(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

గార పోలీస్‌స్టేషన్ పరిధిలో ట్రైమెక్స్‌తో పాటు సరుబుజ్జిలి, బొబ్బిలిలో రూ.27 లక్షలు విలువైన కాపర్ ప్లేట్స్, ట్రాన్స్‌ఫార్మర్స్‌లోని కాపర్ కేబుల్స్‌ను చోరీ చేసిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ వివేకానంద తెలిపారు. సోమవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితులను తీసుకువచ్చి క్రైం వివరాలను వెల్లడిరచారు. ట్రైమెక్స్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌లోని కాపర్ ప్లేట్లు, కేబుల్స్ చోరీకి గురయ్యాయని వచ్చిన ఫిర్యాదుపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి దర్యాప్తు చేసినట్టు డీఎస్పీ వెల్లడిరచారు. కొమరవానిపేటకు చెందని కొమర తారకేశ్వరరావుతో పాటు గాజువాక (గంట్యాడ)కు చెందిన కదిరి హరీష్, గడ్డపాటి తిలక్, చెన్ను చంటి కలిసి ట్రైమెక్స్‌లో రూ.26 లక్షలు, సరుబుజ్జిలి, బొబ్బిలి పోలీస్‌స్టేషన్లు పరిధిలో రూ.లక్ష విలువైన ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కేబుల్స్ చోరీ చేసి వాటిని గాజువాకలోని పైలా ప్రకాష్ అనే స్క్రాప్ నిర్వాహకుడికి విక్రయించినట్టు గుర్తించామన్నారు. ట్రైమెక్స్‌లోని కాపర్ ప్లేట్లు, కేబుల్స్‌ను కారులో నాలుగు సార్లు తరలించినట్టు గుర్తించామన్నారు. కారులో తరలిస్తుండగా పట్టుబడిన నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించి వారి నుంచి 772 కేజీల కాపర్ ప్లేట్లను, కేబుల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. చోరీ కాపర్‌ను కొనుగోలు చేసిన స్క్రాప్ నిర్వాహకుడు పైలా ప్రకాష్ పరారీలో ఉన్నట్టు తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న నలుగురు పాత నేరస్తులేనని, వీరిపై వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నట్టు తెలిపారు. విలేకరుల సమావేశంలో సీఐ పైడపునాయుడు, గార ఎస్‌ఐ జనార్ధనరావు పాల్గొన్నారు.
శ్రీకూర్మం హత్య కేసులో 8 మంది అరెస్టు

గార మండలం శ్రీకూర్మంలో ఈ నెల 6న జరిగిన హత్య కేసులో గ్రామానికి చెందిన 8 మందిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ వివేకానంద తెలిపారు. సోమవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి క్రైం వివరాలను వెల్లడిరచారు. భూవివాదమే హత్యకు కారణమని ఆయన తెలిపారు. ఉప్పాడ రాములమ్మకు చెందిన 1.40 ఎకరాల భూమిని మృతుడు రాజేష్ సహకారంతో ఉప్పాడ సూర్యనారాయణ, చుక్కా రాము, అనపాన షన్ముఖరావు కొనుగోలు చేశారనే కక్షతో దాడి చేశారని తెలిపారు. కత్తులు, గొడ్డళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దారికాచి దాడి చేయడంతో రాజేష్ మృతి చెందగా, తీవ్రగాయాలపాలైన చుక్కా రాము కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. దాడి నుంచి రామును కాపాడడానికి వచ్చిన ఆయన భార్య సరోజిని గాయాలపాలైందని, దాడి నుంచి ఉప్పాడ సూర్యనారాయణ తృటిలో తప్పించుకున్నారని తెలిపారు. 2018లో భూవివాదం నేపధ్యంలోనే సూర్యనారాయణపై కొయ్య భాస్కరరావు కుటుంబ సభ్యులు దాడి చేశారని తెలిపారు. ఇప్పటికీ ఈ కేసు న్యాయస్థానంలో ఉందని, ఉప్పాడ రాములమ్మ వద్ద కొనుగోలు అగ్రిమెంట్ చేసుకున్న భూమి కొయ్య భాస్కరరావు ఆధీనంలోనే ఉందని, దీన్ని అగ్రిమెంట్ చేసుకున్నవారు స్వాధీనం చేయకుండా అడ్డుకోవడానికి ఉద్దేశపూర్వకంగానే మారణాయుధాలతో విచక్షణ రహితంగా దాడి చేశారని తెలిపారు. సూర్యనారాయణ, చుక్కా రాము, మృతి చెందిన రాజేష్ మంచి స్నేహితులని, దాడికి అదే కారణమని తెలిపారు. రాములమ్మ భూమిని కొనుగోలు చేయిండంలో కీలకంగా వ్యవహరించాడని, ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఆ భూమితో రాజేష్‌కు సంబంధం ఉందని విచారణలో గుర్తించినట్టు తెలిపారు. దాని పర్యవసానమే ముగ్గురుపై దాడి చేశారని తెలిపారు. దాడిలో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్న కొయ్య భాస్కరరావు, కొయ్య రమేష్, కొయ్య లోకేష్, కొయ్య సాయికిరణ్, కొయ్య గురయ్య, గుజ్జు లక్ష్మణ, గుజ్జు రామారావు, గుజ్జు శ్రీనును అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్టు తెలిపారు. వీరి నుంచి దాడికి ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, వీరిపై రౌడీషీట్ తెరవనున్నట్టు తెలిపారు.
Comments