ఇండియన్ ఆర్మీ కాలింగ్ రమణ అరెస్టు
జువైనల్ చట్టం ప్రయోగించిన పోలీసులు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ఆర్మీలో ఉద్యోగం కోసం తన సంస్థలో చేరిన మైనర్ విద్యార్థిని రూమ్‌లో బంధించి యూఎస్‌బీ కేబుల్‌తో చిత్రహింసలు పెట్టిన కేసులో ఇండియన్ ఆర్మీ కాలింగ్ వ్యవస్థాపకుడు బీవీ రమణను అరెస్టు చేసి శనివారం సాయంత్రం 3.30 గంటలకు డీఎస్పీ వివేకానంద మీడియా ముందు పెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సోషల్ మీడియాలో ట్రోలైన వీడియో ఆధారంగా సీఐ పైడపునాయుడు నేతృత్వంలో ఎస్‌ఐ హరికృష్ణ, బాధితుడ్ని విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన తర్వాత రమణను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ట్రోల్ అవుతున్న వీడియో 2023 డిసెంబరు 28 నాటిదని, ఎస్‌ఆర్ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన విద్యార్థుల్లో కొందరు దొంగతనం చేశారన్న ఫిర్యాదు రావడంతో బీవీ రమణ, వారిని గదిలో బంధించి చిత్రహింసలు పెట్టాడని తేలిందని, మైనర్ బాలుడిపై ఆ విధంగా హింసకు పాల్పడటంపై జువైనల్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. అమ్మాయిల బెడ్‌రూమ్‌లో సీసీ కెమెరాలు ఉన్నాయని కొన్ని పత్రికల్లో కథనాలు రావడంతో విచారణ జరిపామని, అయితే తమ వస్తువులు పోతున్నాయని తామే చెప్పడంతో మేనేజ్‌మెంట్ సీసీలు పెట్టాయని బాలికలు చెప్పడం వల్ల దీని మీద కేసు నమోదు కాలేదన్నారు. రమణకు సంబంధించిన మరో రెండు అంశాలపై మరింత లోతుగా విచారణ జరపాల్సి ఉందని డీఎస్పీ వివేకానంద పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో సీఐ పైడపునాయుడు, ఎస్‌ఐ హరికృష్ణ పాల్గొన్నారు.
Bình luận