top of page

బెట్టింగా! బెల్ట్‌ తీస్తారు జాగ్రత్త

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Mar 1
  • 3 min read
  • ఛాంపియన్స్‌ ట్రోఫీలో బుకీలకు చుక్కెదురు

  • ఇంటెలిజెన్స్‌ నుంచి కూపీ లాగిన మహేశ్వర్‌రెడ్డి

  • విశాఖలో 12 మంది బుకీలు, 1 యాప్‌ ప్రమోటర్‌ అరెస్ట్‌

  • బెట్టింగ్‌ల వల్ల నష్టపోతే ఫిర్యాదు చేయాలని పిలుపు


(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

మన దేశంలో క్రికెట్‌ కేవలం ఆట మాత్రమే కాదు.. అదొక మతం. అందుకే సచిన్‌ లాంటి ఆటగాళ్లను గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌గా మనం సంభోదిస్తాం. ప్రపంచంలో అనేక దేశాలు క్రికెట్‌ను ఆడుతున్నా ఐసీసీని మాత్రం శాసించేది మన బీసీసీఐయే. క్రికెట్‌ ద్వారా ఆదాయం ఎంత సమకూరుతుందో, దాని మీద బెట్టింగుల వల్ల అంతకు మించిన ఆదాయాన్ని కొందరు బుకీలు గత కొన్నేళ్లుగా సంపాదించారంటే అందులో అతిశయోక్తి లేదు. కారణం.. క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌. ఇన్నాళ్లూ ఈ బెట్టింగ్‌ మీద, బుకీల మీద ఎవరూ సరిగా దృష్టి సారించలేదు సరికదా.. దీన్ని అరికట్టడం ఎవరివల్లా కాదని, వీలైతే దీన్ని చట్టబద్ధం చేయాలన్న వాదనలు కూడా వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే రోజురోజుకు క్రికెట్‌ బెట్టింగుల్లో పాల్గొనేవారి శాతం పెరగడంతో ఆన్‌లైన్‌ యాప్‌లు కూడా తయారయ్యాయి. దీంట్లో సొమ్ములు పెట్టి అప్పులపాలైపోయినవారు కొందరైతే, ఏకంగా ఆత్మహత్య చేసుకున్నవారు మరెంతమందో. ఇన్నాళ్లకు బెట్టింగుల మీద, బుకీల మీద ఉక్కుపాదం మోపే యంత్రాంగం పోలీసుల రూపంలో వచ్చింది. పేరుకు శ్రీకాకుళం వెనుకబడిన జిల్లా అయినా, బెట్టింగుల్లో మాత్రం జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన బుకీలు ఇక్కడ ఉన్నారు. ఎస్పీగా మహేశ్వర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత శాంతిభద్రతల మీద, దొంగసొత్తు రికవరీ మీద ఎంత దృష్టి సారించారో, గంజాయి, బెట్టింగ్‌ వంటి సంఘవ్యతిరేక చర్యలకు పాల్పడేవారి మీద కూడా అంతే స్థాయిలో ఓ కన్నేసుంచారు. అయితే బెట్టింగ్‌ అనేది పేకాట మాదిరిగా ఒక దగ్గర కూర్చుని ఆడేది కాదు కాబట్టి, వీరిని లీగల్‌గా లోపలేయడం కష్టసాధ్యమని భావించిన మహేశ్వర్‌రెడ్డి జిల్లాలో ఎంతమంది క్రికెట్‌ బెట్టింగ్‌లకు బుకీలుగా వ్యవహరిస్తున్నారు? వారు వాడుతున్న యాప్‌లు ఏమిటి? ఎవరి ద్వారా ఈ యాప్‌ల ఐడీ పాస్‌వర్డ్‌లు తెచ్చుకుంటున్నారన్న అంశాలపై ఇంటెలిజెన్స్‌ రిపోర్టు తెప్పించుకున్నారు. అందులో భాగంగానే జిల్లాలో బుకీలకు ముందుగానే హెచ్చరించారు. ప్రస్తుతం ఛాంపియన్స్‌ ట్రోఫీ జరుగుతున్నా, జిల్లాలో పెద్దగా బెట్టింగ్‌ల గోల కనిపించడంలేదు. జిల్లాలో ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి, విశాఖపట్నంలో పోలీస్‌ కమిషనర్‌ బాగ్చి వీరిపై ఉక్కుపాదం మోపేశారు. శ్రీకాకుళంలో యువకుల నుంచి సొమ్ములు తీసుకొని, విశాఖపట్నంలో మకాం వేసి అనేకమంది బుకీలుగా వ్యవహరించేవారు. ఇటీవల విశాఖపట్నంలో 12 మంది బుకీలను ఒకేరోజు అరెస్టు చేశారు. ఇందులో జిల్లాకు చెందినవారు ఉండటం కొసమెరుపు. అలాగే ఇద్దరు పోలీసులను కూడా బాగ్చీ సస్పెండ్‌ చేశారు. వైజాగ్‌లో ఎక్కడెక్కడ బుకీలు ఉన్నా, వారి మూలాలు శ్రీకాకుళంలో ఉన్నాయని గుర్తించారు. దీంతో శ్రీకాకుళంలో మొన్నటి వరకు బుకీలుగా చెలామణీ అయినవారు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తుంది. తమ ద్వారా కాకుండా కొన్ని ప్రైవేటు యాప్‌ల ద్వారా చాలామంది యువత బెట్టింగులకు పాల్పడుతున్నారని తెలుసుకున్న వైజాగ్‌ పోలీస్‌ కమిషనర్‌ కొద్ది రోజుల క్రితం అక్కడి యూట్యూబర్‌ లోకల్‌బాయ్‌ నానిని అరెస్టు చేశారు. కారణం.. ఈయన బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేయడమే. తనకు చదువు లేకపోవడం వల్ల ఇటువంటి యాప్‌ను ప్రమోట్‌ చేశానని, తప్పయిపోయిందంటూ ఆయన సోషల్‌మీడియా వేదికగా స్పందించినా పోలీసులు మాత్రం కేసు నమోదు చేశారు. కేవలం ఒక పెయిడ్‌ యాప్‌కు ప్రమోట్‌ చేసినందుకే లోకల్‌బాయ్‌ నానిని లోపలేస్తే, బుకీగా వ్యవహరిస్తున్న తమ పరిస్థితి ఏమిటని భావించినవారు ప్రస్తుతం ఛాంపియన్‌ ట్రోఫీ ఒకటి జరుగుతున్నట్టే గుర్తించడంలేదు. శ్రీకాకుళంలో అనేకమంది యువకులు బెట్టింగ్‌ మోజులో పడి సర్వశ్వం కోల్పోయారు. మొన్నటికి మొన్న జి.సిగడాం మండలం పెంట సచివాలయ పరిధిలో పంచాల్సిన సామాజిక పింఛన్ల సొమ్మును బెట్టింగుల కోసం ఒక సర్వేయర్‌ వాడేసిన సంఘటన వెలుగులోకి వచ్చిన విషయం విదితమే. ఇది కాకుండా నగరంలో అనేకమంది బెట్టింగుల కోసం తమ ఆస్తులు అమ్ముకున్నారు. చివరకు స్కూల్‌ విద్యార్థులు కూడా ఈ బెట్టింగులకు పాల్పడి దొంగలుగా మారారని గతంలో వచ్చిన పోలీసు నివేదికలు స్పష్టం చేశాయి. ఇక్కడి బుకీలైతే ఏకంగా ఫలితం తేలిపోయిన మ్యాచ్‌కు, రీప్లేకు కూడా బెట్టింగులు నిర్వహించి మోసపూరితంగా సొమ్ములు కొట్టేసిన ఉదంతాలు ఎన్నో. పోలీసులు ఓవైపు ఉక్కుపాదం మోపడంతో పాటు బుకీలుగా ఉన్నవారు కూడా బెట్టింగుల్లో కూడబెట్టిన సొమ్మును చాలామేరకు కోల్పోయారని తెలుస్తుంది. ఇప్పటి వరకు బెట్టింగులకు కింగులమని చెప్పుకునేవారు ప్రస్తుతం దాక్కోగా, నరసన్నపేట వంటి ప్రాంతాల నుంచి పేకాట శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నవారు ఇప్పుడు కొత్తగా బుకీ అవతారాలు ఎత్తినట్టు తెలుస్తుంది. సాధారణంగా బెట్టింగ్‌ వేసినప్పుడు ఇక్కడి నుంచి దుబాయ్‌ వరకు అనేక లింక్‌లు ఉంటాయి. కానీ నరసన్నపేటలో బుకీలుగా మారిన పేకాట శిబిరాల నిర్వాహకులు వీరే అన్నీ అయి వ్యవహరిస్తున్నట్టు చెబుతున్నారు. విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌ బుకీలను అరెస్టు చేయడమే కాకుండా బెట్టింగ్‌ వల్ల ఫలానా వ్యక్తికి డబ్బులిచ్చి నష్టపోయామని ఎవరైనా ముందుకొస్తే వెంటనే న్యాయం చేస్తామని కూడా ప్రకటించారు. శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి ముందుగానే బుకీలను గుర్తించి ఫిర్యాదు వస్తే తోలు తీస్తానని చెప్పడంతో ప్రస్తుతం బుకీలు స్తబ్ధుగా ఉన్నారు. కొన్నాళ్ల క్రితం వరకు శ్రీలంక, గోవా, నేపాల్‌ వెళ్లి మరీ కేసినోలో లక్షలాది రూపాయలు పేకాట, బెట్టింగులు ఆడినవారు ప్రస్తుతం ఎయిర్‌పోర్టులో అడుగు పెట్టాలంటే వణికిపోతున్నారు. శ్రీకాకుళంలో పెద్ద స్టేక్‌ ఉన్నవారికి ఈ ప్రాంతాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వీరికి రాచమర్యాదలు చేస్తూ రానుపోను విమాన టిక్కెట్లు పెట్టి మరీ ఈ సంఘవ్యతిరేక కార్యక్రమాలను ప్రోత్సహించేవారు. మొదట్లో డబ్బులొచ్చినట్లు కనిపించినా, ఆ తర్వాత వారు పంపిణీ చేసే అత్యంత కాస్ట్‌లీ స్కాచ్‌ తాగిన తర్వాత సర్వం కోల్పోవడాన్ని మనోళ్లు గుర్తించారు. దీంతో ఇటు పోలీసుల భయం, అటు అప్పులు పుట్టకపోవడంతో ప్రస్తుతం ఛాంపియన్స్‌ ట్రోఫీకి దూరంగా జరిగినట్లు కనిపిస్తుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page