
‘నమ్మండి.. నేను మారిపోయాను’ అని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఎక్కడికక్కడ చెప్పుకొచ్చారు. ప్రజలు నమ్మారు.. ఓట్లేసి మళ్లీ గెలిపించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేశాక.. ఇప్పటివరకు ఆయన తీరు కూడా మారారన్న మాటకే బలం చేకూర్చేలా కనిపించింది. అంతా బాగుందనుకుంటున్నంతలోనే కొత్త చంద్రబాబు స్థానంలో మళ్లీ పాత చంద్రబాబు తెరపైకి వస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెబుతుండటంతో ‘చంద్రబాబు మారలేదు.. ఇక మారరు’ అన్న వ్యాఖ్యలు మొదలయ్యాయి. ఇటీవల అమరావతిలో జరిగిన రాష్ట్రస్థాయి కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ అధికారులు సరిగ్గా పని చేయకపోతే తానే స్వయంగా వచ్చి చర్యలు తీసుకుంటానని, 1995 నాటి చంద్రబాబును చూస్తా రంటూ హెచ్చరించారు. అలాగే రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు ఒక సమావే శంలో మాట్లాడటానికి ప్రయత్నించగా.. మైక్ కాసేపు మొరాయించింది. దాంతో అసహనానికి గురైన ఆయన సమాచార శాఖ జిల్లా ఉన్నతాధికారిని వేదికపైకి పిలిపించి మందలించారు. ఇప్పటివరకు మాటలతోనే సరి పెడుతున్నానని, పెడచెవిన పెడితే పాత చంద్రబాబును చూపించాల్సి వస్తుందని వేదికపైనుంచే అధికారులను హెచ్చరించారు. ఇక ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కూడా పాత చంద్రబాబునే గుర్తు చేస్తు న్నాయి. గతంలో టీడీపీ ఓటమికి దారితీసిన కార్యక్రమాలు, నిర్ణయాలనే టీడీపీ కూటమి సర్కారు మళ్లీ కొత్త గా అమలు చేయడానికి సిద్ధమవుతుండటం విమర్శలకు, ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో జన్మభూమి 2.0 కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించనున్నట్లు ముఖ్య మంత్రి ప్రకటించారు. 2014`19 మధ్య ఐదేళ్ల కాలంలో అమలుచేసిన జన్మభూమి కార్యక్రమమే 2019 ఎన్నికల్లో ఆ పార్టీ పుట్టి ముంచడానికి దారి తీసిన ప్రధాన కారణాల్లో ఒకటన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నాడు గ్రామాల్లో తెలుగుదేశం కార్యకర్తలతో జన్మభూమి కమిటీలు వేసి గ్రామాలపై పెత్తనమంతా వాటికే అప్పగించారు. పింఛన్లు సహా ఏ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం కావాలన్నా స్థానిక జన్మభూమి కమిటీ సిఫార్సు చేయాల్సిందే. కమిటీ సభ్యులు ఓకే అంటే ఇవ్వాలి.. నో అంటే తిరస్కరించాలి. అభివృద్ధి కార్యక్ర మాలు సైతం జన్మభూమి కమిటీలు చెప్పినట్లు చేయాల్సిన పరిస్థితి ఉండేది. దాంతో అధికార యంత్రాంగం మొత్తం ఈ కమిటీల్లో అదుపాజ్ఞల్లో పనిచేయాల్సిన దుస్థితి. ఈ అధికారాలతోనే మెజారిటీ గ్రామాల్లో జన్మ భూమి కమిటీ సభ్యులుగా ఉన్న టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయి అవినీతి, ఆశ్రితపక్షపాతానికి, నచ్చనివారిపై కక్ష సాధింపులకు పాల్పడ్డారు. ఇవే ఆ పార్టీ పరువును గంగలో కలిపేసి 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపో యేలా చేశాయన్నది నిర్వివాదాంశం. ఆనాటి చేదు అనుభవాలు ఇప్పటికీ ప్రజలకు గుర్తున్నాయి. అటువంటి జన్మభూమి వ్యవస్థను 2.0 పేరుతో మళ్లీ తీసుకొస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో అటు ప్రజ ల్లోనూ, ఇటు అధికార యంత్రాంగంలోనూ ఆందోళన మొదలైంది. జన్మభూమి పథకం ద్వారా గ్రామాల్లో 17,500 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 10వేల కిలోమీటర్ల మురుగు కాలువలు నిర్మిస్తామని చెప్పడం వరకు బాగానే ఉన్నా.. మళ్లీ జన్మభూమి కమిటీల చేతుల్లోనే అధికారాన్ని పెడతారన్న అనుమానాలు పెరుగుతున్నా యి. మరోవైపు ప్రపంచ బ్యాంకు రుణం వైపు చంద్రబాబు సర్కారు అడుగులు వేస్తుండటంతో మళ్లీ రుణాలు, ఆంక్షల ఉచ్చులో రాష్ట్రం చిక్కుకుంటుందన్న అనుమానాలు మొదలయ్యాయి. అమరావతి నిర్మాణం, ఇతరత్రా అవసరాలకు నిధుల సమీకరణలో భాగంగా రెండు రోజుల క్రితమే రాష్ట్రానికి వచ్చిన ప్రపంచ బ్యాంకు ప్రతి నిధుల బృందంతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. రుణాలు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు అనే షరతులు పెడుతుంది. ఆంక్షలు విధిస్తుంది. వాటిని అమలు చేయడానికి సిద్ధపడితేనే రుణాలు ఇస్తుంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఉన్నప్పుడు ఇది మనందరికీ అనుభవంలోకి వచ్చినదే. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలును ప్రపంచ బ్యాంకు అస్సలు అంగీకరించదు. రుణాలు పొందాలంటే వాటినే ఫణంగా పెట్టాల్సి ఉంటుంది. ప్రపంచ బ్యాంకు చెప్పినట్లు అనేక రంగాల్లో సంస్కరణలు అమలు చేయాల్సి ఉంటుంది. విద్యుత్ ఛార్జీల పెంపు, పన్నుల సవరణ వంటివి ఈ సంస్కరణల్లో భాగంగా ఉంటాయి. 1995లో ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడే ఇటువంటి షరతులన్నింటికీ తలొగ్గి ప్రపంచ బ్యాంకు నుంచి భారీగా రుణాలు తీసుకున్నారు. ఆతర్వాత పన్నులు, విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఆనాడు కమ్యూనిస్టు పార్టీలు ఈ చర్యలకు వ్యతిరేకంగా తీవ్రంగా ఉద్యమించాయి. చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టారని విమర్శించాయి. దానికితోడు నాటి పీసీసీ అధ్యక్షుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో ప్రజల్లోకి చొచ్చుకుపోవడంతో చంద్రబాబు అధికారం కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన వైఎస్ గానీ.. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో సీఎంలుగా చేసిన చంద్రబాబు, జగన్‌లు గానీ ప్రపంచ బ్యాంకు వైపు చూడకుండా ఎఫ్‌ఆర్‌ఎంబీ నిబంధనల పరిధిలోనే దేశీయ ఆర్థిక సంస్థల నుంచే రుణాలు తీసుకుంటూ రాష్ట్ర అవసరాలకు సర్దుబాటు చేసేవారు. కానీ ఇప్పుడు మళ్లీ చంద్రబాబు గత చేదు అనుభవాలను విస్మరించి ప్రపంచబ్యాంకు రుణాలకోసం ప్రయత్నించడం కొరివితో తలగోక్కున్నట్లే అవుతుం దని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రజలపై భారం మోపుతారన్న ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి.
Comments