top of page

బాబా గుడి వెనుక రహస్యమదేనా..?

Writer: ADMINADMIN

ఎ సోల్జర్‌ ఈజ్‌ నెవ్వర్‌ ఆఫ్‌ డ్యూటీ!.. ఈ ట్యాగ్‌లైన్‌ గుర్తుందిగా..? మురుగదాస్‌ దర్శకత్వంలో తమిళంలో నిర్మించబడి తెలుగులో తుపాకీగా, హిందీలో హాలిడేగా విజయవంతమైన విజయ్‌ చిత్రం. అయితే ఈ చిత్రానికి పెట్టిన ఆ ట్యాగ్‌లైన్‌ ఓ బాబా విషయంలో అక్షర సత్యం. ఆయనే హీరో ఆఫ్‌ నాథులా. ఆసక్తిగొల్పే ఆ కథ ఎప్పుడో విన్నట్టనిపిస్తోందా? అయితే భారత సైనికదళం గురించి తెలుసుకోవాలనుకునేవారికి పతాకస్థాయిలో స్ఫూర్తి నింపే ఆ బాబా కథ ఓసారి విందాం.

హీరో ఆఫ్‌ నాథులాగా కొలవబడుతున్న బాబా హర్భజన్‌ సింగ్‌ గురించి తెలుసుకునే క్రమంలో మూఢనమ్మకాలుగా, అంధవిశ్వాసాలుగా ప్రచారంలో ఉన్న ఆత్మలు మాట్లాడటం, పైగా ఆత్మలు బార్డర్‌లో కాపలా కాయడం, ప్రాణాలతో ఉన్న సైనికులను సైతం అలర్ట్‌ చేస్తూ దేశసేవ చేయడం వంటి ఎన్నో ఆశ్చర్యపోయే ఆసక్తికర విషయాలను ఆ బాబా కథ మన ముందుంచుతుంది.

హర్భజన్‌ సింగ్‌ పంజాబ్‌లోని గుజరావాలా జిల్లా సద్రానా గ్రామంలో సిక్కు కుటుంబంలో 1946 ఆగస్టు 30న జన్మించారు. ఇప్పుడీ ప్రాంతం పాకిస్థాన్‌లో ఉంది. గ్రామ పాఠశాల నుంచి ప్రాథమిక విద్యను పూర్తి చేసిన హర్భజన్‌ ఆ తర్వాత పంజాబ్‌లోని పట్టిలో దయానంద్‌ ఆంగ్లోవేదిక్‌, డీఏవీ స్కూల్‌ నుంచి మెట్రిక్యులేషన్‌ పూర్తిచేశారు. 1966 ఫిబ్రవరి 9న 23వ పంజాబ్‌ రెజిమెంట్‌లో చేరాడు.

అనుమానాస్పద మరణం

సిక్కిం రాష్ట్రంలోని ఇండో-చైనా సరిహద్దులోని నాథు లా పాస్‌ భారత సైన్యానికి వ్యూహాత్మక ప్రదేశం. శీతాకాలంలో పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే ఈ ప్రాంతం. భారత్‌, చైనా సైన్యాలకు నాలుగు బోర్డర్‌ పర్సనల్‌ మీటింగ్‌ పాయింట్లలో ఒకటి.

1968, అక్టోబర్‌ 4న తుక్లాలోని తన బెటాలియన్‌ ప్రధాన కార్యాలయం నుంచి డెంగ్‌ చుక్లాకు వెళ్తున్న సమయంలో హర్భజన్‌ ప్రమాదవశాత్తూ కొండచరియల పైనుంచి జారిపడి వేగంగా ప్రవహించే కాలువలో గల్లంతయ్యాడు. సైన్యం అతని మృతదేహం కోసం మూడు రోజులు శోధించినా ఆయన జాడ కానరాలేదు. 23, పంజాబ్‌ రెజిమెంట్‌లో తన సహోద్యోగుల్లో ఒకరికి హర్భజన్‌ కలలోకొచ్చాడట. ఆ తర్వాత రెస్క్యూ బృందం ఆయన మృతదేహాన్ని వెతికి పట్టుకోగా, పూర్తి సైనిక గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన బాబా సేవలను గుర్తించిన భారత సైన్యం హర్భజన్‌కు ఒక బాబా (సాధువు) హోదా ఇచ్చింది.

తూర్పు సిక్కింలో బాబా హర్భజన్‌ సింగ్‌ ఆలయం!

కొన్నిరోజులకు హర్భజన్‌ మళ్లీ ఓ సైనికుడి కలలో వచ్చాడట. అప్పుడు తన జ్ఞాపకార్థం ఓ సమాధిని నిర్మించాలన్న కోరికను వ్యక్తం చేశాడట. మొత్తమ్మీద ఆ విషయంపైన అంధ విశ్వాసాలు, మూఢ నమ్మకాలు, శాస్త్రీయత అనే వాదనలకు తావివ్వకుండా పంజాబ్‌ 23 రెజిమెంట్‌ అధికారులు సమాధిని తూర్పు సిక్కింలో గ్యాంగ్‌టక్‌కు 52 కిలోమీటర్ల దూరంలో నిర్మించారు. అప్పటి నుంచీ ఆ ప్రదేశం బాబా మందిర్‌గా ప్రసిద్ధిగాంచింది. ఇప్పుడా ప్రదేశం ఓ టూరిస్ట్‌ హబ్‌.

బాబా మందిరంలో మూడు గదులుంటాయి. బాబా కార్యాలయం, స్టోర్‌ రూమ్‌తో పాటు లివింగ్‌ రూమ్‌ ఉంటాయి. ప్రతీ గదిలో బాబా బతికున్నప్పుడు వాడిన ప్రతి వస్తువునూ చక్కగా ఉంచటం కనిపిస్తుంటుంది. హర్భజన్‌ బతికున్నప్పుడు పడుకునే మంచం నుం ఆయన వేసుకున్న బూట్లు, చెప్పులు, తాగిన వాటర్‌ బాటిల్‌, ఇస్త్రీ చేసి పెట్టుకున్న యూనిఫాం, వానాకాలపు గొడుగు వరకూ ప్రతిదీ ఎంతో శ్రద్ధగా భద్రపర్చారక్కడ. శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉండే ఈ ఆలయం గూండా వెళ్లే సైనికులు ఇక్కడి నుంచి వెళ్లే ప్రతీసారీ బాబాకు నివాళుర్పించి వెళ్లటం ఇక్కడ ఆనవాయితీ. బాబా హర్భజన్‌ సింగ్‌ చనిపోయినా ఆయనకు దేశంపైనున్న భక్తితో ఆయన ఆత్మరూపంలో సేవ చేస్తున్నాడనే నమ్మకం ఇక్కడి ఆర్మీ ఆఫీసర్ల నుంచీ ప్రతీ ఒక్కరిలోనూ గూడుకట్టుకుంది.

ఇతర సైనికులు శుభ్రంగా లేకపోయినా, క్రమశిక్షణ పాటించకపోయినా ఆ ఆర్మీ అధికారి బాబా చేత చెంపదెబ్బతో శిక్షించబడతారనేది అక్కడ వినిపించే మరో నానుడి. అంటే ఆత్మరూపంలోనూ హర్భజన్‌ ఓ ఆర్మీ అధికారిగా క్రమశిక్షణకు ఎంత విలువనిస్తున్నారో చెప్పేందుకు ఓ ఉదాహరణగా అక్కడి అధికారులు చెబుతుంటారు. బాబా హర్భజన్‌ మందిరం వద్ద నీళ్లు తాగితే అనారోగ్యంతో బాధపడుతున్నవారికి నయమైతుందన్న నమ్మకమూ ఉండటంతో ఇక్కడికొచ్చే రోగులకు ఇక్కడి మంచి నీళ్లనందిస్తుంటారట. మొత్తమ్మీద బతికున్నన్నాళ్లు దేశం కోసం సేవ చేసిన హర్భజన్‌.. చనిపోయాక కూడా ఓ మహాత్ముడై అంతకుమించి ఓ ఆత్మరూపంలో ఉన్న ఓ కనిపించని శక్తై, చివరాఖరకు ఓ దేవుడై మొత్తంగా సైనికుడన్నవాడికి సెలవు దినమే లేదన్న మాటను అక్షరసత్యం చేస్తున్నాడనిపిస్తుంది ఈ కథ వింటుంటే.

కనీసం మూడు రోజుల ముందుగానే బాబా హర్భజన్‌ సింగ్‌ ఆత్మ రాబోయే యుద్ధాలు, ఉత్పాతాలు, దాడుల గురించి సైన్యాన్ని హెచ్చరిస్తుందని ఇక్కడి సైన్యంలో బలమైన నమ్మకం. వాస్తవానికి మూఢనమ్మకాలకు, అంధవిశ్వాసాలకు ఆమడ దూరంలో ఉండి పూర్తి శాస్త్రీయ అంచనాలతో పని చేయాల్సిన సైన్యమే హర్భజన్‌ మహిమలను నమ్ముతుందంటే ఎంతైనా కొంత ఆశ్చర్యపోవాల్సిందే మరి. ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 11న ఇప్పటికీ హర్భజన్‌ యాదిలో ఒక జీప్‌ తన వ్యక్తిగత వస్తువులతో సమీప రైల్వేస్టేషన్‌ న్యూ జల్పాయిగురికి బయలుదేరుతుందట. రైలులో పంజాబ్‌ కపుర్తాలా జిల్లాలోని కుకాకు ఆ వస్తువులను చేరవేస్తారట. అంతేకాదు ఆ ట్రైన్‌లో బాబా హర్భజన్‌ ఆత్మకు కూడా ఓ బెర్త్‌ కచ్చితంగా ప్రత్యేక రిజర్వేషన్‌ చేసి పెడతారట. ఓ ముగ్గురు సహ సైనికులు కూడా బాబా ఆత్మతో పాటు తన సొంత గ్రామానికి వెళ్లి ఆయన తల్లికి కొంత డబ్బు సాయం అందించటం వంటివి వింటే నిజంగా ఈ కాలంలో అదీ సైన్యంలో ఈ పోకడలేంటని కచ్చితంగా హేతువాదులైతే ఏకంగా ముక్కున వేలేసుకోవాల్సిందే.. కొట్టిపారేయాల్సిందే! లేదంటే అక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయి సందర్శన ద్వారా తెలుసుకోవాల్సిందే!!

అయితే బాబా ఆత్మకు కూడా అందరు సైనికుల్లాగే సైన్యంలో సెలవులుండటమన్నది ఇక్కడ కనిపించే మరింత విశేషం. ఆయన ఆత్మ సెలవులో ఉన్నప్పుడు సైన్యం మరింత అప్రమత్తంగా ఉంటుందక్కడ. ఎందుకంటే బాబా ఉంటే మిగిలిన సైన్యం అప్రమత్తంగా లేకున్నా ఆ బాధ్యతను బాబా హర్భజన్‌ ఆత్మే చూసుకుంటుంది గనుక అన్నది అక్కడి ఆర్మీ అధికారుల భావన.

సుమారు 50 ఏళ్లుగా ఆ పర్వతాల్లో బాబా హర్భజన్‌ ఆత్మ నివసిస్తోందనే నమ్మకంతో ఆయన ఆలయానికి పెద్దఎత్తున సందర్శకులు కూడా క్యూ కడుతూనే ఉన్నారు. మరణం తర్వాత కూడా దేశాన్ని రక్షిస్తున్న బాబా హర్భజన్‌ కోసం నాథులా వద్ద భారత్‌తో పాటు చైనా సైన్యం కూడా ఆయన గౌరవార్థం ఓ కుర్చీని పక్కనబెట్టింది. ఇదే కాన్సెప్ట్‌తో ఆమధ్య ‘ప్లస్‌ మైనస్‌’ పేరిట యూట్యూబ్‌లో భువన్‌ బామ్‌, దివ్యాదత్తా కలిసి నటించిన షార్ట్‌ ఫిలిం కూడా విశేష ఆదరణను చూరగొనగా, అందులో భువన్‌ బామ్‌ బాబా హర్భజన్‌ ఆత్మ పాత్రలో నటించారు.

అయితే బాబా ఆత్మ చేస్తున్న పనులకు ఉక్కిరిబిక్కిరై ఆ ఆత్మను తీసుకెళ్లాలని భారత్‌కు చైనా ఆర్మీ అధికారులు లేఖ రాయడం ఓ విశేషమైతే, బాబా హర్భజన్‌ ఆత్మకథ ఇప్పుడు ప్రపంచానికే ఒక సవాల్‌గా మారింది. మానవుడు రోదసీలోకి అడుగుపెట్టి ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌తో ప్రపంచాన్ని శాసిస్తున్న వేళ ఇది అసలు నమ్మడానికే వీలు లేని నిజం. శత్రుదేశాల వ్యూహాలు ముందే తెలిసేలా చేయడం, సైనికుల మధ్యే ఉంటూ ఆత్మరూపంలోనే తానూ పహారా కాయడం, ఎవరైనా ఇతర సైనికులు కంటిమీద కునుకు వేస్తే వెంటనే చెంప చెళ్లుమనిపించడం, చైనా సైనికులు ఆక్రమణలకు వస్తే గుర్రపు స్వారీ చేస్తూ హెచ్చరించడం, ఆ దెబ్బకు మీ ఆత్మను మీరు తీసుకెళ్లండి అంటూ చైనా ఆర్మీ గగ్గోలు పెట్టడం, సైనికుడి ఆత్మకు మన ఆర్మీ జీతం, సెలవులు, ప్రమోషన్లను వర్తింపజేయడం, ఇవన్నీ చూస్తుంటే అసలు ఆత్మలు ఉన్నట్టా, లేనట్టా? ఈ ప్రశ్న ఉద్భవించకుండా ఎలా ఉంటుంది మరి..??

నిజంగా బాబా హర్భజన్‌ కథ నిజమని నమ్మినా, నమ్మకపోయినా, ఆర్మీ అధికారులు కూడా ఇంత మూఢవిశ్వాసాలతో ఉన్నారా అననిపించినా, ఇది నిజంగా ఓ ఆసక్తికరమైన, దేశం పట్ల కొందరు సైనికుల అవ్యాజ్య ప్రేమ, భక్తికి నిదర్శనమైన విశేషమే మరి! అందుకే ఇంకా బాబా హర్భజన్‌ సజీవంగానే ఉన్నారని అక్కడి ఆర్మీ నమ్ముతోంది.

ఎ సోల్జర్‌ ఈజ్‌ నెవ్వర్‌ ఆఫ్‌డ్యూటీ అని అందుకే సరిహద్దులో ఆయన ఆత్మ అందర్నీ అలర్ట్‌ చేస్తోందని ఇప్పటికీ విశ్వసిస్తోంది అక్కడి ఆర్మీ.

- రమణ కొంటికర్ల

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page