top of page

బ్యాంకాక్‌లు, గోవాలు వద్దు.. గణగళ్లపేటే ముద్దు

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • అనుమతులు లేకుండా రిసార్ట్‌ల నిర్మాణం

  • వైకాపా హయాంలో మొదలైన బీజం

  • కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో గ్రామస్తుల ఫిర్యాదు

  • వ్యసనాలపై సొమ్ములేరుకోవడం వారికి అలవాటే



(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జిల్లా మొత్తానికి నగరంలో మురళీ థియేటర్‌ వెనుక గతంలో ఓ పేకాట క్లబ్‌ ఉండేది. అనేకమంది పోరాటాల ఫలితంగా దాన్ని అప్పటి డీఎస్పీ పనసారెడ్డి, ఎస్పీలు మూసివేయించారు. ఆ తర్వాత అనేకసార్లు రిక్రియేషన్‌ పేరుతో ఒక క్లబ్‌ను నగరంలో తెరవడానికి అప్పటి పేకాట క్లబ్‌లో సొమ్ములు చేసుకున్నవారంతా వీరప్రయత్నాలు చేశారు. కానీ అది సఫలం కాలేదు. ప్రస్తుతం పేకాట శిబిరాలను నిర్వహిస్తూ ఎవరెవరో సొమ్ములు సంపాదించుకుంటున్నారని తెలిసి గత ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు బీచ్‌ రిసార్ట్‌ పేరుతో ఓ కొత్త పేకాట క్లబ్‌ తెరవడానికి ప్రయత్నించారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో కూర్చొని తాగడానికి సరైన బార్‌ ఉండేదికాదు. ఇప్పటికీ నగరంలో, జిల్లాలో బార్ల పరిస్థితి అదే. ఎంచక్కా సముద్రం వైపు చూస్తూ నీటిలో తేలియాడుతూ మందు కొట్టడానికి ఒక భారీ బార్‌ కావాలని ఇదే వైకాపా నాయకులు భావించారు. దానికి కూడా రిసార్ట్‌ ముసుగే తొడిగారు. ఇక మసాజ్‌ల కోసం, పొందుల కోసం గోవా, బ్యాంకాక్‌లు వెళ్లి ఉత్తినే సొమ్ములు తగలేయడం కంటే అంతకంటే తక్కువ ధరకే తాము అన్నీ అందించవచ్చని గణగళ్లపేటలో ఎటువంటి అనుమతులు లేకుండా వైకాపా నాయకుల సిండికేట్‌ రిసార్ట్‌ నిర్మాణానికి పూనుకొంది. ఒకేసారి అన్ని దుర్‌ వ్యసనాల నుంచి సొమ్ములు చేసుకోవడమే ఈ రిసార్ట్‌ లక్ష్యమని, అందుకే సరైన రోడ్డు లేకపోయినా పోలీసుల బెడద ఉండదని అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దీనిపై మాట్లాడకపోవడానికి కారణం గడిచిన ఎన్నికల్లో వైకాపా నేతలు తెలుగు తమ్ముళ్లతో చేతులు కలపడమే. ఇప్పుడు రిసార్ట్‌ కథాకమామీషులోకి వెళితే..

గమ్‌ బీచ్‌ శాక్స్‌ అండ్‌ అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ పేరుతో ఒక రిసార్ట్‌ను శ్రీకాకుళం రూరల్‌ మండలం పెద్దగణగళ్లవానిపేట గ్రామం పరిధిలో సముద్రంలో నాగావళి కలిసే ప్రాంతం వద్ద నది కోతకు గురవుతున్న చోటకు 40 మీటర్ల దూరంలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇది 70 శాతం పూర్తయింది. దీనికి పంచాయతీ తీర్మానం లేదని గ్రామ సర్పంచ్‌, ఎంపీటీసీలు కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకొని ఏర్పాటు చేసినట్టు చెబుతున్న గమ్‌ బీచ్‌ శాక్స్‌ అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారని గ్రామంలోని యువత ఆరోపిస్తున్నారు. పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో సీఆర్‌జెడ్‌ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన గమ్‌ బీచ్‌ శాక్స్‌ను అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ వేదికగా కాకుండా ఒక రిసార్ట్‌ మాదిరిగా మార్చే ప్రయత్నం జరుగుతుందని, దీనికోసం సుమారు 3 ఎకరాల భూమిని ఆక్రమించారని ఆరోపిస్తున్నారు. దీనిపై పంచాయతీరాజ్‌ శాఖమంత్రి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేయడానికి ఆయన అపాయింట్‌మెంటన్‌ను తీసుకున్నట్టు తెలిసింది. ఇదే అంశంపై ఇదివరకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌తో పాటు కలెక్టర్‌, ఫారెస్టు, టూరిజం, మెరైన్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టరేట్‌ అధికారులు స్పందించి ఫిర్యాదుదారులకు మండల రెవెన్యూ అధికారుల ద్వారా ఎండార్స్‌మెంట్‌ పంపించారు. గమ్‌ బీచ్‌ శాక్స్‌ అండ్‌ అడ్వంచర్‌ స్పోర్ట్స్‌కు అనుమతులు ఎవరు ఇచ్చారో జిల్లా అధికారులకు స్పష్టత లేదని పెద్ద గణగళ్లవానిపేట గ్రామస్తులు చెబుతున్నారు.

సీఆర్‌జెడ్‌కు వ్యతిరేకంగా..

సీఆర్‌జెడ్‌ సడలించిన నిబంధనల ప్రకారం తీరానికి 50 మీటర్ల దూరంలో మాత్రమే తీరప్రాంత, సముద్ర జీవావరణ పరిరక్షణ, తీర ప్రాంతాల అభివృద్ధి, ఎకో టూరిజం, జీవనోపాధి అవకాశాల పెంపు, తీరప్రాంత వాసుల నిలకడైన అభివృద్ధికి సంబంధించిన వాటితో పాటు వ్యవసాయం, ఉద్యానవనాలు, తోటలు, పచ్చికబయళ్లు, ఉద్యానవనాలు, ఆటస్థలాలు, అటవీ, సముద్రపు నీటి నుంచి ఉప్పు తయారీకి మాత్రమే అనుమతిస్తారు. పర్యాటకులు, సందర్శకుల కోసం తాత్కాలిక ప్రాతిపదికన హోటళ్లు, బీచ్‌ రిసార్ట్‌ల నిర్మాణానికి పర్యావరణ మంత్రిత్వ శాఖ, అటవీ శాఖ ముందస్తు అనుమతితో 200 నుంచి 500 మీటర్ల నిర్దేశిత ప్రాంతాల్లో హై టైడ్‌ లైన్‌ మధ్య ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే పెద్దగనగళ్లవానిపేటలో వైకాపా హయాంలో విశాఖపట్నంలో నిర్వహించిన బిజినెస్‌ సమ్మీట్‌లో నగరానికి చెందిన రఫీ సహకారంతో ఎస్‌.తిరుమలరెడ్డి గమ్‌ బీచ్‌ శాక్స్‌ అండ్‌ అడ్వంచర్‌ స్పోర్ట్స్‌కు ఏర్పాటుకు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు నిర్మాణం చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసి హోటల్‌, రిసార్ట్‌, వసతి గదులు, పార్టీలు నిర్వహణకు స్టేజ్‌లు, రాత్రి బస చేయడానికి వసతులు ఏర్పాటు చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. సీఆర్‌జెడ్‌లో సిమెంట్‌ నిర్మాణాలు చేపట్టకూడదని నిబంధనలను గమ్‌ బీచ్‌ యాజమాన్యం పట్టించుకోలేదని గ్రామస్థులు చెబుతున్నారు. కోతకు గురికాకుండా రక్షణ గోడ నిర్మించాలన్న ప్రతిపాదన తయారు చేయడం కోసం ఇటీవల స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఈ ప్రాంతంలో పర్యటించిన కలెక్టర్‌ అక్కడ జరుగుతున్న గమ్‌ బీచ్‌ శాక్స్‌ అండ్‌ అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ నిర్మాణంపై ఆరా తీసి పరిశీలించారు. అయితే అప్పటి వరకు తీర ప్రాంతంలో ఒక నిర్మాణం జరుగుతున్నట్టు జిల్లా ఉన్నతాధికారులకు సమాచారమే లేదని తెలిసింది.

నది కోతకు గురైన ప్రాంతంలో..

గ్రామం పరిధిలో అక్రమంగా వెలిసిన రొయ్యల చెరువుల కారణంగా సముద్రంలో నాగావళి కలిసే ప్రాంతం వద్ద నది కోతకు గురై ప్రతి ఏడాది వరదల సమయంలో లోతట్టు ప్రాంతాలు నీటిలో మునుగుతున్నాయి. సీఆర్‌జెడ్‌ (తీరప్రాంత క్రమబద్ధీకరణ) పరిధిలో ఉండడంతో ఈ ప్రాంతంలో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. దీంతో నది కోతకు గురైన ప్రాంతానికి 200 అడుగుల దూరంలో టూరిజంలో భాగంగా పార్కును అభివృద్ధి చేయాలని పాలకులు నిర్ణయించారు. ఆతర్వాత ఈ ప్రతిపాదన మరుగున పడిపోయింది. ఆ తర్వాత టూరిజంలో భాగంగా గమ్‌ బీచ్‌ శాక్స్‌ అండ్‌ అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ పేరుతో ఒక నిర్మాణం చేయాలని మూడేళ్ల క్రితం నిర్ణయించారు. దీని నిర్మాణం కోసం పర్యాటక శాఖ ప్రతిపాదించిన సమయంలో నది కోతకు గురైన ప్రాంతానికి 200 మీటర్ల దూరంలో ఉండేది. ప్రస్తుతం ఈ నిర్మాణం నది కోతకు గురైనందున 40 మీటర్ల దూరంలో ఉంది. గమ్‌ బీచ్‌ శాక్స్‌ అండ్‌ అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ లాంటి ఈవెంట్‌లు నిర్వహించే సంస్థలు సర్వసాధారణంగా సీ బ్యాక్‌ వాటర్‌లో ఏర్పాటు చేయడానికి అనుమతులు మంజూరు చేస్తారు. ప్రస్తుతం గమ్‌ బీచ్‌ శాక్స్‌ అండ్‌ అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ పేరుతో చేస్తున్న నిర్మాణాలు డీప్‌ వాటర్‌ ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. పెద్దగనగళ్లవానిపేటలో డీప్‌ వాటర్‌ వచ్చే ప్రసక్తే లేదు. నిరంతరం ఆటు పోటు ఉంటుంది. వరదల సమయంలో నదీ ప్రవాహం దిశ మార్చుకొని గ్రామం చుట్టూ చేరుతుంది. దీనివల్ల భవిష్యత్తులో నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అనుమతులు ఉన్నాయి..

ఇప్పటికే సముద్రంలో నాగావళి కలిసే ప్రాంతం సమీపంలో అక్రమంగా రొయ్యల చెరువులు ఏర్పాటు చేయడం వల్ల ప్రతి ఏడాది నది కోతకు గురై ప్రవాహం దిశ మార్చుకుంటోంది. నది కోతకు గురికాకుండా రక్షణ గోడ నిర్మించాలని జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే సీఆర్‌జెడ్‌లో నిబంధనలకు విరుద్ధంగా గమ్‌ బీచ్‌ శాక్స్‌ అండ్‌ అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ పేరుతో ఒక రిసార్ట్‌ సిద్ధమవుతుంది. అయితే జిల్లా పర్యాటక శాఖ అధికారులు మాత్రం పంచాయతీ తీర్మానం తర్వాతే గమ్‌ బీచ్‌ శాక్స్‌ అండ్‌ అడ్వంచర్‌ స్పోర్ట్స్‌కు మూడు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించినట్టు చెబుతున్నారు. అడ్వంచర్‌ స్పోర్ట్స్‌తో పాటు బోటింగ్‌కు ప్రభుత్వంతో ఒప్పందం చేసకున్నారని చెబుతున్నారు. బోటింగ్‌కు మెరైన్‌ అధికారుల అనుమతులు మంజూరు కాలేదని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరైన తర్వాతనే నిర్మాణం చేపట్టినట్టు గమ్‌బీచ్‌ యజమాని తిరుమలరెడ్డి చెబుతున్నారు. నిర్మాణాన్ని కలెక్టర్‌ పరిశీలించి ఉగాది నాటికి అందుబాటులో తీసుకురావాలని సూచించారని చెబుతున్నారు. స్థానికులు మాత్రం పంచాయతీ తీర్మానం చేయకుండా రాజకీయ ప్రేరితమైన అక్రమ నిర్మాణం అధికారుల అండతో సీఆర్‌జెడ్‌లో చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page