చాలా రోజుల తర్వాత ఒకే చూరులో జగన్, షర్మిల
ఆకస్మికంగా ఢల్లీి బయల్దేరిన బొత్స సత్యనారాయణ
హర్యానా ఫలితాల తర్వాత జగన్‌ను దగ్గరచేసిన ట్వీట్
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన సోదరి షర్మిలతో ఆస్తిపంపకాలు సెటిల్ చేసుకుంటున్నారని, ఆమె ద్వారా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోడానికి సిద్ధపడుతున్నారంటూ రెండు రోజుల క్రితం ఆంధ్రజ్యోతి రాసిన కథనాన్ని వైకాపా సోషల్ మీడియా, ఆయన సొంత మీడియా పరోక్షంగా కొట్టిపారేసినా పులివెందుల సాక్షిగా అక్కడ ఏదో జరుగుతోంది. అందులో ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్‌రెడ్డి, ఆమె సోదరి షర్మిల ఆస్తుల పంపకాలు పూర్తయిపోతే ఇక శత్రుత్వాలను పక్కన పెడతారని ఆంధ్రజ్యోతి ప్రకటించిన 24 గంటల తర్వాత జగన్మోహన్‌రెడ్డీ సిగ్గులేదా అంటూ ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధులను గత ప్రభుత్వం నిలిపేయడాన్ని ఎండగట్టినట్టు అదే ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. దీన్ని బట్టి అన్న, చెల్లెళ్ల మధ్య సయోధ్య కుదరడంలేదని జర్నలిస్ట్ సాయి చెప్పిందే వాస్తవమైనట్టు ఉందని అంతా భావించారు. కానీ మూడు రోజుల పాటు పులివెందులలో బస చేయడానికి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి అదే సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా పులివెందులలోనే ఉండటం ఏదో జరగబోతోందనే సంకేతాలు అందిస్తున్నాయి. వైఎస్ షర్మిలతో జగన్మోహన్‌రెడ్డికి ఆస్తుల పంపకంలో విభేదాలున్నాయన్నది సుస్పష్టం. ఈ విషయాన్ని ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కేలో షర్మిల పేర్కొన్నారు. మరోవైపు జగన్మోహన్‌రెడ్డి మీడియాలో కూడా పరోక్షంగా ఇదే అంశాన్ని ఎన్నికల ముందు ప్రస్తావించారు. ఇప్పుడు ఆస్తుల పంపకం పద్ధతి ప్రకారం జరిగిపోతే, ఇక మిగిలింది జగన్మోహన్‌రెడ్డి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుతారా? లేదా అన్నదే ప్రధాన ప్రశ్న. సోనియా గాంధీని ఎదిరించి జైలుకు వెళ్తారు, జాగ్రత్త అని హెచ్చరించినా కూడా వెరవకుండా సొంత పార్టీని పెట్టుకున్న జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరరని సోషల్‌మీడియాలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సమాచారం పెడుతున్నారు. బహుశా జగన్మోహన్‌రెడ్డి పోరాట శైలిని చూసి గతంతో పోల్చుకుని ఈమేరకు పోస్టులు పెడుతున్నారు తప్ప, ఇప్పుడు ఏదైనా జాతీయ పార్టీతో కలిసి ప్రయాణించాల్సిన పరిస్థితి ప్రాంతీయ పార్టీలకు ఉంది. అందుకు వైకాపా అతీతం మాత్రం కాదు. బీజేపీతోనే వచ్చే ఎన్నికలకూ కలిసి వెళ్తామని చంద్రబాబు ఇటీవల మరోసారి ఉద్ఘాటించడంతో మోడీకి ముద్దుబిడ్డ జగన్మోహన్‌రెడ్డి అనే టైటిల్ నుంచి జగన్మోహన్‌రెడ్డి వచ్చే ఎన్నికలకు దూరం జరగాల్సిన పరిస్థితి ఏర్పడిరది. కాంగ్రెస్‌తో దోస్తీ కోసమేనా షర్మిలతో రాజీ అని ఆంధ్రజ్యోతిలో రాస్తే, భయమనేది ఆయన హిస్టరీలో లేదని, ఒక్కడే బయటకు వచ్చి టీడీపీని 23 సీట్లకు పంపాడని, ఓడి మళ్లీ 11 సీట్లకు వచ్చాడని, అయినా భయపడడంటూ సోషల్ మీడియాలో జగన్‌ను మోస్తున్నారు. మరోవైపు హర్యానాలో కాంగ్రెస్ ఓటమి తర్వాత ఐఎన్‌డీఐఏ కూటమిలో పార్టీలు మహారాష్ట్ర ఎన్నికల నాటికి ఉంటాయో ఊడుతాయో తెలియని పరిస్థితులు ఉన్నాయని, ఇటువంటి సమయంలో కాంగ్రెస్‌తో జగన్మోహన్‌రెడ్డి జతకట్టరని చెబుతున్నారు. జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డికి జాతీయ స్థాయిలో మద్దతు అవసరం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ హత్యా రాజకీయాలు జరుగుతున్నాయంటూ ఢల్లీిలో ధర్నా చేసిన జగన్మోహన్‌రెడ్డికి పొలిటికల్ పార్టీ నుంచి వచ్చిన స్పందన అంతంత మాత్రమే. ఇప్పుడు బీజేపీ`టీడీపీ జతకట్టడం వల్ల రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ఒంటరైపోయారు. ఉన్నారో, లేరో తెలియకపోయినా కమ్యూనిస్టులు చంద్రబాబుతోనే వెళ్తారు. కాబట్టి ఇప్పుడు జాతీయ స్థాయిలో జగన్మోహన్‌రెడ్డికి అకామిడేషన్ కావాలి. అనేక రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా జాతీయ పార్టీ కాకపోతే కనీసం పొత్తు లేకపోయినా మట్టికొట్టుకుపోతామన్న సంకేతాలు ఇచ్చాయి. తెలంగాణలో పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ సీట్లు సర్దుకోగా, అక్కడ ప్రాంతీయ పార్టీ బీఆర్‌ఎస్‌కు ఒక్క ఎంపీ సీటు కూడా రాకపోవడం ఇందుకు ఒక ఉదాహరణ. అలాగే ఒడిశాలో నవీన్ పట్నాయిక్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచినా, ఏ జాతీయ పార్టీ అండ లేకపోయినా ఓటు చీలిపోయి బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ఇటువంటి అనేక సంఘటనలను దృష్టిలో పెట్టుకొని జాతీయ పార్టీతో అంటకాగాల్సిన పరిస్థితి జగన్మోహన్‌రెడ్డి పార్టీకి ఏర్పడిరది. అయితే ఇందుకు షర్మిల ఆస్తుల పంపకాలు అయితేగానీ సహకరించరనేది మాత్రం ఉత్తిమాట. ఎందుకంటే.. ఈమధ్యే కాంగ్రెస్‌లోకి వెళ్లిన షర్మిల కంటే ముదుర్లు కాంగ్రెస్‌లో జగన్మోహన్‌రెడ్డి రాకను కోరుకుంటున్నారు. సోనియా నివాసం నుంచి రాకపోకలు సాగించే అనేకమంది జగన్మోహన్‌రెడ్డికి లైన్ క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆస్తులు పంచితేనే పార్టీలోకి రానిస్తారన్న మాట బహుశా సరికాకపోవచ్చు. ఏం జరిగిందో తెలియదు కానీ పులివెందులలో జగన్, షర్మిల బుధవారం భేటీ అవుతున్న సమయంలోనే కాంగ్రెస్ ఎంపీగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా చేసి, ప్రస్తుతం వైకాపా ఎమ్మెల్సీగా ఉన్న బొత్స సత్యనారాయణ మంగళవారం హుటాహుటిన ఢల్లీి వెళ్లారు. బీజేపీతో 2014లో పొత్తులో ఉన్న చంద్రబాబు 2018 నాటికి తెలంగాణలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పటికీ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి చంద్రబాబు శిష్యుడే. అలాగే కర్ణాటకలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న, అక్కడి రాజకీయాలను శాసిస్తున్న శివకుమార్‌తో కూడా చంద్రబాబుకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి చంద్రబాబు అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుందేమో. ఇటీవల హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆ పార్టీకి ఊరటనిచ్చింది. ఇక్కడ కూడా ఈవీఎంల వల్లే ఓడిపోయానని చెప్పుకుంటున్న జగన్మోహన్‌రెడ్డికి హర్యానాలో కూడా కాంగ్రెస్ ఇదే నినాదం చేయడంతో ఇప్పుడు కాంగ్రెస్, వైకాపాలు ఒక్క గొడుగు కిందకు వచ్చినట్టయ్యాయి. జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని భావిస్తున్నా దేశ రాజకీయాల్లో చుట్టూ అల్లుకుపోయిన చంద్రబాబు బిగి నుంచి దాటుకు వెళ్లడం అంత సులభం కాదు. ఎందుకంటే.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే అందుకు ఫండిరగ్ ఎవరు చేశారో, ఎక్కడి నుంచి చేశారో అందరికీ తెలుసు. 2019లో 151 సీట్లు వచ్చిన తర్వాత ప్రజలు తప్ప మరెవరూ అక్కర్లేదన్న భావనలో ఉన్న జగన్మోహన్‌రెడ్డిలో మార్పు రావడానికి కారణం కూడా ఆ ప్రజలే తప్ప మరొకరు కాదు.
Comments