ఈమధ్యకాలంలో ఇంత హైప్ క్రియేట్ చేయబడిన సినిమా మరొకటి లేదేమో.. సినిమా ఎలా ఉంది.. సినిమాలో చెప్పుకున్నట్టు ఇంటర్నేషనల్ వైల్డ్ ఫైర్ రేంజులో ఉందా..?

ఎంత వద్దనుకున్నా కచ్చితంగా పుష్ప ఫస్ట్ పార్ట్‌తో పోలిక తప్పకుండా వస్తుంది. దానికి సీక్వెలే కదా ఇది. స్థూలంగా సినిమా హిట్. ప్రీమియర్లు చూసిన ప్రేక్షకులు కూడా ఖుష్. పక్కా కమర్షియల్ సక్సెస్. డౌట్ లేదు. ఐతే..? ఫస్ట్ పార్ట్ ఇచ్చిన థ్రిల్ ఇందులో కాస్త తక్కువే. ఈ సినిమా మొత్తం బన్నీయే. తనను ఆకాశానికి ఎత్తడానికి మిగతా పాత్రలన్నీ వీక్ చేసేశాడు దర్శకుడు. ఫస్ట్ పార్టులో చివరలో వచ్చిన ఫహాద్ ఫాజల్ పాత్ర కూడా వీకే. ఫస్టాఫ్ మొత్తం ఫహాద్, బన్నీల నడుమ టామ్ అండ్ జెర్రీ బాపతు సో సో కథనం. ఇంట్రవెల్ బ్యాంగ్‌తో సెకండాఫ్ ఇంకాస్త ఇంట్రస్టింగుగా నడిపించాడు దర్శకుడు కథను. నో డౌట్. అల్లు అర్జున్ మంచి పర్‌ఫార్మర్. ఓ రేంజులో అదరగొట్టేశాడు ఆ పాత్రకు తగిన యాక్షన్‌ను. నిజానికి ఫస్ట్ పార్టుతో పోలిస్తే ఇందులో పెద్ద కథేమీ లేదు. కాకపోతే ఎప్పటికప్పుడు హైప్ తీసుకురావడంలో దర్శకుడు సక్సెసయ్యాడు. హైప్‌కు తగిన సరుకు ఇచ్చాడు. అవును, మొన్నామధ్య ఎవరో నిర్మాతో దర్శకుడో అన్నాడు కదా.. స్టార్ హీరోల సినిమాలకు కథలెందుకు అని..! పుష్ప సీక్వెల్ కూడా పుష్ప, బన్నీ బ్రాండ్‌తో నడిచిపోతుంది. బన్నీ లేకపోతే ఈ సినిమా లేదు. పుష్పరాజ్ అనే కేరక్టర్ స్మగ్లర్.. దాన్ని ఓ డ్రగ్‌లాగా ఎక్కించాడు సుకుమార్. డ్రగ్స్ మంచివి కావు, కానీ కిక్కు వస్తుంది కదా.. ఈ కేరక్టరూ అంతే. యాక్షన్ సీక్వెన్సులే కాదు, జాతర, క్లైమాక్సుల చిత్రీకరణలో సుకుమార్ ప్రతిభ, బన్నీ నటన ఈ సినిమాకు ప్రాణం. రష్మిక మంధనకు కూడా కీలకమైన ఎపిసోడ్ జాతరే. కాకపోతే కథాపరంగా క్లైమాక్స్ అసంపూర్తిగా ముగించి, పుష్ప-3 కోసం ఓ అస్పష్టమైన లీడ్ వదిలారు అనిపించింది. అది అంత కిక్ ఇచ్చేలా లేదు.
ఫస్ట్ పార్ట్ పాటలతో పోలిస్తే ఈ సీక్వెల్ పాటలు అంత బాగా లేనట్టు అనిపించినా నాసిరకం అయితే కాదు. దెబ్బలు పడతయిరో పాటలో రచయిత ఏం చెప్పాలనుకున్నాడో ఆ ఆస్కారుడికే ఎరుక పాపం. స్టెప్పులు వేయడంలో రష్మిక బన్నీతో అక్షరాలా పోటీ పడిరది. బీజీఎం మీద కదా హీరో, దర్శకుల అసంతృప్తి, అందుకే కదా వేరేవాళ్లను పెట్టుకున్నది. బీజీఎం అదిరిపోయింది. దర్శకుడి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు బీజీఎం చేసిన సంగీత దర్శకుడు ఎవరో గానీ.. (సీఎస్ శామ్..?) దెబ్బలు పడతయిరో ఐటమ్ సాంగ్‌లో శ్రీలీల మసాలా స్టెప్పులు బాగానే ఉన్నాయి. స్వతహాగా ఆమె మంచి డాన్సర్. ఆమెతో పోటీ ఏ హీరోకైనా కష్టమే.
మొత్తానికి ఇది బన్నీ బ్రాండ్ సినిమా. కథాలోపాలు, కథనలోపాలు గట్రా పట్టించుకోవద్దు. పక్కా ఓ కమర్షియల్ మూవీ కదా, లెంత్ ఎక్కువైనా సరే.. జస్ట్, అలా చూస్తూ ఉండిపోవాలి. మరి పుష్ప అంటే ఫ్లవర్ కాదు కదా.. అసలే ఇప్పుడు ఇంటర్నేషనల్ వైల్డ్ పైర్..!!
‘పుష్ప’లో హీరో ఒక సాధారణ కూలీగా మొదలుపెట్టి.. ఎర్రచందనం సిండికేట్‌ను తన గుప్పెట్లోకి తీసుకునే డాన్ స్థాయికి ఎదుగుతాడు. ఈ జర్నీలో చాలా కథ ఉంటుంది. ఆ కథలో ఎన్నో మలుపులుంటాయి. బోలెడంత మంది విలన్లు.. వాళ్లు సృష్టించే అడ్డంకులు.. ఎత్తులు పై ఎత్తులు.. ఇవన్నీ కాక ఓవైపు హీరోకు ఇంటి పేరు లేకపోవడం వెనుక ఒక ఎమోషనల్ బ్యాక్ స్టోరీ.. ఇంకోవైపు ఓ అమ్మాయితో తనకో లవ్‌స్టోరీ.. ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజీలా అందించాడు సుకుమార్. కొన్ని లోపాలున్నప్పటికీ.. ఒక విస్తృతమైన కథ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ పెద్ద కథలో అదిరిపోయే ఎలివేషన్లు.. పేలిపోయే యాక్షన్ ఘట్టాలతో ‘పుష్ప’ ప్రేక్షకులకు ఇవ్వాల్సిన హై ఇచ్చేసింది. ఐతే ‘పుష్ప: ది రైజ్’ ముగిసేసరికి.. హీరో ఆల్రెడీ పెద్ద రేంజికి ఎదిగిపోయాడు. ఇక అక్కడ్నుంచి ఇంకాస్త ఎత్తుకు ఎదగడం లేదా కింద పడడం.. మళ్లీ లేవడం తప్పితే కథగా చెప్పడానికి పెద్దగా స్కోప్ లేదు. మళ్లీ ఒక జర్నీ చూపించడానికి ఇక్కడ అవకాశమే లేదు. ప్రధాన పాత్ర జీరో నుంచి మొదలు పెట్టి ఒక స్థాయిని అందుకునేలా కథను నడిపిస్తే ప్రేక్షకులకు మంచి కిక్కు వస్తుంది కానీ.. ఆల్రెడీ ఒక స్థాయి అందుకున్న వ్యక్తి ప్రయాణాన్ని చూపిస్తే అందులో మజా ఉండదు. అందుకే ‘పుష్ప’ తరహా కథలకు సీక్వెల్ తీసి మెప్పించడం అంత తేలిక కాదు. ఐతే ఈసారి కథతో మెప్పించలేనని సుకుమార్‌కు బాగానే తెలుసు కాబట్టి.. ప్రేక్షకులకు దాని మీద దృష్టి మళ్ళని విధంగా మాయచేసే ‘ఎపిసోడ్ల’ మీద ఆయన దృష్టిసారించాడు. ఊపిరి సలపనివ్వని ఎలివేషన్ సీన్లు.. ఉర్రూతలూగించే యాక్షన్ ఘట్టాలతో సినిమాను నింపేశాడు. కథ పలుచనవ్వడం ఒకింత నిరాశపరిచినా.. మాస్‌కు పూనకాలు తెప్పించే హై ఓల్టేజ్ ఎపిసోడ్ల వల్ల ‘పుష్ప: ది రూల్’ పక్కా పైసా వసూల్ సినిమాగా తయారైంది.
అల్లు అర్జున్ కెరీర్లో కచ్చితంగా పుష్ప పాత్ర ఒక మైలురాయిలా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. పుష్ప అనే పాత్రను నరనరానా జీర్ణించేసుకున్నట్లు అతను ఆ పాత్రతో వేసిన ఇంపాక్ట్ చాలా బలమైంది. మనం చూస్తున్నది అల్లు అర్జున్ అనే విషయాన్ని పూర్తిగా మరిచిపోయి పుష్పతో కలిసి ప్రయాణం చేస్తాం. ఆ పాత్రకు తగ్గట్లుగా అతను చూపించిన యాటిట్యూడ్.. తన హావభావాలు అన్నీ కూడా వేరే లెవెల్ అనిపిస్తాయి. జాతర ఎపిసోడ్లో బన్నీ పెర్ఫామెన్స్ అయితే పీక్స్ అన్నట్లే. పుష్ప ఇగోను టచ్ చేసినపుడు అతనెలా తయారవుతాడో బన్నీ తన పెర్ఫామెన్సుతో చూపించిన తీరు వావ్ అనిపిస్తుంది. శ్రీవల్లిగా రష్మిక మరోసారి మెప్పించింది. ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే ఇందులో గ్లామర్ డోస్ పెంచింది. అలాగే పెర్ఫామెన్సూ అదరగొట్టింది. జాతర ఎపిసోడ్లో బన్నీతో పోటీ పడి నటించింది. విలన్ పాత్రలో ఫాహద్ ఫాజిల్ చెలరేగిపోయాడు. తెరపై తాను కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకుల అటెన్షన్ రాబట్టాడు. రావు రమేష్‌కు ‘పుష్ప-1’తో పోలిస్తే ఇందులో పాత్ర ప్రాధాన్యం పెరిగింది. ఆయన చాలా బాగా చేశారు. జగపతిబాబే కొంచెం కృత్రిమంగా అనిపించారు. అజయ్ ఆఖరి సన్నివేశంలో బాగా చేశాడు. పుష్ప ఫ్రెండు కేశవగా జగదీష్ అలవాటైన రీతిలో నటించాడు. తారక్ పొన్నప్ప తక్కువ స్క్రీన్ టైంలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. సునీల్.. అనసూయలకు ఇందులో పెద్దగా స్కోప్ లేదు. శ్రీలీల ‘కిసిక్’ పాటలో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. మిగతా ఆర్టిస్టులంతా ఓకే.
టెక్నికల్ గా ‘పుష్ప-2’కు ఢోకా లేదు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు బాగానే పేలాయి. పీలింగ్స్.. కిసిక్ సాంగ్స్ వినడానికే కాదు.. చూడ్డానికీ బాగున్నాయి. టైటిల్ సాంగ్ కూడా ఓకే. సూసేకి.. మెలోడీ వినసొంపుగా ఉంది. కానీ దాని చిత్రీకరణతో సుకుమార్ పెద్ద షాకే ఇచ్చాడు. అది మిక్సిడ్ ఫీలింగ్ ఇస్తుంది. దేవి నేపథ్య సంగీతం మాస్‌కు పూనకాలు తెప్పిస్తుంది. జాతర ఎపిసోడ్.. క్లైమాక్సులో చెవుల తుప్పు వదలగొట్టేశాడు దేవి. ఎలివేషన్ సీన్లను తన ఆర్‌ఆర్‌తో మరింత ఎలివేట్ చేశాడు. మిరస్లో కూబా ఛాయాగ్రహణం సూపర్బ్. విజువల్స్ అదిరిపోయాయి. ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా జాతర ఎపిసోడ్లో ఆర్ట్ డైరెక్టర్.. సినిమాటోగ్రాఫర్ పనితనం ప్రశంసనీయం. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఎంతమాత్రం రాజీ పడలేదు. పాటల లిరిక్స్.. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ‘ఏంది సామి పీడ కల వచ్చిందా’ అని శ్రీ వల్లి అడిగితే.. ‘నిజం కంటే పీడ కల ఏముంది’ అంటూ ఇంటి పేరు లేక తను పడే బాధను పుష్ప చెప్పడం సూపర్బ్. అలాగే హెలికాఫ్టర్ ఎక్కాక కాలు మీద కాలేసుకోమంటే పుష్ప చెప్పే డైలాగ్ కూడా అదిరింది. స్క్రిప్టు రూపకల్పనలో సుకుమార్ చాలామంది సాయం తీసుకున్నట్లు టైటిల్ క్రెడిట్స్ చూస్తే అర్థమవుతుంది. అయినా సినిమా అంతటా తన మార్కు ఉండేలా చూసుకున్నాడు. సుకుమార్ కష్టమంతా తెరపై కనిపిస్తుంది. ఆయనలో ఇంత మాస్ ఉందా అనిపించేలా ఊర మాస్ గా ఎపిసోడ్లను తీర్చిదిద్దాడు. కథాకథనాల పరంగా ‘రంగస్థలం’ సహా కొన్ని చిత్రాల్లో సుకుమార్ చూపించిన బ్రిలియన్స్.. క్లాస్ టచ్ ఇందులో లేదన్నది వాస్తవం. కానీ తన మార్కుతోనే ఆయన మాస్-ఎలివేషన్ సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం మాత్రం ప్రేక్షకులను అలరిస్తుంది. తన బ్రిలియన్స్ తో పరిమిత వర్గాన్ని మెప్పించడం కంటే.. కొంచెం స్థాయి తగ్గించుకుని అయినా ఎక్కువమందిని ఎంటర్టైన్ చేయడమే ధ్యేయంగా ఆయనీ సినిమా తీసినట్లు అనిపిస్తుంది.
Comments