త అంతే... అ పసిపిల్లకు తనను తాను ఇలా చంపుకోవాలని ఎలా తెలిసిందో మరి... సినిమా అర్ధం చేసుకునే వయసు కాదు. హాస్టల్‌లో ఉంటుంది కాబట్టి సీరియల్ చూసే సమయం లేదు. పోనీ మొబైల్ ప్రభావమా అంటే అదీ కాదు.. స్మార్ట్‌ఫోన్ కొనే స్తోమత లేని ఒక గిరిజన కుటుంబం. మరెలా ఈ పనికి సిద్ధపడిరది. పెద్దలు మాట్లాడుతుండగా విన్నాదేమో. ఊర్లో ఎవరైనా ఇలా చెసుకున్నట్టు తెలిసిందేమో... ఏమో మరి. పత్రికల్లో వచ్చిన దాని బట్టి ఆ చిట్టితల్లి హాస్టల్‌లో ఉండలేనని మారాం చేసింది.. ఇంకా తన స్నేహితులు ఎవరూ హాస్టల్‌కి రాలేదని.. వారందరూ వచ్చాక హాస్టల్‌కి వస్తానని తల్లితో చెప్పింది. ఏడ్చింది... బ్రతిమాలింది.. తల్లి అర్ధం చేసుకోలేదు.. ఇక అర్ధం చేసుకోనక్కర్లేదు. సరే ఇక్కడ ఆ తల్లి ఆ పిల్లను హాస్టల్‌లో వదిలి వెళ్లాలి అన్న నిర్ణయం వెనుక ఆర్ధికపరమైన కారణాలు ఉండివుండవచ్చు. తన ఇంట్లో కంటే మంచి భోజనం ఇక్కడ చేస్తుందనో.. మరోమారు ఇంటి నుంచి తీసుకురావడానికి ఆర్ధిక స్తోమత చాలకో అయ్యుండొచ్చు. మరి అన్నీ ఉన్నవారి ఇళ్లల్లో పిల్లలు వేల సంఖ్యలో హాస్టల్‌లలో అమ్మనాన్నలకు దూరంగా ఉన్నవారి సంగతి ఏంటి... పిల్లల్ని ఏ వయసులో హాస్టల్‌లో చేర్పించాలన్న విచక్షణ తల్లిదండ్రులకు లేకపోతే ఎలా? హాస్టల్‌లో కడుపు నొప్పి అని ఏడ్చిన పిల్లలకు ఓ టాబ్లెట్ ఇస్తే సరిపోతుందని సర్ది చెప్పే వార్డెన్లు, అవి నమ్మి అక్కడే వారిని వదిలి వెళ్లే పేరెంట్స్ గురించి ఏమనుకోవాలి. హఠాత్తుగా మనకి ఒక దుర్వార్త తెలిసినపుడు, మనకి నచ్చని పని చేయాల్సినపుడు మనకి కడుపులో తేడా అనిపించి విరేచనం అయ్యేలా ఉంటుంది. అంటే మనస్సుకి, పొట్టకి సంబంధం ఉంది. అలాగే మన పిల్లలు హాస్టల్‌లో కడుపులో నొప్పి అంటే అదో మానసిక సమస్యగా అర్ధం చేసుకోవాలి. అలా నొప్పి అన్న పిల్లల్ని ఇంటికి తెచ్చేసరికి చలాకిగా ఆడుకోవడం మనం చూస్తాం. తల్లిదండ్రులు పలు రకాల పనుల్లో పడి హాస్టల్ ఉన్నవారి పిల్లలను మర్చిపోయే అవకాశం ఉంటుంది.. కాని చాలా సందర్భాల్లో పిల్లలు తోటి పిల్లలతో కలవలేక అమ్మ నాన్నలను మిస్ అయ్యామనే బెంగతో ఉంటారు.
వారిలో ఈ ఒంటరితనం అనేక మానసిక సమస్యలకు దారితీస్తుంది. అప్పుడప్పుడే రజస్వల అయిన పిల్లలకు ఆ రోజుల్లో ఎలా మసలుకోవాలో తెలియదు. అనేక చోట్ల ప్యాడ్ మార్చుకునే సౌకర్యం ఉండదు. మరి కొంతమందికి రోజుల తరబడి బ్లీడిరగ్ అవుతుంది. ఎవరికి చెప్తారు ఇవన్నీ.. నేను హాస్టల్‌లో ఉండలేను అని ఓ చిన్నారి అంది అంటే అక్కడ సమస్య ఉందని అర్థం.. ఇక్కడ పిల్లలను హాస్టల్‌లో ఉంచకూడదన్న అభిప్రాయం కాదు.. కానీ ఏ దశలో? కచ్చితంగా ఒక పిల్లాడు లేదా పిల్ల హాస్టల్‌లో ఉండి తీరాలి.. అది డిగ్రీలోనో, పీజీలోనో అవ్వాలి. ఈ రోజు నీట్ పేరు మీదో ఐఐటి పేరు చెప్పో ఇంటర్‌లో ఎటూ వారికి తప్పడం లేదు. అది వారికి క్రమశిక్షణ నేర్పుతుంది. రేపు వేరే ఇంటికి వెళ్ళాల్సి వచ్చిననాడు వారు నిశ్చింతగా అక్కడ ఉండగలరు. కానీ మరీ పది పన్నెండేళ్ళలో హాస్టల్‌లలో పడేస్తే వారి జీవితం ఎటువైపు దారితీస్తుంది. జీవితాంతం ముఖ్యంగా ఆడపిల్లలు వారి అత్తవారి ఇంట్లోనో, భర్తతోనో ఉంటారు.. కనీసం ఈ చిన్న వయసులోనైనా మీ దగ్గర ఉంచండి.. మీరే వారికి కేరేజ్ కట్టండి.. స్కూల్ బస్ ఎక్కించండి.. టాటా చెప్పండి.. సాయంత్రం వచ్చేసరికి బ్యాగ్ అందుకోండి. మీరే స్నాక్స్ ఇవ్వండి.. కాసేపు మీ వీధిలో ఆడనివ్వండి. మీ దగ్గర కూర్చోపెట్టుకుని చదివించండి.. ఆ చిన్న వయసులో మీ నుంచి దూరంగా ఉంచే ప్రయత్నం చేయకండి.
దీనిమూలంగా పిల్లలు భవిత ఎలా ఉన్నా, తల్లిదండ్రుల ఆప్యాయతానురాగాలు లోపించి తరువాత యాంత్రిక జీవనంలో జీవితం గడుపుతూ ఉంటారు.
- సీహెచ్ దుర్గాప్రసాద్
Comments