top of page

పుష్కర కాలం.. పుష్పక విమానం

Writer: NVS PRASADNVS PRASAD
  • వారసుడుగా వచ్చినా సారధిగా ఎదిగారు

  • నాడు ఢల్లీిలో ఆంధ్రా అంటే ఎర్రన్నే

  • నేడు దక్షిణాదంటే రామూనే

  • కేంద్రమంత్రి అయినా ఎంపీగానే చొరబాటు

  • రాజకీయ ఆరంగేట్రం చేసి నేటికి 12 ఏళ్లు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

కాలచక్రం గిర్రున తిరిగింది.. 26 ఏళ్ల వయసులో అనుకోకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఒక యువకుడి కన్నీళ్ల తడి ఆరేసరికి ఏకంగా కష్టాల మబ్బులు దాటి వర్షపు చినుక్కు సైతం తడవనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. చాలామందిలాగే రాజకీయ వారసుడిగానే ఆరంగేట్రం చేసినా తన మార్కును, తన తండ్రి శైలిని విడవకుండా అందనంత ఎత్తుకు ఎదిగాడు. నెపోటిజం అనుకోడానికి చిన్నపదమే అయినా ఆ లెగసీని కొనసాగించడానికి వారసులు పడే ఒత్తిడి చెప్పుకోలేనిది. ఎప్పటి ఒత్తిడిని అప్పుడే చిత్తుచేస్తూ చిరునవ్వుతో కనిపించే కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు రాజకీయాల్లోకి అడుగు పెట్టి నవంబరు 23కు సరిగ్గా 12 ఏళ్లు అవుతుంది.

2012 నవంబరు 2న కింజరాపు ఎర్రన్నాయుడు మరణించడంతో సిక్కోలు ప్రజాసదన్‌కు వచ్చిన రామ్మోహన్‌నాయుడు తండ్రి కర్మకాండల అనంతరం నవంబరు 23న ప్రజాసదన్‌లో ఎర్రన్నాయుడు కూర్చునే కుర్చీని అధిష్టించారు. జిల్లాలో మరో నాయకుడికి గాని, రాష్ట్రంలో మరో ఎంపీకి గాని మాటవరుసకైనా చెప్పకుండా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రామ్మోహన్‌నాయుడును శ్రీకాకుళం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా అప్పుడే ప్రకటించారు. అందుకు కారణం.. జిల్లాలో ఎంపీగా టీడీపీకి మరో అభ్యర్థి దొరకరనీ కాదు, ఎర్రన్నాయుడు కొడుకనీ కాదు. ఎందుకంటే.. అప్పటికి ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయముంది. ఈలోగా తండ్రి చనిపోయిన సానుభూతి ఉంటుందో, లేదో తెలీదు. మరోవైపు కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. ఎర్రన్నాయుడు కూడా పదవి లేకుండా ఉన్నారు. కాబట్టి ఎన్నికల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. సరిగ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రామ్మోహన్‌నాయుడు జిల్లాలో అన్ని నియోజకవర్గాలూ పర్యటించారు. తన తండ్రి ఆత్మబంధువులను ఓదార్చారు. టీడీపీ నాయకులకు తానున్నానని భరోసా ఇచ్చారు. అక్కడితో ఆగకుండా తాను ఎంపీ అభ్యర్థినని ఓటర్లను పరిచయం చేసుకోడానికి తన పార్లమెంట్‌ పరిధిలో సైకిల్‌ యాత్ర చేశారు. దాని ఫలితమే 2014లో 1,27,572 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తన పార్లమెంట్‌ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థులందరి మెజార్టీ కలిపితే 80వేల పైచిలుకు కాగా, ఒక్క రామ్మోహన్‌నాయుడు మెజార్టీయే 1,27,572. పాతపట్నంలో అప్పుడు వైకాపా గెలిచినా, రాముకే ఇక్కడ ఓట్లు ఎక్కువ పడ్డాయి. జనంలో ఉన్న ఆదరణ చూసి వెంటనే టీడీపీలో జాతీయ స్థాయి పదవిని చంద్రబాబు రామ్మోహన్‌కు అప్పగించారు. 2014లో పార్లమెంట్‌లో అడుగు పెట్టింది మొదలు, ఇప్పుడు కేంద్రమంత్రి అయ్యేవరకు ఆయన వాగ్ధాటికి, సబ్జెక్టు మీద అవగాహనకు ప్రధాని మోడీతో సహా మురిసిపోని నేతలు లేరు. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్‌ పరిధిలో కేవలం 2 స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. అది కూడా బొటాబొటీ మెజార్టీతోనే. కానీ 46.19 శాతం ఓటుషేర్‌తో రాము 6658 ఓట్ల మెజార్టీతో రెండోసారి గెలుపొందారు. ఆ తర్వాత తన తండ్రిలాగే పార్లమెంట్‌లో టీడీపీ ఫ్లోర్‌లీడర్‌గా బాధ్యతలు చేపట్టి వైకాపా తరఫున 25 మంది ఎంపీలున్నా రాముని ఎదుర్కోలేకపోయారు. 2024 ఎన్నికలకు వచ్చేసరికి శ్రీకాకుళంలో ఎంపీ సత్తా ఏమిటో అప్పటి సిట్టింగ్‌ ప్రభుత్వానికి అర్థమైపోయింది. శ్రీకాకుళంలో ఒక్క రామును అడ్డుకుంటే ఖాతా కూడా తెరవదని, ఆయన్ను నిలువరించడానికే వైకాపా శ్రేణులంతా తమ శక్తిని దారపోయాలని బహిరంగంగానే ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. సీన్‌ కట్‌ చేస్తే 61.05 స్ట్రైకింగ్‌ రేట్‌తో 3,27,901 రికార్డు మెజార్టీతో రాము చరిత్రను తిరగరాశారు. విచిత్రమేమిటంటే.. ఈ ఎన్నికల్లో వైకాపా ఏ అసెంబ్లీ సెగ్మెంట్‌లోనూ ఖాతా తెరవలేదు. ఇటు చంద్రబాబునాయుడుకు, అటు ప్రధాని మోడీకి తురుపుముక్కలా ఉపయోగపడతాడనే భావనతోనే ఎలైట్‌ పోర్ట్‌ఫోలియో అయిన పౌర విమానయాన శాఖను అప్పగించారు. 2019`20లో 84 శాతం పార్లమెంట్‌ అటెండెన్స్‌తో 69 ప్రశ్నలు రాష్ట్రం కోసం, 49 ప్రశ్నలు దేశం కోసం వేశారు. రైల్వే స్టాండిరగ్‌ కమిటీ, హోం ఎఫైర్స్‌ కమిటీ సభ్యుడిగా టూరిజం అండ్‌ కల్చరల్‌ కమిటీలోను, బీసీ కమిటీలోను, అఫీషియల్‌ లాంగ్వేజ్‌ మెంబర్‌గాను ఆయన మొదటిసారి ఎన్నికైనప్పుడే పని చేశారు. రామ్మోహన్‌నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు కేంద్రమంత్రి అయినప్పుడు జిల్లాలో టీడీపీ నేతలంతా ఈర్ష్యపడ్డారు. ఇకనుంచి జిల్లా ఎర్రన్న చేతుల్లోకి వెళ్లిపోతుందని భయపడ్డారు. కానీ అదే రామ్మోహన్‌ నాయుడుకు కేంద్రమంత్రి పదవి దక్కినప్పుడు మాత్రం జిల్లాలో ముఖం చిట్లించిన నాయకుడు లేడు. ఎందుకంటే.. రామ్మోహన్‌నాయుడు కేంద్రమంత్రిగా కంటే ఎంపీగానే జిల్లాలో చొచ్చుకుపోతున్నారు. ఎర్రన్న ఢల్లీి వెళ్లి తర్వాత ఆంధ్రప్రదేశ్‌ అంటే ఎర్రన్నాయుడు పేరే చెప్పేవారు. ఇప్పుడు సౌతిండియాకే ఆయన కొడుకు రాము బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు. అతి చిన్నవయసులో కేంద్రమంత్రి అయిన సౌతిండియన్‌గా రికార్డు సృష్టించారు.

ముక్తాయింపు: సరిగ్గా 12 ఏళ్ల క్రితం తన భర్త కుర్చీలో కొడుకును కూర్చోబెట్టిన కింజరాపు విజయమ్మ ఎదగాలీ పసికూన ఇంతకు ఇంతై అని దీవించలేదు. బ్రేక్‌ఫాస్ట్‌ ఇంటిదగ్గర చేసి, మళ్లీ రాత్రి భోజనానికే ఇంటికి రావాలని, నియోజకవర్గాల్లో తెలుగుదేశం పెద్దలెవరితోనూ గొడవలు లేకుండా అందరివాడిగా మసలుకోవాలని చెప్పి కళ్లు తుడుచుకున్నారు. ఇప్పటికీ రామ్మోహన్‌నాయుడు లంచ్‌ ఏదైనా నియోజకవర్గంలో, లేదూ అంటే ఇప్పుడు పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఆయన కార్యాలయం, రాజీవ్‌గాంధీ ఏవియేషన్‌ బిల్డింగ్‌లో.

 
 
 

Comentários


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page