బటన్ బద్దలైన రోజు
- NVS PRASAD
- Jun 5
- 4 min read
సీనియర్లను కాదన్నందుకు ఫలితం
పార్టీ, ప్రభుత్వం వేరన్న శైలికి చెంపపెట్టు
ఎన్నికల ఫలితాలు విడుదలై ఏడాది

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
‘‘నేను నా పని సవ్యంగా చేస్తున్నాను.. ప్రతీసారి క్రమం తప్పకుండా బటన్ నొక్కి పథకాలు అందేటట్టు చేస్తున్నాను.. మీరు కూడా నియోజకవర్గాల్లో పని చేస్తే ఫలితాలు బాగుంటాయి.’’
.. ఇదీ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ బహిరంగ సభలో బటన్ నొక్కుతూ చేసిన ప్రసంగం. బటన్ నొక్కడమే ముఖ్యమంత్రి పని అని, మిగిలిన విషయాలు పట్టించుకోనక్కర్లేదని, తన వల్ల రాష్ట్రంలో ఏదైనా కుటుంబానికి మేలు జరిగితేనే ఓట్లేయాలని, లేదంటే వేరే పార్టీకి వేసుకోవచ్చని ధీమాగా చెప్పిన సందర్భం ఇది. అయితే సరిగ్గా ఈవీఎంలలో అదే బటన్ బద్దలై కూటమి ప్రభుత్వానికి 165 స్థానాలు వచ్చి సరిగ్గా నేటికి ఏడాది. గత ఏడాది జూన్ 4న వచ్చిన ఎన్నికల ఫలితాలు చూస్తే జగన్మోహన్‌రెడ్డి ఉదాశీన పాలనకు, బాధ్యతారాహిత్యానికి అవసరమైన దానికంటే ఎక్కువగానే శిక్షించారని నిరూపించిన రోజు. ఎన్ని ఎక్కువ సీట్లిచ్చారో తిరిగి అన్ని తక్కువ సీట్లతో మూలన కూర్చోబెట్టిన రోజు. కూటమి అధికారంలోకి వచ్చిందని తేల్చిన రోజు. కాకపోతే ఏడాదైనా ఇప్పటికీ తెలుగుదేశం నేతలు జగన్మోహన్‌రెడ్డే ముఖ్యమంత్రిగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నవారినే విమర్శిస్తూ కాలం నెట్టుకొస్తున్నారు.
జూన్ 12న కూటమి ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసింది. లెక్క ప్రకారం ప్రభుత్వం ఏర్పడి అప్పటికి ఏడాది. కానీ జూన్ 4 ఈవీఎంలలో బటన్ బద్దలైన రోజు. ఏ బటన్ నొక్కి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని సుభిక్షం చేశారని భావించారో అటువంటి బటనే ఈవీఎంలలో నొక్కి జనాలు ఆయనకు అధికారం దూరం చేశారు. అయితే విచిత్రం ఆ ఈవీఎం బటన్లపైనే జగన్మోహన్‌రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు.. అది వేరే విషయం. ఎన్నికల ముందు పాదయాత్రలో జనాల హృదయాలు గెలుచుకున్న జగన్మోహన్‌రెడ్డి ఒక పాలకుడిగా మాత్రం విఫలమయ్యారని నిర్ణయించడానికి ఐదేళ్లు అవసరం పడలేదు. కాకపోతే ఆయన నిరంకుశ విధానాల వల్ల, ఆయన పార్టీలో వీరవిధేయుల వల్ల అసమ్మతి, అసంతృప్తి బయటపడకుండా అణచగలగారు గానీ, రెండున్నరేళ్లకు కేబినెట్‌ను మార్చిన సమయానికే ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది. అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే ఆయన ఇచ్చిన హామీల అమలు కోసం అడుగులు వేసిన జగన్మోహన్‌రెడ్డి అతి తక్కువ కాలంలో జనాభిమానానికి దూరమవడానికి కారణం ఆయన పార్టీ వేరు, ప్రభుత్వం వేరని భావించి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడమే. తెలుగుదేశం సానుభూతిపరుల కోణంలో అమరావతి రాజధాని రద్దు, సీపీఎస్ రద్దు చేయకపోవడం, 45 ఏళ్లకు పెన్షన్ ఇవ్వకపోవడం, యువతకు వైన్‌షాపులు, ఫిష్ ఆంధ్రాలో మాత్రమే ఉపాధి చూపించడం వంటివి జగన్ ఓటమికి కారణాలు కావచ్చు గానీ, అంతకు మించి పార్టీలో పనికొచ్చే నేతలను పక్కన పెట్టి కేవలం తన భజనపరులకు మాత్రమే అందలమెక్కించి ఎవరి సూచనలూ పట్టించుకోకపోవడం వల్ల జరిగిన నష్టమిది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనతో పోల్చిచూస్తే జగన్మోహన్‌రెడ్డి తొలి ఏడాది బాగానే పరిపాలించినట్టు కనిపిస్తుంది. అయినా కూడా జగన్మోహన్‌రెడ్డికి 11 సీట్లు మాత్రమే రావడం వెనుక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలను ఆయన తొక్కిపెట్టేయడమే. తన వల్లే అధికారంలోకి వచ్చారని, తలపండిన నేతలు కూడా తనవల్లే గెలిచారని భావించడం వల్లే కేవలం జగన్ వల్లే 2024లో 11 సీట్లకు ఆ పార్టీ పరిమితమైపోయింది.
జిల్లాలో ధర్మాన ప్రసాదరావు వంటి రాజకీయ ఉద్ధండుడికి సైతం ముఖ్యమంత్రిని కలవాలంటే నెలలు తరబడి అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం, కేంద్రంలో లాబీయింగ్ చేయగల సత్తా ఉన్న మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి వంటి నేతలకు బీజేపీ అనే ఆప్షన్ ఉన్నా ఏరికోరి వైకాపాలో చేరినా గుర్తింపు దక్కలేదు సరికదా.. ఆమెకు పోటీగా అక్కడ బలం లేని నాయకత్వానికి ఊపిరిలూదడం, తన సామాజికవర్గానికి చెందిన రెడ్లను తీసుకువచ్చి జిల్లా మీద ఆధిపత్యాన్ని అప్పగించడం వంటివి ఈ జిల్లాలో వైకాపా క్లీన్ స్వీప్ అవడానికి ప్రధాన కారణాలు. 2029 ఎన్నికల్లో కూడా జగన్మోహన్‌రెడ్డి తన వల్లే అంతా జరగాలని భావిస్తే, రాజకీయంగా ఇక్కడ కొన్ని శక్తులు, కొందరు వ్యక్తులు సమాధి అయిపోతారు. అటువంటి వారిని బతికించి జిల్లాలో రాజకీయ చైతన్యం తీసుకురావడం కోసం ధర్మాన అనారోగ్యం పేరుతో అలకపాన్పు మీద ఉన్నారు. కారణం.. చివరి నిమిషంలో భావోద్వేగాల పేరుతోనో, రాజకీయ సమీకరణాలు కుదరలేదనో వేరే వారికి పగ్గాలిస్తే ఇక్కడ రాజకీయాలు చేయడం అవసరమనే భావన ధర్మానలో ఉంది. ఇది వాస్తవం కూడా. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్రభుత్వం చేస్తున్న తప్పులను ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టాలని చూసినా ఆ అవకాశం జగన్మోహన్‌రెడ్డి ఇవ్వలేదు. కేవలం మీతో ఒక్క ఫొటో అని కబురంపితే కలవడం మినహా జిల్లా రాజకీయాలపై సీనియర్లతో చర్చించిన పాపాన పోలేదు. ధర్మాన 2019లో ప్రభుత్వం ఏర్పాటైన మొదట్నుంచి ప్రభుత్వాలు వ్యాపారాలు చేయకూడదని ఓపెన్‌గానే చెబుతూవచ్చారు. ఇసుక, మద్యం వంటి విషయాల్లో వేలు పెట్టకూడదని, ఇటువంటి పాలసీలకు తాను వ్యతిరేకమని చెప్పేవారు. సరిగ్గా ఇప్పుడు అదే మద్యం పాలసీ జగన్మోహన్‌రెడ్డి మెడకు చుట్టుకుంది. సీఎంవోలో అప్పటి మద్యం పాలసీపై సంతకం ఉందని నిరూపించే దమ్ముందా అని జగన్మోహన్‌రెడ్డి మీడియాను ప్రశ్నిస్తుండొచ్చుగాక.. కానీ సగటు ఓటరు మాత్రం మద్యం కుంభకోణం విషయంలో ప్రస్తుత ప్రభుత్వం కక్ష సాధిస్తుందని మాత్రం భావించడంలేదు. ఎందుకంటే నాణ్యమైన మద్యం దొరక్క, డిజిటల్ చెల్లింపులు లేక, టాక్స్ పేయర్ అనే గౌరవం దక్కక అప్పటి ప్రభుత్వాన్ని తిట్టుకోని రోజు లేదు. చివరకు వల్లభనేని వంశీని మరీ అంత హింసించడం సరికాదని సానుభూతి వ్యక్తం చేస్తున్న ఓటరు మద్యం కుంభకోణం మీద మాత్రం ఇంకా పాత్రధారులు కూడా బయటకు రావాలని కోరుకుంటున్నాడు. అలాగే గత ఐదేళ్లలో ఇసుక దొరక్క ఎన్ని వేల నిర్మాణాలు ఆగిపోయాయో వేరేగా చెప్పనక్కర్లేదు. తమ ప్రాంతంలో ఉన్న నదిలో ఇసుక తమ కళ్లముందే వేరే జిల్లాలకు చెందినవారు భారీ వాహనాలపై తరలించుకుపోతుంటే కళ్లు లేని కబోదిలా వ్యవహరించాల్సిన పరిస్థితి సగటు జిల్లావాసిది. జేపీ వెంచర్స్ అని, మరోటని, మరోటని సంస్థలను దించి ఇక్కడ నదీ తల్లుల గర్భాన్ని చీల్చేశారు. ఇది స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని ఇక్కడ జిల్లా నేతలు జగన్‌కు చెబుదామంటే ముందు కోటరీ దాటి వెళ్లనిచ్చేవారెవరు? సంక్షేమ పథకాలు మాత్రమే ఓట్లు రాల్చవని ధర్మానకు ముందే తెలుసు. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఒక కుటుంబానికి జగన్మోహన్‌రెడ్డి ద్వారా ఎంత లబ్ధి జరిగిందన్న డేటాతో కూడిన పుస్తకాన్ని నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులకు అందించారు. అప్పుడే నాలుగు డివిజన్లు తిరిగిన ధర్మానకు సీన్ అర్థమైపోయింది. ఏడాదికి రూ.12 లక్షలు పైబడి లబ్ధి పొందిన కుటుంబాల మొహాల్లో కూడా వెలుగులు లేకపోవడం ఆయన గమనించారు. అయితే పార్టీలో ఈ మాట చెబితే విన్నది ఎవరు? అలాగే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి జగన్మోహన్‌రెడ్డి నవరత్నాలతో కూడిన స్టిక్కర్‌ను అంటించి లబ్ధి జరిగితే అందులో ఉన్న నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలని చేసిన ప్రచారంలో స్వతంత్రంగా స్పందించిన లబ్ధిదారులంతెమంది? వార్డు వాలంటీర్ల మెడ మీద కత్తిపెట్టితే మిస్డ్‌కాల్ ఇచ్చినవారు ఎంతమంది? అన్న విషయం ఆ సీజన్‌లోనే తేలిపోయింది. కాకపోతే జగన్మోహన్‌రెడ్డి పంపకాల స్థాయి గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉండటం వల్ల ఓటరు ఆ ఇంటిలోనే ఉన్నారన్న భ్రమలో పడిపోయింది కేడర్. ఒకవైపు పార్టీ అధికారంలో ఉన్నా, తమను ఆర్ధికంగా బలోపేతం చేయలేదని బాధపడుతూనే మరోవైపు జగన్మోహన్‌రెడ్డిని కొట్టేవాడు లేరనే భ్రమలోకి వెళ్లిపోయారు. కానీ కెరీర్ ప్రారంభం నుంచి ఇలాంటి ఎన్నికలు, ఎందరో నాయకుల్ని చూసుకొచ్చిన ధర్మాన లాంటివారికి మాత్రం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసు. కానీ ఆయన్ను అడిగేవాడెవరు?
గేమ్ ఛేంజర్ పవన్
సరిగ్గా ఇటువంటి సమయంలోనే చంద్రబాబును అరెస్ట్ చేయించి గత ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది. ఇక్కడ స్కిల్ కుంభకోణం జరిగిందా? లేదా? అన్న విషయానికి పోవడంలేదు. కానీ ఎన్నికల ముందు చంద్రబాబును అరెస్టు చేయడమనేది రాజకీయంగా ఆత్మహత్యాసదృశమే. అప్పటివరకు ఉప్పు, నిప్పులా బీజేపీ, టీడీపీలకు సయోధ్య కుదిర్చి ఓటు చీలకుండా చేయడం వల్లేల కూటమి అన్ని స్థానాలను, అంత ఓటింగ్‌ను దక్కించుకోగలిగింది. దీనికి తోడు 70 మందికి పైగా అభ్యర్థులను మార్చడం, స్థానికేతరులను దించడం వైకాపా ఓటమికి ఒక కారణం. పాఠశాలలు, గ్రామ సచివాలయాలు, వైద్యం వంటి విషయాల్లో మంచి చేసినా, రోడ్ల దుస్థితి ముందు ఇవి దిగదుడుపైపోయాయి. అన్నిటికీ మించి చంద్రబాబు సామాజిక భద్రతా పింఛను రూ.4వేలు చేస్తామనడం పెద్ద ఎత్తున ఓటు ట్రాన్స్‌ఫర్‌కు కారణమైంది.
పాలనే అగ్నిపరీక్ష
గడిచిన ఎన్నికల్లో కూటమి పార్టీలతో సంబంధం లేకుండా కేవలం తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కటే ప్రభుత్వం ఏర్పాటుకు పూర్తి మెజార్టీ సంపాదించింది. అదలా ఉంచితే బాబు ప్రకటించిన ఎన్నికల ప్రణాళికను అమలుచేయడం సాధ్యమేనా? ఉమ్మడి ఎన్నికల ప్రణాళికను అమలుచేయడానికి ఏటా రూ.1.60 లక్షల కోట్లు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సంపదను ఎలా సృష్టిస్తారు? సూపర్‌సిక్స్ ఫార్ములాను ఎలా అమలుచేస్తారనేదే ఏడాదైనా అర్థంకాని భేతాళ ప్రశ్న. జగన్మోహన్‌రెడ్డి తప్పిదాల వల్ల అధికారం సులువుగా వచ్చినా పాలనే తలకు మించిన భారంగా ఉంది. ఇప్పటికీ ఫ్రీగ్యాస్ సిలెండర్లు, సామాజిక పింఛన్లు తప్ప సూపర్‌సిక్స్‌లో మిగిలిన పథకాలు అమలుకాలేదు. ఈ విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం అని చెబుతున్నారు. ఆగస్టులో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. ఇవి అమల్లోకి వచ్చేవరకు గ్యారెంటీ లేదు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు, జిల్లాలో కొత్త పనుల ప్రారంభం వంటివాటిలో జగన్మోహన్ రెడ్డి పాలనకు, కూటమి ప్రభుత్వానికి తేడా కనిపించడంలేదు. కాకపోతే రాష్ట్రంలో ఏం జరిగినా నిమ్మకు నీరెత్తినట్టుండే జగన్మోహన్‌రెడ్డికి, అప్పటి ప్రతిపక్షం మీద విరుచుకుపడటానికి తప్ప ప్రజా సమస్యలపై నోరెత్తని మంత్రులకు, ఇప్పటి పాలకులకు మధ్య స్పష్టమైన తేడా అయితే కనిపిస్తుంది. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు గాని, మరో పవర్ సెంటర్ లోకేష్‌కు గాని సమస్య విన్నవించుకుంటే దానిపై వారు స్పందిస్తున్న తీరు మాత్రం ఊరట కలిగించే అంశం.
Kommentare