top of page

బెట్టింగ్‌ కోసం.. పింఛను సొమ్ము స్వాహా

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • ఆలస్యంగా వెలుగుచూసిన సర్వేయర్‌ నిర్వాకం

  • సర్వీసు మొత్తం వసూళ్లు, అక్రమాలే

  • రికవరీ కోసం తిప్పలు పడుతున్న అధికారులు


(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జి.సిగడాం మండలం పెంట గ్రామ సచివాలయ సర్వేయర్‌ చదువుల భానుప్రతాప్‌ రూ.49వేల పింఛను నగదుతో పరారైన 15 రోజుల తర్వాత సదరు సచివాలయ సిబ్బంది ఈ నెల 17న తహసీల్దారు శ్రీకాంత్‌, ఎంపీడీవో రామకృష్ణలకు ఫిర్యాదు చేశారు. భానుప్రతాప్‌ ఆచూకీ ఇప్పటికీ తెలియలేదని సన్నిహితులు చెబుతున్నారు. భానుప్రతాప్‌ డిప్యూటేషన్‌పై జిల్లా అదనపు సంచాలకులు సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డు శాఖలో విధులు నిర్వహిస్తున్నాడు. జిల్లా కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సర్వేయర్‌ భానుప్రతాప్‌కు 2024 జూన్‌ నుంచి పెంట గ్రామ సచివాలయ పరిధిలో పింఛను పంపిణీ బాధ్యతను అప్పగించారు. జిల్లా ఏడీ కార్యాలయంలో డెప్యూటేషన్‌పై విధులు నిర్వహించే భానుప్రతాప్‌ పొందూరుకు చెందినవాడు. పెంట గ్రామ సచివాలయం నుంచి డెప్యూటేషన్‌పై జిల్లా కార్యాలయంలో చేరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు పంపిణీలో డెప్యూటేషన్‌పై పని చేస్తున్న సచివాలయం ఉద్యోగులంతా వారు పని చేసేచోట హాజరు కావాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. ఆ మేరకు జూన్‌ నుంచి భానుప్రతాప్‌ పెంట సచివాలయం పరిధిలో పింఛన్ల పంపిణీలో పాల్గొంటూ ఉండేవాడు. సర్వే శాఖ ఏడీతో సన్నిహితంగా తిరిగే సర్వేయర్‌ భానుప్రతాప్‌ ఈ నెల ఒకటో తేదిన ఫిబ్రవరికి సంబంధించి పింఛన్ల సొమ్ము మొత్తం రూ.1.66 లక్షలకు గాను రూ.1.17 లక్షలు పంపిణీ చేశారు. మిగతా 11 మంది లబ్ధిదారులకు సంబంధించిన రూ.49వేలు ఆయన వద్దనే అట్టిపెట్టుకొని పత్తా లేకుండాపోయారు. ఒకటో తేదీ శనివారం కావడంతో భానుప్రతాప్‌కు ఇచ్చిన టార్గెట్‌ మేరకు రూ.1.17 లక్షలు పంపిణీ చేసేశాడు. మిగతా 11 మంది లబ్ధిదారులకు మూడో తేది సోమవారం పంపిణీ చేస్తానని చెప్పి రూ.49వేలు పట్టుకుపోయాడు. మూడో తేదీన భానుప్రతాప్‌ తన తల్లికి బాగులేదని చెప్పి సచివాలయానికి రాకుండా డమ్మాకొట్టాడు. నాలుగో తేదిన వచ్చి పంపిణీ చేసేస్తానని, పింఛన్‌ తీసుకోవడానికి సచివాలయానికి వచ్చిన 11 మంది లబ్ధిదారుల నుంచి బయోమెట్రిక్‌ తీసుకోవాలని వెల్ఫేర్‌ అసిస్టెంట్‌కు చెప్పినట్టు తెలిసింది. దీంతో సచివాలయ సిబ్బంది 11 మంది లబ్ధిదారుల వేలిముద్రలను తీసుకొని తర్వాత రావాలని సూచించారు.

ఇంటి పన్ను సొమ్ము ఇచ్చారు

పింఛను మొత్తం ఎందుకు ఇవ్వడం లేదని లబ్ధిదారులు ప్రశ్నిస్తే.. డబ్బులు బ్యాంకు అకౌంట్‌లో ఉండిపోయాయని, ఫోన్‌పే లిమిట్‌ దాటిపోవడం వల్ల 24 గంటల వరకు సాధ్యం కాదని నచ్చజెప్పి సచివాలయ సిబ్బంది పంపించారని తెలిసింది. తర్వాత రోజు 11 మంది లబ్ధిదారులు పింఛన్‌ డబ్బుల కోసం సచివాలయ సిబ్బందిని నిలదీయడం ప్రారంభించారు. ఫోన్‌ స్విచాఫ్‌ చేసి ఉండడంతో భానుప్రతాప్‌ ఇంటికి వెళ్లి సచివాలయ సిబ్బంది వాకబు చేశారు. తల్లికి బాగులేదని, ఆసుపత్రిలో చేర్చి ట్రీట్‌మెంట్‌ చేయడానికి రూ.49వేలు ఖర్చు చేసినట్టు సచివాలయ సిబ్బందికి భానుప్రతాప్‌ చెప్పిన విషయాన్ని వారికి వివరించారు. కానీ భానుప్రతాప్‌ తల్లి మాత్రం గత రెండు రోజులుగా తన కొడుకు ఇంటికి రావడం లేదని చెప్పినట్టు తెలిసింది. ఆసుపత్రిలో చేర్చి వైద్యం చేయించినట్టు భానుప్రతాప్‌ చెప్పిన మాట అబద్ధమని ఆయన తల్లి చెప్పడంతో పింఛను సొమ్ముతో పరారైనట్టు తేలింది. ఈ నెల 3న భానుప్రతాప్‌కు రూ.33వేలు జీతం ప్రభుత్వం జమ చేసింది. అప్పటికే తల్లి వైద్యం కోసం రూ.49వేలు ఖర్చు చేసినట్టు చెప్పడంతో జీతం సొమ్మును వెనక్కి ఇచ్చేయాలని సచివాలయ సిబ్బంది కోరినట్టు తెలిసింది. ఆ తర్వాత ఫోన్‌ స్విచాఫ్‌ చేయడంతో భానుప్రతాప్‌ ఎక్కడ ఉన్నాడో ఆచూకీ లేకపోవడంతో పింఛన్‌ సొమ్ముతో పరారైనట్టు ఈ నెల ఆరో తేదీకే సచివాలయ సిబ్బంది రూఢీ చేసుకున్నారు. 11 మంది లబ్ధిదారులకు సచివాలయ పరిధిలో వినియోగదారుల నుంచి వసూలుచేసిన ఇంటి పన్ను మొత్తం రూ.30వేలుతో కలిపి సిబ్బంది తలా కొంత వేసుకొని ఈ నెల ఐదునే పింఛను సొమ్ము చెల్లించేశారు. నాలుగు రోజులుగా ఆచూకీ లేకపోవడంతో భానుప్రతాప్‌ తల్లి జిల్లా సర్వేశాఖ కార్యాలయంలో ఏడీని కలిసినట్టు తెలిసింది. దీనిపై ఏడీ స్పందిస్తూ ఒకటో తేదీ నుంచి విధులకు హాజరు కావడం లేదని, డిప్యూటీ సర్వేయర్‌తో విచారణ చేయించి చర్యలు తీసుకుంటానని భానుప్రతాప్‌ తల్లికి, సచివాలయం సిబ్బందికి తెలిపినట్టు తెలిసింది.

బదిలీల ఆర్డర్లు తయారు బాధ్యత

సర్వేయర్‌ భానుప్రతాప్‌కు ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడడం, బెట్టింగ్‌ వేసే అలవాటు ఉందని సహోద్యోగులు చెబుతున్నారు. మూడేళ్లుగా సర్వేయర్‌గా ఉద్యోగం చేస్తున్నా ఇంటికి ఒక్క పైసా ఇవ్వలేదని భానుప్రతాప్‌ తల్లి సచివాలయ ఉద్యోగుల వద్ద బోరున విలపించినట్టు చెబుతున్నారు. బ్యాంకు నుంచి హౌసింగ్‌ లోన్‌ రూ.7లక్షలు వాడుకున్నా ఒక్క రూపాయి ఇంటి కింద ఖర్చు చేయలేదని భానుప్రతాప్‌ తల్లి సచివాలయ సిబ్బందికి చెప్పినట్టు తెలిసింది. భాను ప్రతాప్‌కు డెప్యూటేషన్‌పై జిల్లా కార్యాలయంలో బాధ్యతలు అప్పగించిన శాఖాధికారి ఆయనతో అనేక అక్రమాలు చేయించినట్టు ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని శాఖల్లో సచివాలయ ఉద్యోగుల బదిలీలు పూర్తి అయిన తర్వాత గత ఏడాది ఆగస్టు 23న మొదటి బదిలీ ఉత్తర్వును ఇచ్చారు. ఆ తర్వాత ఈ ప్రక్రియ సుదీర్ఘకాలం అంటే ఈ ఏడాది జనవరి వరకు సాగింది. ఆ సమయంలో బదిలీ ఆర్డర్లను తయారుచేసే బాధ్యతను సర్వేశాఖ ఏడీ భానుప్రతాప్‌కు అప్పగించారు. బదిలీలు నిర్వహించినన్ని రోజులు ఏడీ కారులోనే ల్యాప్‌టాప్‌ పట్టుకొని భానుప్రతాప్‌ తిరిగేవాడని ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో ప్రతి ఆర్డర్‌కు కొంత మొత్తం వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఏడీ పేరు చెప్పి బదిలీ అయిన సర్వేయర్ల నుంచి వసూలుచేస్తున్న విషయం సదరు అధికారికి కొందరు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఏడీకి తెలిసే జరుగుతుందన్న విమర్శలున్నాయి. సచివాలయ సర్వేయర్లకు సంబంధించిన బదిలీ ఉత్తర్వులన్నీ భానుప్రతాప్‌ ద్వారా వస్తుండడంతో అందరూ ఆయన్నే ఆశ్రయించారు. దీంతో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు ఉన్నా, లేకున్నా బదిలీ ఆయన ప్రతి సర్వేయర్‌ నుంచి రూ.10వేలు నుంచి రూ.60 వేలు చొప్పున సుమారు రూ.10 లక్షలు వసూలు చేశారని విశ్వసనీయ సమాచారం.

బదిలీల పేరుతో వసూలు

ఈ క్రమంలోనే ఏడీకి తెలియకుండా కొందరికి బదిలీ ఉత్తర్వులు ఇచ్చి డబ్బులు వసూలు చేశారని విమర్శలున్నాయి. కొందరి నుంచి లక్ష రూపాయిలు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. బదిలీ ప్రక్రియ రోజుల వ్యవధిలో పూర్తి కావాల్సివున్నా నాలుగు నెలల పాటు నిర్వహించడం వల్ల భానుప్రతాప్‌ కొందరికి బదిలీ ఉత్తర్వులు వాట్సాప్‌లో పంపించి ఏడీ డబ్బులు ఆశిస్తున్నారని చెబుతుండేవాడు. డబ్బులు ఇస్తే బదిలీ ఉత్తర్వులు పైన ఏడీ సంతకం చేయించి పంపిస్తానంటూ నమ్మించేవాడు. ఈ తతంగం ఏడీకి తెలిసే జరిగేదని ఉద్యోగుల్లో చర్చ సాగుతుంది. కొందరు సర్వే ఉద్యోగులు భానుప్రతాప్‌కు ఫోన్‌ చేస్తే తీసుకున్న సొమ్ములన్నీ ఏడీకే ఇచ్చేస్తున్నానని చెబుతుండేవాడని ఉద్యోగుల్లో ఒక చర్చ సాగింది. అందులో భాగంగానే ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎం పురం సచివాలయానికి బదిలీ చేయిస్తానని చెప్పి ఒకరికి తెలియకుండా మరొకరికి వేర్వేరుగా బదిలీ ఉత్తర్వులు ఇచ్చి వారి నుంచి రూ.10 వేలు చొప్పున ఇద్దరి నుంచి రూ.20వేలు వసూలు చేశారు. ఆ తర్వాత వారిద్దరూ మోసపోయామని గ్రహించి ఏడీని ఆశ్రయించినా తనకు సంబంధం లేదని చేతులెత్తేశారు తప్ప భానుప్రతాప్‌పై చర్యలు తీసుకోలేదు. అదే అదనుగా భానుప్రతాప్‌ బదిలీ అయిన సచివాలయం సర్వేయర్లు ఎవరినీ విడిచిపెట్టలేదని తెలిసింది. ఏడీ కార్యాలయంలో పని చేస్తున్న ఒక మహిళా ఉద్యోగి నుంచి రూ.60 వేలు వసూలు చేసినట్టు తెలిసింది. సదరు ఉద్యోగి కంచిలి నుంచి జిల్లా కార్యాలయంలో పని చేస్తుండగా ఆగస్టులో నిర్వహించిన బదిలీల్లో తిరిగి కంచిలికి బదిలీ అయింది. దీనితో ఆమె బదిలీ నిలుపుదల చేయిస్తానని, ఆ తర్వాత జిల్లా కార్యాలయానికి, లేదంటే గారకు బదిలీపై తీసుకువస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. బాధిత ఉద్యోగి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుంటే భానుప్రతాప్‌ కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి ఇంటిముందు బైఠాయిస్తానని హెచ్చరించినా డబ్బులు ఇవ్వలేదని తెలిసింది. వసూలుచేసిన డబ్బులన్నీ ఏడీకి ఇచ్చినట్టు భానుప్రతాప్‌ తన సహోద్యోగులకు చెప్పినట్టు గుసగుసలు ఉన్నాయి. అయితే ఏడీ మాత్రం తనకు సంబంధం లేదని చెప్పినట్టు సర్వే ఉద్యోగులు చెబుతున్నారు. భానుప్రకాష్‌ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎదరుచూస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page