top of page

బేరం కుదిరిందా.. బ్రాంచిని మార్చెయ్‌!

Writer: ADMINADMIN
పాత ఆర్‌ఎం ఖాతాలో కొత్త లీల
(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శ్రీకాకుళంలో ఒక రీజియన్‌కు అధికారిగా వ్యవహరించిన టీఆర్‌ఎం రాజు బ్యాంకు పేరుతో సొమ్ములొచ్చే ఏ పనినీ విడిచిపెట్టలేదు. చివరకు తనవల్ల నిండుప్రాణం బలైపోయినా చలించలేదు. చివరకు బ్యాంకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఓ బ్రాంచిని సైతం మార్చేసి ఉన్నతాధికారులను ఏమార్చేశారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక డే అండ్‌ నైట్‌ కూడలి వద్ద బ్రిడ్జికి ఆనుకొని సెయింట్‌ జోసెఫ్‌ కాన్వెంట్‌కు వెళ్లే రోడ్డులో ఎస్‌బీఐ బ్రాంచి ఒకటి అప్పట్లో ఏర్పాటుచేశారు. దీని ఉద్దేశమేమిటంటే.. నగరంలో వర్తకులు అన్ని రోజులూ లావాదేవీలు నిర్వహించలేరని, ఆదివారం బ్యాంకు ఓపెన్‌గా ఉంటే డిపాజిట్లు, విత్‌డ్రాలకు వారికి అనుకూలంగా ఉంటుందని భావించి ఈ బ్రాంచిని ఏర్పాటుచేశారు. అంతేకాకుండా డే అండ్‌ నైట్‌ జంక్షన్‌ వద్ద ఆసుపత్రులు ఉండటంతో అందరికీ ఇది సౌకర్యంగా ఉంటుందని భావించారు. దీంతో స్వయంగా అప్పటి ఆర్థిక శాఖామంత్రి చిదంబరమే వర్చువల్‌ విధానంలో ఈ బ్రాంచిని ప్రారంభించారు. ఆదివారం పనిచేసి మంగళవారం సెలవు తీసుకునే ఈ బ్యాంకు ఖాతాదారులకు మంచి సేవలే అందించింది. కానీ ఆర్‌ఎం రాజు మాత్రం డే అండ్‌ నైట్‌ జంక్షన్‌లో నగరం నడిబొడ్డులో ఉండాల్సిన బ్రాంచిని ఇప్పుడు సింహద్వారం వద్దకు తరలించేశారు. కారణం.. ఈ భవనాన్ని అద్దెకు ఇచ్చినవారితో ఈయనకు కుదిరిన లాలూచీయేనని చెప్పుకుంటున్నారు. ఆర్‌ఎం వద్ద డ్రైవర్‌గా పని చేసిన వ్యక్తి సమీప బంధువుకు చెందిన ఈ భవనంలోకి బ్రాంచిని మార్చేశారు. నిబంధనల ప్రకారం ఉన్న బ్రాంచిని 300 మీటర్ల పరిధిలోనే మార్చాలి. కానీ 2 కిలోమీటర్ల అవతల ఎవరికీ ఉపయోగం లేని ప్రాంతంలో డే అండ్‌ నైట్‌ బ్రాంచిని మార్చేశారు. ఇదిలా ఉండగా పనితీరు సరిగా లేకపోయినా డబుల్‌`ఎ గ్రేడ్‌ ఇచ్చేసిన బ్రాంచిల్లో ప్రస్తుతం ఆడిట్‌ జరుగుతోంది. అదే సమయంలో జోనల్‌ కార్యాలయంలో ఆర్‌ఎం టీఆర్‌ఎం రాజుపై విచారణ ఇంకా కొనసాగుతుంది. శ్రీకాకుళం నుంచి తీసుకువచ్చి ఇంతవరకు తనకు పోస్టింగ్‌ ఇవ్వలేదని రాజు కోరినా విచారణ పూర్తయ్యే వరకు అటువంటి ఆశలు పెట్టుకోవద్దని బ్యాంకు ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది.



 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page