top of page

బాబును చూసి నేర్చుకోండి!

Writer: ADMINADMIN
  • 18న కూటమి నాయకులతో చంద్రబాబు సమావేశం

  • ఇసుక, మద్యం దందాలపై క్లాస్‌ పీకే అవకాశం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఆంధ్రప్రదేశ్‌లో లీడర్‌ లేని సమాజం సృష్టించాలని ప్రయత్నం చేసిన జగన్‌ మోహన్‌ రెడ్డికి ఆదిలోనే హంసపాదు ఎదురయింది. క్యాడర్‌ లెస్‌ పార్టీ చేయడమే అజెండాగా ఐదేళ్లు పరిపాలన చేసిన జగన్‌ మోహన్‌ రెడ్డికి ఎన్నికల్లో ప్రజలు కొట్టిన దెబ్బకు దిమ్మె తిరిగి నా అక్క చెల్లమ్మల ఓట్లు ఎక్కడకి పోయాయి అనే పరిస్థితిలోకి వెళ్లారు. క్యాడర్‌ లేకుండా ఐదేళ్లు పాలించిన జగన్‌ ఓడిపోయాక కూడా ‘మా ప్రభుత్వంలో తప్పులు జరిగాయి. సరిదిద్దుకుంటా, మరోసారి తప్పు జరగకుండా చూసుకుంటా. క్యాడర్‌కు అన్యాయం జరిగింది, ఇంకోసారి న్యాయం చేస్తా’ అనే మాటలు రాలేదని ఒక పక్క క్యాడర్‌ దుమ్మెత్తిపోస్తున్నా జగన్‌ ఇంకా భ్రమ నుంచి బయటికి రాలేదు. జగన్‌ కావచ్చు, జగన్‌ కోటరీ కావచ్చు మాకు క్యాడర్‌ అవసరం లేదు అనుకున్నాక ఎన్నికల్లో క్యాడర్‌ పోరాటం చేయకుండా గాలికి వదిలేశారు. జగన్‌ కార్యకర్తలను నా కుటుంబం అంటూ వాడుకొని అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను గాలికి వదిలేసిన జగన్‌ మోహన్‌ రెడ్డిని వైకాపా క్యాడర్‌ నమ్మే సాహసం చేయడం లేదని వైకాపా కార్యకర్తలు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఒకటే ఎన్నికల్లో గెలిపిస్తే ఈ దేశంలో చాలామంది ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యేవారు. జగన్‌ మోహన్‌ రెడ్డికి హర్యానా ఎన్నికలు చూసాక ప్రభుత్వ వ్యతిరేకత ఒక్కటే ఎన్నికలు గెలిపించదని క్లారిటీ వచ్చిఉండాలి. టీడీపీ కూటమి ఎమ్మెల్యేల మీద విపరీతమైన ఆరోపణలు రావడంతో ఈ నెల 18న సీఎం చంద్రబాబు క్లాస్‌ తీసుకుంటారని పొలిటికల్‌ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతుంది. టీడీపీ అధిష్టానానికి టీడీపీ ఎమ్మెల్యేల మీద పలు రకాల దందాలు, ఎమ్మెల్యేల బంధువుల ప్రమేయం నియోజకవర్గాల్లో ఎక్కువ అయింది. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేలతో సమావేశం అయిన చంద్రబాబు వారికి పలు అంశాలపై క్లాసులు ఇచ్చారు. మద్యం షాపు యజమానులను బెదిరించిన పలువురు ఎమ్మెల్యేలకు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చినా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు చక్రం తిప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మద్యం, ఇసుక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు మరోసారి స్పష్టం చేయనున్నారు. అయినా చంద్రబాబు మాట ఎమ్మెల్యేలు వింటారా! వినే పరిస్థితులు ఎక్కడా కనపడటం లేదు. ఏపీలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. మద్యంపై 2 శాతం సెస్‌ విధిస్తూ జీవో జారీ చేసింది. డ్రగ్‌ రిహాబిలిటేషన్‌ సెస్‌ కింద దీన్ని వసూలు చేస్తుండగా, రూ.100 కోట్ల వరకు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇలా వచ్చిన నిధులను డ్రగ్స్‌ నియంత్రణ, రీహాబిలిటేషన్‌ కేంద్రాల కోసం ప్రభుత్వం వినియోగించనుంది. ఇక డ్రగ్స్‌ రీహాబిలిటేషన్‌ సెస్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. రేపటి నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. అదనపు ప్రివిలేజ్‌ ఫీజు కింద చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు పెంచుతూ సవరణ చేశారు. అంటే ఒకవేళ మద్యం బాటిల్‌ ఎమ్మార్పీ ధర రూ.150.50 ఉంటే.. దానిని రూ.160కి పెంచేలా అదనపు ప్రివిలేజ్‌ ఫీజు ఉంటుంది. విదేశీ మద్యం బాటిళ్లపై అదనపు ప్రివిలేజ్‌ ఫీజు కింద ఎమ్మార్పీ ధరలో చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు పెంచారు. మద్యం షాపుల టెండర్లలో కొన్నిచోట్ల ఏకపక్షంగా జరిగినా, కొన్ని చోట్ల వైకాపా నాయకులకు షాపులు వచ్చాయి. ఇక్కడ షాపులు వచ్చిన వైకాపా నాయకులు వైకాపా అధినేత జగన్‌ మీద తీవ్రమైన విమర్శలు చేయడం చర్చకు దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వారి కార్యకర్తల కోసం లిక్కర్‌ పాలసీ మార్చింది. వైకాపా ప్రభుత్వంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చిన.. లిక్కర్‌ షాపుల దగ్గర బడ్డీకొట్టు పెట్టుకునే అవకాశం కూడా ఇవ్వకుండా జగన్‌ నాశనం చేశారని వైకాపా కార్యకర్తలు వాపోతూ ఉన్నారు. వైకాపా ప్రభుత్వంలో నచ్చిన బ్రాండ్లు అమ్ముకొని వైకాపా పెద్ద తలకాయలకు కమీషన్‌ కొడితే పొద్దునే మార్కెట్‌లోకి బ్రాండ్లు వచ్చేవంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం కార్యకర్తలకు న్యాయం చేయాలనే ప్రయత్నం చేస్తే గత ప్రభుత్వం బేవరైజేస్‌ కంపెనీల నుంచి కమీషన్‌ దోచుకున్నారని వైకాపా కార్యకర్తల్లో చర్చ నడుస్తోంది. మాజీ సీఎం జగన్‌ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై లుకౌట్‌ నోటీసు ఉందని, అందువల్లే ఆయనను ఢల్లీి ఎయిర్‌ పోర్టులో అడ్డుకోవడం జరిగిందని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ ఈ లుకౌట్‌ నోటీసు జారీ చేసినట్లు చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి పోలీసులు తనకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని చెప్పడం జరిగింది. వైకాపా నేతలే లక్ష్యంగా వరుస అక్రమ కేసులతో వారిని వేధించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్త కుట్రలకు తెరతీస్తోంది అని వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి వాపోయారు. గత ప్రభుత్వంలో టీడీపీ నేతలను టార్గెట్‌ చేసుకొని వెంటాడి అరెస్ట్‌ చేసిన సందర్భాలు ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు చట్టం చుట్టం అవుతుందని వైకాపా నాయకులకు ఇప్పుడు అర్థం అవుతుంది.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page