top of page

ఫీజుల జంఝాటం!

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ ఊసెత్తని రాష్ట్ర ప్రభుత్వం

  • ఇప్పటివరకు ఒక్క విడత కూడా చెల్లించకుండా తాత్సారం

  • బకాయిలు చెల్లించాలని కళాశాల యాజమాన్యాల ఒత్తిళ్లు

  • కోర్సు చివరి ఏడాదిలో ఉన్న విద్యార్థులకు ఇరకాటం

  • ఇప్పటికే చాలామంది అప్పులు చేసి కడుతున్న ఉదంతాలు

విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ సౌకర్యాన్ని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగిస్తామని ఎన్నికల్లో ఎన్డీయే కూటమి హామీ ఇచ్చింది. పైగా వైకాపా ప్రభుత్వం ఈ పథకంలో కొన్ని కోతలు విధించిందని, తాము మాత్రం పూర్తిస్థాయిలో ఫీజ్‌ రీయింబర్స్‌ చేస్తామని కూడా కూటమి నేతలు భరోసా ఇచ్చారు. కట్‌ చేస్తే.. ఎన్నికల్లో గెలిచి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే రాష్ట్రస్థాయి కళాశాల యాజమాన్య సంఘం ప్రతినిధులు ప్రభుత్వ పెద్దలను కలిసి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను తల్లిదండ్రుల ఖాతాల్లో కాకుండా నేరుగా కాలేజీ యాజమాన్యాల ఖాతాలకు జమ చేయాలని కోరారు. దానికి విద్యాశాఖ మంత్రి లోకేష్‌ సానుకూలంగా స్పందిస్తూ ఇచ్చారు. కానీ విద్యాసంవత్సర మొదలై నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఊసెత్తడం లేదు. అసలు ఇస్తారా లేదా, ఇస్తే ఎప్పుడు ఇస్తారన్న క్లారిటీ కూడా ఇవ్వడంలేదు.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

గత ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ మొత్తాలను జమ చేసేది. కాన్నీ ఎన్డీయే ప్రభుత్వం కళాశాలల ఖాతాలకు జమ చేస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటివరకు ఆ పని కూడా చేయకపోవడంతో విద్యార్ధుల తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. రీయింబర్స్‌మెంట్‌ ఇస్తారా.. లేదా అన్న అనుమానాలతో కొట్టుమిట్టాడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో 2023 డిసెంబర్‌లో విడుదల కావాల్సిన రీయింబర్స్‌మెంట్‌ చివరి త్రైమాసిక నిధులను ఆలస్యంగా ఈ ఏడాది మార్చిలో విడుదల చేశారు. ఆ నిధులు సార్వత్రిక ఎన్నికల అనంతరం తల్లుల ఖాతాల్లో జమయ్యాయి. ఎన్నికల తర్వాత కొలువుదీరిన ఎన్డీయే సర్కారు ఇంతవరకు ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులపై ఎటువంటి ప్రకటన చేయలేదు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను పోస్టుమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌(ఆర్టీఎఫ్‌, ఎంటీఎఫ్‌)గా మార్చింది. అలాగే ఇంజినీరింగ్‌ కాలేజీల మినిమం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని రూ.35 వేల నుంచి రూ.43వేలకు పెంచిందే చెల్లింపుల గురించి ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో ఆ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారోనని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జరుగుతున్న జాప్యాన్ని ఆసరా చేసుకుని ఇప్పటికే కొన్ని కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నాయి. పరీక్షలు రాయడానికి, కోర్సులు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు తీసుకోడానికి ఫీజు చెల్లింపులతో యాజమాన్యాలు లింకు పెడుతున్నాయని బాధిత విద్యార్ధులు చెబుతున్నారు. ఫలితంగా నానా తంటాలు పడి ఫీజులు చెల్లించి మాస పరీక్షలకు హాజరవుతున్న పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉంది. ఫీజులు చెల్లిస్తే తప్ప వార్షిక పరీక్షలకు అనుమతించేదిలేదని కాలేజీ యాజమాన్యాలు తెగేసి చెబుతుండటంతో విద్యార్ధుల తల్లిదండ్రులు అప్పులు చేసి బకాయిలు చెల్లించాల్సిన దుస్థితి.

అప్పుడు అలా.. ఇప్పుడిలా..

వైకాపా ప్రభుత్వం హయాంలో 2021 నుంచి 2023 విద్యా సంవత్సరం వరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి షెడ్యూల్‌ ప్రకారం జగనన్న విద్యాదీవెన కింద ఫీజులతో పాటు వసతి దీనెన పేరుతో హాస్టల్‌, మెస్‌ ఖర్చులు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తూ వచ్చారు. వీటిని విద్యార్ధుల తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాలకు గడువులోగా చెల్లిస్తుండేవారు. ఇప్పటి వరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి (త్రైమాసికం) విడుదల చేస్తున్న చెల్లింపులు నిలిచిపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 2023-24 విద్యా సంవత్సరంలో అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి జిల్లాలో 50,945 మంది విద్యార్థులకు రూ. 35.17 కోట్లు ఈ ఏడాది మార్చిలోనే గత ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఎన్నికల కోడ్‌ రావడంతో చెల్లింపుల ప్రక్రియ నిలిచిపోయింది. పోలింగ్‌ తర్వాత న్యాయస్థానం అనుమతితో ఆ మొత్తాలను విద్యార్ధుల ఖాతాల్లో జమ చేశారు. 2020`21 విద్యా సంవత్సరంలో నాలుగు విడతల్లో 67,940 మందికి రూ.97.37 కోట్లు, 2021`22లో 68,913 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నాలుగు విడతల్లో రూ.127.09 కోట్లు, 2022`23లో 53,867 మంది విద్యార్ధులకు రూ.128.65 కోట్లు జమ చేశారు. ఐదేళ్ల పాలన కాలంలో పూర్తి స్థాయిలో మూడేళ్లకు మాత్రమే ఫీజు రీయంబర్స్‌ చేశారు. 2019`20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయంబర్స్‌మెంట్‌ నిధులు జమ చేయకుండానే టీడీపీ గద్దె దిగిపోయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా విద్యా సంవత్సరం ముగిసిందంటూ చేతిలెత్తేసింది. దీంతో 2020లో ఇంజినీరింగ్‌ చివరి ఏడాది విద్యార్థులు సొంతంగా ఫీజులు చెల్లించి పరీక్షలు రాసి కోర్సు పూర్తి చేశారు.

యాజమాన్యాల ఒత్తిళ్లు

కాగా మొన్నటి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంతవరకు చెల్లింపులు జరపకపోవడం పట్ల విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం మాదిరిగా ప్రతి మూడు నెలలకు చెల్లింపులు జరిపి ఉంటే ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ మధ్య ఇప్పటికే మూడు విడతల చెల్లింపులు పూర్తి అయ్యేవి. కానీ ఇప్పటి వరకు ఒక్క విడత చెల్లింపు కూడా జరగలేదు. దీంతో 2023`24 విద్యా సంత్సరంలో కోర్సులు పూర్తి చేసుకోనున్న విద్యార్ధుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఇంజినీరింగ్‌ నాలుగో ఏడాది చదువుతున్న విద్యార్ధులు మరో రెండు నెలల్లో వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వీరంతా 2021`22లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరారు. వీరికి మొదటి ఏడాది 2021లో పూర్తిస్థాయిలో ఫీజు రీయంబర్స్‌మెంట్‌ జరగలేదు. చివరి ఏడాది అయిన 2024లో నూ అదే పరిస్థితి ఏర్పడిరది. దీంతో వీరంతా పెద్ద మొత్తంలో ఫీజు బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి. 2021 సెప్టెంబర్‌లో మొదటి ఏడాది ఇంజినీరింగ్‌లో చేరినవారికి 2022 మార్చిలో తొలి ఫీజు రీయంబర్స్‌మెంట్‌ జమైంది. ఈ ఏడాది ఆగస్టులో ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్ధులకు కూడా అదే పరిస్థితి ఎదురు కానుంది. ఒకవేళ ప్రభుత్వం కాలేజీలకు ఫీజులు జమ చేసినా అది రెండు నుంచి నాలుగో ఏడాది చదువుతున్న విద్యార్ధులకు మాత్రమే పరిమితం అవుతుంది. ఈ బకాయి మొత్తాన్ని చివరి ఏడాదిలో విద్యార్ధులు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పధకం ప్రారంభమైన నాటి నుంచి ఈ తంతు కొనసాగుతోంది.

పూర్తిస్థాయి బడ్జెటే లేదు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాలను కళాశాలల యజమాన్యాల ఖాతాల్లో జమచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉండడంతో విద్యార్థులకు చుక్కెదురు తప్పదని ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టలేదు. నాలుగు నెలల కాలానికి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆమలు చేస్తుండగా, అందులో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత లేదు. ఐటీఐ నుంచి ఐఐటీ, వైద్యవిద్య వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం అర్హత ఉన్న విద్యార్ధులంతా ఎదురు చూస్తున్నారు. వైకాపా హయాంలో ప్రవేశపెట్టిన కొన్ని విధానాలపై ఎన్డీయే ప్రభుత్వం పునఃసమీక్ష చేస్తుండడం వల్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో మరింత జరిగే అవకాశం ఉందంటున్నారు. ఇది చివరి ఎడాది విద్యార్ధులకు ఇబ్బందికరంగా మారనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page