విశాఖ స్థానికసంస్థల ఎమ్మెల్సీపై వీడిన ఉత్కంఠ
పోటీ చేయడంలేదని ప్రకటించిన అధికార టీడీపీ
రంగంలో సత్తిబాబుతోపాటు మరో ఇండిపెండెంట్
అతను కూడా ఉపసంహరణ నాటికి తప్పుకొనే అవకాశం
ఒకవేళ ఎన్నిక జరిగినా నామమాత్రమే
కాపుల కోణంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన జగన్
ముందే చెప్పిన ‘సత్యం’
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో వైకాపా అభ్యర్థి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్నిక ఇక లాంఛనమే. ఈ ఎన్నికలో తమ అభ్యర్థిని నిలబెట్టాలని నిన్నటి వరకు కసరత్తు చేసిన అధికార టీడీపీ.. చివరికి అభ్యర్థిని నిలపడంలేదని స్పష్టత ఇచ్చేసింది. దాంతో వైకాపా అభ్యర్థి బొత్స సత్యనారాయణ మండలికి వెళ్లడం ఖాయమైంది. ఈ పరిణామాన్ని ముందే అంచనా వేసిన ‘సత్యం’ తన కథనం ద్వారా వెల్లడిరచిన విషయం తెలిసిందే. బొత్సతోపాటు ఇండిపెండెంట్‌గా మరో అభ్యర్థి నామినేషన్ వేసినా ఉపసంహరణ సమయానికి ఇది కూడా క్లియర్ కావచ్చు. లేదంటే తెలుగుదేశం తరఫు ఓట్లు వైకాపాకు పడకుండా ఇండిపెండెంట్ అభ్యర్థికి పడేలా టీడీపీ ప్లాన్ చేయొచ్చు. ఏది ఏమైనా మెజారిటీ సభ్యుల బలమున్న వైకాపా అభ్యర్థి బొత్స సత్తిబాబు ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎమ్మెల్సీగా మండలిలో అడుగు పెట్టబోతున్నారు. విజయనగరం నుంచి తీసుకువచ్చి ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించినప్పుడే వైకాపా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇప్పటికే శాసనమండలిలో వైకాపాకు 42 మంది సభ్యుల బలం ఉంది. ఇటువంటి సమయంలో మండలిలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలంగా మాట్లాడగలిగే నేత అవసరం ఉంది. కానీ బొత్స సత్యనారాయణ మాటకారి కాదు.. అదే సమయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా మీడియా అటెన్షన్‌ను క్యాచ్ చేయలేరు. అయినా కూడా బొత్స సత్తిబాబునే ఏరికోరి ఎమ్మెల్సీగా నిలపడం వైకాపా సాధించిన తొలి విజయం. సత్తిబాబు పేరును ఖరారు చేయడం ద్వారా ఉమ్మడి విశాఖ జిల్లాలో వైకాపా ప్రజాప్రతినిధులు టీడీపీ వైపు వెళ్లిపోకుండా ఆపగలిగారు. అదే సమయంలో ఖర్చుకు వెనకాడకుండా బెంగళూరు క్యాంప్‌కు తరలించి సభ్యులను నిలుపుకోగలిగారు.
గెలిచే పరిస్థితి లేక టీడీపీ వెనుకడుగు
ఉమ్మడి విశాఖ జిల్లాలో అధిక శాతం కూటమి సభ్యులే ఎమ్మెల్యే, ఎంపీలుగా ఉన్నా ఎమ్మెల్సీ ఓటర్లను తమ వైపు తిప్పుకోడానికి వారికి ఎక్కడా వైకాపా అవకాశం ఇవ్వలేదు. దీంతో టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించాల్సి వచ్చింది. ఇది కూడా ఒక రకంగా తెలివైన నిర్ణయమే. మండలిలో ఇప్పటికే 42 మంది వైకాపా ఎమ్మెల్సీలు ఉన్నారు. టీడీపీ, జనసేనలకు కలిపి తొమ్మిది మంది, ఇండిపెండెంట్లు ముగ్గురు, పీడీఎఫ్ సభ్యులు ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలిచినా మండలిలో కొత్తగా ఒరిగేది ఉండదు. కాబట్టి డబ్బులు ఖర్చుచేసి గెలుపు ఓటముల మధ్య ఊగిసలాడటం ఇష్టంలేక టీడీపీ తప్పుకున్నట్లు కనిపిస్తోంది. పోటీ చేసి ఓడిపోతే పరువు పోతుందన్న భయం కూడా ఉండటం దీనికి మరో కారణంగా తెలుస్తోంది. మొత్తం 58 మంది మండలి సభ్యుల్లో ఎనిమిది మందిని గవర్నర్ నామినేట్ చేయగా, 20 మంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికవుతారు. మరో 20 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకోవడం ద్వారా మండలికి వెళ్తారు. గ్రాడ్యుయేట్లు ఎన్నుకోవడం ద్వారా ఐదుగురు, ఉపాధ్యాయులు ఎన్నుకోవడం ద్వారా మరో ఐదుగురు మండలిలో ఉంటారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతానికి పైగా వైకాపా విజయం సాధించడంతో పాటు ఆ ఎన్నికల్లో టీడీపీ బరిలో లేకపోవడం వల్ల మొత్తం 20 ఎమ్మెల్సీ స్థానాలూ వైకాపా పరమైపోయాయి. అలాగే 2019 అసెంబ్లీ వైకాపా 151 స్థానాలు సాధించింది. ఆ బలంతో గతంలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 14 స్థానాలను వైకాపా తన ఖాతాలో వేసుకుంది. ఆ విధంగా మండలిలో పూర్తి మెజారిటీతో ఉన్న వైకాపా అక్కడ అధికార కూటమిని ఇరుకున పెట్టాలని చూస్తోంది. ఆ దిశగా పార్టీ ఎమ్మెల్సీలను సమన్వయం చేసుకుని ఏకోన్ముఖంగా నడిపించేందుకు ఎమ్మెల్సీగా సత్తిబాబు మండలిలో అడుగు పెట్టిన తర్వాత ఆయనకు ఫ్లోర్ లీడర్ పదవి ఇస్తారని తెలుస్తోంది.
కాపుల వైపే ఉన్నామన్న సందేశం
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో కలిసి జనసేన పోటీ చేయడం, జనసేనకు బీజేపీ మద్దతు ఉండటంతో కాపులు ఈ ఎన్నికల్లో ఒకవైపే పోలరైజ్ అయ్యారు. అందుకే వైకాపా ఊహించని రీతిలో 11 స్థానాలకు పరిమితమైపోయింది. బీజేపీ రాష్ట్రంలో కమ్మ, రెడ్లు కాకుండా కాపులను తెర మీదకు తెచ్చి రాజకీయం చేయాలని చూస్తున్న నేపథ్యంలో కూటమి అధికారంలోకి రావడం వల్ల 2019లో వైకాపాకు కొమ్ము కాసిన కాపులు ఈసారి చేజారిపోతారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఈ నేపథ్యంలో కాపులకు తామెప్పుడూ ప్రాధాన్యత ఇస్తూనే ఉంటామని చెప్పడం కోసమే సత్తిబాబును వైకాపా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెట్టింది. మరోవైపు డీసీసీబీ చైర్మన్ అయినా, ఎమ్మెల్సీ అయినా, రాష్ట్ర మంత్రి అయినా దేనికైనా తాను సిద్ధమని ముందుకు వచ్చే ఏకైక నాయకుడు కూడా సత్తిబాబే. సార్వత్రిక ఎన్నికల్లో పవన్‌కల్యాణ్ పార్టీకి 22 సీట్లు రావడం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉండే కాపు నియోజకవర్గాల్లో ఆ పార్టీకి మంచి మెజార్టీ రావడంతో వైకాపాలో ఉన్న కాపులు ఒక్కొక్కరిగా బయటకు వెళ్లిపోతారన్న సమాచారం వైకాపా వద్ద ఉంది. ఇప్పటికే పార్టీ వీడిన ముగ్గురూ కాపు నాయకులే కావడం ఈ కథనాలకు ఊతమిచ్చింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని అయినా ఎన్నికల అనంతరం ఆయన పార్టీ వీడారు. ఇక పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల నాని కూడా కాపు నేతే. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఉపముఖ్యమంత్రిగా కూడా చేశారు. ఇప్పుడు ఆయన కూడా పార్టీలో లేరు. పార్టీకి ఇప్పటికే రాజీనామా చేసిన గుంటూరు జిల్లాకు చెందిన కిలారి రోశయ్య జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఓవైపు కాపులు ఖాళీ అయిపోతున్నా, ఆ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇస్తూనే ఉంటామని చాటి చెప్పడానికే జగన్మోహన్‌రెడ్డి సత్తిబాబుకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చారు.
Comments