top of page

బెయిలు లేని జైలు

Writer: ADMINADMIN

ప్రొఫసర్‌ సాయి బాబా మరణానికి ముందు నాగపూర్‌ జైలులో తాను ‘అండా సెల్‌’లో ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పారు. అండా సెల్‌ అంటే కోడి గుడ్డు ఆకారంలోని జైలుగది. మామూలు జైలు గదుల్లో 15 మంది దాకా ఖైదీలంటారు. గది కాదు.. అవి హాల్స్‌ లాగా ఉంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, కొంతమందిని ఏకాంత కారాగార వాసానికి గురిచేస్తారు. కొరడాతో రోజుకు వంద దెబ్బలు కొట్టినా మనిషి తట్టుకొంటాడు. ఏకాంత కారాగారం అంతకన్నా వంద రెట్లు అతి కిరాతకమైన హింస. కరుడుగట్టిన నేరస్తుడు సైతం రెండు మూడు రోజుల్లోనే బ్రేక్‌ డౌన్‌ స్టేజికొచ్చేస్తాడు. వ్యాకులత, మానసిక కుంగుబాటు, భ్రాంతి, ఆత్మహత్యా ఆలోచనలు, జ్ఞాపకశక్తి క్షీణించడం, ఆత్మన్యూనతా భావం, మతి స్థిమితం కోల్పోవడం, నిద్ర పట్టకపోవడం, బరువు తగ్గడం, గుండెవ్యాధులు, బీపీ, ఇమ్మ్యూనిటీ బలహీనపడడం, చూపు మందగించడం, వినికిడి లోపం.. ఇంకా చాలా ఉన్నాయి. ఉరేస్తే నిమిషంలో ప్రాణం పోతుంది. ఏకాంత కారాగారవాసం అంటే నిత్య నరకం. జైలు.. అక్కడ ఎలాంటి ఖైదీలకు ఏకాంత కారాగార శిక్ష విధిస్తారు? అనేది వేరే టాపిక్‌. ఈ పోస్ట్‌ స్వీయ ఏకాంత కారాగార శిక్ష విధించుకొంటున్న నాగరిక జీవుల గురించి.

పిల్లలు అమెరికాలో సెటిల్‌. ఉద్యోగం నుంచి రిటైర్‌. ఇంట్లో రెండు పండుటాకులు. మినీ అండా సెల్‌. ఆ అమ్మాయి బాగా చదివింది. పెళ్లి వద్దంది. అమెరికాలో పెద్ద కంపెనీలో జాబ్‌, వర్క్‌ ఫ్రొం హోమ్‌.. మినీ అండా సెల్‌. డబ్బున్న కుటుంబం.. పిల్లలిద్దరికీ హోమ్‌ స్కూలింగ్‌, ఆన్‌లైన్‌ క్లాసులు, మిగతా టైంలో వారు సెల్‌ఫోన్‌పై.. 90 శాతం అండా సెల్‌. కాంక్రీట్‌ జంగిల్‌లో పెద్ద అపార్ట్మెంట్‌లో నివాసం. అక్కడే సూపర్‌ మార్కెట్‌, క్లినిక్‌, ఒకప్పుడు హోటల్స్‌కు, పార్కులకు, సినిమా థియేటర్లకు వెళ్లేవారు. ఇప్పుడు స్మార్ట్‌ టీవీ, ఓటీపీ, జొమాటో.. 75 శాతం అండా సెల్‌. బంధువుల సంఖ్య తగ్గింది, తగ్గడం కాదు.. కాంటాక్ట్స్‌ పోయాయి. ఉన్నవారితో సంబంధాలు తక్కువ. సంవత్సరానికి ఒకసారి అయితే ఎక్కువ. ఆ టైంలో ఎవరి గొప్పలు వారు చెప్పుకోవడంలో బిజీ. అత్మీయ కలియికలు లేవు. ఫ్రండ్స్‌ ఉన్నారు. కానీ అవీ ప్లాస్టిక్‌ పువ్వులే.. మనసును సృజించవు. పిల్లలతో పలకరింపులు తక్కువ, స్కూల్‌ నుంచి వచ్చిందే.. ‘హోమ్‌వర్క్‌ ఉందా? పుస్తకం తీయి.. చదువు.. ఎన్ని మార్కులొచ్చాయి?’ ఇవే పలకరింపులు. బతుకే అండా సెల్‌ ఇంట్లో రెండు సోఫాలు.. భార్య అటువైపు రీల్స్‌ చూస్తూ, భర్త ఇటువైపు పాలిటిక్స్‌కు సంబంధించిన వీడియో చూస్త్తూ, బెడ్‌రూమ్‌లో కొడుకు పుస్తకాల మధ్య సెల్‌ఫోన్‌ వీడియో గేమ్‌ ఆడుతూ.. ప్రతి కొంపా ఒక అండా సెల్‌.

నక్సలైట్‌ నాయకుడో లేదా టెర్రరిస్ట్‌కు మాత్రం అదీ అరుదుగా ఎదురయ్యే అండా సెల్‌.. ఇప్పుడు ప్రతి ఇంట్లో. ప్రతి చేతిలో. చూడ్డానికి ఇది చేతిలో కానీ, మనిషి, మానవత్వం, ఆత్మీయత అన్నీ ఇందులో బందీ. ఒకప్పుడు మతి స్థిమితం కోల్పోయిన వారిని ఎర్రగడ్డకు పంపేవారు. ఇప్పుడు ప్రతి ఇల్లు ఒక ఎర్రగడ్డ, ఒక వైజాగ్‌. మనిషి సంఘజీవి. జట్టు, తెగ ఉమ్మడి కుటుంబం, కేంద్రక కుటుంబం. భూమిపై పడ్డప్పటి నుంచి భూమిలోనికి పోయేదాక నలుగురితో కలిసి బతికాడు. ఆధునికత పేరుతో సృష్టికి విరుద్ధంగా పయనిస్తున్నాడు. అందుకే కరోనా కాలం నుంచి ఇంగ్లీష్‌ భాషలో నాకు నచ్చని ఒకే ఒక మాట.. స్టే హోమ్‌.. స్టే సేఫ్‌.

సెల్‌ అంటే జైలుగది. జైలు నుంచి బయటకు రావడానికి పెరోల్‌, రెమిషన్‌, బెయిలు.. ఇది బెయిలు లేని జైలు. చంటి వయసు నుంచి మరణం దాక వెంటాడి వేటాడే జైలు. చేతిలో సెల్‌.. మనిషి నాట్‌ వెల్‌. అది కచ్చితంగా కిల్‌.. ఎంతమందికి అర్థం చేసుకొనే దిల్‌? నేను కూడా సెల్‌ఫోన్‌ వాడుతాను. సెల్‌ఫోన్‌ నన్ను వాడదు.

- అమర్నాథ్‌ వాసిరెడ్డి ఫేస్‌బుక్‌ వాల్‌ నుంచి..

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page