
రాష్ట్ర దేవదాయ శాఖ కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. ఆశాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేసిన శాంతి అక్రమాలు, వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో సన్నిహితంగా ఉండటం వంటి అంశాలు బయట పడటంతో ఆ శాఖ వ్యవహారాలు రచ్చకెక్కాయి. ప్రభుత్వం కూడా సీరియస్‌గా స్పందించి విచారణ జరిపి స్తోంది. ఇంత జరుగుతున్నా.. కొత్త ప్రభుత్వంలో ఆ శాఖ మంత్రి మాత్రం ఇంతవరకు పదవీ బాధ్యతలు స్వీక రించలేదు. అదేంటి.. ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి రెండు నెలలు పూర్తి అయ్యాయి కదా! మంత్రుల ప్రమాణ స్వీకారాలు, ఛాంబర్ల కేటాయింపులు, బాధ్యతలు చేపట్టడాలు అన్నీ పూర్తి అయ్యాయి కదా.. మరి దేవదాయ మంత్రి పదవీ బాధ్యతలు చేపట్టకపోవడం ఏమిటి? అన్న సందేహం రావ డం సహజం. అవన్నీ కరెక్టే.. ఈ రెండు నెలల కాలంలో నాలుగైదుసార్లు కేబినెట్ మీటింగులు కూడా జరిపి పలు కీలకాంశాలపై చర్చించి ఆమోదముద్ర కూడా వేశారు. కానీ చంద్రబాబు కేబినెట్‌లో దేవదాయ శాఖ మంత్రిగా నియమితులైన ఆనం రామనారాయణరెడ్డి మాత్రం ఇంతవరకు సచివాలయంలోని తన ఛాంబర్‌కు వెళ్లలేదు.. అధికార బాధ్యతలు చేపట్టలేదు. ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల తర్వాత చివరికి మొన్న ఆదివారంనాడే ఆ ముచ్చట కానిచ్చారు. బహుశా రాష్ట్ర, దేశ రాజకీయ చరిత్రలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక మంత్రి ఇంత ఆలస్యంగా పదవీ బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి కావచ్చేమో! ఆ జాప్యానికి ఆయన అనుచరగణం చెబుతున్న కారణం.. మంచి రోజులు లేకపోవడమేనట! ఇది సరైన రీజన్ కాదనేది సుస్పష్టం. ఎందుకంటే ఎన్నికలు జరిగిన తర్వాత అటు కేంద్రంలో.. ఇటు ఏపీతో సహా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వాలు ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే ప్రమాణ స్వీకా రాలు, బాధ్యతలు చేపట్టడాలు పూర్తి చేసేశాయి. మన రాష్ట్రంలోనూ జూన్ 12న చంద్రబాబు సీఎంగా, మరో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి ఎన్నికైన ఆనం రామనారాయణరెడ్డి కూడా ఉన్నారు. అనంతరం మంత్రులకు శాఖలు, ఛాంబర్లు కేటాయించారు. ఆ వెంటనే రోజుల వ్యవధిలో మంత్రులు ముహూర్తాలు చూసుకుని అధికారికంగా బాధ్యతలు చేపట్టి.. విధుల్లో నిమగ్న మయ్యారు. కానీ ఆనం వారు మాత్రం రెండు నెలలపాటు జాప్యం చేశారు. శాఖ కేటాయింపుపై ఉన్న అసం తృప్తితోనే ఆయన అలక పాన్పు ఎక్కినట్లు ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. సీనియర్ నాయకుడినైన ఆయన రెవెన్యూ, ఆర్థికం వంటి కీలక శాఖలు ఆశించారు. కానీ చంద్రబాబు మాత్రం దేవదాయ శాఖతో సరిపెట్టారు. తనబోటి సీనియర్‌కు దేవదాయశాఖ ఇవ్వడమేమిటని ఆనంవారు చిన్నబుచ్చుకున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే చంద్రబాబు చేసింది కూడా తప్పేంకాదు. ఎందుకంటే.. రామనారాయణరెడ్డి ఎన్నికలకు ఏడాది ముందు వరకు వైకాపాలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని కాదని టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారన్న ఆరోపణతో ఆయన్ను వైకాపా బహిష్కరించింది. దాంతో ఎన్నికల ముందు టీడీపీలో చేరిన ఆయన ఆ పార్టీ తరఫున గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. పార్టీలో ముందునుంచీ ఉన్న సీనియర్లను కాదని నిన్నగాక మొన్న పార్టీలో చేరిన నేత ముఖ్యమైన శాఖలు కోరుకోవడం అత్యాశే అవుతుందన్న వ్యాఖ్యలు వినిపి స్తున్నాయి. ఆ సంగతి అలా ఉంచితే.. దేవదాయ శాఖను చేపట్టడానికి ఆనం విముఖంగా ఉండటానికి మరో కారణం నెగిటివ్ సెంటిమెంట్. ఏపీ ఉమ్మడిగా ఉన్నప్పటి నుంచీ ఇది ఉంది. అదేంటంటే.. దేవదాయ శాఖ మంత్రులుగా చేసినవారికి ఆతర్వాత ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదట! టీడీపీ ఏర్పడిన తర్వాత ఎన్టీఆర్ హయాంతో పాటు ఆ తర్వాత ఏర్పడిన దాదాపు అన్ని ప్రభుత్వాల్లోనూ దేవదాయ శాఖ చేపట్టిన మంత్రులు పదవీ భ్రష్టత్వం పొందారు. ఎన్టీఆర్ హయాంలో 1983, 1985 కేబినెట్లలో ఈ శాఖ మంత్రులుగా పని చేసిన ఈలి ఆంజనేయులు, ఎన్.యతిరాజారావులు ఆతర్వాత రాజకీయాలకే దూరమైపోయారు. ఈలి ఆంజనేయులు ఏకంగా మరణించారు. అంతెందుకు రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ నుంచి కూడా ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు. వారిలో తాడేపల్లిగూడెం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన పైడికొండల మాణిక్యాలరావుకు దేవదాయశాఖ ఇచ్చారు. కానీ 2018లో చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటపడటంతో ఆయన కేబినెట్‌లో ఉన్న మాణిక్యాలరావుతో పాటు మరో బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్ పదవి కూడా ఊడిపోయింది. ఆ తర్వాత మాణిక్యాలరావు రాజకీయాల్లో కనిపించడం మానేశారు. 2019లో జగన్ ప్రభుత్వం వచ్చాక వెల్లంపల్లి శ్రీనివాస్ దేవదాయ మంత్రి అయ్యారు. కానీ రెండున్నరేళ్ల తర్వాత జరిగిన పునర్వ్యవస్థీకరణలో పదవి కోల్పోవడమే కాకుండా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. వెల్లంపల్లి తర్వాత జగన్ కేబినెట్‌లో చేరి దేవదాయ శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి హోదా పొందిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణది కూడా సేమ్ దుస్థితి. సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో చంద్ర బాబు ఇచ్చిన దేవదాయ శాఖను చేపట్టకుండా అలక పాన్పు ఎక్కితే శాఖ మార్చే అవకాశం ఉండొచ్చని భావించడం వల్లే అనంవారు ఇంతకాలం దూరంగా ఉన్నారు. కానీ చంద్రబాబు ఏమాత్రం పట్టించుకో కపోవడంతో బాధ్యతలు చేపట్టక తప్పలేదన్న చర్చ జరుగుతోంది.
Comments