top of page

బాగా డబ్బుంది కానీ.. ఏం లాభం?!

Writer: ADMINADMIN
ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్‌ బోర్డు బీసీసీఐ. ఐసీసీకి కూడా రానంతం ఆదాయం బీసీసీఐకి వస్తోంది. ప్రపంచంలోని చిన్న క్రికెట్‌ బోర్డులు నాలుగైదింటిని పోషించే సత్తా బీసీసీఐకి ఉంది. కానీ ఏం లాభం. క్రికెట్‌ నుంచి సంపాదిస్తూ.. క్రికెట్‌ బతకడానికి మాత్రం ఏ మాత్రం కృషి చేయడం లేదు. టీ20 క్రికెట్‌ ద్వారా భారీగా ఆర్జిస్తూ.. సంప్రదాయ క్రికెట్‌ను భ్రష్టుపట్టించే స్థాయికి దిగజారిపోయింది బీసీసీఐ.

అసలు కొన్నేళ్లుగా ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో రాణించే వాళ్లకు జాతీయ జట్టులో స్థానం కల్పించాల్సింది పోయి.. ఐపీఎల్‌ స్టార్లను టీమ్‌ ఇండియాకు ఎంపిక చేస్తోంది. వాళ్లు కూడా ఒకటో రెండో మ్యాచ్‌లు ధనాధన్‌ క్రికెట్‌ ఆడేసి పోతున్నారు. సరే క్రికెటర్ల సంగతి పక్కన పెడదాం.. కనీసం దేశంలో క్రికెట్‌ స్టేడియంలను అయినా అభివృద్ధి చేస్తుందా అంటే.. అదీ లేదు. బీజేపీ ప్రభుత్వం గుజరాత్‌నే పట్టించుకుంటున్నట్లు.. బీసీసీఐకి అహ్మదాబాద్‌ స్టేడియం తప్ప మరోటి కనపడదు.

ఒకప్పుడు కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్‌ స్టేడియం అంటే ఒక చరిత్ర. 80 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ స్టేడియం.. ఇప్పుడు బీసీసీఐ కారణంగా అభివృద్ధికి నోచుకోకుండా పోయింది. ఇండియాలో ఒకప్పుడు చెన్నై, కోల్‌కతా, ఢల్లీి, ముంబై, బెంగళూరు, కాన్పూర్‌ మాత్రమే టెస్టు మ్యాచ్‌లకు పర్మనెంట్‌ సెంటర్లుగా ఉండేవి. ఆ తర్వాత హైదరాబాద్‌, లక్నో, ధర్మశాల, నాగ్‌పూర్‌, అహ్మదాబాద్‌ కూడా లిస్టులో వచ్చి చేరాయి. అయితే కొన్నేళ్లుగా కాన్పూర్‌లోని గ్రీన్‌ పార్క్‌ స్టేడియంలను అభివృద్ధి చేయాలనే సోయి బీసీసీఐకు గానీ, యూపీ క్రికెట్‌ అసోసియేషన్‌కు గానీ పట్టలేదు. 80 ఏళ్ల పురాతనమైన స్టేడియంలో టెస్టులు నిర్వహించాలనే సోయి ఉంది. కానీ ఒక మంచి డ్రైనేజీ సిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని మాత్రం భావించలేదు. గంట గంటన్నర వర్షం పడితే.. రోజంతా మ్యాచ్‌ను క్యాన్సిల్‌ చేయాల్సిన పరిస్థితి. వర్షం నీళ్లు బయటకు పోయే దారి ఉండదు.. ఔట్‌ ఫీల్డ్‌ త్వరగా ఆరదు. దీంతో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో రెండు రోజులు ఆటే జరగలేదు.

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానం కొనసాగించాలనే లక్ష్యంతో బజ్‌బాల్‌కి మించిన క్రికెట్‌ ఆడి.. ఎలాగో టీమ్‌ ఇండియా మూడు రోజుల మ్యాచ్‌ గెలిచింది. బంగ్లాదేశ్‌ కాబట్టి ఇండియా కూడా తన ప్లాన్‌ను అమలుచేసి గెలిచింది. రేపు న్యూజిలాండ్‌ జట్టు పర్యటనకు రానుంది. అప్పుడు కూడా రెండు రోజుల మ్యాచ్‌ క్యాన్సిల్‌ అయితే భారత జట్టు ఇలాగే గెలుస్తుందా?. న్యూజిలాండ్‌ అంటే ఇంకో విషయం గుర్తొచ్చింది. ఆఫ్ఘనిస్తాన్‌ జట్టుకు మనం స్టేడియంలను వాడుకోమని ఇస్తున్నాం కదా. ఈ క్రమంలో ఇదే నెల మొదట్లో గ్రేటర్‌ నోయిడాలోని షహీద్‌ విజయ్‌ సింగ్‌ పాథిక్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో న్యూజిలాండ్‌తో ఆఫ్గనిస్తాన్‌ ఒక టెస్టు మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. అయితే ఒక్క బంతి పడకుండానే టెస్టు మ్యాచ్‌ రద్దయ్యింది. గ్రేటర్‌ నోయిడా స్టేడియంలో ఔట్‌ ఫీల్డ్‌ మొత్తం చిత్తడిగా మారింది. అక్కడ కూడా డ్రైనేజ్‌ సిస్టమ్‌ సరిగా లేకపోవడమే కారణం. 1890లో తొలిసారి ఒక్క బంతి కూడా పడకుండా ఇంగ్లాండులో టెస్టు మ్యాచ్‌ రద్దయింది. ఆ తర్వాత 1998లో న్యూజిలాండ్‌లో ఇలాగే రద్దయింది. మళ్లీ గ్రేటర్‌ నోయిడాలో జరిగింది. కాన్పూర్‌ అయినా, గ్రేటర్‌ నోయిడా అయినా బీసీసీఐ ఆధీనంలోని క్రికెట్‌ అసోసియేషన్లే స్టేడియంల నిర్వహణ చూస్తుంటాయి. అందుకోసం ప్రతీ ఏడాది కొంత మొత్తాన్ని బీసీసీఐ చెల్లిస్తుంటుంది. కానీ ఏనాడూ ఏ క్రికెట్‌ అసోసియేషన్‌ను కూడా స్టేడియంల నిర్వహణ ఎలా ఉందని ఆరా తీసిన దాఖలాలు లేవు. టెస్టు మ్యాచ్‌లు సరైన గ్రౌండ్‌ మెయింటెనెన్స్‌ లేక రద్దయితే ఐసీసీ చర్యలు తీసుకోవాలి. కానీ బీసీసీఐ డబ్బు, పరపతి చూసి అసలు పట్టించుకోవడమే మానేసింది. ఏవో నాలుగైదు స్టేడియంలు మినహా.. దేశంలోని చాలా గ్రౌండ్లకు డ్రైనేజీ సిస్టమ్‌ సరిగా ఉండదు. గట్టిగా రెండు గంటల వర్షం పడితే.. ఇక మ్యాచ్‌ రద్దు చేసుకోవాల్సిందే. ఇప్పటికైనా స్టేడియంల అభివృద్ధిని బీసీసీఐ సీరియస్‌గా తీసుకోవాలి. లేకపోతే.. అంతంత మాత్రంగానే ఉన్న టెస్టు మ్యాచ్‌ల మనగడ.. పూర్తిగా ప్రశ్నార్థకంగా మారుతుంది.

- భాయ్‌జాన్‌

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page