బుకీల వేట మొదలైంది..!
- NVS PRASAD
- May 24
- 1 min read
పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలన్నీ సిండికేట్ గుప్పెట్లో ఉంచుకొని అన్నీ తామే చేయాలన్న యోచనలో గత కొన్నేళ్లుగా ఇక్కడి యువతను తప్పుదారి పట్టిస్తున్న గ్రూప్ సభ్యుల ఆట కట్టించేందుకు ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. స్థానికంగా పోలీస్‌స్టేషన్లు ఉన్నా, అందులో సిబ్బంది మాత్రం ఇటువంటి వారిని అరికట్టడంలో వెనుకబడ్డాలని తెలుసుకున్న ఎస్పీ స్వయంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసి, ఎక్కడికక్కడ కట్టడి మొదలుపెట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి ఒప్పంగిలో ధనుంజయ, పాకాల కిశోర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల భోగట్టా. సన్‌రైజర్స్ (హైదరాబాద్) వర్సెస్ రాయల్ ఛాలెంజ్ (బెంగళూరు) మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా, ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వీరిద్దర్నీ ఒప్పంగిలో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం నగరంలో పద్మావతి కల్యాణ మండపం వెనుక ఒక పేకాట డెన్ మీద దాడి చేసి, 12 మందిపై కేసు నమోదు చేయడంతో పక్కనే ఉన్న మరో డెన్‌తో పాటు జిల్లాలో పేకాట శిబిరాలు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు ఇద్దరు బుకీలను అదుపులోకి తీసుకున్న తర్వాత నగరంలో సిండికేట్‌గా ఏర్పడి బెట్టింగులను ప్రోత్సహిస్తున్న గ్రూప్ రాత్రి నుంచి కనిపించకుండాపోయినట్టు భోగట్టా. అడ్డదిడ్డంగా పుట్టుకొచ్చిన ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా బయటకు దొరక్కుండా బెట్టింగ్ ఆడిస్తూ పోలీసులకు తెలిసినా ఆధారాలు లేవన్న కారణంతో తమనేమీ చేయలేరని చెలరేగిపోయినవారు ఇప్పుడు కనపడకుండాపోయారు.
Comments