2.1 కేజీల గంజాయి స్వాధీనం
నగరంలో డ్రోన్‌తో క్రైం స్పాట్‌లు గుర్తింపు
మత్తు ఆనవాళ్ల కోసం స్నిప్పర్ డాగ్స్
డీఎస్పీ సీహెచ్ వివేకానంద
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

శుక్రవారం సాయంత్రం నగరంలోని 80 అడుగుల రోడ్డులో అనుమానాస్పద కదలికలపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గూనపాలెం, చెరువుగట్టు వీధికి చెందిన యువకుడు లండ కుమార్‌ను ఒకటో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని డీఎస్పీ సిహెచ్ వివేకానంద తెలిపారు. శనివారం వన్‌టౌన్ సర్కిల్ పరిధిలోని సీఐ పైడపునాయుడు, ఎస్‌ఐ ఎం.హరికృష్ణతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నిందుతుడి నుంచి 2.1 కేజీల గంజాయిని స్వాధీనం చేసకున్నట్టు తెలిపారు. చెడు అలవాట్లకు బానిసై డబ్బులు సంపాదించాలన్న యావతో నిందితుడు కుమార్ ఒడిశాలోని పర్లాకిమిడి నుంచి గంజాయిని తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్నట్టు తెలిపారు. గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా తయారుచేసి నగరంలో యువకులకు విక్రయిస్తున్నాడని తెలిపారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు మరికొందరిని అదుపులోకి తీసుకోనున్నట్టు తెలిపారు. గంజాయిని కొనుగోలు చేసి సేవిస్తున్న కొందరు యువకులను నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు గుర్తించి వారి తల్లిదండ్రుల ద్వారా డీఎడిక్షన్ కేంద్రానికి తరలిస్తామన్నారు. జిల్లాలో గంజాయిని నియంత్రించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నేరాలను అదుపు చేయడానికి, గంజాయి, మత్తు పదార్ధాలను సేవించేవారిని గుర్తించడానికి నగరంలో డ్రోన్స్ ఎగురవేస్తున్నట్టు తెలిపారు. డ్రోన్స్ ద్వారా నేరం జరిగే అవకాశం ఉన్న లొకేషన్లను గుర్తిస్తున్నట్టు తెలిపారు. దీనికోసం ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్టు వివరించారు. గంజాయి, మత్తు పదార్ధాలను గుర్తించడానికి స్పిప్పర్ డాగ్స్‌ను రోజూ డివిజన్ పరిధిలో ఏదో ఒక ప్రాంతంలో తిప్పుతున్నట్టు తెలిపారు. ముఖ్యంగా రైల్వే, బస్‌స్టేషన్లలో స్నిప్పర్ డాగ్స్ ద్వారా గంజాయి, మత్తు పదార్ధాలను గుర్తించేందుకు వినియోగిస్తున్నట్టు తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల్లో గంజాయి, మత్తుపదార్ధాలు సేవించే ఆనవాళ్లను డాగ్స్ ద్వారా గుర్తించినట్టు తెలిపారు. వీటిని క్రైం స్పాట్‌లు గుర్తించి డ్రోన్స్ ద్వారా నిఘా పెట్టామన్నారు. గంజాయిని నియంత్రించడానికి జిల్లాలో పోలీస్‌శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటి వరకు 41 కేసులు నమోదుచేసి 100 మందిని జైల్లో పెట్టామన్నారు. గంజాయి నియంత్రించడంలో పోలీసుశాఖ కొంతమేర విజయవంతమైందన్నారు. గంజాయి మూలాలన్నీ ఒడిశాలోనే ఉన్నాయన్నారు. ఒడిశాలో పోలీసుల నుంచి సహకారం అందడంలేదన్నారు. యువత మత్తుకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. గంజాయితో యువకుడిని అదుపులో తీసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని అభినందించారు.
Comments