యానిమల్ ఫ్యాట్ ఉందని కచ్చితంగా చెప్పని ల్యాబ్ రిపోర్టు
మతపరమైన వ్యాఖ్యల దుమారం బాబుకిది మొదటిసారి కాదు
ఎలాంటి ఆధారాలు లేకుండానే ముఖ్యమంత్రి ఆరోపణలు
నిష్పక్షపాత విచారణ కోసం ప్రపంచవ్యాప్త భక్తుల ఆందోళన
(పవన్ కోరాడ)

పవిత్ర తిరుమల ఆలయంలో ప్రసాదంగా ఇచ్చే లడ్డులో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణ పెద్ద దుమారానికి తెరతీసింది. వైఎస్‌ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కల్తీ జరిగిందంటూ ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మాటల యుద్ధం మొదలుపెట్టారు. ఈ వివాదపు అగ్గిని రాజేసుకుని హిందూత్వవాదులు భావేద్వోగపరమైన ఉద్యమాన్ని సోషల్ మీడియాలో ఇప్పటికే మొదలుపెట్టారు. ఈ హేట్రెడ్ ఉద్యమం రాష్ట్ర సరిహద్దులు దాటి ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని చుట్టేసింది. తాము అధికారంలోకి వచ్చిన వందరోజుల సందర్భంలో జరుపుకొంటున్న సంబరాల్లో చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. బాబు వ్యాఖ్యలపట్ల వివిధ మతసంస్థల అధిపతుల నుంచి, రాజకీయ పార్టీల నుంచి ఆలయ ఉన్నతాధికారుల వరకూ గట్టి ప్రతిస్పందన వస్తోంది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని బిజెపి, కాంగ్రెస్ పార్టీలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా రాజకీయ లబ్ధి పొందడానికి బాబు ఈ వ్యాఖ్యలు చేసారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
లాబ్ నివేదికలు
గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్‌లో ఉన్న నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు వెలువర్చిన ఒక నివేదిక ఈ వివాదానికి కారణమైంది. తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు ఉందని సోషల్ మీడియాలో ప్రచారం అవుతోన్న నివేదిక భక్తుల నమ్మకానికి సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో వేగంగా వైరల్ అయింది. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కల్తీకి అవకాశముందని ఆ నివేదికలో ఉంది. ఒక రసాయనమైన ‘ఎస్’ విలువ ఉన్నదానికంటే పెరిగితే విదేశీ కొవ్వులకు స్థానం ఉంటుందని, చేప నూనె, పశు కొవ్వు చేరవచ్చని ఆందోళన చెందింది. కాని, వాటిని ప్రసాదంలో గమనించినట్టు ఎక్కడా లేదు. ఉండడానికి అవకాశం ఉంటుంది అని అన్నదే తప్ప, జంతువుల కొవ్వు ఉందని ఎక్కడా చెప్పలేదు. బాబు వ్యాఖ్యలపై వైకాపా నాయకులు విరుచుకుపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచీ ప్రతి విషయంలోనూ గత ఐదేళ్లలో ఘోర వైఫల్యం జరిగిందనే మాటల వాడడం పరిపాటి అయింది. ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకున్న తర్వాత ఆయన దగ్గర నుంచి చంద్రబాబు గత పాలకులను విమర్శించడం నేర్చుకున్నారనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో కూడా జగన్ మిగిలిన హిందువుల కంటే క్రిస్టియన్లకు ఎక్కువ ఫేవర్ చేస్తున్నారని దుమారం రేపుతునే ఉన్నారు. అయితే ఇప్పుడు చేసిన ఆరోపణ పూర్తిగా జగన్మోహన్‌రెడ్డిని అణగదొక్కడానికి చేసింది. ఆయన క్రిస్టియన్ కాబట్టే ఇలాంటి దురాగతానికి పాల్పడ్డాడని దేశవ్యాప్తంగా చర్చ జరగడానికి తావిచ్చే వీలుంది.
కల్తీల చరిత్ర
అయితే తిరుపతి లడ్డూలలో కల్తీ గురించి దుమారం రేగడం ఇది తొలిసారి కాదు. ఇంతకుముందు ఒక రకమైన డాల్డా బ్రాండ్‌లో వనస్పతి అనే శాకాహార కొవ్వు ఉందని వివాదం చెలరేగింది. టిటిడి అధికారులు ఈ వెజిటుబల్ ఫాట్ ఉందని తేలిన తర్వాత ఆ నెయ్యి సరఫరా చేసిన కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టారు. ఇదివరలో ఒక సంస్థ సరఫరా చేసిన 68వేల కిలోల నెయ్యిలో 20వేల కిలోలు నాణ్యత తక్కువగా ఉందని దానిని వెనక్కి తిప్పి పంపడమే కాదు, దానిని కూడా బ్లాక్‌లిస్ట్ పెట్టినట్టు ఆలయ నిర్వహణ అధికారి జె.శ్యామలరావు తెలిపారు. అయితే ఇన్నాళ్లూ వెజిటబుల్ కొవ్వుల గురించే ఆందోళన ఉండేది. కాని మొదటిసారి చంద్రబాబు లడ్డు తయారీలో జంతువుల కొవ్వు ప్రస్తావించి ఆలయ అధికారులను నిశ్చేష్టపరిచారు.
చంద్రబాబు నాయుడుకు కప్పదాటు రాజకీయాల గురించి అందరికీ తెలిసిందే. రాజకీయాలలో లబ్ది కోసం లడ్డు తయారీలో జంతువుల కొవ్వు ప్రస్తావించి ఆలయ అధికారులను నిశ్చేష్టపరిచారు. అవసరానికి అనుగుణంగా నాలుకను ఎటు పడితే అటు తిప్పడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని దేశంలో ఉన్న అందరు రాజకీయ నాయకులకూ తెలిసిందే. 1999 ఎన్నికలలో ఎన్‌డిఏతో జట్టుకట్టి కార్గిల్ వార్ నేపథ్యాన్ని తనకు అనుకూలంగా వాడదలచుకున్నారు. అప్పుడు ఆ పాచిక పారలేదు. మరో ఎన్నికలలో ఎన్‌డీఏ కటీఫ్ చెప్పారు. రాహుల్‌గాంధీతో రాసుకుపూసుకు తిరగడమే కాక, నరేంద్ర మోదీని నోటికి వచ్చినట్టు తాను తిట్టడమే కాకుండా, ఇతరులతో తిట్టించడానికి కొత్తఢల్లీిలో ఒక రోజంతా కార్యక్రమం పెట్టించి, జాతీయ మీడియా అటెన్షన్ పొందారు. అయినా అలాంటివేమీ పట్టించుకోకుండా, 2024 ఎన్నికలలో ఎన్డీయేతో జట్టుకట్టారు. గెలవడం కోసం దేనికైనా తెగిస్తారనే గొప్ప చరిత్ర గల చంద్రబాబు సరిగ్గా 100 రోజుల పాలన పూర్తయిన రోజునే ఈ వివాదాస్పద వ్యాఖ్యను ఎంచుకోవడానికి కారణాలు మనం అన్వేషించాలి. ఈ విషయమై ‘ది వైర్’తో తెలంగాణ కాంగ్రెస్ జాతీయ సమన్వయకర్త శ్రీధర్ రామస్వామి మాట్లాడుతూ 2004 నుంచి 2009 మధ్య తొలిసారి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే తరహాలో చంద్రబాబు చేసిన దుష్ప్రచారాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పటికి వాట్సప్, ఇతర సోషల్ మీడియా ఇంత విపరీతంగా లేని రోజులలో కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారన్నారు. ఈ దేశంలో హిందువులను క్రిస్టియన్లుగా మతం మార్చడానికి వాటికన్ సిటీలో పోప్‌నుంచి సోనియా గాంధీ కొన్ని రహస్య సందేశాలు అందుకున్నారని, ఆ బాధ్యతను క్రైస్తవ మతానికి చెందిన వైఎస్ రాజశేఖర రెడ్డికి అప్పజెప్పారని వదంతులు లేవనెత్తారు. అక్కడితో ఆగకుండా తిరుమల తిరుపతికి చెందిన ఏడు కొండలలో మూడిరటిని వివిధ చర్చిలకు ధారాదత్తం చేస్తున్నట్టు పుకార్లు లేవదీశారు.
సుద్దపూస చంద్రబాబు సూక్తులు
2021లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మతపరమైన మార్పిడులకు సహకరిస్తున్నారంటూ చంద్రబాబు అభియోగం మోపారు. విజయనగరం జిల్లా రామతీర్ధాలలో రాముడి విగ్రహం పగిలిపోయినప్పుడు, సంఘటన స్థలాన్ని సందర్శించిన అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకూ 127 హిందూ దేవాలయాలపై దాడులు జరిగినట్టు ఫిర్యాదు చేస్తూ హిందువుల మనోభావాలతో ముఖ్యమంత్రి ఆడుకుంటున్నారని విమర్శించారు. ఆయన అక్కడితో ఆగకుండా, హిందే దేవాలయాలను నిర్లక్ష్యం చేస్తూ, మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారని చెరిగిపారేశారు. పలుమార్లు జగన్ క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తిగా, ఆయన వ్యక్తిగత మత విశ్వాసాన్ని సభలలో ప్రసంగిస్తూ, ప్రణాళికాబద్ధంగా ఆయనపై బురద జల్లడాన్ని మనం గమనించవచ్చు. మరో సందర్భంలో టిడిపి పార్టీ సమావేశంలో వైఎస్ జగన్ మత విశ్వాసాలపై బహిరంగంగా బురద జల్లడానికి ప్రయత్నించారు. ‘‘నా ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. నీ ఆరాధ్య దైవం జీసస్ క్రైస్ట్. నువ్వు ఎన్నికలలో గెలిస్తే జెరూసలెం వెళ్తావు, అదే నేను తెలిస్తే తిరుపతి వెళ్తాను. నీతో ఎప్పుడూ బైబిల్ ఉంటుంది. అందులో తప్పేమీ లేకపోవచ్చు. కానీ, హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు మాత్రం నేను ఉపేక్షించేది లేదు’’ అంటూ విరుచుకుపడ్డారు. ఇదంతా ప్రజలలో నెమ్మదిగా జగన్మోహన్ రెడ్డి అనుసరించే మతం గురించి ప్రజల మనస్సులలోకి ఎక్కించడానికే అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
సీనియర్ రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ కె.నాగేశ్వర్ ఈ విషయమై మాట్లాడుతూ, ‘‘రాజకీయ వ్యాఖ్యలు నాలుగు రోజులకు ప్రజలు మర్చిపోతారు. వారిని వీరు, వీరిని వారు ఎన్నయినా అనుకోవచ్చు. కాని, చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. వాటిని అంత సులువుగా వారు మర్చిపోలేరు. అందువల్ల దీనిమీద పూర్తిస్థాయి విచారణ జరిగి నిజానిజాలు తేల్చాలి’’ అని కోరారు. ఎటువంటి ఆధారాలతో ముఖ్యమంత్రి ఆవిధంగా మాట్లాడారు? ఎవరితో న్యాయ విచారణ జరిపించారు? ఏ విధమైన సాక్ష్యాలు ఆయన వద్దనున్నాయి? ఇంతకీ తిరుమల పోలీస్ స్టేషనులో ఇప్పటివరకూ కేసు ఫైల్ చేశారా? ఎవరిని నిందితులుగా చేర్చారు? ఇవి చాలా ముఖ్యమైన విషయాలని చెప్పారు. విహెచ్‌పి లాంటి హిందూ సంస్థలు కూడా ఈ విధమైన డిమాండ్‌తో ఇంతవరకూ రాకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దీనినిబట్టి చూస్తే ఇదంతా పొలిటికల్ మైలేజీ కోసం సృష్టించిన టీ కప్పులో తుపానులాగా కనిపిస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ది వైర్ సౌజన్యంతో..
Comments