‘ఫాదర్’.. బ్రదర్.. సిస్టర్.. ఆయన దగ్గర తేడాల్లేవమ్మా!
- BAGADI NARAYANARAO
- Nov 28, 2024
- 3 min read
కార్లు ఇప్పిస్తానని చర్చిఫాదర్‌కు మోసం
బదిలీ చేయిస్తానని తోడల్లుడికి టోపీ
అప్పు పేరుతో తోబుట్టువుకు టోకరా
ఎంత రాస్తున్నా తరగని సతీష్ లీలలు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

మద్యం సేవించి వాహనం నడపినందుకు రెండు నెలల పాటు జైల్లో పెట్టారు. ఇటీవల పిక్నిక్ కోసం సమద్ర తీర ప్రాంతానికి వెళ్లిన ఆరుగురు పర్యాటకులు జూదం అడుతుండగా పట్టుబడడంతో వారిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ లెక్కన 20 ఏళ్లుగా వందలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి రూ.కోట్లు కొల్లగొట్టిన మందస మండలం లోహరిబంద పంచాయతీ కార్యదర్శి మన్నం సతీష్‌బాబుకు ఎలాంటి శిక్ష వేయాలి? ఇప్పటికీ దర్జాగా ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతూనే నిరుద్యోగులను వంచించిస్తున్నాడు. సతీష్ బాధితుల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గుంటూరు, ఏలూరు జిల్లాలకు చెందిన వందలాది మంది నిరుద్యోగ యువత ఉన్నారు. గుంటూరు జిల్లా పెద్ద వడ్లపూడికి చెందిన మన్నం సతీష్‌బాబు ఇల్లరికంగా శ్రీకాకుళం నగరంలో అడుగుపెట్టి ఇక్కడివారికి రూ.కోట్లలో మోసం చేశాడు. ఇల్లరికం అల్లుడిగా రావడానికి మామను మోసం చేశాడని చెప్పుకుంటుంటారు. ఈయన బాధితుల్లో తోబుట్టువు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. ఆమె నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని ఎగ్గొట్టాడని ప్రచారం సాగుతుంది.
కుటుంబ సభ్యులూ బాధితులే
సతీష్ బాధితుల్లో ఆయన తోడల్లుడు, తోబుట్టువు, ఒక చర్చి ఫాదర్, ఇద్దరు డ్రైవర్లు, ఒక ఉపాధ్యాయుడు, డీఆర్‌డీఐ ఉద్యోగి, వాచ్‌మెన్ కొడుకు, చెఫ్, ఒక విలేకరి, ఒక ఏఎస్‌ఐ కొడుకు, డీఎస్పీ తోడల్లుడు, వాచ్‌మెన్, ఒక వృద్ధురాలు, ఒక ఒంటరి మహిళ, ఒక వెల్డర్, నలుగురు గిరిజన యువకులు ఇలా చెప్పుకుంటూ పోతే జాబితాలో వందల మంది నిరుద్యోగ యువత, మహిళలు ఉన్నారు. పైన పేర్కొన్న 15 మంది బాధితుల నుంచి రూ.5 లక్షల నుంచి రూ. 14 లక్షలు వరకు చొప్పున దాదాపు రూ.1.80కోట్లు కొట్టేశాడు. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి మాయలో పడి రూ.కోట్లు సమర్పించుకున్నారంటే సతీష్ ఏ స్థాయిలో వారిని ముగ్గులోకి దించాడో అర్ధం చేసుకోవచ్చు. 2014 అక్టోబర్ 10న వెలుగు చూసిన మోసంపై ఉన్నతాధికారులు అప్పుడే సీరియస్‌గా విచారణ జరిపించి ఉంటే వందలాది మంది యువత ఆయన బారిన పడి రోడ్డున పడిపోకుండా అడ్డుకోగలగేవారు. ఆరుగాలం శ్రమించి, రక్తం కరిగించి కూడబెట్టిన డబ్బును సతీష్ పాలు కాకుండా చూడగలిగేవారు. సెటిల్మెంట్ పేరుతో బాధితులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి అక్కడ పోలీసుల ద్వారా డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పి అంగీకారం చేసుకున్న సందర్భాలు ఉన్నాయని బాధితులు చెబుతున్నారు.
బదిలీ చేయిస్తానని చెప్పి..
సతీష్ చేతిలో మోసపోయిన వారిలో ఆయన తోడల్లుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉన్నాడు. 22 ఏళ్లుగా సతీష్‌ను దూరం పెట్టిన తోడల్లుడు గత ఏడాది జూన్‌లో జరిగిన బదిలీల్లో హిరమండలం నుంచి శ్రీకాకుళం నగరానికి తీసుకువస్తానని ఒక ప్రజాప్రతినిధి పేరు చెప్పి అక్షరాల రూ.6లక్షలు పిండేశాడు. సతీష్ మాయల మరాఠీ అని తెలిసి కూడా తోడల్లుడు మోసపోయాడు. తల్లి అనారోగ్యంతో మంచాన పడడం, అదే సమయంలో శ్రీకూర్మం నుంచి హిరమండలం బదిలీ కావడం, మానసిక ఆందోళనలో ఉండడం మోసపోవడానికి కారణమైందని బాధితుడు చెబుతున్నాడు. 22 ఏళ్లుగా ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు లేకపోయినా తల్లిని పరామర్శంచడానికి సతీష్ వచ్చాడు. అప్పుడే ప్రజాప్రతినిధి ద్వారా, కమిషనర్‌తో మాట్లాడి బదిలీ చేయిస్తానని సతీష్ ఇచ్చిన హమీని నమ్మేశాడు. సతీష్ మోసగాడని తెలిసినా బదిలీపై చెప్పిన మాటలు నమ్మకాన్ని కలిగించడంతో దశలవారీగా రూ.6లక్షలు సమర్పించుకున్నాడు. నెలలు దాటిపోవడంతో బదిలీ విషయంలో మోసపోయానని గ్రహించి కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై జెడ్పీ సీఈవో ఆధ్వర్యంలో విచారణ జరిగినా, నివేదిక బుట్టదాఖలైంది.
వాహనాలు మంజూరు చేయిస్తానని..
2005 నుంచి పరిచయం ఉన్న ఒక చర్చి ఫాదర్‌ను మోసగించి రూ.9.50 లక్షలు కొట్టేశాడు. ఫోన్‌పే ద్వారా రూ.7.50 లక్షలు, నగదు రూపంలో మరో రూ.2లక్షలు తీసుకొని అమరావతిలోని సచివాలయం చుట్టూ ఆరు నెలల పాటు తిప్పాడు. వీరిని మోసం చేసిన తీరుకు బాధితులే ఆశ్చర్యపోయారంటే వారిని ఏవిధంగా బుట్టలో వేశాడో అర్థం చేసుకోవాలి. చర్చిఫాదర్ ఫైనాన్స్‌లో ఒక ట్రాక్టర్ కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నాడని తెలిసి సబ్సిడీలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వాహనాన్ని మంజూరుచేయిస్తానని సతీష్ నమ్మించాడు. 20 ఏళ్లుగా పరిచయం ఉన్న సతీష్ మాయలో పడిన ఫాదర్ ఏలూరులోని జంగారెడ్డిగూడెంలో డైవర్లగా పని చేస్తున్న తన ఇద్దరు మేనళ్లుల్లు ప్రవీణ్, సునీల్ కూడా వాహనాలు కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నారని చెప్పడంతో వారికీ సబ్సీడీలో ఎర్టిగా, బ్రెజ్జా కారును మంజూరు చేయిస్తానని చెప్పాడు. పేర్లు నమోదు చేయడానికి తక్షణమే రూ.25 వేలు డిపాజిట్ కట్టాలని ముగ్గురి నుంచి 2023 అక్టోబర్ 28న రూ.75వేలు ఫోన్ పే ద్వారా సతీష్ తీసుకున్నాడు. ఆ తర్వాత దశల వారీగా ఏదో ఒక వంక పెట్టి రూ. 9.50 లక్షలు ముగ్గురి నుంచి వసూలుచేశాడు. అనకాపల్లిలో వాహనాలు ఉన్నాయని ఒకసారి, జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చేశాయని ఇంకోసారి చెప్పి అమరావతిలో మూడు రోజుల పాటు వారిని ఉంచి వెనక్కి పంపించేశాడు. చివరికి మోసపోయామని గుర్తించిన బాధితులు డబ్బులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేయడంతో ఒక హమీ పత్రాన్ని రాసి వారి చేతిలో పెట్టి తప్పించుకున్నాడు. దీంతో బాధితులు ఈ ఏడాది జూలై 12న కలెక్టర్‌ను కలిసి విన్నవించారు. ఆ తర్వాత అక్టోబర్‌లో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును ఎస్పీ టౌన్ డీఎస్పీకి పంపించి విచారణ చేయాలని ఆదేశించారు. దీనిపై డీఎస్పీ ఈ నెల 24న సతీష్‌ను, బాధితులను పిలిపించి విచారించి వాంగ్మూలం నమోదు చేశారు.
Comments