top of page

పీవోకేలో ఎన్నికల రిజర్వేషన్ల చిచ్చు

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jun 11
  • 2 min read

కొన్నేళ్లుగా పాక్ పాలకుల దుర్నీతి, అణచివేత విధానాలపై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నది. ఈ తరుణంలో మరికొన్ని వివాదాస్పద నిర్ణయాలతో ఆజ్యం పోసి అసంతృప్తి జ్వాలలను మరింత ఎగదోశారు. ఫలితంగా కొన్ని రోజులుగా పీవోకే మొత్తం ఆందోళనలు, హర్తాళ్లతో అట్టుడుకుతున్నది. రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులను సర్దుబాటు చర్యలతో శాంతింపజేయాల్సిన ప్రభుత్వం దానికి విరుద్ధంగా దమనకాండకు పాల్పడుతున్నది. దాంతో నాలుగైదు రోజుల్లోనే సుమారు 200 మంది పౌరులు సైన్యం జరిపిన కాల్పుల్లో అశువులు బాశారు. వీరిలో అమాయక బాలలు, మహిళలు ఉండటంతో పాక్ సైన్యం తీరుపై అంతర్జాతీయ మానవహక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న నిరసనలకు, కాల్పుల ఘటనలకు పీవోకేకు సంబంధించి పాక్ ప్రభుత్వం ప్రకటించిన రాజకీయ రిజర్వేషన్లే కారణమయ్యాయి. పీవోకేలో వచ్చే నెల 27న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ మొత్తం 45 సీట్లు ఉండగా వాటిలో 12 నియోజకవర్గాలను పీవోకే బయట ప్రాంతాల్లో ఉన్న కశ్మీరీ శరణార్థులకు రిజర్వ్ చేస్తూ పాకిస్తాన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇదే పెను వివాదానికి కారణమైంది. పీవోకేలో నివాసం ఉండని కశ్మీరీ శరణార్థుల పేరుతో పంజాబ్, సింధ్ ప్రాంతాలకు చెందిన రాజకీయ నాయకులకు పీవోకేలో అవకాశం కల్పించేందుకే ప్రభుత్వం ఈ రిజర్వేషన్లు ప్రకటించిందని ఆరోపిస్తూ ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(జేఏఏసీ) ఆధ్వర్యంలో ప్రజలు ఉద్యమించడంతో పీవోకే మొత్తం ఆగ్రహజ్వాలల్లో చిక్కుకుంది. శరణార్థుల పేరుతో ప్రకటించిన రిజర్వేషన్ల వల్ల స్థానిక ప్రాతినిధ్యం దెబ్బతింటుందని, అందువల్ల వాటిని రద్దు చేయాలని జేఏఏసీ డిమాండ్ చేస్తోంది. శరణార్థులకు రిజర్వేషన్లు రద్దు చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనంటూ కోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా స్పందించడం పీవోకే ప్రజలను మరింత రెచ్చగొట్టింది. చాలా ఏళ్లుగా తమ ప్రాంత వనరులను తరలించుకుపోయి పంజాబ్, సింధ్ ప్రాంతాýను అభివృద్ధి చేస్తున్నారని, తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా తృతీయశ్రేణి పౌరుల్లా చూస్తున్నారని ఆరోపిస్తూ 2023లో తీవ్ర ఆందోళనలు నిర్వహించారు. అప్పట్లోనూ అణచివేతకు ప్రయత్నించి విఫýమైన పాక్ ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తామని, అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి నిరసనకారులను శాంతింపజేసింది. నాటి హామీలు ఇప్పటికీ అమలు కాకపోగా పుండు మీద కారం చల్లినట్లు శరణార్థి రిజర్వేషన్ల పేరుతో పీవోకే ప్రజల రాజకీయ అవకాశాలను కూడా పంజాబ్, సింధ్ నేతలకు దోచిపెట్టుందుకు సర్కారు తెగించడం స్థానికులను ఆగ్రహానికి గురిచేసింది. దీంతోపాటు సబ్సిడీపై గోధుమ పిండి సరఫరా చేయాలని, విద్యుత్ టారిఫ్‌లు తగ్గించాలన్న డిమాండ్లతో జాక్ భారీ ర్యాలీ, సభకు పిలుపునిచ్చింది. ఇవి జరగడానికి ఒక రోజు ముందు నుంచే పీవోకేలో ఘర్షణలు మొదలయ్యాయి. అక్కడ జరుగుతున్న హింస, ఇంటర్నెట్ బంద్, విద్యుత్ కొరత, పెరిగిన ధరలు, నిరుద్యోగం, రాజకీయంగా తమను తొక్కేస్తున్నారని కూడా ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల డిమాండ్లు, ఆకాంక్షలను పట్టించుకోకుండా ప్రభుత్వం శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణతో జేఏఏసీని ఉగ్రవాద సంస్థగా ముద్ర వేసి గత వారమే నిషేధించింది. ప్రభుత్వ నిర్వాకం అణచివేత చర్యేనని ఆ గ్రూప్ సభ్యులు మండిపడుతున్నారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా రోడ్లపైకి వస్తున్న జాక్ సానుభూతిపరులను, ప్రజలపై సైన్యాన్ని, సాయుధ పోలీసులను మోహరించి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. శాంతిభద్రతల నిర్వహణ పేరుతో నిరసనకారులపై తూటాల వర్షం కురిపిస్తూ మారణకాండకు పాల్పడుతున్నది. దాదాపు ప్రతిరోజూ జరుగుతున్న కాల్పుల ఘటనల్లో ఇప్పటివరకు 200 మందికి పైగా నిరసనకారులు ప్రాణాలు కోల్పోగా కనీసం 400 మంది గాయపడ్డారని అంటున్నారు. మరోవైపు వందలాది మందిని పోలీసులు అరెస్టు చేసి జైళ్లలో పెట్టారు. అక్కడితో ఆగని పాక్ ప్రభుత్వం నిషేధించిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీకి చెందిన నలుగురు ముఖ్య నాయకులను పరారీలో ఉన్న నేతలుగా ప్రకటించి వారిని పట్టుకోవడానికి కోటి పాకిస్తానీ రూపాయల భారీ బహుమతిని ప్రకటించింది. జాయింట్ యాక్షన్ కమిటీకి చెందిన షౌకత్ నవాజ్ మీర్, ఉమర్ నజీర్ కాశ్మీరీ, ఖవాజా మెహ్రాన్ అర్షద్, సర్దార్ అమన్ ఖాన్‌ల ఆచూకీని తెలియజేసిన వారికి లేదా వారిని పట్టించిన వారికి కోటి రూపాయల నజరానా ఇవ్వడంతోపాటు సమాచారం ఇచ్చిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని ఆజాద్ జమ్మూ కాశ్మీర్(పీవోకే) రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. పీవోకేలో జరుగుతున్న సైనిక దమనకాండ, పౌరుల ఊచకోతలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. పీవోకేలో సర్కారీ స్పాన్సర్డ్ దాడులను పొరుగదేశమైన భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ ఆగడాలపై అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించి అక్కడి పాలకులను బాధ్యులను చేయాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేసింది. అంతర్జాతీయ సమాజం తగిన రీతిలో స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. మరోవైపు పాకిస్తాన్ మానవ హక్కుల సంఘం కూడా ఉగ్రవాద నిరోధక చట్టం కింద జేఏఏసీ ని నిషేధించడాన్ని తప్పు పట్టింది. బలప్రయోగానికి పాల్పడటాన్ని గర్హించింది. ప్రజలు, రక్షక భటులు ప్రాణాలు కోల్పోవడం, ఇంటర్నెట్, ఫోన్ సేవలను నిలిపివేయడాన్ని హెచఆర్‌సీపీ తీవ్రంగా ఖండించింది. మరోవైపు బ్రిటిష్ పార్లమెంటులో కశ్మీర్ వ్యవహారాలు పరిశీలించే విభాగం కూడా పీవోకే పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు పౌరులకు ఉంటుందని స్పష్టం చేసింది. ఆ హక్కును తిరస్కరించడం కాకుండా వారి సమస్యలను పారదర్శకంగా పరిష్కరించాలని డిమాండ్ చేసింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page