top of page

బంగారు రుణాలపై ఆంక్షలు సబబేనా?

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jun 2
  • 2 min read

ఆర్థిక వ్యవహారాల్లో రుణాలదే కీలక పాత్ర. దిగువస్థాయిలో ఉండే పేదవాడి నుంచి పైస్థాయిలో ప్రభుత్వాల వరకు రుణాలు లేకుండా తమ ఇంటిని లేదా ప్రభుత్వాన్ని నడపగలగడాన్ని ఊహించలేం. రుణాల్లో కూడా బంగారు వస్తువులు తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారుల కంటే బ్యాంకుల్లో అతి స్వల్ప వడ్డీ రేటు, నిమిషాల వ్యవధిలో గోల్డ్‌ లోన్లు ఇస్తుండటంతో ఈ విధానం బాగా చెలామణీలోకి వచ్చింది. సామాన్య గృహస్తుల నుంచి చిరు వ్యాపారులు, ఉద్యోగులు, రైతుల వరకు అవసరమైనప్పుడు తమ ఇళ్లలో ఉన్న నగలు బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం, మళ్లీ డబ్బు సర్దుబాటు అయిన వెంటనే బ్యాంకుకు చెల్లించి నగలు విడిపించు కోవడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. అయితే ఈ వెసులుబాటుపై రిజర్వ్‌ బ్యాంకు కత్తి కట్టింది. గోల్డ్‌ లోన్ల మంజూరు మార్గదర్శకాలను కఠినతరం చేసింది. దాంతో బంగారంపై రుణాలు పొందడం సులభసాధ్యం కాని వ్యవహారంగా మారింది. రుణాల్లో పారదర్శకత పెంచి, అక్రమాలను అరికట్టడమే లక్ష్యంగా పేర్కొంటూ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్బీఐ) జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులతో పాటు ఎన్‌బీఎఫ్‌సీలు (నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు) ఇక నుంచి బంగారు, వెండి రుణాల పరిమితి తగ్గుతుంది. వినియోగదారుడు తీసుకొచ్చే నగ వాస్తవ విలువలో గరిష్టంగా 75 శాతం మేరకే రుణం ఇవ్వాలి. గతంలోనూ 75 శాతంగానే ఉన్న ఈ పరిమితిని కోవిడ్‌ సమయంలో 80 శాతానికి పెంచినా.. ఇప్పుడు మళ్లీ తగ్గించారు. వస్తువును తాకట్టు తీసుకొచ్చేవారు అది తమదేనన్న రుజువు చూపించాలి. ఇందుకోసం దాని కొనుగోలు రసీదు లేదా ఆ వస్తువు తమదేనని స్పష్టం చేస్తూ సంతకంతో కూడిన వ్యక్తిగత ధ్రువీకరణ పత్రం(సెల్ఫ్‌ డిక్లరేషన్‌) సమర్పించాల్సి ఉంటుంది. కాగా అప్పు తీసుకునేవారికి వారు తాకట్టు పెట్టిన బంగారం లేదా వెండి వస్తువు బరువు, స్వచ్ఛత, మినహాయింపులు, ఫొటోలతో కూడిన సర్టిఫికెట్‌ను బ్యాంకింగ్‌ సంస్థలు ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల పారదర్శకత పెరుగు తుంది. 22 క్యారెట్ల కంటే తక్కువ స్వచ్ఛత ఉన్న బంగారానికి ఇక నుంచి రుణం మంజూరు చేయరు. అయితే బ్యాంకులు అమ్మే ఇండియా గోల్డ్‌ కాయిన్స్‌ను మాత్రం స్వీకరిస్తారు. బంగారంతో పాటు తొలి సారిగా వెండి రుణాలకు రిజర్వ్‌ బ్యాంకు అనుమతి వచ్చింది. అయితే 925 స్వచ్ఛత ఉన్న ప్రత్యేక వెండి నాణాలపైనే ఈ అవకాశం కల్పించారు. ఒకే రుణంలో ఖాతాపై గరిష్ఠంగా ఒక కిలో బంగారు ఆభరణాలు, 50 గ్రాముల బంగారు నాణాలకు మాత్రమే అవకాశం ఉంటుంది. బంగారం విలువను 22 క్యారెట్ల ధర ప్రకారమే లెక్కిస్తారు. రుణ ఒప్పంద పత్రాల్లో బ్యాంకు వసూలు చేసే అన్ని ఛార్జీలు, బంగారం వివరాలు, వేలం ప్రక్రియ, చెల్లింపు గడువు వివరాలు స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఖాతాదారుడు రుణం పూర్తిగా చెల్లించాక గరిష్టంగా ఏడు పనిదినాల్లోపు బంగారం తిరిగి ఇవ్వాలి. ఆలస్యమైతే రోజుకు రూ.5 వేలు చొప్పున బ్యాంకులు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. బంగారు రుణాలు పొందడంలో అక్రమ పద్ధతులు అనుసరిస్తున్నట్టు తమ దృష్టికి రావడంతో నిబంధనల్లో కొన్ని మార్పులు చేశామని ఆర్బీఐ ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌ తరుణ్‌ సింగ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. క్లయింట్‌ లేకుండానే బంగారానికి విలువ కట్టడం, బంగారు రుణాలపై నిరంతర పర్యవేక్షణ లేకపోవడం, రుణాలు చెల్లించని పక్షంలో ఆ బంగారాన్ని వేలం వేసే విషయంలో పారదర్శకత లేకపోవడం తదితర ఇబ్బందులు తమ దృష్టికి వచ్చినందునే కొన్ని మార్పు లు చేశామన్నారు. ఈ కొత్త నిబంధనలపై కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులపై ఆధారపడేందుకు దోహదం చేసేలా ఉన్న ఈ కొత్త మార్గదర్శకాలను వెంటనే ఉపసంహరించుకోవాలని అక్కడి ప్రజలు, ప్రభుత్వ, ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. సన్నకారు రైతులు, చిరు వ్యాపారులకు లోన్లు పొందడం ఇకపై కొంత కష్టంగా ఉంటుందని అంటున్నారు. అల్పాదాయ వర్గాల ప్రజలు తమ ఇంట్లోని నగలను ఇంతవరకు బ్యాంకులో కదువ పెట్టి అవసరాలు తీర్చుకునేవారు. ఇక నుంచి వారు ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులపై ఆధారపడుతూ అధిక వడ్డీలు చెల్లించుకోవాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతా రామన్‌ దృష్టికి వెళ్లడంతో ఆమె కొంత వెసులుబాటు కల్పించే సూచన చేశారు. కొత్త మార్గదర్శకాల నుంచి రూ.2 లక్షల్లోపు బంగారు రుణాలను మినహాయించాలని రిజర్వ్‌ బ్యాంకుకు సూచించారు. ఆ మేరకు ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటే సామాన్య వినియోగదారులకు కొంత ఉపశమనం కలుగుతుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page