బానిస వ్యాపారుల వేలం పాట అందాల పోటీ
- Guest Writer
- May 28
- 4 min read

హైదరాబాద్ నగరం ఈసారి అందాల పోటీకి వేదికగా మారింది. మహిళా సంఘాలన్నీ మూకుమ్మడిగా దీనికి వ్యతిరేకంగా నిరసనకు దిగాయి. టూరిజం నుంచి రూ.15 కోట్లు మహిళా సాధికారిత(?) కోసం మరో రూ.10 కోట్లు కలిపి రూ.25 కోట్ల సొమ్మును ఉడతా భక్తిగా అందజేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
అంతమంది ‘అందమైన’ పడతులు కనువిందు చేస్తుంటే ఆనందించాలి కానీ ఏమిటీ ఇదంతాని ‘మగ కళ్లు’ అంటున్నాయి. అందాల పోటీ వల్ల ఒకరిద్దరు హీరోయిన్లు దొరక్కపోతారాని సినిమా వాళ్ల ఆశ. అందం ఆడోళ్ల సొంతం.. చక్కగా ప్రదర్శిస్తే తప్పేంటని ఉదారవాదం మెదళ్లు విసుక్కుంటున్నాయి. అస్సలు దానికెంత కష్టపడాలో ఎంత శ్రమ, ఎంత శిక్షణ అవసరమో తెలుసా? లుక్స్ లేకుండా ఎలా మనగలుగుతామని అమ్మాయిలు అంటున్నారు. ఈ మహిళా సంఘాలు ఏవో కేసులు అవి చూసుకుని మహిళా ఉద్ధరణ చేయాలి కానీ అందంపై దాడి ఏంటని మరికొందరు నిగ్గదీస్తున్నారు. మీడియా మైలేజ్ కోసం మహిళా సంఘాలు దీన్ని ఎంచుకున్నాయని కెమెరాల వెనుక గొనుగుతున్నది. మరి మహిళా సంఘాల బాధ ఏంటి?
ఉదారవాద శరీరాలను, మనసులను ఉదారవాద ఆర్థిక విధానాలు తయారు చేస్తాయి. ఈ ఆర్థిక విధాన కాలంలో విపరీతమైన వేగంతో ‘అందాల పరిశ్రమ’ పెరుగుతోంది. కాస్మోటిక్స్ చర్మం నుంచి గోళ్ల వరకు శరీరంలో ప్రతి అంగాన్ని ప్రత్యేకంగాను, శరీరం మొత్తం అందంగా చూపించే లేపనాలు, రంగులు, తాత్కాలికం - శాశ్వతమైన పూతలు అన్ని కలిపి మందుల పరిశ్రమ కంటే ఈ పరిశ్రమ ముందుంది.
శరీరంలో ఏ అవయవం అందంగా లేకున్నా అందంగా మల్చడం. శరీరం మొత్తాన్ని అంచెలంచెలుగా మార్చడం, నాజూకుగా తయారు చేయడం. శరీరంలోని కొవ్వును తీయడం కాస్మోటిక్ సర్జరీలో భాగంగా ఉంది. ప్రస్తుత రోజుల్లో ఇది వైద్య వృత్తి నిపుణత్వంలో మంచి డిమాండేడ్ శాఖగా ఆవిర్భవించింది. ఇక స్పాలు, బాడీ మసాజ్, బ్యూటీ పార్లర్లు, ఫ్యాషన్ డిజైన్లు, నడకతో పాటు ఎలా నవ్వాలో నేర్పే శిక్షణా తరగతులు కూడా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా తిండి ఏం తినాలో, ఎంత తినాలో చెప్పే డైటీషియన్లు, పర్సనల్ ట్రైనర్లు, అందాన్ని గుర్తించే నిపుణులు, సలహాదారులు కూడా ఉన్నారు. కెమెరా వాళ్లు, వాటి ప్రసారకులు యాడ్ ఏజెన్సీలు, సినిమా వాళ్లు చివరగా అందాల పోటీ నిర్వహణ, పరిశ్రమ, దాని జడ్జీలు, నిర్వాహకులు, వేదికలు, శరీర అందాన్ని ప్రమాణీకరించేవారు, కొలతలు వేసేవాళ్లు వగైరాతో కూడిన పెద్ద మానవ పరిశ్రమ కొనసాగుతోంది. ఇదంతా కాకుండా గత పదేళ్లలో ఈ అందపు అంటురోగంతో సామాజిక మాధ్యమం అత్యధికంగా ప్రభావితమై, లాభపడిరది.
అందానికి ఆరోగ్యానికి మధ్య తేడా తెలియకుండా, అందంగా కనబడటమే ఆరోగ్యంగా ఉండటం అంటే, నేను అందంగా కనపడ్డాననే భావనే ఆరోగ్యం అనే దశకు యువతులను చేర్చాయి. అందం అనే ఒక మానసిక భావనను ఆత్మవిశ్వాసం, సాధికారితకు జోడిరచాయి. దీంతో వడపోసిన చిత్రాలు, మార్చిన ఫొటోలతో సామాజిక మాధ్యమాల్లో అందం ఏరులై పారుతున్నది.
అందంగా ఉండాలనే ఒత్తిడి లేని అనేక సమయాలు, సందర్భాలు స్త్రీల జీవితాల్లో అనేకం ఉండేవి. ఇప్పుడు వాటిని కూడా ఈ అందం వ్యాపారం ఆక్రమించింది. పుట్టుక, పసితనం, బాల్యం, ఆటలు ఆడటం, నిద్రపోవటంతో సహా కాలాన్ని దేన్ని కూడా ఇది వదలటం లేదు. జీవితంలో ప్రతి దశలో ప్రతి ఒక్క స్థితిలో అందంగా కనపడే తీరాలి. ‘ఎప్పుడు త్వరపడినట్టు కాదు, ఎప్పుడు ప్రారంభించిన ఆలస్యం కాదు’ ఇది ఒక చర్మం రంగుని మెరుగుపరిచే పూత పసిపిల్లలకు వాడొచ్చా (దానిలో పాదరసం ఉంటుంది) అని అడిగిన దానికి జవాబు అంటే పసితనపు లేత చర్మానికి ఈ రసాయనాలు హానికరం అయినవైనా పూసేయండి అందంగా ఉండాలి కదా అని అర్థం. వయస్సు మీరుతున్నదని ఆందోళన, ముడతల గురించిన ఆవేదన వీటన్నింటిని సృష్టించేది వీటికి పరిష్కారం ఇచ్చేది కూడా అందాల పరిశ్రమే.
ఇంట్లో ఉంటున్న తల్లి కూడా నిరంతరం అందంగా కనపడేలా తన్ను తాను తీర్చిదిద్దుకోవాలి. బిడ్డకు పాలిచ్చినా, లేకున్నా గర్భవతి కాక పూర్వం ఉన్న స్థితికి శరీరాన్ని తీసుకురావడానికి ఆ తల్లి శ్రమ పడాలి. అంతదాకా అందపు ఒత్తిడి చొచ్చుకుపోయింది.
శరీరంలో ఏ అంగాలు అందంగా ఉండాలి. మొహం, కాళ్లు, చేతులు వగైరా అయిపోయాయి. 1990 దశకంలో నాజూకుగా ఉండాల్సింది మోచేతి పైన జబ్బలు. 2000 సంవత్సరం తర్వాత చంకలు.. అవి నల్లగా ఉండకూడదు. తర్వాత కనుబొమ్మలు, ప్రస్తుతం రెండు తొడల మధ్య ఉండాల్సిన దూరం (నిలబడితే స్త్రీ తొడల మధ్య రెండు అంగుళాల నుంచి మూడు అంగుళాల దూరం కనపడాలని, అవి నాజూకు తొడలు - కాళ్లకు నిదర్శనమని ఇటీవలే ప్రామాణీకరించారు). దీంతోపాటు బికిని వారధి, స్థనాల కింది భాగం అందము, తొడలపై కింది మందం వగైరాలు ఈ జాబితాలో చేరాయి. కాబట్టి స్త్రీల శరీరాలు అందంగా ఉండి తీరాల్సిన భాగాల అన్వేషణ వాటిని అందంగా చేసుకోవాలనే ఒత్తిడి నిరంతరాయంగా కొనసాగుతుంది.
శరీరంపైనే అందం పరిశ్రమ ఆగిపోతుందనే భ్రమలు అవసరం లేదు. శరీరం లోపలికి కూడా దూరిపోయింది. బ్యూటీ డ్రిరక్స్ ఏవేవి కలిపి తాగితే అందం పెరుగుతుంది. ఏది తాగితే, తింటే ఏ భాగం అందంగా మెరుగుపడుతుంది. విటమిన్లు, ఖనిజాలు వాటికి ట్యాబ్లెట్లు అందాన్ని జారిపోకుండా, పాడైపోకుండా నిలబెట్టే నిరోధక వ్యవస్థలు వగైరాలతో వీటిపై పరిశోధన ట్యాబ్లెట్లు, టానిక్లు, డ్రిరకులతో కూడి మొత్తం ఇది ఒక ప్రత్యేక పరిశ్రమగా నిలుస్తోంది. ఇక మరొకటి అందానికి సలహాలు, చిట్కాలు వగైరాలతో ప్రకటనలు. అందానికి సంబంధించిన మొబైల్ యాప్‌లతో పాటు ‘నీవే చేసుకోవచ్చు, ప్రయత్నించి చూడు’ ఇంట్లోనే నీ దగ్గర ఉన్న వాటితోనే అంటూ రకరకాల వెబ్‌సైట్లు సలహాలు, సూచనలు ఇస్తుంటాయి.
వ్యాపార ప్రపంచపు నిఘాకు అవసరమైన ఛాయాచిత్రాలు తీసేటప్పుడు కూడా స్త్రీ శరీరాన్ని అణువణువు కవర్ చేస్తూ, శరీరంలో ఎక్కడ ఒక్క మడత కానీ నల్లని గీతలు కానీ (ట్యానింగ్) కూడా కనబడని స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో స్త్రీల శరీరంలో అంగాంగాన్ని సూక్ష్మస్థాయిలో నిఘా వేసి మరి చూస్తున్నారు. ఆధునిక కెమెరాల స్థాయికి తగినట్లుగా మనల్ని మనం కూడా హెచ్‌డీ మెరుపులకు సరిపడేలా తీర్చిదిద్దుకోవాల్సి వస్తుంది. దీనికి తోడు స్త్రీలు తమను తాము సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తూ లైక్‌ల కోసం ఎదురుచూస్తూ తమపై తామే సామాజిక నిఘాకు తలుపులు తీస్తున్నారు. ఇంత సూక్ష్మ పరిశీలన నేత్రం. మైక్రోస్కోప్‌తో జరిగినంత వివరంగా స్త్రీల శరీరాలపై జరుగుతుంది. కరోనా వైరస్‌పై కూడా ఇంత జరిగి ఉండకపోవచ్చు.
ఒక స్త్రీ మరొక స్త్రీపై చేసే పరిశీలన ఎలా ఉందంటే ఏం ధరించింది, మేకప్ ఎలా వేసుకుంది, ఏ ఏ దుస్తులు వేసుకుంది లాంటి వాటిని ఒక్క క్షణంలో తేరిపార చూసేసి నిర్ధారించి అంచనా వేసే ఒక దృష్టిని ఈనాటి తరానికి అందాల పరిశ్రమ నేర్పిస్తుంది. ‘ఎట్లా చూడాలి’, ‘ఏం చూడాలి’ అనేది గత తరం స్త్రీలకు నేటి యువతకు ఒక వ్యాపారం కల్పించిన తేడా ఈ దృష్టి కోణం.
నేనెంత అందంగా, వెర్రెక్కించేలా ఉన్నాను?
ఎంత వయసులా కనపడుతున్నాను?
ఇదే యావ, రోజుకు పది సార్లు సెల్ఫీలు. సర్దుకోవడాలు పోల్చుకోవడాలు ఇదే వ్యాపకం. అందమైన పెదాలకు పది చిట్కాలు నేర్చుకోవడం అదే నైపుణ్యం. అందపు యాప్‌లు ఏ దశ వరకు పెరిగాయంటే స్త్రీల శరీరం, మొహం అనేది సంక్షోభ వినిమయ కేంద్రాలుగా మారిపోయాయి.
స్త్రీల సమానత్వ గౌరవ పోరాటంపై ప్రతి దాడి అందాల పరిశ్రమ. స్త్రీలంటే శరీరం కాదన్న నినాదాన్ని తిరగరాసి స్త్రీలు అంటే శరీరం మాత్రమే అని ప్రకటించింది. ఈ అందం ఒక మతం, ఒక క్రతువు, ఒక సంప్రదాయం, ఒక వినూత్నమైన రూపంలో దాడి చేస్తున్న అతి పాత కొలమానం.
ఈ వినిమయంగా మారిపోయిన అందం లైంగికతపై దాడి, శరీరంపై పునరుత్పత్తిపై హక్కు పొందిన స్త్రీలను వారి శరీరాలపై హక్కు వారే వదులుకునేలా చేసిన ఒక కుట్ర. వారి కదలికలు, వారి నడక, వారి భంగిమ, వారి పలుకు అన్నింటిపై ఈ అందాల పరిశ్రమ నియంత్రణ సాధించింది. అందాల పరిశ్రమ తయారుచేసే కృత్రిమ అందం తప్ప స్త్రీలకు వేరే గుర్తింపు లేకుండా చేసింది.
ఈ అందం సార్వజనీనమైందిగా అందరూ వాంఛించేదిగా సృష్టించింది. స్త్రీలు అందాన్ని కోరుకుంటారు. పురుషులు అందమైన స్త్రీలను కోరుకుంటారు. స్త్రీలు తమ అందాన్ని మెరుగుపరుచుకునే శ్రమలో ఉంటారు. పురుషులు పరిశ్రమలు పెట్టి డబ్బు సంపాదించింది, అందమైన స్త్రీలను పొంది, వారిని తమ విజయ చిహ్నాలుగా ప్రదర్శించుకుంటారు. భాష ఏదైనా రూపం అత్యాధునికమైన అందాల పోటీల సారాంశం ఇదే.
స్త్రీ అందం పురుష ప్రపంచంలో ఒక మారకద్రవ్యం (కరెన్సీ). ఈ అందం అనేదాన్ని కరెన్సీగా వాడటం పారిశ్రామిక విప్లవంతో ప్రారంభమై నేటి కార్పోరేట్ కాలానికి పతాక స్థాయికి చేరింది. ఈ అందం అనే భ్రమ కేవలం లైంగిక దోపిడీకి, శారీరక దోపిడీకి సంబంధించిన అంశం కాదు. అది ఒక రాజకీయ భావజాలం.
అందాన్ని సామర్ధ్యానికి, తెలివికి, కొలమానంగా విజయవకాశాలకు పునాదిగా భావిస్తే దాన్ని ప్రామాణీకరిస్తే ఈ రక్షణ రేఖకు బయట ఉన్న అసంఖ్యాకమైన స్త్రీలు ఎంత అవమానానికి ఎంత తిరస్కారానికి ఎంత దోపిడీకి గురవుతారు? మొత్తం సేవా రంగంలో రిసెప్షనిస్టుల దగ్గర నుంచి ఎయిర్ హోస్టెస్ వరకు అందం ఇప్పటికీ ఒక అవసరంగా మారిపోయింది. అందంగా ఉన్నవాళ్లే బాగా చదువుకుంటారనే సామెత కూడా పాతదే కొనసాగుతున్నది. ‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’ అందాల పోటీలెంత ప్రకటించిన దానిలో ప్రశ్నలు బుర్ర తక్కువ ప్రశ్నలే.
సామర్థ్యమున్న స్త్రీలు, శాస్త్రవేత్తలు, వ్యవసాయదారులు, నిపుణులైన శ్రామికులు ఉత్పాదక శ్రమల్లో అనుత్పాదక శ్రమల్లో తీరికలేని వాళ్లు ‘అందం’ దెబ్బకి ఆత్మన్యూనతకూ తిరస్కారాలకు గురవ్వాలా?
అసలు అందానికి ఒక నిర్వచనం ఒక ప్రమాణం ఉందా? ఉంటుందా? అది సాధ్యమేనా! తెలుపే అందమా? అంటే వాళ్ల వ్యాపారం యూరప్‌లో ఉంటే తెలుపు అందం. ఆఫ్రికాలో ఉంటే నల్లటి చర్మపు మెరుపందం అంటారు. రకరకాల శరీరపు రంగులు, అవయవాల పొందికలు, శరీర నిర్మాణ చక్రాలు ముక్కు, మొహం అమరికలు గల ప్రపంచంలో అందానికి పోటీలు అంటే అందాన్ని ఒక రకం అవయవాల కొలతలకు అమరికలకు పరిమితం చేయటమే. స్త్రీలను విజ్ఞానులుగా, నిపుణులుగా, ఆటగాళ్లుగా తయారు కానీయకుండా దారి మళ్లించి శరీరాలుగా మార్చడం. వారి మేధస్సును వికసించనీయకుండా ఆపడం.. ఇది వ్యాపారం కాదు. ఇది అవకాశం కాదు. ఇది మానసిక శారీరక బానిసత్వం. అది ‘ప్రపంచ సుందరి’ వేదిక కాదు. స్త్రీల శరీరాలను కర్రలతో పొడిచే దాని బిగుతును సొగసును వేలం వేసే బానిస వ్యాపారుల కబేలా. ఈ బానిస వ్యాపారాన్ని ప్రపంచం అంతా ఛీత్కరించాలి. ఈ మానవ మాంసపు అశ్లీల అమ్మకాలనీ తిరస్కరించాలి.
దేవి, సామాజిక కార్యకర్త, ది వైర్ కోసం..
Comments