top of page

బిడ్డని పెంచడమే కాదు.. కనడమూ కళే!

Writer: ADMINADMIN

సృష్టిలో అత్యంత తెలివైన జీవి మనిషే. భవనాన్ని కట్టడానికి ఇటుకలు వాడుతాం. అలాగే మెదడు న్యూరాన్‌లతో నిర్మితమయ్యింది. పుట్టిన బిడ్డ మెదడులో 10వేల కోట్ల న్యూరాన్‌లు ఉంటాయి. పాలపుంతల్లో నక్షత్రాల సంఖ్యతో ఇది సమానం. ఈ న్యూరాన్‌ల సంఖ్య వయసు పెరిగేకొద్దీ కొంతమేర పెరిగినప్పటికీ అసలైన మార్పు న్యూరాన్‌ల మధ్య ఏర్పడే వైరింగ్‌. ఈ మెదడు కణాల వైరింగ్‌ను ‘న్యూరల్‌ సినాప్సిస్‌’ అంటారు. రెండేళ్ల బిడ్డలో ప్రతి సెకనుకు పది లక్షల కనెక్షన్స్‌ ఏర్పడతాయి. మూడేళ్ల బిడ్డకు మొత్తం కోటి కోట్ల కనెక్షన్స్‌ వస్తాయి. కోటి కోట్లు అంటే ఒక కోటి.. వెయ్యి కోట్లు.. లక్ష కోట్లు.. ఇలా లెక్కిస్తే వచ్చేది కోటి కోట్లు. అర్థమయ్యింది కదా?

కొంతమంది మేధావులవుతారు.. మరికొంతమంది తెలివిలో వెనుకబడిపోతారెందుకు?

వ్యక్తికీ వ్యక్తికీ న్యూరాన్‌ల సంఖ్యలో తేడాలున్న మాట వాస్తవం. కానీ ఇది అంత ప్రాధాన్యమున్న అంశం కాదు. అసలు విషయం న్యూరాన్‌ల మధ్య ఎన్ని కనెక్షన్స్‌ ఏర్పడ్డాయి అనేది. ఇంకా లోతుగా చెప్పాలంటే కనెక్షన్స్‌ ఏర్పడినా వాటిని ఉపయోగించకపోతే అవి బలహీనమైపోయి ఉపయోగం లేకుండా పోతాయి. ఈ కనెక్షన్స్‌ను ఎంత ఎక్కువగా వాడితే అవి అంత దృఢంగా మారి వ్యక్తిని మేధావిని చేస్తాయి. కాబట్టి బిడ్డను మేధావిగా మార్చాలంటే ఈ వైరింగ్‌ను.. ఈ కనెక్షన్స్‌ను బాగా ఎక్కువగా వాడనివ్వాలి. ఈ వైరింగ్‌ను బలోపేతం చేసి అవి మొత్తం ఉపయోగంలోకి వచ్చేలా చేస్తే బిడ్డ మేధావి అవుతాడు. అలా కాకుండా వైరింగ్‌ను పనిలోకి దించకపోతే ఆ కనెక్షన్స్‌ బలహీనపడి ఉపయోగంలోకి రాకుండా పోతాయి. అప్పుడు శుంఠ తయారవుతాడు.

న్యూరాన్‌ల మధ్య ఉన్న వైరింగ్‌ను బలోపేతం చేయాలంటే చేయాల్సినవి ఆరు నెలల వయసు నుంచి.. ఆ మాటకొస్తే తల్లిగర్భం నుంచి కూడా బిడ్డతో మాట్లాడాలి. మనం చెప్పేమాటల్ని వారు ఆరునెలల వయసు నుంచి అర్థం చేసుకోవడం మొదలుపెడతారు. నిద్ర పోయే సమయాన్ని మినహాయించి మిగతా సమయంలో బిడ్డతో ఇంటరాక్ట్‌ అవుతూ ఉండాలి. ఆడిరచడం.. మాటలు నేర్పడం.. వారి స్థాయిలో ఒక్కో మాట పదే పదే చెప్పడం చేయాలి. ఎనిమిది తొమ్మిది నెలల వయసు నుంచే వారు మన మాటల్ని అనుకరించడం మొదలుపెడతారు. అంటే మనం చెప్పినదాన్ని తిరిగి చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఒక వయసులో అది కిలి కిలి భాష. ఏదో నాలుగైదు పదాలను తిరిగీ తిరిగీ చెబుతారు. 14-17 నెలల వయసులో అనేక పదాల్ని పలకడం నేర్చుకొంటారు. తమదైన రీతిలో కుత్త (కుక్క), తాకి (కాకి) ఇలా చెప్పడం మొదలుపెడతారు. ప్రతి దశలో బిడ్డతో మాట్లాడాలి. మాటలు పికప్‌ చేస్తున్నప్పుడు సాయం చేయాలి. తాకి కాదు కాకి.. చెప్పు చెప్పు అని ప్రోత్సహించాలి. సరిగ్గా చెబితే అభినందించాలి.

ఐదేళ్ల లోపు పిల్లలు మూడు భాషల్ని సులభంగా నేర్చుకొంటారు..

ఒక భాష మాత్రమే నేర్చుకొనే పిల్లలకన్నా మూడు భాషలు నేర్చుకొనే దక్షిణ భారత పిల్లల న్యూరాన్‌ వైరింగ్‌ ఎక్కువ పటిష్టం. పిల్లల్ని గేలి చేయకూడదు. వారు తప్పుగా చెబుతుంటే ప్రేమకొద్దీ పెద్దవారు, వారిని అనుకరిస్తూ గేలి చేస్తారు. అలా చేయకూడదు. వస్తువులు, ఆటబొమ్మలు ఇచ్చి ఆడిరచాలి. మట్టిలో, గడ్డిలో ఆడిస్తే వారి ఇమ్యూనిటీ బలోపేతమవుతుంది. నాలుగు గోడల మధ్య వారిని బంధిస్తే శుంఠలవుతారు. బయటకు తీసుకొని వెళ్లాలి. అదిగో చూడు ఆకాశం, మేఘాలు, చందమామ, నక్షత్రాలు, ఎండ, వాన, గాలి ఇలా సమస్త ప్రకృతిని పరిచయం చెయ్యాలి. బిడ్డకు అన్నం తినిపిస్తూ వెనకటి తరం తల్లులు పాడిన చందమామ రావే పాట తెలుసు కదా. ప్రపంచంలోని అన్ని భాషల్లో జోల పాటలు, లాలిపాటలు, చందమామ పాటలున్నాయి.

బంధువుల, స్నేహితుల ఇళ్లకు, ఫంక్షన్స్‌కు, పార్కులకు తీసుకొని వెళ్లాలి. పిల్లలు చుట్టూరా జరుగుతున్నదాన్ని నిశితంగా గమనిస్తారు. ‘అదిగో మామ.. అత్త.. నమస్తే చెప్పు. అదిగో పులి (జూ)లో, అదిగో కాకి.. చెప్పు.. కాకి ఏమంటుంది? కా.. కా అంటుంది. అదిగో నెమలి.. చూడు ఎన్ని రంగులో..’ ఇలా సమస్త వాస్తవ లోకాన్ని వారికి పరిచయం చెయ్యాలి. పాటలు పాడాలి. జోలపాట ఇంకా అనేకం. పద్యాలు శ్లోకాలు నేర్పించాలి. కథలు చెప్పాలి. బెడ్‌ టైం స్టోరీస్‌.. అన్నం తినిపిస్తున్నప్పుడు.. ఇంకా అనేక సమయాల్లో కథలు చెప్పాలి. ఇంత సోది ఎందుకండీ? ఒక్క మాటలో చెప్పాలి అంటే.. వెనుకటి తరం తల్లులు పిల్లల్ని పెంచినట్టు. ఆ రోజుల్లో అందరూ చదువుకొని ఉండకపోవచ్చు. కానీ తెలివైనవారు. ఇంగిత జ్ఞానం కలిగినవారు. ఐఐటీలో సీట్‌ సాధించి థర్డ్‌ ఇయర్‌లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో సరైన కంపెనీ దొరకలేదని ఆత్మహత్య చేసుకునేవాడు మేధావా? ఇంగిత జ్ఞానం లేని చదువుకున్న శుంఠ. చదువు వేరు, తెలివి వేరు. తెలివైనవారు చదువులో చక్కగా సాగుతారు.

చేయకూడనివి..

చేతికి సెల్‌ఫోన్‌ ఇవ్వకూడదు. దీనివల్ల మెదడు కణాలు (గ్రే సెల్స్‌, వైట్‌ మేటర్‌, హిప్పోక్యాంపస్‌) దెబ్బతింటాయి. ఏడీహెచ్‌డీ లాంటి మానసిక రుగ్మతలు వస్తాయి. కనుగుడ్లు మొదలుకొని శరీరంలోని అనేక భాగాలు దెబ్బతింటాయి. శారీరక, మానసిక రుగ్మతలు తప్పనిసరిగా వస్తాయి. బిడ్డకు టైంపాస్‌ కావడం కోసం చేతికి సెల్‌ఫోన్‌ ఇవ్వడమంటే ఆ బిడ్డ భవితకు సమాధి కట్టినట్టే. వాస్తవాలు చేదుగా ఉంటాయి. ‘ఈ కాలం పిల్లలు..’ లాంటి సోది కబుర్లు అమాయకత్వాన్నో లేదా అవగాహనా లోపాన్నో తెలియచేస్తాయి. కాలం మారితే మెదడు కణాలు, కనుగుడ్లు, చేతి వేళ్లు ఒక్క మాటలో చెప్పాలంటే శరీరం మారిపోతుందా? మెదడు గ్రహణ విధానం మారిపోతుందా?

‘కోటా’ కోడి భోజనం

పిల్లలకు కథలు, వీడియోలు అడవి, జూ పార్క్‌ మొదలైనవి చూపిస్తే కొంతమేర ఉపయోగమే. కానీ అసలు కంటే కొసరు ఎక్కువ కాకూడదు. పార్క్‌లోకి తీసుకెళ్లడం, వెన్నెల, వాన, గాలి, అడవి, పెళ్లి, హోటల్‌, సినిమా థియేటర్‌ ఇవి అసలు. వాటిని వీడియోలో చూపించడం కొసరు. టీవీలో వెన్నెల చూస్తూ మీరు వెన్నెల అనుభూతిని పొందగలరా? ఊటీకో, గోవాకో, సింగపూర్‌కో టూర్‌కు పోవాలి అనుకున్నవారు కేవలం వీడియో చూసి టూర్‌ పోయినట్లు ఫీల్‌ కాగలరా? కోడిని వేలాడదీసి చికెన్‌ తిన్నట్టు ఫీల్‌ కావడం లాంటిది ఇది. అప్పుడప్పుడు కొసరు ఓకే. కానీ అది వాస్తవంగా ఉండాలి. కుక్కను తరిమే పిల్లి. మాట్లాడే చెట్టు.. పరుగెత్తే పర్వతం.. ఇవీ నేటి పిల్లల వీడియోలు.. అసలు పరిచయం కాకముందే వక్రీకరించిన కొసరు ముందుకు వస్తే పిల్లల మెదళ్లు గందరగోళానికి గురికావా? రాజును చూసిన కన్నులతో భటుడ్ని చూస్తే.. సినిమాల్లో వీడియోలో అతిశయోక్తులు అధికం. బక్కపలచ హీరో వందమందిని ఒంటి చేత్తో లేపేస్తాడు. పిల్లి భీముడిలా బలశాలి. ఈ మాయ ప్రపంచానికి బిడ్డ అడిక్ట్‌ అయిపోతే ఇక వాస్తవ లోకంలోకి ఎలా వస్తాడు? మాయ ప్రపంచంలోనే ఉండిపోవాలి అనుకొంటాడు. ముందుగా వీడియో గేమ్‌లు.. అటుపై టీనేజ్‌ వచ్చాక పోర్న్‌ ఫిలిమ్స్‌.. ఇంకాస్త ముదిరితే కొకెయిన్‌ 1ఎస్‌డీ లాంటి భ్రాంతి కలిగించి గమ్మతైన లోకాన్ని ముందుంచే డ్రగ్స్‌.

ఇంకా చేయకూడనివి..

‘జికె పేరుతో దేశాలు - రాజధానులు, దేశాలు కరెన్సీ లాంటి సోది సమాచారాన్ని వారిచే బట్టీ కొట్టించడం చేయకూడదు. దీనివల్ల టైం వేస్ట్‌. అసలు నేర్చుకోవలసిన వాటిని నేర్చుకొనే సమయం వారికి దక్కదు. టీవీ షోల పేరుతో గంటలు గంటలు ఏదో ఒక పని కోసం ట్రైనింగ్‌ ఇవ్వడం (ఒక పాటనో డాన్స్‌నో ప్రాక్టీస్‌ చేస్తూ).. సినిమా టీవీ సీరియళ్లలో యాక్ట్‌ చేయించడం. బాల్యంలో సమాజం గురించి నేర్చుకోవాలి. అదే జీవితానికి పునాది. పునాది లేని మేడ బాత్‌టబ్‌లో అంతమైపోతుంది. అలా కాకుండా మూడేళ్లకే షూటింగ్‌లకు పోతే అమ్మ నాన్నకు డబ్బు.. అటుపై రెండో పెళ్లి మొగుడు.. తన డబ్బుతో అతని సినిమా వ్యాపారం.. నష్టాలు.. బాత్‌టబ్‌లో బీమా డబ్బు కోసం.. జీవితం అంతం కావడం.. అర్థమయ్యింది కదా.. బాల్యనటుల జీవితాలు ఎందుకు కొడిగట్టిపోతాయో?

వాస్తవ లోకాన్ని బిడ్డకు పరిచయం చేయండి. పార్కులకు హిల్స్‌ స్టేషన్స్‌కే కాదు వారి వయసు బట్టి వృద్ధాశ్రమాలకు, అనాధ శరణాలయాలకు, మురికివాడలకు తీసుకొని వెళ్లండి. వారు ఎదుగుతుంటే మీరు వారికి అర్థమయ్యేలా చేయండి. వారిని అర్థం చేసుకోండి. ఇంత టైం ఎక్కడుందండీ? అనుకొనే వారికి పిల్లలని పెంచడం భారమనుకుంటే, అంత టైం లేదు, దొరకదు అనుకొంటే పిల్లలని కనొద్దు. కని వారిని సరిగా పెంచలేకపోతే వారు నాశనం.. మీరు నాశనం.. సమాజమే నాశనం. కుటుంబమే సమాజానికి పునాది. పిల్లల్ని కనడం, పెంచడం పెద్ద వరం. గొప్ప అనుభూతి.

- అమర్నాథ్‌ వాసిరెడ్డి ఫేస్‌బుక్‌ వాల్‌ నుంచి

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page