top of page

బొమ్మను నమ్మి.. బోర్లాపడ్డారు!

Writer: NVS PRASADNVS PRASAD
  • `అంతా తానే అన్న భావనలో జగన్‌ వ్యవహారాలు

  • `తన ఫొటోనే గెలిపించేస్తుందన్న ధోరణి

  • `చివరికి సొంత తండ్రి సెంటిమెంటును విస్మరించారు

  • `సామాజికవర్గాన్ని, కార్యకర్తలను దూరం చేసుకున్నారు

  • `ఇప్పటికీ కోటరీ మాయలోనే ఉన్న వైకాపా అధినేత

  • `అదే కొనసాగితే వచ్చే ఎన్నికల్లోనూ గట్టెక్కడం కష్టమే

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జగన్‌ బలవంతుడు, మొండి ధైర్యం కలవాడు అని జనం ఎంత నమ్మారో.. అంతకు మించి రాజశేఖరరెడ్డి వారసుడు అని అనేకమంది నమ్మారు. రాజకీయాల్లో కులం అనేది చాలా బలమైనది. జగన్‌ అనుకున్న పేదలు, పెత్తందారుల నినాదంలో పెత్తందారులతో పాటు పేదలు కూడా కూటమి వెంట పోయారు. ఇది రాజకీయాల్లో సహజం. పులివెందుల లాంటి మాస్‌ ఏరియాలో రాజకీయాలు ఎలా ఉంటాయో చూసిన జగన్‌ అది మర్చిపోయి రాజకీయాల్లో మార్పు తెస్తా, నేను పెట్టినవాడే ఎమ్మెల్యే, నన్ను చూసి ఓటు వేస్తారు అనుకున్నారు. కానీ 2019లో జగన్‌కు ఇన్ని సీట్లు రావడం వెనుక రాజశేఖరరెడ్డి బొమ్మ ఉందన్న విషయం మర్చిపోయారు. టీడీపీ ఇప్పటికీ ఎన్టీఆర్‌ పేరును ఎందుకు వాడుతోందో జగన్‌ను అర్థం కాలేదు. చంద్రబాబుకు ఇష్టం లేకపోయినా ఎన్టీఆర్‌ అనే పేరు వెంటే ఈ రాష్ట్రంలో పది శాతం క్యాడర్‌ ఉంది. వారికి అభ్యర్థితో పని లేదు. కేవలం సైకిల్‌ గుర్తు, ఎన్టీఆర్‌ బొమ్మే ముఖ్యం. ఇప్పటికీ టీడీపీ మనుగడ సాగిస్తుండటానికి ఇవే ముఖ్యకారణం. నాయకులను మోసం చేసిన కార్యకర్తలు లేరు. కానీ కార్యకర్తలను మోసం చేసిన నాయకులు ఉన్నారు. ఇదే సూత్రం జగన్‌కు వర్తిస్తుంది. దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకుడు కూడా కార్యకర్తలను వదులుకోలేదు. ఐదేళ్లు అధికారంలో ఉండి లీడర్‌ను, క్యాడర్‌ను వదిలేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్‌రెడ్డే. సొంత బలం వల్లే కూటమికి 164 సీట్లు రాలేదు. కేవలం జగన్మోహన్‌రెడ్డి మీద ధ్వేషం వల్లే వారికి అన్ని సీట్లు వచ్చాయి. క్యాడర్‌లెస్‌ పార్టీకి, క్యాడర్‌ బేస్డ్‌ పార్టీకి ఉన్న తేడా ఏమిటో టీడీపీని చూసైనా నేర్చుకోవాలి. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోడానికి ప్రయత్నించకుండా ఇంకా భజన బృందం చెప్పిన మాటలు విని ఈవీఎంల మీదో, ఓటరు మీదో నెపాన్ని నెట్టేస్తే వచ్చేసారి కూడా ఫలితాలు ఇలానే ఉంటాయి.

వైఎస్‌ను విస్మరించారు

రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి సొంత సామాజికవర్గం ఓటర్లు ఒకవైపే ఓటేసినా మరో 40 సీట్లు వైకాపాకు వచ్చి ఉండేవి. కానీ అలా జరగలేదని ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. సొంత సామాజికవర్గమే ఆయనకు ఓటేయలేదన్న బాధ జగన్‌కు కూడా ఉన్నట్లుంది. ఎందుకంటే అసెంబ్లీలో శుక్రవారం నాటి ప్రమాణస్వీకారంలో జగన్మోహన్‌రెడ్డి అని చెప్పాల్సిన చోట ముందు జగన్మోహన్‌ అనే తనకు తాను చెప్పుకున్నారు. అసలు రెడ్లయినా జగన్‌కు ఎందుకు ఓటేయాలి? ఆయన పాలనలో రెడ్లే ఎక్కువగా నష్టపోయారని ‘సత్యం’ అనేకమార్లు చెప్పింది. వాస్తవానికి రాష్ట్రంలో రెడ్డి సామాజికవర్గాన్ని ఒక్క తాటిమీదకు తెచ్చేందుకు స్వర్గీయ రాజశేఖరరెడ్డికి 20 ఏళ్లు పట్టింది. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు రెడ్లు ఎక్కువగా కాంగ్రెస్‌తో ఉండేవారు. కానీ టీడీపీ వచ్చిన తర్వాత ఈ సామాజికవర్గం సగానికి పైగా టీడీపీ వైపు వెళ్లిపోయింది. 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాల్లో ఒకసారి ఎనిమిది, మరోసారి తొమ్మిది స్థానాలు టీడీపీ గెలుచుకుంది. విచిత్రమేమిటంటే.. ఆ సమయంలో రాజశేఖరరెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. 1999 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు పాలనలో వైఫల్యాలు ఎండగట్టడం, 2004 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌ సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించడంతో మళ్లీ రెడ్లను కాంగ్రెస్‌ వైపు తిప్పగలిగారు. 2014, 2019 ఎన్నికల్లో ఈ సామాజికవర్గం జగన్మోహన్‌రెడ్డికి అండగానే ఉంది. కావాలంటే రెడ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల డేటా చూడవచ్చు. కానీ 2019లో జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అవలంభించిన విధానాలు ఆ సామాజికవర్గాన్ని రాజకీయంగా, ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. ఒక్క ఓటు కూడా వేయించలేని రద్దుగాళ్లందరూ జగన్‌ పక్కన చేరి దొంగ కాంట్రాక్టులు చేయడమే కాకుండా రియల్‌ ఎస్టేట్‌, ఇసుక, మద్యం, మైనింగ్‌, మరీ ముఖ్యంగా గ్రానైట్‌ వ్యాపారాల్లో ఉన్న రెడ్లందర్నీ వేధించి, వెంటాడి మరీ వేటాడారు. ఇక రాజకీయంగా చూస్తే ముఖ్యమంత్రి మొదలుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర పదవులు పొందిన ఏ వైకాపా నాయకుడు కూడా రెడ్ల మొహం చూడ్డానికి ఇష్టపడలేదు. టీడీపీని కాదని జగన్మోహన్‌రెడ్డిని గెలిపించినందుకు తమకు తగిన శాస్తి జరిగిందని రెడ్లు భావించారు.

సొంత సామాజికవర్గాన్నే వేధించారు

గ్రామాల్లో సచివాలయాలు కట్టినవారికి బిల్లులు ఇవ్వకపోవడంతో సామాన్య కార్యకర్తలు చితికిపోయారు. అన్నింటికంటే పెద్ద నేరమేమిటంటే.. ముప్ఫై నలభై ఏళ్లుగా వైఎస్‌ కుటుంబానికి అభిమానులుగా ఉన్నవారి భూములు సైతం దోచుకునేందుకు వైకాపా నాయకులు వెనుకాడలేదు. తాము గెలిపించిన నాయకుడే తమ భూముల మీద కన్నేస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక నలిగిపోయారు. ఎమ్మెల్యేలు, మంత్రులు లాంటి వారికే జగన్మోహన్‌రెడ్డి దర్శనభాగ్యం లేకపోతే సామాన్య కార్యకర్త పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డి మళ్లీ విజయం సాధిస్తే ఆయన విధానమే కరెక్ట్‌ అని ప్రజలు భావించి ఓటేశారని, మళ్లీ పాత పంథానే అవలంభిస్తారని రెడ్డి సామాజికవర్గం భయపడిరది. మళ్లీ జగన్మోహన్‌రెడ్డి వస్తే తాము పూర్తిగా పాతాళంలోకి వెళ్లిపోతామని భావించింది. చాలామంది టీడీపీలో చేరిపోయారు. కొందరికి మనసురాక సైలెంట్‌గా ఉండిపోయారు. 2009లో రాజశేఖరరెడ్డి మరణం తర్వాత 2019 ఎన్నికల వరకు తనను భుజాల మీద మోసిన ఏ వర్గాన్నీ జగన్మోహన్‌రెడ్డి మిగుల్చుకోలేదు. గత ఎన్నికల్లో 40 శాతం ప్రజలు ఓట్లేశారని జగన్మోహన్‌రెడ్డి భుజాలు చర్చుకుంటున్నారు. అలాకాకుండా ఓటమికి కారణమైన 11 శాతం మంది ఓటర్లెవరో తెలుసుకుంటే బాగుంటుంది. వారిలో సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు, మద్యం ప్రియులు, అభివృద్ధిని కోరుకునేవారు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. అలాగే కాంట్రాక్టర్లు, రియల్టర్లు, వ్యాపారులు, చంద్రబాబు పథకాలకు ఆకర్షితులైనవారు కూడా ఉన్నారు. ఇసుక సమస్యతో ఉపాధి కోల్పోయిన కూలీలు, వైకాపా నాయకుల బాధితులు, హిందూ మతానికి నష్టం జరుగుతుందని భావించినవారు ఉన్నారు. వీరందరినీ పెత్తందారులనే ముసుగువేసి పక్కన పెట్టేయకుండా ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పటికైనా డబ్బు తీసుకుని పనిచేసే ఐప్యాక్‌ల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని గ్రహించాలి. సోషల్‌ మీడియాలో ప్రతిదానిపైనా విరుచుకుపడిపోయే పేటీఎం బ్యాచ్‌ వల్ల మేలు జరగదని తెలుసుకోవాలి.

ఆంధ్ర తెరపై తమిళ సీను

గతంలో ప్రజావేదిక కూల్చివేతతో వైకాపా ప్రభుత్వం ప్రారంభం కావడం.. నేడు వైకాపా కేంద్ర కార్యాలయాన్నే కూల్చడం చూస్తే ముఖ్యమంత్రులు మారారు.. మిగిలినదంతా సేమ్‌ టు సేమ్‌గా కనిపిస్తుంది. తమిళనాడు రాజకీయాలు ఆంధ్రాకు వచ్చేశాయి. జయలలిత వర్సెస్‌ కరుణానిధి అక్కడైతే.. జగన్‌ వర్సెస్‌ చంద్రబాబు ఇక్కడ. రాబోయే రోజుల్లో ఇదే రాజకీయం కొనసాగుతుంది. అందులో డౌటే లేదు. ప్రజావేదిక కూల్చినప్పుడు అక్రమ కట్టడమని ముద్ర వేసినట్లే ఇప్పుడు వైకాపా కేంద్ర కార్యాలయానికీ అదే ముసుగు తొడిగారు. ఈ లెక్కన గత ఐదేళ్లలో వైకాపా చేసిన ప్రతి పనికి ప్రతిచర్య ఉంటుందని అర్థమవుతుంది. తాను దాదాపు 30 ఏళ్లు అధికారంలో ఉంటానని జగన్మోహన్‌రెడ్డి భావించారు. కానీ ఐదేళ్ల కాలానికే ఆయన చాలా తొందరపడ్డారు. చంద్రబాబును అరెస్టు చేసినా ప్రజల్లో ఆయనకు సానుభూతి రాలేదని వైకాపా ప్రకటించినప్పుడే జనం నాడి అర్థం కావడంలేదని తేలిపోయింది. కేవలం ఐదేళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించినందుకు అన్ని జిల్లాల్లోనూ వైకాపా కార్యాలయాలు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం కొంత నయం. 1983 తర్వాత నాలుగుసార్లు మాత్రమే అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ 2014`19 మధ్య మాత్రమే శ్రీకాకుళంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకుంది. ఆ మాటకొస్తే అనేక జిల్లాల్లో ఇప్పటికీ టీడీపీకి సొంత కార్యాలయం లేదు. కానీ వైకాపా ప్రతి జిల్లాలోనూ ప్యాలెస్‌ల స్థాయిలో కార్యాలయాలు నిర్మించుకోవడం వెనుక ఏకవ్యక్తి పాలనలో ఉన్న పార్టీ ఆస్తులు ఆ వ్యక్తి సొంతమవుతాయి కాబట్టి దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకునే వ్యూహం ఉందని భావించాలి. జగన్మోహన్‌రెడ్డికి ఓడిపోతాననే భావన లేకపోవడం వల్లే ఎక్కడికక్కడ ఇష్టారాజ్యంగా కార్యాలయాలు కట్టుకుంటూపోయారు. ఇందుకు కారణం భజనపరులే. రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాలు మాత్రమే చేయాలి. భగవంతునితో పోల్చడం, భజనలు చేస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయి. చివరకు దేవుళ్లను తెచ్చి క్యాంప్‌ ఆఫీసులో సెట్టింగులు వేసి కూర్చోబెడితే ఇలాంటి ఫలితాలే వస్తాయి. నిస్వార్ధంగా పనిచేసే కార్యకర్తలకు, అభిమానులకు మించిన సజ్జల రామకృష్ణారెడ్లు ఉండరని తెలుసుకోవాలి. తమిళనాడులో శశికళ మాయలో పడి జయలలిత ఏ విధంగా సర్వనాశనమైందో గుర్తుంచుకోవాలి.

 
 
 

Komentarze


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page