బాబూ ఘట్టం.. ఎన్నాళ్లీ గొట్టం పనులు?
- Prasad Satyam
- Apr 24
- 2 min read
రోడ్డును తవ్వేసి వదిలేశారు
నిధులు రాలేదని చేతులెత్తేశారు
నామినేషన్‌లో దక్కించుకున్నా పూర్తిచేయడానికి దిక్కులేదు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఈ ఏడాది మార్చిలో నగరంలో ప్రబలిన డయేరియాకు కలుషిత నీరే కారణమని ప్రాథమికంగా భావించినప్ప్పుడే పైప్‌లైన్ల మరమ్మతు కోసం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అదే నెల 6న డిస్ట్రిబ్యూషన్ లైన్ నుంచి ఇంటికి వెళ్లే హెచ్‌డీపిఏ లైన్‌ను కొన్ని ప్రాంతాల్లో మార్చాలని, ఆ మేరకు రూ.80 లక్షలు విలువైన పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇప్ప్పుడు ఏప్రిల్ 6 దాటిపోయి మే నెలలోకి కూడా వచ్చేస్తున్నా ఇంతవరకు సంబంధిత కాంట్రాక్టర్లు ఈ పనులు పూర్తి చేయలేదు. అసలే ఇరుకు సందులుగా ఉండే ఐదు వీధుల్లో నడవడమే కష్టమైన రోడ్లున్న ప్రాంతంలో ఇప్ప్పుడు డిస్ట్రిబ్యూషన్ లైన్ ఉండే రోడ్డు మధ్యభాగాన్ని తవ్వేసి, ఇంతవరకు దానిపై రోడ్డు వేయకుండా స్థానికులతో సంబంధిత కాంట్రాక్టర్లు ఆడుకుంటున్నారు. ఇందుకు కారణమేమిటని ఆరా తీస్తే.. తమకు బిల్లుల చెల్లింపు జరగడంలేదని, అందుకే ఆపేశామని చెబుతున్నారట. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఇన్నాళ్లూ లెక్కాపత్రం లేకుండా నామినేషన్ పద్ధతిలో అనేక పనికిమాలిన పనులు చేపట్టి సొమ్ములు తినేసిన కాంట్రాక్టర్లు ఈ పనులు పూర్తిచేయడానికి మాత్రం ఎందుకు రావడంలేదని స్వయంగా కలెక్టరే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు భోగట్టా. మార్చి 6న పనులు ప్రారంభించాలని ఆదేశించిన మార్చి 16 వరకు వీటిని ప్రారంభించలేదు. ఈలోగా డయేరియాలు, మలేరియాలు మాసిపోయాయి. ఆ తర్వాత తీరిగ్గా రోడ్డును తవ్వి కొన్నాళ్లు, హెచ్‌డీపీఈ పైప్‌లు వేసి కొన్నాళ్లు కాలక్షేపం చేశారు. ఎంతకీ పనులు పూర్తిచేయకపోవడంతో సుడా నుంచి రూ.2 కోట్లు తెస్తానని ఎమ్మెల్యే గొండు శంకర్ హామీ ఇచ్చారు. దీంతో డిస్ట్రిబ్యూషన్ లైన్ నుంచి ఇంటి కనెక్షన్ కోసం హెచ్‌డీపీఈ పైప్‌లు కలిపారు. ఇప్పటికీ అక్కడ రోడ్డు కప్పడానికి, కాలువలు నిర్మించడానికి రూ.2 కోట్లు రాకపోవడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. సుడా పలికిందో పలకలేదో తెలియలేదు గాని, పనులు మాత్రం అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీంతో డయేరియా మొదటిగా కనిపించిన గోల్కొండరేవు రోడ్డు, దమ్మలవీధి, మంగువారితోట, కాకివీధి, ఆరంగివీధిలతో పాటు ఫాజుల్‌బాగ్‌పేట సీపానవీధి రామ మందిరం ప్రాంతంలో పైప్‌లైన్లను రోడ్డు మధ్యలో తవ్వి, దానిపై మట్టి వేసి వదిలేశారు. ఈ రోడ్డు ప్రస్తుతం వాహనాలు వెళ్లడానికి వీలు లేకుండా ఉండటంతో అన్నీ రోడ్డు మీదే పార్కింగ్ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. చాలామంది వాహనదారులు ఈ గోతుల కారణంగా గాయాల పాలవుతున్నారు. పాదచారులు సైతం నడవడానికి ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఈ విషయం ఎన్నిసార్లు నివేదించినా సమస్య పరిష్కారం కాకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు జరిపి పాదచారులు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ పనులను ఘట్టం గురునాధంతో పాటు వేరే పేరుతో తెలుగు తమ్ముళ్లు చేపట్టినట్లు తెలుస్తుంది.






Comments