top of page

బాబు! మారని మనిషి

Writer: NVS PRASADNVS PRASAD
  • ఇంకా అధికారుల చేతుల్లోనే అన్నీ

  • వైకాపాతో అంటకాగిన ఐఏఎస్‌లపై చర్యలు శూన్యం

  • ఫైబర్‌ కేసులో జీవీ రెడ్డి బలి

  • తెలుగు తమ్ముళ్లలో అంతర్మథనం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)
‘‘యుద్ధంలో అధినాయకుడు ఏం చెప్పినా వింటాం.. యుద్ధం ముగిశాక పరిణామాలు సైనికులకే తెలుస్తాయి.. నాయకుడు కచ్చితంగా సైనికులతో చర్చించాలి. అప్పుడే మరో యుద్ధానికి సిద్ధమవుతారు.’’
‘‘తప్పును ఇది తప్పు అని చెప్పడం క్రమశిక్షణ అతిక్రమణ అయితే.. ఫైళ్లు తగలబెట్టడం, భూదందా, దోపిడీ, అరాచకాలపై చర్యలు లేకపోవడాన్ని ఏమనాలో మాకు తెలీదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీలోకి వచ్చిన జీవీ రెడ్డికి, అదే కష్టకాలంలో వైకాపా కార్యాలయంలో మీటింగ్‌ పెట్టి ఆ పార్టీ కేడర్‌కు ఊతమిచ్చిన ఐఏఎస్‌కు ఒకటే ట్రీట్మెంటా?’’
‘‘గెలుపు నుంచి గెలుపు ఎందుకు కొనసాగడంలేదో ఒక్కసారి ఆలోచించండి. నారా లోకేష్‌ గారూ.. మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాం. మీ నాన్నగారి మీద మా గౌరవం ఎప్పటికీ తగ్గదు. ఆయనంతే.. ఆయన రాజకీయమూ అంతే.. అని ఎన్నోసార్లు మమ్మల్ని మేము సముదాయించుకుంటూవస్తున్నాం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన మాత్రమే చేశారు. అయితే పరిపాలనతో పాటు రాజకీయం కూడా ఉండాలని మా ఆకాంక్ష.’’

.. ఇవీ ఫైబర్‌నెట్‌ చైర్మన్‌గా జీవీ రెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేసిన తర్వాత తెలుగుదేశం సోషల్‌మీడియా పోస్టుల్లో కొన్ని. జీవీ రెడ్డి రాజీనామా ఎమ్మెల్సీ పోలింగ్‌కు ముందు వైకాపా ఆడిన కుట్రలో భాగమని ప్రచారం చేస్తున్నా తెలుగు తమ్ముళ్లు మాత్రం ఆత్మాభిమానం ఉన్న జీవీ రెడ్డికే మద్దతు తెలుపుతున్నారు. ఈ అంశం ఎమ్మెల్సీ ఎన్నికల మీద ప్రభావం చూపించకపోవచ్చు కానీ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదైనా తమకేమీ ఒనగూరలేదన్న భావనతో ఉన్న సగటు కార్యకర్తకు చంద్రబాబు మారలేదు. మరి మారరన్న సంకేతం పంపగలిగింది.

ఈ నేపథ్యంలో జాతీయ అధికార ప్రతినిధి, ప్రాథమిక సభ్యత్వంతో సహా ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌ పదవికి జీవీ రెడ్డి రాజీనామాతో కూటమి ప్రభుత్వం ప్రధానంగా టీడీపీ ఆత్మరక్షణలో పడిరది. టీ కప్పులో తుపానులా చల్లార్చాల్సిన వ్యవహారానికి ఆజ్యం పోశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అనేక ప్రభుత్వ కార్పొరేషన్లలో అధికారుల పెత్తనం వల్ల ప్రకంపనలు ఉన్నట్లు తెలుస్తోంది.

గత ఏడాది నవంబర్‌ 15న జీవీ రెడ్డి ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మూడు నెలల్లోనే ఆయన అనేక విషయాలు బయటపెట్టడంతో పాటు ప్రక్షాళన చేయాలనే వేగానికి కళ్లెం వేసినట్టు మారింది. దీంతో ‘సీఎం చంద్రబాబు మారని మనిషి’ అనే మాటను తలపిస్తున్నాయి. ‘అధికారుల పక్షపాతిగానే వ్యవహరిస్తున్నారు. పార్టీ శ్రేణుల స్థైర్యం దెబ్బతీసేవిగానే ఉన్నాయి’ అనే అపవాదు ఎదుర్కొంటున్నారు.

జీవీ రెడ్డి ప్రక్షాళన జరగాలని కోరుకున్నారు. ఆత్మగౌరవ సమస్య ఎదురైంది. ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన టీడీపీ అంకితభావంతో పనిచేసే కార్యకర్తకు ఎదురుదెబ్బ తగిలింది. సీఎం చంద్రబాబు చైర్మన్‌, ఎండీ మధ్య సమన్వయం చేయాల్సింది. ప్రతి సందర్భంలో కార్యకర్తలు తనకు ప్రాధాన్యం అని చెబుతూ వచ్చారు. అధికారంలోకి వచ్చాక కూడా చెప్పారు. ఈరోజు ఆ కార్యకర్త ఎక్కడికి వెళ్లారు. ఎప్పటిలాగే అధికారులు ముందుకు వస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో మొదటిసారి సీఎం అయిన సందర్భంలో ఆకస్మిక తనిఖీలతో సీఎం చంద్రబాబు అధికారులను పరుగులు పెట్టించారు. జన్మభూమి కార్యక్రమంతో పార్టీ క్యాడర్‌కు విశ్రాంతి లేకుండా చేశారు. ఆ తర్వాత టెలిఫోన్‌, వీడియో కాన్ఫరెన్స్‌తో జిల్లా అధికారులతో నేరుగా సంప్రదింపులు సాగించడం, టీడీపీ ఎంపీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేక గగ్గోలుపెట్టారు. ‘పనులపై కలెక్టర్‌, ఎస్పీల వద్దకు వెళితే.. మేము సీఎంతో మాట్లాడి చెబుతాం’ అనే సమాధానంతో ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మారారు. ఇదే సమయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ఒత్తిడి తట్టుకోలేని ఓ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ గుండెపోటుతో మరణించిన సంఘటన కలకలం రేపింది. అయినా, తన పంథాలో సాగిన చంద్రబాబు 2003లో తిరుపతి అలిపిరి సమీపంలో ల్యాండ్‌మైన్ల దాడికి గురయ్యే వరకు సాగించారు. వరుసగా పదేళ్లు టీడీపీ అధికారానికి దూరమైన సమయంలో హైదరాబాద్‌ ఇందిరాపార్కు సమీపంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన సభలో పార్టీ క్యాడర్‌ చంద్రబాబుపై తీరుపై నిప్పులు చెరిగింది. అప్పుడు ఆయన చెప్పిన మాట ఒకటే ‘ఔను నా వల్లే తప్పు జరిగింది. నన్ను నమ్మండి నేను మారతాను. ఇకపై సమష్టి నిర్ణయాలు తీసుకుందాం’ అని క్యాడర్‌ను దాదాపు బతిమాలినంత పనిచేశారు.

2009 ఎన్నికల్లో సీట్ల పంపిణీలో మళ్లీ పాత పద్ధతే అనుసరించారు. 2014లో బీజేపీ మిత్రపక్షంగా సీట్ల కేటాయింపులో టీడీపీ కోటలను వదులుకుని తప్పు చేశారనేది టీడీపీ నేతల విశ్లేషణ. అది వాస్తవం కూడా. 2019 ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించి, అధికారం పోయిన విషయాన్ని కూడా పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. 2014లో టీడీపీ అధికారంలో ఉండగా తిరుపతిలో జరిగిన టీడీపీ మహానాడులో అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి వేదికపైనే తనదైన శైలిలో దుమ్ము దులిపిన సంఘటన ప్రస్తావనార్హం. ‘అయ్యా చంద్రబాబు సార్‌.. ముందు నువ్వు ఆ వీడియో కాన్ఫరెన్సులు ఆపు సామీ. మా మాట ఒక్కడు వినడం లేదు. ఏదన్నా సిఫారసు చేస్తే, మేము సీఎంతో మాట్లాడతాం’ అని అంటున్నారని జేసీ నిరసన వ్యక్తం చేశారు.

‘టీడీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు గౌరవం ఉండాలంటే మీరు మారాలి సార్‌’ అని బాహాటంగానే వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. తాజాగా చర్చకు దారితీసిన ఘటన ఏపీ ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌గా నియమితులైన జీవీ రెడ్డి (జి.వెంకటరెడ్డి) ఆ సంస్థ జరుగుతున్న అక్రమాలు, వేతనాల చెల్లింపు వంటి అంశాలను బయటపెట్టారు. సంస్థను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగానే ఆలోచలు సాగించారనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కాగా, ఆ సంస్థ ఎండీ దినేష్‌ మధ్య సఖ్యత కొరవడిరది. రాజకీయ ప్రతినిధిగా ఉన్న చైర్మన్‌ హోదాలో ఉన్న జీవీ రెడ్డి ఆదేశాలు అమలుచేయని స్థితిలో, వారిద్దరి మధ్య యుద్ధమే సాగిన విషయం తెలిసిందే.

ఫైబర్‌ నెట్‌ ఎండీ దినేష్‌ రాజద్రోహానికి పాల్పడ్డారనే జీవీ రెడ్డి వ్యాఖ్యలు ఐఏఎస్‌ల ఆగ్రహానికి గురిచేసింది. ఆ తర్వాత సీఎం చంద్రబాబు మాట్లాడిన తర్వాత జీవీ రెడ్డి తన పదవి, అధికార ప్రతినిధి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడానికి దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే జీవీ రెడ్డి అర్ధంతరంగా పదవి, పార్టీ నుంచి నిష్క్రమించడం, టీడీపీలో ప్రకంపనలు సృష్టించింది.

గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా ‘నన్ను నమ్మండి’ అని ప్రతి సభలోనూ సీఎం చంద్రబాబు పదేపదే కోరారు. 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ కూటమి టీడీపీ 135 స్థానాలు, జనసేన 21, బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. వారిలో 83 మంది మొదటిసారి గెలిస్తే యువతే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మంత్రులే కాకుండా, కార్పొరేషన్‌ చైర్మన్లుగా యువకులకు కూడా ప్రాధాన్యం ఇచ్చిన విషయం తెలిసిందే. వారిలో ఎక్కువ మంది సీఎం చంద్రబాబు కొడుకు నారా లోకేష్‌ మద్దతుదారులే అనే మాట బలంగా వినిపిస్తోంది.

బాబు తీరు మారలేదా..

ప్రతి ఎన్నికల్లో సీఎం చంద్రబాబు అనుసరించే పద్ధతి. చేసే వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. ఈసారి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. షేక్‌ హ్యాండ్లు, ఆలింగనాలు, కార్యకర్తలకు దగ్గరికి వెళ్లడం, మాట్లాడడం వంటి చర్యలతో ‘చంద్రబాబు మారిన మనిషే’ అని అందరూ అనుకునే లోపే.. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటతో పెద్దబండ పడిరది. ఈ సంఘటనపై టీటీడీ పరిపాలనా భవనంలో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో శ్యామలరావుతో జరిగిన సమీక్ష దుమారం రేపింది. సీఎం సమక్షంలోనే చైర్మన్‌, ఈవో వాదులాడుకోవడం, చైర్మన్‌ నాయుడును ఉద్దేశించి ఈవో శ్యామలరావు నువ్వు.. నువ్వు అని సంబోధించారనే వ్యవహారంలో ఇద్దరు ఘర్షణ పడినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో కూడా సీఎం చంద్రబాబు టీటీడీ ఈఓకు మద్దతుగానే నిలిచి, కలసి పని చేయాలని హితోపదేశం చేశారు. తాజాగా ఫైబర్‌ నెట్‌ మాజీ చైర్మన్‌ జీవీ రెడ్డి వ్యవహారంలో కూడా ఇదే జరిగింది. సీఎం చంద్రబాబు అధికారుల పక్షంగా వ్యవహరించడం పార్టీ క్యాడర్‌ ప్రధానంగా ప్రజాప్రతినిధులు, వారికి సమాన క్యాబినెట్‌ హోదాకు తగిన పదవుల్లో ఉన్న నేతలు కూడా ఇబ్బందులు పడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో కూడా గుంటూరు కమిషనర్‌గా ఉన్న ప్రవీణ్‌ ప్రకాష్‌ ఉన్న రోజుల్లో టీడీపీ మేయర్‌ ఏసురత్నంను అరెస్టు చేయించారు. అప్పుడు కూడా చంద్రబాబు ప్రవీణ్‌ ప్రకాష్‌ను సమర్థించారు. ఆ తర్వాత ప్రవీణ్‌ ప్రకాష్‌, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఏమి చేశారు? వారి నుంచి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేది చూశాం.

ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌ జీవీ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో అధికార ప్రతినిధి హోదాలో చురుగ్గా వ్యవహరించారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగానే ఆయన ఆ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. గణాంకాలతో సహా ప్రత్యర్థి పార్టీ నేతలను కట్టడి చేయడంలో చిన్నవయసులో మేథస్సు చాటేవారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఆయనకు ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌గా సీఎం చంద్రబాబు అవకాశం కల్పించారు. చిత్తశుద్ధితో పనిచేస్తారు. మాట్లాడతారనే పేరు సంపాదించుకున్న జీవీ రెడ్డి ఆడిటర్‌, న్యాయవాదిగా కూడా మంచి అనుభవం సాధించారు. అయితే. సీఎం చంద్రబాబు మానసపుత్రిక ఫైబర్‌ నెట్‌లో జరుగుతున్న అక్రమాలు, వైకాపా పాలనలో జరిగిన వ్యవహారాలను జీవీ రెడ్డి బయటపెట్టారు. సీఎం చంద్రబాబుకు ఆయనతో పాటు ఆ సంస్థ ఎండీ దినేష్‌ మధ్య అంతరం ఏర్పడిన నేపథ్యంలో ‘నేను కార్తకర్తకు ప్రాధాన్యం ఇస్తా’ అని చెప్పిన మాటకు భిన్నంగా ‘సీఎం అధికారి పక్షం వహించారు’ అనే అపవాదుకు గురయ్యారు. అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల వ్యవధిలో రెండు సంఘటనల సందర్భంగా కూడా పార్టీ ప్రతినిధులే ఇబ్బందిపడ్డారు. దీనిద్వారా చంద్రబాబు పద్ధతి మార్చుకోరా? పరిస్థితి ఇలాగే ఉంటే.. మమ్మల్ని ఖాతరు చేసే అధికారి ఉండరేమో అని మిగతా కార్పొరేషన్‌ చైర్మన్ల అంతర్మథనానికి గురవుతున్నారు. ఫైబర్‌ నెట్‌ ఘటన ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలో పడేసినట్లే భావిస్తున్నారు. అధికారంలో లేనప్పుడు చంద్రబాబు మాటలకు పదవిలోకి వచ్చాక చేసే తీరులో చాలా వ్యత్యాసం ఉంటోందనే భావన వ్యక్తం అవుతోంది.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page