బాలయ్యా.. ఏమిటీ గోలయ్యా!
- Prasad Satyam
- Sep 26
- 3 min read
పవన్‌కు ఇరకాటం.. జగన్‌కు అవకాశం
దుమారం రేపుతున్న బాలకృష్ణ అసెంబ్లీ ప్రసంగం
నాడు తన అన్నను అవమానించారని పవన్ ప్రచారం
అదే విషయం అసెంబీల్లో ప్రస్తావన
దాన్ని విదేశాల నుంచే తీవ్రంగా ఖండిరచిన చిరంజీవి
దాంతో అయోమయంలో జనసేన, టీడీపీ వర్గాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించిన సినీనటుడు బాలకృష్ణ అసెంబ్లీకి హాజరుకావడమే చాలా తక్కువ. హాజరైనా మాట్లాడటం అంతకంటే అరుదు. అటువంటి బాలయ్య ఎట్టకేలకు అసెంబ్లీ వేదిక నోరువిప్పారు. అంతా గోలగోల చేసేశారు. బాలయ్యా ఏమిటీ గోలయ్యా? అనిపించేలా తమ పార్టీని, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేనానిని ఇరకాటంలోకి నెట్టేశారు. అంతేనా కూటమి ఉమ్మడి ప్రత్యర్థి అయిన వైకాపా అధినేత, మాజీ సీఎం జగన్‌ను తిట్టినట్లు కనిపించినా తన అనాలోచిత ప్రసంగంతో మేలు చేశారు. సినీ పరిశ్రమకు రాయితీలు, కొత్త సినిమాల విడుదల సందర్భంగా బెనిఫిట్ షోలు వేసుకునేందుకు, టికెట్ రేట్ల పెంపు విషయమై గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దకు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో తెలుగు సినీపరిశ్రమ ప్రతినిధి బృందం వెళ్లింది. అప్పట్లో అక్కడ ఏం జరిగిందన్నదానిపై రాజకీయ విమర్శలు చెలరేగాయి. ఎన్నికల అనంతరం అవి సద్దుమణిగినా.. మళ్లీ గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్ ఆనాటి ఉదంతాన్ని ప్రస్తావిస్తూ నాడు చిరంజీవి గట్టిగా చెప్పడంతోనే అప్పటి సీఎం వైఎస్ జగన్ దిగివచ్చి సినీపరిశ్రమకు అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. సభలోనే ఉన్న బాలకృష్ణ దీనిపై స్పందిస్తూ ‘నాడు చిరంజీవి చేసిందేమీ లేదని’ స్పష్టం చేశారు. ఆ సందర్భంగా చిరంజీవిని ఏకవచనంతో సంబోధించడం వివాదానికి దారితీసింది. ఇక తన ప్రసంగంలో ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్‌ను సైకో.. అంటూ దారుణంగా తూలనాడుతూనే జగన్ తీసుకున్న నిర్ణయాల్లో చిరంజీవి ప్రమేయం ఏమీ లేదని చెప్పారు. బాలకృష్ణ వాడే భాష, ధోరణి, తత్వం అదే. ఆయన బ్లడ్డు, బ్రీడు కూడా అదే. కానీ చిరంజీవిని తీసిపారేసే క్రమంలో ఒకరకంగా జగన్‌కు మేలు చేశారు.
జనసేన, టీడీపీ వాదనలకు విరుద్ధం
సినీ ప్రముఖులతో నాటి సీఎం జగన్ జరిపిన చర్చలపై ఇంతకాలం వైకాపా ఒక వాదన.. తెలుగుదేశం, జనసేనలు మరో వాదన వినిపిస్తూ వచ్చాయి. ‘జగన్ మా అన్న చిరంజీవిని పిలిచి మరీ అవమానించారు’ అని ఇన్నాళ్లుగా జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఆరోపిస్తున్నారు. దానికి టీడీపీ వంతపాడిరది. అందుకు తగినట్లే నందమూరి, నారా ఫ్యాన్స్, జనసేన, మెగా ఫ్యాన్స్ అందరూ అదే వాదనను వినిపిస్తూవచ్చారు. గురువారం అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ కూడా దాదాపు అదే విషయం చెబుతూ నాడు జగన్ సినీ పరిశ్రమకు ఏమీ చేయలేదన్నట్లు మాట్లాడారు. కానీ బాలకృష్ణ ఎందుకో చిరంజీవిని టార్గెట్ చేసే క్రమంలో జగన్‌కు ఆయాచితంగా మేలు చేశారు. అయితే విదేశాల్లో ఉన్నప్పటికీ చిరంజీవి ఈ వివాదంపై సత్వరమే స్పందించారు. అక్కడి నుంచే ఒక ప్రకటన విడుదల చేస్తూ జగన్ తనను అవమానించారనడంలో వాస్తవం లేదని తేల్చేశారు. ‘జగన్ ఇంటికి వెళ్లినప్పుడు నన్ను సాదరంగా ఆహ్వానించారు’ అని స్పష్టంగా పేర్కొన్నారు. అంటే చిరంజీవిని జగన్ అవమానించారని ఇన్నాళ్లూ ఆయన సోదరుడు పవన్‌కల్యాణ్, తదితరులు చేసిన ప్రచారాన్ని చిరంజీవే ఖండిరచినట్లయ్యింది. ఇన్నాళ్లూ ఈ ప్రచారంపై స్పందించని చిరంజీవి.. తాజాగా బాలకృష్ణ చేసిన పరుష వ్యాఖ్యల కారణంగానే ప్రకటన విడుదల చేసినట్లు కనిపిస్తోంది.
ఆరోపణలకు చిరు ఖండన
అంతేకాకుండా బాలకృష్ణ అసెంబ్లీలో తనపై చేసిన విమర్శలను ఖండిస్తూ చురకలు అంటించారు. ‘ఆనాడు నా చొరవ కారణంగానే నీ వీరసింహారెడ్డి, నా వాల్తేరు వీరయ్య సినిమాల టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు లభించిందని గుర్తుచేశారు. సామాన్యుడైనా, ముఖ్యమంత్రైనా గౌరవం ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే మాట్లాడతాను అంటూ అప్పట్లో జగన్ కలిసేముందు బాలకృష్ణకు కూడా ఫోన్ చేశాను. కానీ ఆయన దొరకలేదు, కుదరలేదు’ అని పేర్కొన్నారు. బాలకృష్ణ వాడిన భాషను ఖండిస్తూనే సినీ ఇండస్ట్రీ విషయంలో తను చొరవ తీసుకున్నా బాలకృష్ణ సహకరించకుండా తిరస్కరించారని కార్నర్ చేశారు. అంతేకాకుండా జగన్ తనను అవమానించారనేది అబద్ధమని వివరించారు.
కక్కలేని మింగలేని పరిస్థితి
నిజానికి చిరంజీవి తన సహజశైలికి భిన్నంగా ఇంత వేగంగా స్పందిస్తారని ఎవరూ అనుకోలేదు. పైగా తన విషయంలో తన తమ్ముడు ఇన్నాళ్లూ చేసిన ప్రచారాన్ని తానే ఖండిస్తారని కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ పరిణామాలతో బాలకృష్ణకు పోయేదేమీ లేదు. అతనంతే.. మారడు. చివరికి ఈ ఎపిసోడ్‌తో పవన్‌కల్యాణ్ ఇరుకున పడ్డారు. ఎలా స్పందించాలో అర్థంకాని పరిస్థితి. చిరంజీవి చెప్పినదాన్నీ ఖండిరచలేరు. అలాగని తన ప్రచారానికి విరుద్ధంగా ఉన్న చిరంజీవి వ్యాఖ్యలను ఆమోదించ లేరు. (ఎవరి దగ్గరా ప్రాధేయపడాల్సిన పని లేదని, రాయితీలు అడగడం ఇండస్ట్రీ హక్కు అనీ, చిరంజీవి అండ్ టీం జగన్ వద్దకు వెళ్లినప్పుడు పవన్ వ్యాఖ్యానించారు.) మరోవైపు బాలకృష్ణ అసెంబ్లీలో చెప్పిందంతా నిజమేనని కూడా అనలేరు. అందుకు తగినట్లే ప్రతిదానికీ సీరియస్‌గా రియాక్టయ్యే పవన్ ఫ్యాన్స్ సైలెంటుగా ఉండిపోయారు. ప్చ్.. ప్రస్తుతం ఓజాస్ గంభీర్‌కు ఎటూ తోచడం లేదు! జగన్ ఫ్యాన్స్ మాత్రం కాగల కార్యం బాలకృష్ణే తీర్చాడు అన్నట్లు హేపీ ఫీలవుతున్నారు. బాలకృష్ణ తన ప్రసంగంలో మరో విషయం ప్రస్తావిస్తూ ఏదో ఇష్యూలో ఎఫ్‌డీసీ లిస్ట్ ప్రిపేర్ చేస్తే అందులో తన పేరును తొమ్మిదో స్థానంలో పెట్టారని అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో తనను లైట్ తీసుకుంటున్నారని ఆ విధంగా బయటపెట్టుకున్నారు. సభలోనే మంత్రి కందుల దుర్గేష్‌ను నేరుగా ఆ విషయం ప్రశ్నించడమంటే పరోక్షంగా దుర్గేష్ బాస్ పవన్‌కళ్యాణ్‌ను అడగడమే కదా!










Comments