విశాఖ కమిషనరేట్‌కు వెళ్లేందుకు సిక్కోలు సీఐలు ససేమిరా
`కమిషనర్‌గా నిజాయితీ అధికారి ఉండటమే కారణం
`పోనీ విజయనగరం వెళ్దామంటే అంగీకరించని నిబంధనలు
`దాంతో ఏదో విధంగా శ్రీకాకుళంలోనే కొనసాగేందుకు పాట్లు
శంఖబ్రత బాగ్చీ.. విశాఖ సిటీ పోలీస్ కమిషనర్. 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈ ఏడాది జులై రెండో తేదీన విశాఖ సిటీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఈయన పేరు చెబితే శ్రీకాకుళంలో పని చేస్తున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు చెమటలు పట్టేస్తున్నారు. బాగ్చీ విశాఖపట్నం సీపీ అయితే శ్రీకాకుళంలో పోలీసు అధికారులకు వచ్చిన ఇబ్బంది ఏమిటనే అనుమానం కలిగితే ఈ కథనం చదవాల్సిందే.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరినందున ప్రస్తుతం జిల్లాలో వైకాపా హయాం నుంచి పని చేస్తున్న అధికారులకు బదిలీ తప్పదు. సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు పోలీసు అధికారులను మార్చడం మనకు తెలుసు. ఆ ప్రకారం శ్రీకాకుళం నుంచి బదిలీ చేయాల్సివస్తే మహాసముద్రం లాంటి విశాఖపట్నంలో ఎక్కడో ఓచోటుకు పోస్టింగ్ వేయించుకుని వెళ్లిపోవడానికి సిద్ధపడుతుంటారు. కానీ ఈసారి శ్రీకాకుళం నుంచి బదిలీ చేస్తే విశాఖపట్నం వెళ్లడానికి ఇక్కడి అధికారులు ఇష్టపడటంలేదు. దీనికి కారణం.. అక్కడ సిటీ పోలీస్ కమిషనర్‌గా బాగ్చీ ఉండటమే. నిజాయితీపరుడిగా పేరుపడ్డ ఈ ఐపీఎస్ అధికారి విశాఖపట్నంలో బాధ్యతలు స్వీకరించిన రోజే వీడియో కాన్ఫరెన్స్‌లో ఇద్దరు పోలీసు అధికారులకు ఛార్జిమెమో ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నందున దీనికి సమాధానం చెప్పాలని ఆదేశించారు. అడిషనల్ డీజీ క్యాడర్ అధికారి అయిన శంఖబ్రత బాగ్చీ ఒకసారి యాక్షన్ తీసుకుంటే దాన్ని మళ్లీ వెనక్కు తీసుకునే పవర్ ప్రభుత్వానికి తప్ప మరొకరికి లేదు. వచ్చీరాగానే విశాఖ పోలీసుల చరిత్ర విప్పేసిన బాగ్చీ నేరుగా బాధితులు తనతో మాట్లాడేందుకు ఓ ఫోన్ నెంబరును విడుదల చేశారు. ఈ నెంబరుకు ప్రతిరోజూ వందలాది ఫిర్యాదులు వస్తున్నాయి. అన్ని కాల్స్‌ను ఆయనే లిఫ్ట్ చేసి నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఎక్కడైనా తేడా వస్తే సంబంధిత పోలీసు అధికారులను క్షమించడంలేదు. దీంతో విశాఖపట్నానికి బదిలీపై వెళ్లి బాగ్చీకి బలైపోవడం ఎందుకని ఎవరూ ముందుకు రావడంలేదు. అలా అని పక్క జిల్లా ఉమ్మడి విజయనగరానికి వెళ్లడానికి ఇక్కడ పని చేస్తున్న సీఐలకు నిబంధనలు అంగీకరించవు.
శ్రీకాకుళం తప్ప వేరే ఆప్షన్ లేదు
ఇచ్ఛాపురంతో పాటు మరో స్టేషన్ మినహా జిల్లాలో ఉన్న 18 మంది సీఐలలో దాదాపు 16 మంది సీఐలు విజయనగరం జిల్లాకు చెందినవారే. వీరికి ఆ ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవు. విశాఖ రేంజ్ డీఐజీ పరిధిలో ఉన్న మూడు ఉమ్మడి జిల్లాల్లోనే సీఐలు, ఎస్‌ఐలను బదిలీలు చేయాలి. ఇప్పుడు విశాఖపట్నం వెళ్లడానికి సీఐలు ముందుకు రాకపోవడం, సొంత జిల్లా కావడం వల్ల విజయనగరం జిల్లాకు వెళ్లే అవకాశం లేనందున ఇప్పుడు వారి ముందున్న ఏకైక ఆప్షన్ శ్రీకాకుళం జిల్లా లో కొనసాగడమే. అయితే వైకాపా ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆ పార్టీకి అనుకూలంగా పని చేశారన్న అపవాదును కొందరు సీఐలు మూటగట్టుకున్నారు. మరికొందరు మాత్రం తామరాకు మీద నీటిబొట్టులా పని చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం జిల్లాలో పని చేస్తున్న సీఐలు, ఎస్సైలలో కొంతమందికి పార్టీ ముద్ర లేకపోయినా స్థానిక అధికార పార్టీ నాయకులకు కొందరి మీద ఇంట్రస్ట్ ఉండటం వల్ల వారిని తీసుకురావడానికి వీలుగా ప్రస్తుతం ఉన్నవారిపై బదిలీ వేటు వేయక తప్పడంలేదు. ప్రస్తుతం ఫోకల్ పాయింట్‌లో పని చేస్తున్న తమను ఇదే జిల్లాలో కనీసం నాన్‌ఫోకల్‌కైనా బదిలీ చేసి ఇక్కడే ఉంచాలని పలువురు రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు.
కొత్త ఎస్పీ మాట చెల్లుతుందా?
ప్రస్తుతం ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాకే పోలీసు అధికారుల్లో ఎక్కువ డిమాండ్ ఉంది. చాలా రోజుల తర్వాత జిల్లాకు ఒక నిఖార్సయిన డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ కేవీ మహేశ్వర్‌రెడ్డి ఎస్పీగా వచ్చారు. జిల్లాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ల జాబితాను ఇప్పటికే ఆయన తెప్పించుకున్నారు. ఆయన మాట చెల్లితే కొందరు ఎస్సైలు, సీఐలను జిల్లాలో ఉంచే ప్రతిపాదన చేస్తే జిల్లాకు మేలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఐపీఎస్‌ల బదిలీలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీల స్థానచలనమే. ముందుగా డీఎస్పీ క్యాడర్ అధికారులను బదిలీ చేసి, ఆ తర్వాత అడిషనల్ ఎస్పీలను వేస్తారని ఒక ప్రచారం ఉంది. అయితే సీఐ, ఎస్సై స్థాయి అధికారులను స్థానిక నాయకత్వమే నిర్ణయిస్తున్నందున పైనుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే బదిలీల ఉత్తర్వులు వెలువడతాయన్న ఉద్దేశంతో ముందుగానే సీఐలు, ఎస్సైలు తమకున్న పరిచయాలతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Commentaires