మోడీ ప్రభుత్వం ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ బిల్లు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఎన్నికల్లో సంస్కరణలు తీసుకొచ్చే ఉద్దేశంతో పార్లమెంట్, దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో ఈ బిల్లు తీసుకొచ్చింది. సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాల్సి ఉన్నా వెనక్కు తగ్గినట్లు తెలుస్తుంది. కాకపోతే ఈ వారంలో ఏదో ఒకరోజు ప్రవేశపెట్టడానికి సిద్ధపడుతుంది. బిల్లు అమల్లోకి వస్తే మాత్రం దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వంద రోజుల్లో అంటే మూడు నెలల్లో దేశం మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ దిశగానూ కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. కానీ జమిలీ ఎన్నికలు అనేవి పాలన సమాఖ్య స్వభావాన్ని దెబ్బతీస్తాయి. ఈ చర్య పార్లమెంటరీ వ్యవస్థ నుంచి అధ్యక్ష వ్యవస్థగా మారడానికి నాంది కాబోతుంది. అంతేగాకుండా జాతీయ పార్టీల ఆధిపత్యానికి దారితీస్తూ ప్రాంతీయ పార్టీలకు ముగింపు ఘంటికలు కూడా మోగుతున్నాయి. ఒక దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల రాష్ట్ర నిర్దిష్ట సమస్యలపై దృష్టి తగ్గుతుంది, ఎందుకంటే ప్రాంతీయ ప్రయోజనాలను పక్కనపెట్టి జాతీయ ప్రయోజనాలు ఆధిపత్యం చెలాయిస్తాయి. జమిలీ ఎన్నికల వలన సమాఖ్య స్ఫూర్తి నిర్వీర్యమవుతుంది. ఇంత విశాలమైన, వైవిధ్యమైన దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎదురయ్యే సవాళ్లు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించడమనేది చట్టపరమైన, రాజ్యాంగ సవాళ్లను లేవనెత్తుతుంది. అవి ఎలాగంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతర కాలంలో కూలిపోతే ఏమవుతుంది? జాతీయ చక్రానికి అనుగుణంగా తాజా ఎన్నికలు ఆలస్యమవుతాయా, తద్వారా అప్రజాస్వామికంగా నిబంధనలను పొడిగించడం లేదా తగ్గించడం జరుగుతుందా? లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించడం వలన ప్రస్తుతం ఉన్న అన్ని రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేయవలసి ఉంటుంది. వీటిలో ప్రతిఒక్కటి వేర్వేరు పదవీకాలాలను కలిగి ఉంటాయి. రాష్ట్రంలోని పాలక ప్రభుత్వం స్వచ్ఛందంగా సిఫారసు చేసి, గవర్నర్ ఆమోదం తెలిపినా లేదా రాజ్యాంగ యంత్రాంగానికి విఘాతం కలిగినా, కేంద్ర ప్రభుత్వ సిఫార్సు ద్వారా రాష్ట్రపతి పాలన విధించినా అసెంబ్లీని రద్దు చేయవచ్చు. ఇకపోతే ఏకకాల ఎన్నికల ప్రతిపాదనను అమలు చేయడానికి కూడా ఆర్టికల్స్ 83, 85, 172,174, 356తో కూడిన కనీసం ఐదు రాజ్యాంగ సవరణలు అవసరం. అయితే రాజ్యాంగాన్ని సవరించే ఏ బిల్లు అయినా ఆ సభలోని మొత్తం సభ్యుల మెజారిటీతో పాటు ఆ సభలోని సభ్యుల్లో మూడిరట రెండొంతుల కంటే తక్కువ కాకుండా హాజరై ఓటింగ్ ద్వారా మాత్రమే ఆమోదించబడుతుంది. మరి ఇపుడు ఎన్డీయే 293 సభ్యుల బలంతో పోలిస్తే, పూర్తిగా హాజరైన లోక్‌సభలో మూడిరట రెండొంతుల మెజారిటీ 362. కాబట్టి ప్రభుత్వం ఎన్డీయేతర బ్లాక్ నుంచి 69 ఓట్లను పొందాలి. ఇది జరిగే పనేనా? ఇకపోతే జమిలి ఎన్నికలతో ఎన్నికల ఖర్చు తగ్గుతుందనేది కేంద్ర ప్రభుత్వ వాదన. కేవలం 5వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయనే కారణంతో జమిలీ ఎన్నికలకు వెళ్లడం సరైన చర్య కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు మొత్తం దాదాపు 90 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నవారు 97 కోట్ల మంది ఉన్నారు. ప్రతీ ఐదేళ్లకోసారి విడతల వారీగా జరిగే ఎన్నికల కోసం దాదాపు రూ.10వేల కోట్లు ఖర్చవుతోంది. ఈ విధంగా లెక్కిస్తే ఒక్క ఓటరుపై కేవలం రూ.20 మాత్రమే ఖర్చవుతోంది. ఇక రాజకీయ పార్టీలు చేసే ఖర్చు ప్రజలకు పునఃపంపిణీ జరుగుతున్నది, దీనివల్ల అనేకమందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కాబట్టి దీన్ని ఖర్చుగా ఎలా భావిస్తారు? ఒకే దేశం, ఒకే ఎన్నిక అనే భావన కొన్ని చిన్న ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, ఇది భారతీయ సమాజంలో గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. నిజానికి ఇప్పుడు కావాల్సింది ఒకేసారి ఎన్నికలు కాదు. ప్రజాస్వామ్యం మరింతగా వర్ధిల్లే విధంగా, ధన ప్రలోభాలను గణనీయంగా తగ్గించి, ప్రజాభిప్రాయానికి చట్టసభల్లో తగు ప్రాతినిధ్యం లభించేందుకు ఉన్నంతలో మెరుగైన దామాషా పద్ధతి ఎన్నికల సంస్కరణలు కావాలి. తరచూ ఎన్నికల వలన ప్రభుత్వాలు దీర్ఘకాలిక విధానాలను రూపొందించే అవకాశాలకు ఆటంకం కలుగతుందని, ఒకేసారి ఎన్నికలు జరిగితే ఇలాంటి అవకాశం ఉండదనేది కేంద్రంలో బీజేపీ వాదన. పాలకులు మారినా లక్ష్యాల నిర్దేశం, పథకాలు కొనసాగేందుకు ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసిన పెద్దలు దీర్ఘకాలిక విధానాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం, ఇది జనాన్ని తప్పుదారి పట్టించడమే. ప్రతిదానికీ ప్రజాస్వామ్య జపంచేసే వ్యక్తులు, శక్తులూ అభివృద్ధి, ఖర్చు తగ్గించాలనే పేరుతో ప్రజాస్వామిక సూత్రాలకే విఘాతం కలిగించే ప్రతిపాదనను ముందుకు తెస్తున్నారు.
top of page
bottom of page
Comments