
బుడమేరును గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా సర్కారు పట్టించుకోకపోవడం వల్లే విజయవాడ ముంపునకు గురైందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అదే తరహా వ్యాఖ్యలు చేశారు. అటు వైకాపా అధినేత వైఎస్ జగన్ భారీ వర్షాలతో కృష్ణానదికి, బుడ మేరుకు వరద పోటెత్తవచ్చని ముందస్తు సమాచారం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కాలేదని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో విఫలమైందని, దాని ఫలితంగానే భారీ నష్టం, జనం కష్టాలు పెరిగా యని విమర్శించారు. అధికార ప్రతిపక్షాలు ఇలా పరస్పరం బురద చల్లుకుంటూ వరద రాజకీయాలు చేస్తుం డటం విచారకరం. రాజకీయ ఆరోపణల సంగతి పక్కన పెడితే విజయవాడ విలయానికి ప్రధాన కారణం ఏమిటన్నది ప్రధాన పక్షాల ఆరోపణల్లోనే తేటతెల్లమైపోయింది. భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీకి స్థాయికి మించి వరద నీరు పోటెత్తడం వల్ల అటు గుంటూరు, ఇటు ఎన్టీఆర్ జిల్లా ముఖ్యంగా విజయవాడ తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతోపాటు విజయవాడ నగరం మీదుగా ప్రవహించే బుడ మేరు కూడా విశ్వరూపం చూపించడం వల్లే పరిస్థితి విషమించింది. అటు కృష్ణమ్మ వరద, ఇటు బుడమేరు ప్రవాహం కలిసి బెజవాడను ముంచేశాయన్నది వాస్తవం. భారీ వర్షాలు, కృష్ణమ్మకు వరద పోటెత్తడం వంటి కారణాలను పక్కనపెడితే గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనిరీతిలో బుడమేరు ఉప్పొంగి విరుచుకుపడటానికి అన్ని ప్రభుత్వాల నిర్వాకమూ కారణమే. ఓ పక్క కృష్ణానది, మరోపక్క బుడమేరు వాగు.. మధ్య విజయవాడ నగరం.. ఇదీ భౌగోళిక స్వరూపం. ఎన్నడూ ఈ రెండూ ఒకేసారి విరుచుకుపడిన దాఖలాల్లేవు. కానీ ఈసారి కూడబలుక్కున్నట్లు రెండూ పోటెత్తడంతో బెజవాడ బెంబేలెత్తిపోయింది. గత నాలుగు రోజులుగా వరద నీటిలోనే మగ్గిపోతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతున్నా.. ఆ స్థాయిలో అనుకున్నంత వేగంగా నగరంలోని కాలనీలను ముంచేసిన వరద నీరు తగ్గడం లేదు. మరోవైపు కొంత శాంతించిందనుకుంటున్న బుడమేరు నీటిమట్టం బుధవారం మరోసారి నాలుగు అడుగుల మేర పెరి గింది. అది చాలదన్నట్లు మూడు చోట్ల వాగు గట్లకు గండ్లు పడటంతో వరద నీరు ఊళ్లలోకి చేరుతోంది. వరద అనుకున్న మేర తగ్గకపోవడానికి కారణం బుడమేరుతో పాటు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరి హద్దుల్లో ఉన్న కోల్లేరు ఆక్రమణలకు గురి కావడమే. బుడమేరు వాగు విజయవాడ నగరం మీదుగా 150 నుంచి 170 కిలోమీటర్లు ప్రయాణించి శాంతినగర్, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి ప్రాంతాల మీదుగా కొల్లేరు సరస్సులో కలుస్తుంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బుడమేరు వరద వేగంగా వెళ్లి కొల్లేరులో కలిసే పరిస్థితి లేదు. దీనికి ఏళ్ల తరబడి ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణం. 2005`06లో బుడమేరకు భారీ వరద వచ్చిన తర్వాత భవిష్యత్తులో దాని తీవ్రతను తగ్గించేందుకు బుడమేరు ప్రవాహాన్ని పోలవరం కుడి కాలువలోకి మళ్లించే ఏర్పాటు చేశారు. అలాగే కృష్ణానదిలోకి మొదటి నుంచీ వెళ్లి కలిసేది. అయితే ఇక్కడో సమస్య ఉంది. కృష్ణానదిలో వరద ఉధృతి అధికంగా ఉంటే బుడమేరు నీరు కృష్ణాలోకి వెళ్లకుండా వెనక్కి వచ్చేస్తుంది. అలాంటి సందర్భాల్లో విజయవాడ మీదుగా ప్రయాణించి కొల్లేరు సరస్సులో కలవాల్సి ఉం టుంది. అయితే దురదృష్టం ఏమిటంటే ఇక్కడ బుడమేరు, అక్కడ కొల్లేరులో గత కొన్నేళ్ల నుంచి ఆక్రమణలు విపరీతంగా పెరిగిపోయాయి. విజయవాడ నగర పరిధిలో బుడమేరు ప్రవాహమార్గం వెంబడి విచ్చలవిడిగా ఆక్రమణలకు పాల్పడి వందలాది ఇళ్లు, బహుళ అంతస్తుల భవంతులు నిర్మించేశారు. ఏకంగా అనేక కొత్త కాలనీలే పుట్టుకొచ్చేశాయి. ఫలితంగా వాగు ప్రవాహమార్గం కుచించుకుపోవడమే కాకుండా పూడికలతో లోతు తగ్గిపోయింది. మరోవైపు బుడమేరు వరద కలవాల్సిన కొల్లేరు సరస్సు కూడా ఆక్రమణల పాలై చాలా వరకు తన స్వరూపాన్ని కోల్పోయింది. కొల్లేరును ఆనుకుని ఉన్న కైకలూరు, ఆకివీడు, భీమడోలు, తదితర పట్టణాల్లో కొల్లేరు సరస్సు తీర ప్రాంత భూములను ఆక్రమించి మట్టితో పూడ్చేసి ఇళ్లు, ఇతర నిర్మాణాలు కట్టేశారు. మరోవైపు సరస్సులోనే ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసి చేపలు, రొయ్యల చెరువులు తవ్వించేసి అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు. ఇటువంటి వ్యవహారాలను ప్రధానంగా ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా ఆయా ప్రాంతాల్లోని నాయకులందరూ తమ పలుకుబడిని బట్టి యధేచ్ఛగా అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తూ కొల్లేను చెరబట్టారు. కొల్లూరులో ఆక్రమణలు తొలగించడానికి, కాంటూరు లెవల్‌ను మెయిం టెన్ చేయడానికి దాదాపు 20 ఏళ్ల క్రితం పశ్చిమగోదావరి జిల్లా యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ చేపట్టి అక్రమ చేపల చెరువులు, ఇతర నిర్మాణాలను తొలగించేందుకు పూనుకున్నా, రాజకీయ ఒత్తిళ్లతో అది అసంపూర్తిగా నిలిచిపోయింది. అప్పటి నుంచీ మళ్లీ కొల్లూరు వైపు ఏ ప్రభుత్వం కూడా చూసిన పాపాన పోలేదు. బుడ మేరుది అదే దుస్థితి. వీటి కారణంగానే విజయవాడను ముంచెత్తిన వరద రోజులు గడుస్తున్నా వెనక్కి పోకుండా తిష్టవేసింది. బుడమేరు ప్రవాహం అనుకున్నంత వేగంగా కొల్లేరు వైపు సాగడంలేదు. అలాగే ఆక్ర మణలు పెరిగిపోవడం వల్ల అక్కడికి చేరుకున్న నీటిని కొల్లేరు వేగంగా తనలోకి తీసుకోలేకపోతోంది. ఫలి తంగా వరదలు సంభవించినా కొన్ని గంటల్లోనే వెనక్కి వెళ్లిపోవాల్సి నీరు రోజుల తరబడి ఎక్కడికక్కడ నిలిచి పోతోంది. దీనివల్ల ఆయా ప్రాంతాల ప్రజల అవస్థలు రెట్టింపువుతున్నాయి. వరదల ఉధృతి తగ్గిన తర్వాత బుడమేరు ఆక్రమణలపై ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని అంటున్నారు. చూడాలి మరి.. ఏమవుతుందో!
Comments