బదిలీలైతే బాగోతాలు బయటపడతాయ్!
- BAGADI NARAYANARAO
- Aug 24, 2024
- 4 min read
కొత్త ప్రభుత్వంలోనూ పాతవారే కొనసాగే యత్నాలు
రెవెన్యూలో ప్రహసనంగా మారిన బదిలీలు
రాజకీయ ప్రమేయంతో ఏళ్ల తరబడి ఒకేచోట తిష్ట
తహసీల్దార్ నుంచి వీఆర్వో వరకు ఇదే పరిస్థితి
ఇదే అదనుగా రికార్డుల తారుమారు, గల్లంతు
అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఇక్కడున్న కొన్ని సామాజికవర్గాలకు ప్రతీ రాజకీయ నాయకుడితోను బీరకాయ పీచు చుట్టరికం ఉంటుంది. వైకాపా అధికారంలో ఉంటే ఒకరితోను, టీడీపీ అధికారంలోకి వస్తే మరొకరితోను చెప్పించుకునే బంధుత్వాలు నెరుపుతుంటారు. గత పాలనలో ఆ పార్టీ చేయించిన అరాచకాలన్నింటికీ వంతపాడి, ఇప్పుడు అదే స్థానంలో బదిలీ లేకుండా కొనసాగిస్తే అదే విధంగా సాయపడతామన్న ధోరణిలో ఇక్కడి రెవెన్యూ ఉద్యోగులు రాజకీయ నాయకులకు సంకేతాలు పంపిస్తున్నారు. అయ్యతరఫు బాగారి వైకాపా నేతకు చుట్టమైతే, అమ్మ తరఫు మేనమామ టీడీపీ నేతలకు చుట్టమవుతాడు. కాబట్టి ఎవరొచ్చినా తమకు జరిగే నష్టమేమీ లేదన్న భావనలో రెవెన్యూ ఉద్యోగులు వారిలో వారే సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒకచోట పనిచేసినవారిని కచ్చితంగా బదిలీ చేయాలని మరోసారి ప్రభుత్వం నొక్కివక్కాణిస్తే ప్రత్యామ్నాయంగా ఎక్కడికి వెళ్లాలన్న దాని మీద ఇప్పటికే సీట్లు సర్దుబాటు చేసుకుంటున్నారు. ఉదాహరణకు శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఈ ప్రభుత్వంలో కూడా బదిలీ కాకూడదని ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ కాదూ కూడదూ అంటే పక్కనే ఉన్న గార వెళ్లడానికి ప్లేస్ రిజర్వ్ చేసుకుంటున్నారు. అలాగే గార నుంచి వైకాపాతో అంటకాగిన వ్యక్తి శ్రీకాకుళం వస్తారు. కలెక్టరేట్‌లో డీటీగా చేస్తున్న వ్యక్తి శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయానికి వస్తారు. తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న వ్యక్తి కలెక్టర్ ఆఫీసుకు వెళ్తారు. అంతేకాని మారుమూల ప్రాంతాల్లో సుదీర్ఘ కాలంగా మగ్గిపోతున్నవారికి మాత్రం అవకాశం ఇవ్వరు. కూటమి ప్రభుత్వం వచ్చింది, కూకటివేళ్లతో పాతవారిని మార్చేస్తుందనుకోవడం పొరపాటే. ఎవరి స్థాయిలో వారు టీడీపీ ఎమ్మెల్యేలను, మంత్రులను వారి వారి అనుంగుల ద్వారా కలిసి సిఫార్సు లేఖలు తెచ్చుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి పెద్ద ఎత్తున డిమాండ్ ఉండటంతో ఎమ్మెల్యే గొండు శంకర్ కార్యాలయంలో ఏం జరుగుతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రెవెన్యూ ఉద్యోగులు మాత్రం శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు ఉన్నా, గొండు శంకర్ ఉన్నా తమ బంధువులేనన్న భావనతో ఉన్నారు. అన్నింటికీ మించి ప్రస్తుతం తాము పని చేస్తున్న సీటును వదిలి దూరంగా పోతే అప్పట్లో తాము చేసిన రికార్డు టాంపరింగ్, భూ పంపకాలు, బినామీ పేర్లతో కొట్టేసిన భూముల వ్యవహారాలు బయటికొస్తాయని, అందుకే ఎంత ఖర్చయినా సీటు వదలడానికి ఇష్టపడటంలేదు. పొరపాటున బదిలీ జరిగితే ఆ స్థానంలో తమ మనుషులనే తెచ్చి కూర్చోబెట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో శ్రీకాకుళం ఎమ్మెల్యే ఏం చేస్తారనేదే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ. ఇప్పటికే జిల్లాస్థాయి పోస్టులకు సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌లు సంయుక్తంగా ఓ జాబితాను సిద్ధం చేసుకున్నారు. ఇది కాకుండా ఇప్పుడు మిగిలింది దిగువస్థాయి ఉద్యోగులే. సాధారణ బదిలీలో సచివాలయ ఉద్యోగులను కూడా కొత్తగా చేర్చడంతో ఎమ్మెల్యేల కార్యాలయాలపై తీవ్ర ఒత్తిడి ఉంది. గత ఐదు రోజులుగా ఎమ్మెల్యే గొండు శంకర్ వీరికి జడిసి కార్యాలయానికి కూడా రావడంలేదు. దీంతో ఆయన సొంత గ్రామం కిష్టప్పేట వద్ద జనాలు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. మరోవైపు కోటబొమ్మాళిలో రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు ఇంటివద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. ఏది ఏమైనా రెవెన్యూ ఉద్యోగులు మాత్రం పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకువచ్చి తమ పాపాల పుట్ట బద్దలుకాకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

కమిటీ ఏదైనా.. మార్గదర్శకాలు ఎలా ఉన్నా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేకుండా బదిలీలు, పోస్టింగులు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు, ఎప్పుడూ లేదు. ప్రస్తుతం ప్రారంభమైన బదిలీల ప్రక్రియలోనూ ఇదే జరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. విద్య, వైద్యఆరోగ్య శాఖలు మినహా మిగిలిన అన్ని శాఖల్లోనూ బదిలీల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నెల 18న జారీచేసిన జీవో నెం.75 ప్రకారం ఈ నెల 31లోగా బదిలీలు, పోస్టుల ప్రక్రియ ముగించాలని ఆదేశించింది. ఒక్క ఎక్సైజ్ శాఖలో మాత్రం వచ్చే నెల ఐదో తేదీ నుంచి 15వ తేదీ మధ్య బదిలీలు చేపట్టనున్నారు. మిగతా శాఖల సంగతెలా ఉన్నా కీలకమైన రెవెన్యూ శాఖలో బదిలీలు మాత్రం మొదటినుంచీ ప్రహసనప్రాయంగా సాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడూ దానికి మినహాయింపు లేదన్నట్లే కనిపిస్తోంది. వివిధ స్థాయిల రెవెన్యూ ఉద్యోగులు తమకు అనువైన ప్రాంతాల్లో పోస్టింగు వేయించుకునేందుకు అప్పుడే రాజకీయ సిఫార్సుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సిఫార్సులకు తోడు బదిలీల ప్రక్రియలో పొందుపర్చిన పలు నిబంధనలు రెవెన్యూ ఉద్యోగులను ఏళ్ల తరబడి ఒక ప్రాంతం చుట్టూనే బదిలీల పేరుతో తిరుగుతూ వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశం కల్పిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న బదిలీల ప్రక్రియలో అగ్రభాగం రెవెన్యూ శాఖదే. ఆ మేరకు కలెక్టర్, జేసీ, డీఆర్వోలతో కూడిన కమిటీల ఆధ్వర్యంలో బదిలీలు చేపట్టాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ తహసీల్దార్, అంతకంటే కిందిస్థాయి ఉద్యోగుల బదిలీలకు జేసీ, డీఆర్వోలతో కమిటీ ఏర్పాటు చేశారు. తహసీల్దార్లు, వీఆర్వోల బదిలీల బాధ్యతను కలెక్టర్ నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో బదిలీల ప్రక్రియను ఉమ్మడి జిల్లా కలెక్టర్, విభజిత జిల్లా డీఆర్వోలకు అప్పగించారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల నుంచి అధికారపార్టీ ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలతో కూడిన జాబితాలను కలెక్టరేట్‌కు అందించారు. వాటికి అనుగుణంగా బదిలీలు, పోస్టింగులకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఉద్యోగ సంఘాల్లో ప్రతినిధులుగా ఉన్న ఉద్యోగులు, అధికారులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంటుందని భావిస్తున్నారు. కాగా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటై 56 నెలలు పూర్తి కావడంతో వారికి కూడా బదిలీ ఉత్తర్వులు వర్తింపజేస్తున్నారు. దాంతో వారంతా ప్రజాప్రతినిధుల సిఫార్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. 2019`24 మధ్య ఒకేచోట పని చేసిన వారందరినీ మార్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు సూచించారు.
లోపాలు సరిదిద్దకపోవడమే కారణం
ప్రజలకు చేరువగా ఉంటూ అధికశాతం ప్రభుత్వ సేవలు అందించేది రెవెన్యూశాఖే. అదేవిధంగా ఎక్కువ అవినీతి ముద్ర పడేది కూడా ఈశాఖ పైనే. వ్యవస్థాగత లోపాలు సరిచేసే బాధ్యతను ఎవరూ తీసుకోకపోవడం వల్లే ఈ శాఖ ప్రతిష్ట మసకబారిందని ఆ శాఖ రిటైర్డ్ అధికారులు చాలామంది అభిప్రాయపడుతున్నారు. రాజకీయ ప్రాపకంతో చాలామంది మార్గదర్శకాలను తుంగలో తొక్కి అనుకూలమైన పోస్టింగులు పొందుతుండటం వల్ల రెవెన్యూ ప్రతిష్ట దిగజారుతోందని విమర్శలు ఉన్నాయి. రాజకీయ సిఫార్సులతో ఏళ్లతరబడి సొంత మండలాల్లోనో, ఒకే మండలంలోనో పని చేయడం వల్ల స్థానిక నాయకుల ఒత్తిడి, ప్రలోభాలకు లోనై ఉద్యోగులు అవకతవకలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వ్యవస్థలో ఉన్న లోపాలను ఆసరా చేసుకొని స్థానిక ప్రజాప్రతినిధులతో అంటకాగుతూ ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. దాంతో రెవెన్యూలో నిజాయితీ అన్న మాటకు చోటు లేకుండాపోయిందంటున్నారు. వీఆర్వోలకు సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వకూడదన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. కానీ ప్రస్తుత బదిలీ మార్గదర్శకాల ప్రకారం గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుంటున్నారు. దీనివల్ల ఒక్కో గ్రామ పంచాయతీలో ఐదేళ్లు చొప్పున సర్వీస్ అంతా ఒకే మండలంలోని గ్రామాల్లోనే పూర్తి చేసే పరిస్థితి ఉంది. ఒకే మండలంలో సుదీర్ఘ కాలం పనిచేయడం వల్ల శాఖలోని గుట్టుమట్లన్నీ తెలుసుకుని రికార్డుల ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నారు. మరికొందరు రికార్డులను ఇళ్లలో పెట్టుకుని మిస్సింగ్ అని చూపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంటివద్దే వాటిని తారుమారు చేసేస్తున్నారు. ఫలితంగా మండలాల్లో 80 శాతం రెవెన్యూ రికార్డులు మాయమవడమో, ట్యాంపరింగ్‌కు గురి కావడమో జరిగింది. దీనికి పలాస మండలమే నిలువెత్తు నిదర్శనం. ఈ మండలానికి చెందిన రెవెన్యూ రికార్డులు చాలా వరకు అందుబాటులో లేవు. అలాగే ప్రతి ఎన్నికల తర్వాత టెక్కలి తహసీల్దార్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ కావడం సర్వసాధారణం. ఈ నేపథ్యంలో వీఆర్వోలను గ్రామం యూనిట్‌గా కాకుండా మండలాన్నో, నియోజకవర్గాన్నో యూనిట్‌గా బదిలీలు చేయాలన్న సూచనలు అందుతున్నాయి. మండలం లేదా నియోజకవర్గంలో ఐదేళ్లు పనిచేసిన వీఆర్వోలను తప్పనిసరిగా మండలం దాటించి బదిలీ చేయాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఏళ్ల తరబడి ఒకేచోట తిష్ట
తహసీల్దార్ నుంచి వీఆర్వో వరకు రాజకీయ నాయకుల సిఫార్సు తప్పనిసరి అయిపోయింది. పలాసలో 2019 ఆగస్టు నుంచి 2024 మార్చి వరకు ఒకే తహసీల్దారు కొనసాగారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అప్పుడు కూడా సార్వత్రిక ఎన్నికల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో బదిలీ చేయకతప్పలేదు. చాలా మండలాల్లో ఇదే రీతిలో డీటీలు, సర్వేయర్లు, సీనియర్ సహాయకులు ఏళ్ల తరబడి పని చేస్తున్నారు. దీనికి కారణం స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సులే. రెవెన్యూలో నిజాయితీకి తావులేదని అనేక సందర్భాల్లో వెలుగులోకి వచ్చింది. శాఖాపరమైన చర్యలు, ఛార్జిమెమోలు అందుకున్నవారిని, సస్పెండైనవారిని ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసి సొంత మండలాలకు తెచ్చుకుంటున్నారు. అర్హత లేకపోయినా పోస్టింగులు ఇప్పించుకుంటున్నారు. అదే సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పినట్టు పని చేయని వారిపై రోజుల వ్యవధిలోనే బదిలీ వేటు వేస్తున్నారు. ఇక క్షేత్రస్థాయి సిబ్బంది నియామకాల్లో స్థానిక సంస్థల ప్రతినిధుల ప్రమేయం ఉంటోంది. తాము చెప్పినవారిని నియమించకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరించే పరిస్థితి చాలాచోట్ల ఉంది.
సాంకేతిక అందుకోలేని దుస్థితి
పంచాయతీరాజ్ వ్యవస్థలో పంచాయతీ కార్యదర్శికి డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. అదే రెవెన్యూలో ఏడు, పది తరగతులు పాసైనవారు వీఆర్వోలుగా ఉన్నారు. తలయారీ, నామినీ వ్యవస్థ నుంచి వచ్చినవారిలో ఎక్కువ మంది ఏడో తరగతి పాసైనవారే. గ్రామస్థాయిలో వీరంతా బలమైన వ్యవస్థగా ఏర్పడి శాసిస్తున్న పరిస్థితి ఉంది. ఇటువంటివారు ఆధునిక సాంకేతికతను అందుకోలేక ప్రజలకు సేవలు అందించడంలో తీవ్ర జాప్యానికి కారణమవుతున్నారని విమర్శలు ఉన్నాయి. వీరు మండలాన్ని విడిచివెళ్లే పరిస్థితి గానీ, పనిచేస్తున్న గ్రామాల నుంచి కదిలించే అవకాశం గానీ లేవు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వీరి జోలికి వెళ్లదు. దీంతో వీరి బదిలీలు, పోస్టింగుల విషయంలో ప్రజాప్రతినిధులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. 2014`19 మధ్య పని చేసిన వారిని ఏరికోరి తెచ్చుకొనే ప్రయత్నాల్లో గ్రామస్థాయి నాయకులు ఉన్నారు.
Comments