`ఇదే స్టేట్‌బ్యాంకు రాజుగారి రీతి
`స్వప్నప్రియ కుటుంబంపై ఇప్పటికీ కక్ష
`చనిపోయిన ఆమె మట్టిఖర్చులూ ఇవ్వని కఠినాత్ముడు
`తన అనుయాయూలపై ఫిర్యాదులు మాత్రం బుట్టదాఖలు
`వెళ్లిపోయిన ఆర్‌ఎం లీలలపై ఇప్పటికీ అనుమానాల దొంతరలు

శ్రీకాకుళం రీజియన్‌లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలను తన సొంతానికి వాడుకోవడం.. దొరికిపోతే బ్రాంచి మేనేజర్లనో, ఇతర బలహీనులనో బలి చేయడం ఆర్.ఎం.గా పని చేసిన టీఆర్‌ఎం రాజుకు వెన్నతో పెట్టిన విద్య. గార ఎస్‌బీఐ బ్రాంచిలో తాకట్టు నగల మాయం కేసులో స్వప్నప్రియను బలిపశువును చేసి, ఆమె ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆ నేరాన్ని పూర్తిగా ఆమె కుటుంబం మీదకు నెట్టేసి ఆ ఇంటికి మగదిక్కుగా ఉన్న స్వప్నప్రియ సోదరుడ్ని జైలుకు పంపించినా కూడా ఇంకా మృతురాలి ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారు టీఆర్‌ఎం రాజు. స్వప్నప్రియ చనిపోయి ఇన్నాళ్లయినా కనీసం బ్యాంకు తరఫున ఇవ్వాల్సిన మట్టిఖర్చులను కూడా అప్పటి ఆర్‌ఎం రాజు మంజూరు చేయలేదు. సాధారణంగా ఉద్యోగులు మరణిస్తే 24 గంటల్లో దహన సంస్కార ఖర్చుల కింద బ్యాంకు యాజమాన్యం రూ.25వేల వరకు చెల్లిస్తుంది. కానీ స్వప్నప్రియ మట్టి ఖర్చులను ఇప్పటికీ ఇవ్వలేదంటే బయటకు రాదనుకున్న తాకట్టు బంగారం వ్యవహారం స్వప్నప్రియ ఆత్మహత్య వల్లే బయటి ప్రపంచానికి తెలిసిపోయిందన్న కోపంతో ఆర్‌ఎం రాజు ఉన్నట్లు అర్ధమవుతోంది.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

తన కుమార్తె దహన సంస్కార ఖర్చులు మంజూరు చేయాలని కోరుతూ స్వప్నప్రియ తల్లి ఆర్‌ఎంగా పని చేసిన టీఆర్‌ఎం రాజుకు అనేకసార్లు విన్నవించుకున్నారు. అయినా ఆయన స్పందించలేదు. ఫిబ్రవరి 20న మెయిల్ కూడా చేశారు. కానీ ఇప్పటి వరకు ఆర్‌ఎం రాజు దానికి రిప్లై ఇవ్వలేదు. కనీసం తన పైఅధికారులకు సైతం మట్టిఖర్చులు ఇవ్వాలన్న విషయం తెలియజేయలేదు. స్వప్నప్రియ ఆత్మహత్యకు ప్రధాన కారకుడు ఆర్‌ఎంగా పని చేసిన టీఆర్‌ఎం రాజేనని ఇప్పుడిప్పుడే ఆరోపణలు వినిపిస్తుండటంతో స్వప్నప్రియ తల్లి ధైర్యం చేసి ఏకంగా బ్యాంకు ఛైర్మన్‌కే మెయిల్ చేశారు. తానొక సీనియర్ సిటిజన్‌నని, మహిళనని కూడా చూడకుండా తన కూతురి దహన సంస్కారాల సొమ్ము కోసం టీఆర్‌ఎం రాజుకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని చైర్మన్‌కు పంపిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సాధారణంగా ఎస్‌బీఐ బ్రాంచిల్లో తాను ఆడమన్నట్లల్లా ఆడే చింతాడ శ్రీనివాసరావు లాంటి ఫీల్డ్ ఆఫీసర్లపై అనేక ఫిర్యాదులు టీఆర్‌ఎం రాజుకు గతంలో అందాయి. వాటికి రిప్లై ఇవ్వకుండా, పైఅధికారులకు తెలియజెప్పకుండా తన వద్దే అన్ని ఫిర్యాదులను తొక్కిపెట్టేసేవారు. వారితో ఆ పాపాలు చేయించింది టీఆర్‌ఎం రాజు కావడమే దానికి కారణం. ఇప్పుడు కొత్త గా వచ్చిన రీజనల్ మేనేజర్ ఆర్‌ఎం లాగిన్‌లో పడి ఉన్న ఫిర్యాదులను చూసి గుండె బాదుకుంటున్నట్లు భోగట్టా. వీటన్నిందిపై పైవారికి ఫిర్యాదులు చేయడం, లేదంటే స్థానికంగా విచారణ చేపట్టడం తన వల్ల కాదని, తనను ఇక్కడి నుంచి బదిలీపై పంపించేయాలని ఆయన గగ్గోలు పెడుతున్నట్లు తెలిసింది.
ఇప్పటికే సమాధానం లేని ప్రశ్నలెన్నో?
మరోవైపు స్వప్నప్రియ ఆత్మహత్య కేసును సాధారణ కేసుల్లాగే క్లోజ్ చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. ఎందుకంటే.. స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకోవడం, బ్యాంకులో బంగారం మాయం కావడం, ఆ కేసులో ఆమెను ఎ`1గా పోలీసులు పేర్కొనడంతో బంగారం మాయం చేసి, దాన్ని తిరిగి చెల్లించలేక స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకుంది తప్ప, ఇందులో కొత్త కోణమేమీ లేదని భావించి టూటౌన్ పోలీసులు ఈ కేసును క్లోజ్ చేశారు. అయితే ‘సత్యం’లో ఇటీవల ప్రచురితమైన కథనాలు స్వప్నప్రియ ఆత్మహత్య వెనుక వేరే కోణం ఉందని స్పష్టం చేయడంతో ఈ కేసును మరింత లోతుగా పరిశోధించాలంటూ టౌన్ డీఎస్పీ శృతి ఆ ఫైల్‌ను వెనక్కు తిప్పి పంపినట్లు తెలుస్తోంది. స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకోవడం వాస్తవం. గార బ్రాంచిలో తాకట్టు నగలు మాయమవడమూ వాస్తవం. అయితే ఇందులో ఎవరి పాత్ర ఎంత? స్వప్నప్రియ మాత్రమే ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? తాకట్టు పెట్టిన బంగారానికి సంబంధించిన నగదు ఎవరెవరి అకౌంట్లలోకి వెళ్లింది? టీఆర్‌ఎం రాజుకు కొత్త కారు కొని ఇచ్చిందెవరు? గార స్టేట్‌బ్యాంకు కుంభకోణం కేసులో సూత్రధారులు, పాత్రధారులకు ఎస్‌బీఐలో కాకుండా వేరే బ్యాంకులో ఉన్న అకౌంట్ల వివరాలు ఏమిటి? వారి కుటుంబ సభ్యులకు ఏయే బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయి? అందులోకి ట్రాన్స్‌ఫర్ అయిన నగదు ఎప్పుడు, ఎక్కడి నుంచి వచ్చింది? అనే అంశాల మీద పోలీసు దర్యాప్తు ప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుతానికి దోషులను పట్టేసుకున్నాం, బంగారాన్ని రికవరీ చేశాం అంటూ పోలీసులు కేసును క్లోజ్ చేయొచ్చు. కానీ ఈ వ్యవహారం ఎప్పటికైనా సూత్రధారులను, పాత్రదారులను విడిచిపెట్టేదిగా మాత్రం కనిపించడంలేదు.
` స్టేట్ బ్యాంకులో ఉండాల్సిన కొవ్వాడ అణువిద్యుత్ నిర్వాసితుల సొమ్ము ఏమైంది? అప్పటి కలెక్టర్ నివాస్ ఎస్‌బీఐ అధికారుల మీద ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు?
` మూలపేట నిర్వాసితుల సొమ్ము ఎస్‌బీఐ నుంచి ప్రైవేటు బ్యాంకులకు ఎందుకు తరలిపోయింది?
` బదిలీపై వెళ్లిపోయిన కలెక్టర్ లాఠకర్ టీఆర్‌ఎం రాజును ఏమన్నారు?
` జీరో అకౌంట్ పేరుతో విద్యార్థుల ఖాతాల్లో జరిగిన కుంభకోణాన్ని ప్రశ్నించిన యూనియన్ నాయకుడు ఏమైపోయారు? వీటన్నింటిపై కథనాలతో మళ్లీ కలుద్దాం.
Kommentare