గోల్డ్‌షాపు బాయ్‌గా జీవితం ప్రారంభం
గోవా కేసినోలో వాటాలు
పేకాట శిబిరాల్లో పెట్టుబడులు
ఇప్పుడు గంజాయి రవాణాలో కీలకపాత్ర
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఆయన పేరు ఫకీరు. నరసన్నపేటలో ఉంటాడు. ఫకీరు కదాని పెద్ద కంజీరా పట్టుకొని తలపాగా చుట్టుకొని, మెడలో పూసలు ధరించి పొడుగాటి లాల్చీ వేసుకొని మొలకు గళ్ల లుంగీని కట్టుకుంటాడనుకుంటే పొరపాటే. కాకపోతే ఫకీరు వేషాలు మాత్రం వేస్తుంటాడు. ఫకీరు ఆ ఫకీరులాగే తన చుట్టూ ముగ్గురు నలుగుర్ని పెట్టుకుంటాడు. అక్కడ ఫకీరు పాడుతుంటాడు.. ఇక్కడ ఫకీరు సొమ్ములు లెక్కపెడుతుంటాడు. ఈ ఫకీరు డబ్బు సంపాదించడానికి ఉన్న అన్ని అక్రమ మార్గాలూ తెరిచి అతి తక్కువ కాలంలోనే కోట్లాది రూపాయలు గడించిన అమీరు.

డబ్బు సంపాదించడం తప్పు కాదు. అయితే అందుకు ఎంతోమంది జీవితాలను బలపీఠాలు ఎక్కించి, ఆ సొమ్ముతో ఇప్పుడు జిల్లాలో ప్రముఖుడుగా చెలామణి అవుతున్నారు. కొన్నేళ్ల క్రితం నరసన్నపేటలో ఉన్న ఒక బంగారం షాపులో సేల్స్‌మెన్‌గా పని చేసిన బోయిన ఫకీరు ఇప్పుడు నరసన్నపేటలో రాజకీయ నాయకులకు, ఎన్నికలకు ఫండిరగ్ ఇచ్చే స్థాయికి ఎదిగిపోయారు. దీని వెనుక కథాకమామీషు ఒక్కసారి తెలుసుకుందాం. క్రికెట్ ఆట మీద పందాలు కాయడం మొదలైన దగ్గర్నుంచి ఈయన పంట పండిరది. చిన్న బుకీగా స్థానిక యువత నుంచి సొమ్ములు వసూలుచేసి ప్రారంభించిన అక్రమాల జీవితం ఆ తర్వాత ఇదే నరసన్నపేటలో కుమార్ అనే మరో క్రికెట్ బుకీ కలిసిన తర్వాత మొత్తం మారిపోయింది. కుమార్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అప్పటికే బుకీగా చీకటి సామ్రాజ్యంలో గుర్తింపు వచ్చేసింది. ఒక బేకరీలో పని చేసిన కుమార్ బుకీగా పైస్థాయికి వెళ్లిపోవడంతో ఆయనకు బినామీగా ఫకీర్‌ను పెట్టుకున్నాడు. అప్పట్నుంచీ ఈయన ద్వారా క్రికెట్ బెట్టింగులకు దిగడం మొదలుపెట్టారు. ఐపీఎల్ సీజనైతే నేరుగా లైన్ తీసుకొని బెట్టింగులు వేసే వీరు మిగిలిన అన్ని ఆటలకు, అన్ని సీజన్లకు మార్కెట్‌లో ఉన్న బెట్టింగ్ యాప్‌లను లీజుకు తీసుకొని వాటి ఐడీ పాస్‌వర్డ్‌లు యువతకు ఇచ్చి ఆడిరచి సొమ్ములు సంపాదిస్తున్నారు. ఇప్పుడు కుమార్ జాతీయ స్థాయికి ఎదిగిపోవడంతో రెండు రాష్ట్రాల్లో ఫకీరే చక్రం తిప్పుతున్నాడు. ఈయన చుట్టూ నలుగురు యువకులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల మాదిరిగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నట్టు ల్యాప్‌టాప్‌లు పట్టుకొని తిరుగుతుంటారు. ఇందులో ఒకరు కలెక్షన్లకు, మరొకరు మార్కెటింగ్‌కు, ఇంకొకరు ఐడీ పాస్‌వర్డ్ సమాచారం చేరవేసేందుకు.. ఇలా పని చేస్తున్నారు. బుకీగా వచ్చిన సొమ్ములో ప్రస్తుతానికి రూ.10 కోట్ల ఆస్తి ఒకప్పుడు బంగారం షాపులో పని చేసిన సేల్స్‌మెన్ సంపాదించాడంటే ఆశ్చర్యపోక తప్పదు. ఇక కేవలం బెట్టింగుల మీదే ఇదంతా సంపాదించాడా? అంటే ఫకీరుకు ఇంకో కోణం కూడా ఉంది.. పేకాడిరచడం. మరోవైపు వేరేవారు నడిపే శిబిరాలకు తన కస్టమర్లను పంపడం. సాధారణంగా వ్యాపారాలు, కంపెనీలు నిర్వహించేవారికే వాటాదారులు ఉంటారని మనకు తెలుసు. కానీ పేకాడిరచడం కూడా ఒక కంపెనీయేనని మొదటిసారిగా మన జిల్లాకు చెందిన పేకాట నిర్వాహకులే నిరూపించారు. పెద్ద పెద్ద కంపెనీల్లో వాటాల కోసం షేర్లు విడుదల చేసినట్లే జిల్లాలో సూట్ ఆటకు కూడా వాటాదారులు ఉన్నారు. కాయిన్ రూపంలో సొమ్ములు పెట్టడం పేకాటలో ఆనవాయితీ. జిల్లాలో పేక నిర్వహిస్తున్న అనేక శిబిరాల్లో ఫకీరుకు వాటాలున్నాయి. అంతెందుకు.. గత ప్రభుత్వంలో తానే అన్ని ఖర్చులూ అప్పటి నాయకులకు చూసుకున్నానని ఫకీరు ఓపెన్‌గానే చెబుతుంటాడట. బెట్టింగ్‌లో పోలీసులు పట్టించుకోపోవడం, పేకాడుతుంటే సహకరించడం వల్ల ఏకంగా ఇప్పుడు గంజాయి రవాణా చేసినా తననేమీ చేయలేరన్న కోణంలో ఫకీర్ అండ్ బ్యాచ్ పేకాట ముసుగులో గంజాయిని తరలిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెట్టింగు మీద, పేకాట మీద నెలకు రూ.10 లక్షలు ఒక్క ఫకీరే సంపాదిస్తున్నట్లు చెబుతున్నారు. గోవాలో ఉన్న ఒక కేసినోలో మన జిల్లాకు చెందిన కొందరు ప్రముఖులకు వాటాలున్నాయి. అందులో ఫకీరు కూడా ఒకరని తెలుస్తుంది. ఇటీవల గోవాలో బిగ్`బి అనే కేసినోలో పేకాడేందుకు ఇక్కడి నుంచి అనేకమందిని ఫకీరు తరలించినట్లు సమాచారం ఉంది. నాలుగు రోజుల పాటు కేసినోలో జరిగిన ఈవెంట్‌కు హాజరవ్వాలంటే ముందుగా జిల్లాలో ఫకీరు వద్ద రూ.3లక్షలు డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత ఇటువంటి వారందర్నీ విమానమెక్కించి ఫకీరు గోవా తీసుకువెళ్తాడు. ఇలా తీసుకువచ్చినందుకు కేసినో నిర్వాహకులు ఫకీరుకు 7 శాతం కమీషన్ ఇవ్వడంతో పాటు విమానం టిక్కెట్లు కూడా రానుపోను ఏర్పాటుచేస్తారు. ఇక మందు, విందు, చిందు కోసం గోవాలో చెప్పుకోనక్కర్లేదు.
Comments