- సాయంత్రం 5.30 తర్వాత డీఎంహెచ్‌వో ఛాంబర్‌లో పంపకాలు, పన్నాగాలు
- మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు నకిలీ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్లు
- ఎఫ్‌ఎన్‌వో పోస్టుల ప్రొవిజినల్ జాబితా ప్రకారం వసూళ్లు
- డీఎంహెచ్‌వో కార్యాలయంలో కొనసాగుతున్న దోపిడీపర్వం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో పోస్టింగ్ కావాలా, అంతర్గత బదిలీలు కావాలా, వర్క్ అడ్జస్ట్‌మెంట్ కావాలా, ఫేక్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ కావాలా, కొత్త నోటిఫికేషన్‌లో ఉద్యోగాలు కావాలా.. దేనికైనా సిద్ధం. లంచమిచ్చుకోండి.. పని చేయించుకోండి.

- ఇది ఇప్పుడు ఇక్కడ నడుస్తున్న అత్యంత పారదర్శకమైన పాలన.
సాయంత్రం 5.30 నుంచి 9 గంటల వరకు జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి తన ఛాంబర్‌లో ఉంటారు. కానీ ఎంత అత్యవసరమైన పని ఉన్నా ప్రాణాలు తోడేసే పైనున్న ఆయన ఛాంబర్‌లోకి వెళ్లే అవకాశమైతే లేదు. కారణం.. ఆ సమయంలో డీఎంహెచ్‌వో ఎన్‌హెచ్‌ఎం డీపీఎంవోతో ఏకాంతంగా పంపకాలు, మంతనాలు జరుపుతుంటారు. ఉదయం నుంచి అటు అర్బన్ హెల్త్ సెంటర్లు, ఇటు రూరల్ పీహెచ్‌సీల తనిఖీల పేరుతో వెళ్లి వసూలుచేసుకొచ్చిన దాన్ని సాయంత్రం 5.30 నుంచి 9 గంటల మధ్యలో డీఎంహెచ్‌వో కార్యాలయంలో పంచుకుంటారని పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో అంతా తానై వ్యవహరిస్తున్న ఎన్‌హెచ్‌ఎం డీపీఎంవో డాక్టర్ రవీంద్ర ఇటీవల ప్రభుత్వం కొన్ని పోస్టులకు విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి బేరసారాలు నడిపినట్టు తెలుస్తుంది. జనవరి 17న జిల్లాలో 5 ఎఫ్‌ఎన్‌వో పోస్టులకు, ఒక ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో ఎఫ్‌ఎన్‌వో పోస్టులకు 85 మంది దరఖాస్తు చేసుకోగా, ఒక ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు 43 మంది అప్లై చేశారు. అయితే వీరికి సంబంధించి ఎవరు మెరిట్, రోస్టర్‌లో ముందున్నారో తెలిపే ప్రొవిజినల్ జాబితా డీఎంహెచ్‌వో కార్యాలయంలో తయారుచేశారు. ఇప్పుడు ఈ జాబితా ప్రకారం ఎవరికి ఉద్యోగాలు వస్తాయో దాదాపు తేలిపోయింది. ఈమేరకు జిల్లా మొత్తం టూర్ వేస్తున్న డీపీఎంవో ఇందులో మెరిట్‌లో ఉన్నవారికి ఉద్యోగాలు ఇవ్వడానికి డీఎంహెచ్‌వోకు సిఫార్సు చేస్తానని, అయితే అందుకు ఖర్చవుతుందని చెప్పి ఒక రేట్ ఫిక్స్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత డీఎంహెచ్‌వోకు అన్నీ ఈయనేనని అందరికీ తెలుకు కాబట్టి ఈమేరకు కలెక్షన్లు మొదలైనట్టు తెలుస్తుంది. అలాగే విశాఖపట్నం జోన్‌లో 106 స్టాఫ్‌నర్సు పోస్టులకు ప్రకటన విడుదలైంది. దీనికి ఇప్పటికే ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్‌లో పని చేస్తున్న బీఎస్సీ నర్సింగ్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎందుకంటే.. ప్రస్తుత 106 స్టాఫ్‌నర్స్ పోస్టులకు ప్రభుత్వం రూ.48 వేలు జీతం ఇవ్వనుంది. ఇదే పని హెల్త్ Ê వెల్‌నెస్ సెంటర్లలో లేదా మరోచోట రూ.25వేలకు స్టాఫ్‌నర్సులు పని చేస్తున్నారు. అయితే ఇప్పుడు జీతం ఎక్కువ కావడంతో ఈ పోస్టులకు ఎక్కువ డిమాండ్ ఉంది. దీన్ని కూడా డీపీఎంవో తెలివిగా క్యాష్ చేసుకుంటున్నారని వినికిడి. ప్రస్తుతం తన వద్ద మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లుగా పని చేస్తున్న నర్సింగ్ సిబ్బందికి ఎక్స్‌పీరియన్స్ వెయిటేజ్ మార్కులు ఎక్కువ వేసి ఈ పోస్టులు రావడానికి కారణమవుతున్నారని ఆరోపణలున్నాయి. దీనికోసం సొమ్ములు వసూలు చేస్తున్నట్టు భోగట్టా. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లకు ప్రభుత్వం గాద్రేజ్ బీరువాలు, హెచ్‌పీ డెస్క్‌టాప్‌లు, బీపీ మిషిన్‌లు, రివాల్వింగ్ చైర్లు అందజేస్తుంది. అయితే ఈ ప్రాజెక్టుకు డీపీఎంవోగా ఉన్న డాక్టర్ రవీంద్ర వీటిని ఎక్కడ ఇచ్చారు? ఎక్కడ ఇవ్వాల్సి ఉంది? అన్న లెక్కలు సరిగా చూపడంలేదని, కొన్ని వస్తువులు బహిరంగ మార్కెట్‌కు వెళ్లిపోయాయన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. ఇటీవల కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జిల్లా వైద్య అధికారులతో సమీక్షించారు. పనితీరు సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారణం.. వైద్యులెవరూ సమయానికి పీహెచ్‌సీకి రావడంలేదని తేల్చారు. దీనికి మచ్చుక నాలుగు పీహెచ్‌సీల్లో వైద్యుల ఎఫ్‌ఆర్‌సీని పరిశీలించారు. పర్యవేక్షణ లోపం బయటపడటంతో భవిష్యత్తులో ఇటువంటివి జరగకూడదని మందలించారు. అయితే ఈ ఎఫ్‌ఆర్‌సీని డీఎంహెచ్‌వో మేనేజ్ చేస్తారని, ఒక్కొక్క పీహెచ్‌సీలో ఒక్కో వైద్యుడు రూ.10వేలు ఇస్తే సరిపోతుందని డీపీఎంవో బేరం పెట్టినట్టు తెలుస్తుంది.
Comments