సుమకు పెళ్లి కుదిరింది. మూడు నెలల్లో పెళ్లి ముహూర్తం. సందడే సందడి. ఇంట్లో ఒకదాని తర్వాత ఒకటిగా పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టారు. దగ్గర బంధువులకు సంతోషపు గుర్తుగా పెట్టడానికి చీరలు, పంచెలు, ఇతరత్రా బట్టలు మన మూడు జిల్లాలలో చాలా ఫేమస్ అని విజయనగరం బయల్దేరారు. విజయనగరంలో రోజంతా బట్టల షాపులన్నీ తిరిగారు. రాసుకున్న లిస్టులలో పేర్లు తన్నుకొస్తూనే ఉన్నాయి. ఇంటికొచ్చిన తర్వాత సుమ అమాయకంగా అడిగింది ‘‘ఈరోజు మనం కొత్త బట్టల కోసం విజయనగరం అంతా తిరిగాం కదా, మరి ఆ షాపులన్నీ ఇప్పుడు శ్రీకాకుళంలోనే ఉన్నాయి కదమ్మా!’’ అని. ఉన్నాసరే పెళ్లిబట్టలంటే విజయనగరం వెళ్లి తీరాల్సిందే అని నాన్నగారు ఆ చర్చను అక్కడతో ఆపేశారు. పసుపు కొనడానికి ఫలానా షాపు దగ్గరే తీసుకోవాలని ప్రయత్నించారు. ఆ షాపాయన తిరుపతి వెళ్తే, అతను వచ్చేవరకు రెండు రోజులు ఆగారే గాని, వేరే దగ్గర కొనలేదు. అలా ఉంటాయి మన సెంటిమెంట్లు.
ఇక బంగారం కొనుగోలు తేదీ దగ్గరకొచ్చింది. తలా ఒక సలహా ఇవ్వడం మొదలుపెట్టారు. సుమ తల్లిదండ్రులు ఎలా లేదన్నా పాతిక లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, నగలు కొనుగోలు చేయడం కాబట్టి చాలా మందిని సంప్రదించాలనుకున్నారు. అందరినీ అడిగారు గాని, ఈ సందర్భపు నాయిక సుమను మాత్రం ఎవ్వరూ సలహా అడగలేదు. అయినా ఈ తరపు అమ్మాయిలు ఊరుకుంటారా? అందులోనూ సుమ ఎంబీఏ చదువుకుంది. అమ్మనాన్నలతో నెమ్మదిగా తన అభిప్రాయాన్ని చెప్పింది. నాన్నా, పలాసలో ఉండేవారు వారింట్లో శుభకార్యాలలో బంగారం కొనుగోలు కోసం శ్రీకాకుళం వస్తారు. మనమెందుకు వైజాగ్ వెళ్లాలి? మనం ఎందుకు శ్రీకాకుళంలో బంగారం కొనకూడదు? అని ప్రశ్నించింది. బులియన్ మార్కెట్లో బంగారం ధర మనకు తెలిసిందే, నగల ధరల హెచ్చుతగ్గులూ మనం అంచనా వేయగలిగిందే కదా అని నచ్చచెప్పింది. పోనీ, సగం నగలు ఇక్కడ, మిగతా నగలు వైజాగ్‌లో తీసుకుందాం, మనకు కూడా తేడా తెలిసివస్తుంది కదా అని కన్విన్స్ చేసింది. పెద్ద పట్టణాలలో మెరుగైన డిజైన్లు ఉండవచ్చని సుమ తల్లి చెప్పినప్పుడు కూడా తాను ఖండిరచలేదు. అన్నింటినీ బేరీజు వేసుకుందామనింది. మొత్తానికి శ్రీకాకుళంలో బంగారం కొనడానికి ఒప్పించింది. ఇప్పుడు శ్రీకాకుళంలోనే బంగారు అవసరాలన్నీ తీరుతున్నప్పుడు వంద కిలోమీటర్లు ప్రయాణించడం వృధా!

ప్రకటనల మాయలో పడొద్దు
లోహాలలోకెల్లా విలువైన లోహం ప్లాటినం తర్వాత బంగారమే. కొన్ని వేల సంవత్సరాల నుంచి మానవుడికి అత్యంత ప్రీతిపాత్రమైన లోహంగా బంగారు ఆభరణాలే నిలుస్తున్నాయి. బంగారం పట్ల రానురాను క్రేజ్ పెరుగుతోందే కాని తగ్గడం లేదు. అందుకే బంగారం రాజలోహమైంది. బంగారం కొనడానికి ఇదే సరైన సమయం అంటూ ఏమీ ఉండదు. బంగారాన్ని కొనడానికి ఇదే సరైన ధర అంటూ ఏమీ ఉండదు. మీరెప్పుడు కొంటే అదే సరైన సమయం. మీరు ఎంతకు కొంటే అదే సరైన ధర. మీరు ఏ క్షణాన బంగారం కొనడానికి దుకాణానికి వెళతారో అదే శుభ ఘడియ. మన దేశంలో పెళ్లిళ్లలో బంగారానికి ఉన్న విలువ అంతాఇంతా కాదు. ఏటా మన దేశంలో ఏడాదికి సుమారుగా వెయ్యి టన్నుల బంగారం వినియోగమవుతుందని ఒక అంచనా. మన దేశంలో బంగారానికి అంత డిమాండ్. బంగారం గురించిన వివరాలు మనిషి నుంచి మనిషికే మారిపోతుంటాయి. అలాంటిది ఒక బంగారం కొట్టు నుంచి మరో బంగారం కొట్టుకు మారిపోవా? అందుకే బంగారం తూనిక, నాణ్యత, ధరల విషయంలో ఎప్పుడూ వినియోగదారుడికి గందరగోళమే.
బంగారాన్ని అంతర్జాతీయంగా ఔన్సులలో కొలుస్తారు. మనం మాత్రం స్థానికంగా తులాలలోనే కొలుస్తాం. ఒక ఔన్సు అంటే 31.103 గ్రాముల బంగారం. ఒక తులం బంగారం అంటే 11.664 గ్రాములు. బంగారం స్వచ్ఛతను, నాణ్యతను, ఫైన్‌నెస్‌ను కొలిచేందుకు కారట్ అనే పేరుతోనూ, ఫైన్‌నెస్ అనే పేరుతోనూ సూచిస్తారు. 24 క్యారట్ల బంగారం నూటికి నూరు శాతం సంపూర్ణ స్వచ్ఛమైన బంగారం. అన్నిటికంటే ఖరీదు ఎక్కువ. అయితే దీనితో ఆభరణాలు తయారు చేయడం సాధ్యపడదు. అంత స్వచ్ఛమైన బంగారం చాలా మెత్తగా ఉంటుంది. ఆభరణంగా నిలబడదు. దానికి ఇంప్యూరిటీస్ చేర్చితేనే ఆభరణం దృఢంగా ఉంటుంది. అలా రాగిని, నికెల్‌ను, సిల్వర్‌ను, పల్లాడియం లోహాలను బంగారానికి కలిపి దృఢత్వం ఆపాదిస్తారు. అయితే అలా దానిలో ఇంప్యూరిటీస్ చేర్చి, స్వచ్ఛతను తగ్గించినపుడు బంగారం నాణ్యత తగ్గుతుంది. దానిని 24 కారట్ల తర్వాత 23, 22, 20, 18, 14 కారట్లు అని ఆరు రకాలుగా విభజిస్తారు.
ఇంప్యూరిటీస్ మిశ్రమానికి ఉదాహరణగా ఇది చదవండి.
* 18 కారట్ల రోజ్ గోల్డ్‌లో బంగారం 75, రాగి 22.25, వెండి 2.75 శాతం చొప్పున కలుస్తాయి.
* 18 కారట్ల పింక్ గోల్డ్‌లో బంగారం 75, రాగి 20, వెండి 5 శాతం కలుస్తాయి.
* 18 కారట్ల పచ్చ బంగారంలో బంగారం 75, రాగి 23, వెండి లేదా కాడ్మియం 2 శాతం కలుస్తాయి.
* 18 కారట్ల ముదురు ఆకుపచ్చ బంగారంలో బంగారం 75, వెండి 15, రాగి 6, కాడ్మియం 4 శాతం చొప్పున కలుస్తాయి.
* 18 కారట్ల బ్లూ గోల్డ్‌లో బంగారం 75, ఇనుము 25 శాతం కలుస్తాయి.
* 18 కారట్ల పర్పుల్ గోల్డ్‌లో బంగారం 80, అల్యూమినియం 20 శాతం కలుస్తాయి.
* 18 కారట్ల తెల్ల బంగారంలో బంగారం 75, ప్లాటినం లేదా పల్లాడియం 25 శాతం చొప్పున కలుస్తాయి.
కాబట్టి బంగారం ఎంచుకోవడంలో ప్రతి వినియోగదారుడికీ చుక్కలు కనిపిస్తుంటాయి.
ధర పెరిగినా డిమాండ్ తగ్గలేదు
మన సందిగ్ధాలను, సందేహాలను నివృత్తి చేయడానికి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సహకారం తీసుకుని, భారత ప్రభుత్వం 2021 జూన్ 16 నుంచి బంగారానికి హాల్‌మార్క్ వేయడం తప్పనిసరి చేసింది. 24 కారట్లు లేదా 999 ఫైన్‌నెస్ బంగారాన్ని పెట్టుబడుల కోసం, నాణేలుగాను, బార్లుగాను (వీటినే బులియన్లు అంటారు) సాధారణంగా కొంటారు కాబట్టి హాల్‌మార్కింగ్ అవసరం లేదు. కాని ఆభరణాల రూపంలో కొంటే తప్పనిసరిగా హాల్ మార్క్ ఉండాల్సిందే. అప్పుడే వినియోగదారుడికి బంగారం నాణ్యత కనుగొనే విషయంలో తిప్పలు తప్పుతాయి.
ఈ ప్రపంచం అనే పడవ ప్రస్తుతం నడుస్తోన్న ఆర్థిక కల్లోల కడలిని దాటగలిగేంత వరకూ బంగారం ఒక తెరచాపలా ఉపయోగ పడుతుంది. ఇది అర్థం చేసుకున్న వారికి చేసుకున్నంత. మదుపు చేయగలిగిన ప్రతివారూ బంగారంలో మదుపు చేసి తీరాలి. ఇదే నవీన లోకపు మేలైన ఆత్మరక్షణ మార్గం. ఫోన్‌పే యాప్ మీకుంటే రోజుకో, వారానికో కనీసంగా ఒక వంద రూపాయల పెట్టుబడితో బంగారంపై పెట్టుబడులు పెట్టవచ్చు. అలా మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి స్వాగతం పలకండి. ఒకప్పుడు ఏదైనా శుభకార్యాల జరిగినపుడు మాత్రమే ఆర్థిక పరిస్థితిని బట్టి పావు తులమో, అర తులమో, తులమో బంగారం కొని, పెట్టుబడుల మార్గంలో నూతన దంపతులు అడుగు పెట్టేవారు. ఇప్పుడు వయసుతో, డబ్బుతో సంబంధం లేకుండా ఎవరైనా, ఎంతైనా బంగారంలో పెట్టుబడులు పెట్టొచ్చు.
1974 నాటికి మన దేశంలో 10 గ్రాముల బంగారం ధర 500 రూపాయలు ఉండేది. 1985 కల్లా బంగారం ధర నాలుగు రెట్లు మాత్రమే పెరిగి 2,130 రూపాయలకు చేరుకుంది. 2000 సంవత్సరానికి 4400 రూపాయల ధరను చేరింది. గ్లోబలైజేషన్ క్రమంలో మాత్రమే బంగారం ధర తారస్థాయికి చేరిందని చెప్పాలి. 2010లో 18,500 రూపాయలకు, 2020 కల్లా 48,651 రూపాయలకు పది గ్రాముల బంగారం ధర చేరింది. 2024 ఏడాది మధ్యలో 74,520 రూపాయలకు చేరుకున్న బంగారం లక్ష రూపాయలు కావడానికి ఎంత సమయం పడుతుందనుకుంటున్నారు!
ఇంతకీ బంగారం కేవలం ఆభరణంగా వాడే లోహం మాత్రమేనా, ఇతరత్రా రంగాలలో ఎక్కడైనా వినియోగిస్తారా అనే సందేహం రాక మానదు. బంగారాన్ని ఆభరణాల తర్వాత సాంకేతిక పరికరాలలో వినియోగించడం రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత బంగారాన్ని ఆరోగ్య సంరక్షణలో కూడా బంగారానికి సముచిత స్థానముంది. స్వర్ణభస్మం, స్వర్ణలేహ్యం వివిధ ఔషధ పదార్ధాలతో కలిపి వాడడం ద్వారా అనేక రోగాలను నయం చేస్తున్నారు.
- దుప్పల రవికుమార్
Comments