వ్యసనాలకు బానిసై డబ్బు కోసమే హత్య?
పెద్దపాడు రోడ్డులో సొంత భవనాలున్నా.. న్యూకాలనీలో అద్దె ఇంటిలో శరత్
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి
టూటౌన్ పోలీసుల అదుపులో మరికొందరు అనుమానితులు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

శ్రీకాకుళం నగర నడిబొడ్డు న్యూకాలనీలో పొందూరు మండలం మొదలవలసకు చెందిన పూజారి కళావతి (48) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. న్యూకాలనీలో అద్దెకుంటున్న అండులూరి శరత్‌కుమార్ (34) స్థానిక సరస్వతి థియేటర్ పక్కన జనరేటర్ మెకానిక్ వర్క్స్‌తో పాటు సెకండ్ హ్యాండ్ జనరేటర్లు అమ్మడం, అద్దెలకు ఇచ్చే వ్యాపారం నిర్వహిస్తున్నాడు. చెడు సావాసాలు, మద్యంకు బానిసైన శరత్‌కుమార్ తండ్రి వెంకట్రావు ఆస్తిపరుడైనా కుమారుడ్ని భరించలేక బయటకు నెట్టేశారు. దీంతో ఏడాదిన్నరగా న్యూకాలనీలోనే శరత్‌కుమార్ అద్దెకుంటున్నాడు. మొదలవలస గ్రామానికి చెందిన వివాహిత కళావతితో వివాహేతర సంబంధం ఉందని శరత్ మిత్రులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే శనివారం కళావతిని ఫోన్ చేసి పిలిపించుకున్నాడని తెలుస్తుంది. గతంలో అనేకమార్లు శరత్ రూమ్‌కు కళావతి వచ్చినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. గత కొంతకాలంగా వ్యాపారం సరిగ్గా నిర్వహించక వ్యసనాలకు బానిసైన శరత్ అప్పులపాలైపోయాడు. దీంతో కనపడినచోటల్లా వడ్డీలకు అప్పులు చేసి షాపు కూడా సరిగ్గా తెరవకుండా విలాసాల్లో తేలియాడేవాడని తెలుస్తుంది. శనివారం కూడా ఫుల్‌గా మద్యం సేవించిన తర్వాత కళావతికి ఫోన్ చేసి రప్పించుకొని తన బాకీలు తీర్చుకోడానికి పనికొస్తుందని ఆమె వద్ద ఉన్న నగలు కాజేయడానికి హత్య చేసినట్లు తెలుస్తుంది. శనివారం రాత్రి కళావతిని హత్య చేసి బాత్రూమ్‌లో పడేసిన తర్వాత శరత్ గర్ల్‌ఫ్రెండ్‌కు ఫోన్ చేసి బెడ్‌రూమ్‌లో శనివారం ఉదయం 4 వరకు కులికినట్లు తెలుస్తుంది. ఈ విషయం బెడ్‌రూమ్‌లో ఉన్న మహిళకు తెలుసా? లేదా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం శరత్ బాత్రూమ్‌లో శవాన్ని ఉంచి, తన ఫ్రెండ్ నరేంద్ర వద్దకు వెళ్లి గతంలో రూ.40వేలు తీసుకున్న అప్పును తీర్చినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఆదివారం సాయంత్రం బైపాస్ జంక్షన్ వద్ద దాబాకు వెళ్దామని నరేంద్రను తీసుకువెళ్తున్న తోవలోనే కళావతిని హత్య చేశానని నరేంద్రకు శరత్ చెప్పినట్లు భోగట్టా. దీన్ని మొదట నమ్మని నరేంద్ర అందుకు సంబంధించిన ఆధారాలు కూడా శరత్ చూపించడంతో అక్కడికక్కడే బండిని నిలుపుదల చేసి టూటౌన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి శరత్‌ను అప్పగించినట్లు తెలుస్తుంది. మరోవైపు అప్పటికే ఈ విషయం పోలీసులకు ఉప్పందడంతో శరత్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. అదే సమయంలో టూటౌన్ కానిస్టేబుల్‌కు సమాచారం రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం కళావతిని హత్య చేసి, ఆ బాడీని బాత్రూమ్‌లోకి తరలించి మరో అమ్మాయితో శనివారం రాత్రంతా గడిపిన శరత్ ఒక్కడే ఈ హత్యకు పాల్పడ్డాడా? లేదూ అంటే ఆయన మిత్రులు ఉన్నారా? అన్న కోణంలో దర్యాప్తు జరుగుతుంది. పోలీస్ ఇంటరాగేషన్‌లో మాత్రం తానొక్కడినే హత్య చేసినట్లు శరత్ చెబుతున్నాడని తెలుస్తుంది. కానీ పోలీసులు మాత్రం నరేంద్ర, ఉమ అనే ఇద్దర్ని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు భోగట్టా. జనరేటర్లకు రీకండిషన్ చేసి అమ్మడం ద్వారా మూడు తరాలుగా శరత్ కుటుంబం బాగా సంపాదించింది. అయినా కొడుకు స్థిరం కాకపోవడంతో వెంకట్రావు బయటకు పంపించేశారు. ఇదిలా ఉండగా ఘటనా స్థలాన్ని ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి, డీఎస్పీ వివేకానందలు సోమవారం ఉదయం పరిశీలించారు. బాత్రూమ్‌లో పడివున్న కళావతి మృతదేహం వద్ద క్లూస్‌టీమ్ ఆధారాలు సేకరించింది. ఆమె శరత్ రూమ్‌లోకి వచ్చేసరికి వంటిపై నగలు ఉన్నాయా లేవా? అన్నది దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారం ప్రకారం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నగరంలో ఉన్న టైలర్ దగ్గర్నుంచి బట్టలు తీసుకోడానికి వెళ్తున్నానని చెప్పిన కళావతి న్యూకాలనీలో ఓ ప్రైవేటు కళాశాల వద్ద తన ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేసి శరత్ గది వైపు మధ్యాహ్నం 2.40 గంటలకు వెళ్లడాన్ని సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. నగరంలో సంచలనం సృష్టించిన ఈ మర్డర్ కేసును పోలీసులు ఛాలెంజింగ్‌గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Kommentare