top of page

బాబుగారికి అలా కలిసొస్తుంది!

  • Guest Writer
  • Jun 7
  • 4 min read
  • ప్రజారాజధానులను ప్రభుత్వాలు కట్టలేవ్‌

  • వెయ్యి మంది రాని ఎయిర్‌పోర్టుకు అప్పులిచ్చే సంస్థలెక్కడ?

  • రాజధాని ప్రాంతంలో భూముల ధరలు నేలచూపులు

  • హైదరాబాద్‌ హైటెక్‌ మోడల్‌ అమరావతిలో కుదరదు

కొన్ని కొన్ని విషయాల్లో నిజం పాలు ఎలా ఉన్నప్పటికీ.. అవి సాధారణ ప్రజలు ప్రశ్నించడానికి అతీతంగా ఉంటాయి. విజనరీ అనే పదం చంద్రబాబుకు అతుక్కుపోయింది. అంతేకాకుండా ఐటీ అంటే.. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ. ఇది కూడా ఆయనకే దఖలు పడిపోయింది. 1995లో ఏ పరిస్థితుల్లోనైతేనేమీ ఆయన ముఖ్యమంత్రి అయ్యే సమయానికి కంప్యూటర్‌ విప్లవం ఒక రకమైన విస్ఫోటనం చెందింది. మన దేశంలో అప్పటికే బెంగళూరు ఆ దిశలో ముందంజలో ఉండగా, హైదరాబాదులో హైటెక్‌ సిటీని అంతకుముందు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి జనార్దన్‌ రెడ్డి హయాంలో పునాదిరాయి వేసి శ్రీకారం చుట్టాకా ప్రభుత్వాలు మార్పిడిలో ఈయన సమయానికి అది రావడం, ఆ తర్వాత ఈయన చక్రం తిప్పే కాలంలో హైటెక్‌ సిటీ డెవలప్‌ కావడం.. వగైరా పనులన్నీ జరిగి జనమంతా చంద్రబాబు కంప్యూటర్‌ని కనిపెట్టి జనానికి అంతర్జాలాన్ని పరిచయం చేసారని నమ్మే పరిస్థితికి వచ్చారు.

అంతేకాకుండా ఆ తర్వాత వచ్చిన మొబైల్‌ ఫోన్ల విప్లవం కూడా చూశాక మొబైల్‌ ఫోన్‌ కూడా చంద్రబాబే కనిపెట్టి జనానికి ఇచ్చారని ఒక రకమైన బలమైన నమ్మకాన్ని జనం పెట్టేసుకున్నారు. అది కాదంటే మనల్ని కొట్టేట్టున్నారు. నిజానికి ఏదో ఒక సందర్భంలో బాబుగారే చెప్పారు.. తనకు సెల్‌ఫోన్‌లో మెసేజ్‌ పెట్టడం కూడా తెలియదని. ఇక్కడ రెండు రకాలు. మెసేజ్‌ పెట్టడానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానం ఒకటైతే, ఆ మెసేజ్‌ రాయడానికి కావలసిన భాషా పరిజ్ఞానం మరొకటి. ఈ రెంటిలోనూ ఆయన బలహీనుడే కాబట్టి ఒక సందర్భంలో తనే చెప్పేశారు తనకు మొబైల్‌ ఫోన్లో మెసేజ్‌ పెట్టడం కూడా తెలియదని. ఏదేమైనప్పటికీ జనం దృష్టిలో ఆయనే గ్రాహం బెల్‌. ఇంటర్నెట్‌ కనిపెట్టిన ఆయన ఎవరో నాకు తెలియకపోవడం క్షమార్హం కాకపోయినప్పటికీ క్షమించేయాలి. ఎందుకంటే అజ్ఞానాన్ని క్షమించలేకపోవటం మీ దుర్మార్గం అవుతుంది.

ఆ విధంగా కంప్యూటర్‌ని, ఇంటర్నెట్‌ను, మొబైల్‌ ఫోన్‌ని కనిపెట్టి జనానికి అందించారని జనమంతా ఇప్పుడు కూడా నమ్ముతున్నారు. విచిత్రం ఏమంటే పాత రోజుల్లో జేఎన్‌టీయూ లాంటి అత్యున్నత సాంకేతిక విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్‌ చదివిన ఉన్నత విద్యావంతులకు కూడా ఈ నమ్మకం ఉంది. మనలాంటి సామాన్యులకు ఇక చెప్పేదేముంది. దాంతో ఆయన అన్నీ తానే అనే ఒక మానసిక భావనకు లోనై ఉంటాడు కాబట్టి ఆ రంగంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన చాట్‌ జిపిటి, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, జెమిని జిపిటి, గ్రోక్‌ ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ కూడా తన ఆవిష్కరణలేనంటూ ఈ మధ్యకాలంలో చెప్పుకొస్తున్నారు, మనం కూడా చూస్తున్నాం.

అదేదో విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ పెట్టుబడిదారుల గ్రూపు చక్కగా టక్‌అప్‌ చేసుకుని, టై కట్టుకుని సూటు వేసుకున్న పారిశ్రామికవేత్తలు అంతా మీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి మాకు మీరు చూపగలిగిన ఇన్సెంటివ్‌లేంటని అడిగితే.. ఆయన ఇక్కడున్న మౌలిక వసతుల గురించి గానీ, ఖనిజ సంపదల గురించి గానీ, ఓడరేవుల గురించి గానీ, మానవ వనరుల లభ్యతను గురించి గానీ ఒక్క మాట కూడా చెప్పకుండా, అక్కడ చంద్రబాబు అనే బ్రాండ్‌ ఉందని సగర్వంగా చెప్పేశారు. ఆ పారిశ్రామికవేత్తలంతా తలలు పట్టుకుని అటు నుంచి అటే ఎటో వెళ్లిపోయారు. ఎవరు కూడా ఒక రూపాయి పెడితే ఒట్టు.

ఆ రకమైన నేపథ్యంలో సోనియా కర్కశంగా విడదీసేసిన రాష్ట్రానికి రాజధాని ఎవరు కట్టగలరని జనం అనుకున్నప్పుడు అప్పట్లో హైదరాబాదును కట్టిన మయుడు చంద్రబాబునాయుడేనని నమ్మి ఆయనకు ఓట్లు వేసేశారు. దాంతో ఆయన ఆ పని మీద నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ రిపోర్టును చదవకుండానే పక్కన పడేసి అమరావతిని రాజధానిగా ఎంచుకునే 36 వేల ఎకరాలు జనం భూమిని తీసుకుని దానికి ప్రభుత్వ భూమి మరి 15 వేల ఎకరాలు జత చేసి మొత్తం 50వేల ఎకరాలకు మించి ఉన్న ప్రాంతంలో రాజధాని కట్టడానికి పూనుకున్నారు. ఇది పచ్చి బూతు పని అని ఆ రోజుల్లో అందరూ ముక్కున వేలేసుకున్నారు. మూడు పంటలు పండే వ్యవసాయ భూమిని అలా బంజరుగా మార్చటం సరికాదని ఎవరు చెప్పినా ఆయన వినే స్థితిలో లేకపోయారు.

విజయవాడ, గుంటూరు, తెనాలి, బందరు చతుర్భుజం ప్రభుత్వ భూములు అన్నింటిలోనూ కావాల్సిన భవనాలు అన్ని కట్టేసి రాజధానికి కావలసిన ఏర్పాట్లు అన్ని చేసుకుంటే.. ఆ చతుర్భుజ ప్రాంతం దానంతట అదే అభివృద్ధి చెందుతుంది. దాంతో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ వాటంతట అవే ప్రభావితం అవుతాయి. దానికి కొత్తగా 50వేల ఎకరాలను రాజధాని నిమిత్తం ఒక ప్రభుత్వం తీసుకుని అభివృద్ధి చేయాల్సిన పని లేదని బాధ్యత గల మేధావులంతా అప్పట్లో మొత్తుకున్నారు. కాకపోతే రాజధాని నిర్మాత చంద్రబాబు అనే ఒక కీర్తిని తాను చిరస్థాయిగా దక్కించుకోవాలనే యావ, ఆబ, కండూతి ఏమన్నా కానీ అవే కారణాలతో ఆయన రాజధాని నగరాన్ని నిర్మించడానికి పూనుకున్నారు.

ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మహానగరం అనేది ప్రభుత్వం నిర్మించేది కాదు. అది కాలక్రమేణా జనమంతా చేరి అంచెలంచెలుగా కొంచెం కొంచెంగా కాలానుగతంగా నిర్మించుకునే ప్రాంతం. ప్రభుత్వం దగ్గర ఉండే కొద్దిపాటి నిధులు దైనందిన కార్యక్రమాలను దాటి నగర నిర్మాణాలకు సరిపోవు. ఐనప్పటికీ పైన చెప్పిన కీర్తికండూతి కారణంగా చంద్రబాబు మహానగర నిర్మాణానికి పూనుకున్నారు. కట్టేది మనవాడే కదాని తాను ఇచ్చే ఎకరానికి వచ్చే 1200 గజాలు.. గజం ఒక్కింటికి రూ.50వేలు వస్తుందని, ఆ రకంగా తామిచ్చే ఎకరానికి ఎంత లేదన్నా ఆరు కోట్ల రూపాయల సొమ్ము తమకు వస్తుందని దురాశపడి 30 లక్షలు ఖరీదు చేసే తమ పొలాన్ని రాజధాని నిర్మాణానికి ఇచ్చేసి, తిరిగి తామేదో త్యాగం చేసామని వాళ్లంతా అనుకున్నారు.

కట్‌ చేస్తే.. జగన్‌ వచ్చారు.. అర్థంలేని మూడు రాజధానుల పల్లవిని ఎత్తుకున్నారు. అమరావతిని ఉన్నచోటనే పడుకోపెట్టేశారు. రాజధాని కాస్తా హుళక్కి అయింది. దాంతో రైతులు ఆందోళన చేశారు. దాంతోపాటు అనేక ఇతర కారణాలతో జగన్‌ ఆకాశం నుంచి పాతాళానికి పడిపోయారు. మంచిదే. తిరిగి చంద్రబాబు పాలనకు వచ్చారు. ఇప్పుడు మళ్లీ పాత అమరావతిని పట్టాలపైన పెట్టడమే కాకుండా కొత్తగా మరొక 50వేల ఎకరాలు తీసుకుని ఎన్నెన్నో ఇతర కార్యక్రమాలు చేపట్టాలని చూస్తున్నారు. కాకపోతే మన బడ్జెట్‌, మన తాహతు దానికి సరిపోవు. 13 జిల్లాల చిన్న రాష్ట్రానికి రాత్రికి రాత్రి ప్రపంచ స్థాయి రాజధాని రాదు. ఇది అప్పట్లో కెసిఆర్‌ యాదగిరిగుట్టను తిరుపతి స్థాయిలో అభివృద్ధి చేస్తానని అన్నప్పుడు సీపీఐ నారాయణ ఏమన్నారంటే తలకిందులుగా తపస్సు చేసినా గుట్ట కొండ కాదు, అమరావతి హైదరాబాద్‌ కాదు అని కుండ కాదు ఏకంగా ఇత్తడి బిందెనే బద్దలుకొట్టారు.

ఆ దృష్టితో చూసినప్పుడు రెండోసారి పాలనకు వచ్చి ఈ ఏడాది అయ్యాక ముందు భూములు కోల్పోయిన రైతులకు వారి వారి వాటాలను వారికి ఇచ్చే బృహత్కార్యాన్ని గాలికి వదిలేసి 4,500 కోట్లతో సెక్రటేరియట్‌ భవనం నిర్మాణం అంటూ గాలిమేడలు కట్టడానికి పూనుకున్నారు. ఇంతకంటే ఆత్మహత్య సదృశం మరొకటి ఉండదు. అంతేకాదు మరొక 50వేల ఎకరాలు తీసుకుని అందులో 5వేల ఎకరాల్లో ఎయిర్‌పోర్టును నిర్మిస్తామంటున్నారు. ఇది మరీ అర్థం లేని పని. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రతిరోజు 40వేల మంది ప్రయాణికులు ఉంటారు. ఆ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి 2008 నాటికి 3వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు జీఎంఆర్‌. ఇప్పటి అంచనాల్లో అది కనీసం 20వేల కోట్ల రూపాయలు అవుతుంది. పట్టుమని రోజుకి వెయ్యి మంది ప్రయాణికులను ఆకర్షించలేని విమానాశ్రయానికి 20వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్త గాని, అతనికి అప్పులు ఇచ్చే ఆర్థిక సంస్థలు గాని భారతదేశంలో లేనేలేవు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్న భూములు తాలూకు ప్రభుత్వ వాటాను అమ్మేద్దామనే ఒక దివాలాకోరు ఆలోచనను మంత్రి నారాయణ బయట పెడుతున్నారు. అసలు వాటిని కొనేవాడు ఎవడు? హైదరాబాదు హైటెక్‌ మోడల్‌ ఇక్కడ అమలవుతుందనుకుంటే అంతకంటే హాస్యాస్పదమైన ఆలోచన మరొకటి ఉండదు.

మరొక విషయం.. భూమి అనేది పెరుగుదలకు అవకాశం ఉండదు, జనాభా పెరుగుదలతో పాటు భూమి సమాంతరంగా పెరగదు. కాబట్టి భూమి మీద పెట్టుబడి పెడితే అది పదింతలు అవుతుందని చెప్పే శోభన్‌బాబు, మురళీమోహన్‌ సూత్రీకరణలు అమరావతి విషయంలో పనికిరావు. ఎందుకంటే విస్తారమైన భూములు లభ్యతలో ఉన్నప్పుడు, వాటికి కావాల్సిన డిమాండ్‌ పాతాళంలో ఉన్నప్పుడు ఒక్కొక్క గజం నేల 50 వేల రూపాయలు పలుకుతుందని పేరాశ కూడనే కూడదు. 50 వేల చదరపు గజముల ఇళ్ల స్థలాలు చేతిలో పెట్టుకుని ఆరేళ్ల నుంచి ఎంత ప్రయత్నం చేసినా కూడా 100 గజాలు విక్రయించలేని దుస్థితిని అందరం చూశాం. సరఫరా కంటే ఒక అంచె డిమాండ్‌ తక్కువ ఉంటే ఇక సరుకు భూమిపాలే. రాజధాని రైతులు ఈ విషయాన్ని గుర్తెరిగారో లేదో మనకు తెలియదు.

పక్కన గన్నవరంలో ఉన్న ఎయిర్‌పోర్టులో బేరాలు లేక ఖాళీగా ఉంటే, ఇవతల పక్క రాజమండ్రిలో ఎయిర్‌పోర్టు ఉండగా, ఉత్తరాంధ్ర జిల్లాలకు విశాఖతో పాటు భోగాపురం రెడీ అయిపోతుంటే, రేణిగుంట, కడప విమానాశ్రయాలు ఖాళీగా గోళ్లు గిల్లుకుంటుంటే అమరావతిలో 5వేల ఎకరాల్లో 30 వేల కోట్ల రూపాయలతో మరొక ఎయిర్‌పోర్టు నిర్మాణమా? ప్రజల ఆస్తులతో, జీవితాలతో, వారి భవిష్యత్తుతో ఎంత జూదం ఆడతారా? దీన్ని విజన్‌ అంటారా? హైదరాబాదును ఐదేళ్లలో తానే కట్టానన్న నాయకుడు.. అదే ఐదేళ్లలో అమరావతిలో ఒక్క అడుగు కూడా ముందుకెందుకు వేయలేకపోయాడని ప్రశ్నించుకుంటే మనకు జవాబు తెలుస్తుంది.. అక్కడ కట్టింది ఈయన కాదు, ఇక్కడ కట్టలేకపోయింది ఈయన కాదు అని. ఇలాంటి దుందుడుకు పనులు కేవలం కీర్తి కండూతితో ఎంత మాత్రం చేయతగవు. జనం కూడా ఎంతసేపు కులరొచ్చులో పడి కొట్టుకోవడం కాకుండా నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. లేకుంటే ఆ మూల్యాన్ని వాళ్లే చెల్లించుకోవలసి ఉంటుంది.


- పెపకాయల రామకృష్ణ

1 Comment


Nagesh Balaram
Nagesh Balaram
Jun 07

super ramakrishnagaru... meeru rasindi aksharala satyam...

Like

Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page