సీఎం హెచ్చరికలు పట్టించుకోని నేతలు
గొలుసు దుకాణాలకు వేలం పాటలు
4 నియోజకవర్గాల్లో ఎమ్మార్పీపై రూ.20 అదనం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

అధిక మొత్తంలో మద్యం అమ్ముకోవాలంటే బెల్టుషాపులే ప్రత్యామ్నాయ వ్యాపారంగా మద్యం వ్యాపారులు చూస్తున్నారు. మద్యం దుకాణాల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వాటాలున్న ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల సహకారంతో సాగిస్తున్న బెల్టు వ్యాపారంపై చర్యలు తీసుకునే సాహసం అధికారులు చేయలేరు. మద్యం వ్యాపారం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న నినాదం వెనుక బెల్టుషాపులే కీలకం. ప్రభుత్వం ఇచ్చిన మార్జిన్‌తో సరిపుచ్చుకునే వ్యాపారం కాదిది. కేవలం బ్యాక్‌డోర్ అమ్మకాల ద్వారా మాత్రమే ఇక్కడ వ్యాపారుడు సంపాదిస్తుంటాడు, ఎక్సైజ్ అధికారులు తాము కొనుక్కున్న ఆస్తులకు ఈఎంఐలు కడుతుంటారు. ఒక ఏరియాకు ఎన్ని వైన్‌షాపులు ఉండాలన్న లెక్క ప్రభుత్వం వద్ద లేకపోయినా, ఒక వైన్‌షాపు పరిధిలో ఎన్ని గ్రామాలకు బెల్టు ద్వారా మద్యం సరఫరా చేయొచ్చన్న లెక్క మాత్రం సిండికేట్ వద్ద ఉంటుంది. ఇందుకోసం పిల్లి తన పిల్లల్ని మార్చినట్టు షాపును కూడా బెల్టుకు అనుగుణంగా మార్చారంటే అది ఎంత పవర్‌ఫుల్లో అర్థం చేసుకోవచ్చు. ఇందుకు ఓ తాజా ఉదాహరణ చూద్దాం.
ఆమదాలవలస నియోజకవర్గం దూసికి కేటాయించిన మద్యం షాపు నెంబర్ 39ని తోటాడలో ఏర్పాటుచేశారు. కొత్తవలస, దూసిలో మద్యం షాపులు పక్కపక్కనే ఉండడం వల్ల మండలంలో బెల్ట్ షాపులకు మద్యం పంపిణీకి గ్రామాలు సర్దుబాటు కావడం లేదని శాశ్వత లైసెన్స్ జారీ చేసిన తర్వాత తోటాడ పంచాయతీ పరిధిలో వెంకటేశ్వర కాలనీ అపార్ట్‌మెంట్ల మధ్య పొలాల్లో కంటైనర్లలో మద్యం షాపు తెరిచారు. దీనివల్ల దూసి, కొత్తవలస షాపుల నుంచి బెల్టులకు వెళ్లే గ్రామాలు కాకుండా శ్రీకాకుళం నగరానికి ఆనుకొని ఉన్న తోటాడ, గోపీనగరం వంటి ప్రాంతాల బెల్ట్‌షాపులకు మద్యం డోర్ డెలివిరీ చేయడానికే ఈ వ్యవహారమంతా నడిచింది.
బెల్టుషాపులు తెరిస్తే బెల్టు తీస్తానంటూ ఈ నెల 1న ఈదుపురం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించిన రెండు రోజులకే గార మండలం రామచంద్రాపురం పంచాయతీ జొన్నలపాడులో ఐదు బెల్టుషాపుల నిర్వహణకు రెండేళ్లకు గానూ రూ.2 లక్షలకు గ్రామ పెద్దల సమక్షంలో వేలం పాట ఖరారు చేశారు. ముగ్గురు వ్యక్తులు తప్ప ఇంకెవరూ బెల్టుషాపులు పెట్టి మద్యం విక్రయించరాదని గ్రామంలో తీర్మానం చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలో పాతర్లపల్లిలో బెల్టు షాపు నిర్వహణకు ఏడాదికి రూ.16లక్షలు కట్టుబడిగా నిర్ణయించినట్లు తెలిసింది. లావేరు మండలం సుభద్రాపురంలో బెల్టుషాపు నిర్వహణకు రూ.4లక్షలు చెల్లించాలని గ్రామంలో తీర్మానం చేసుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ గ్రామాలన్నీ వైకాపాకు పట్టున్న గ్రామాలు కావడంతో అందరూ ఆ పార్టీ నాయకులు మద్యం బెల్ట్‌షాపులు తెరిచి అక్రమాలకు పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. బెల్టు దుకాణాలు తెరిచినా, అధిక ధరలకు మద్యాన్ని అమ్మినా పీడీ యాక్ట్ నమోదు చేసి జైల్లో పెడతామంటూ చంద్రబాబు హెచ్చరించినా మద్యం షాపుల్లో వాటాలు పెట్టిన టీడీపీ నాయకులు పెడచెవిన పెట్టారు. గతంలో మాదిరిగా గ్రామాల్లో బెల్ట్‌షాపులు తెరిచి మద్యం విక్రయిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు మాత్రం బెల్ట్‌షాపులు లేవని చెబుతున్నారు. బెల్ట్ షాపులను ప్రోత్సహించే మద్యం దుకాణాలు లైసెన్స్ రద్దు చేస్తామని చంద్రబాబు హెచ్చరికలను టీడీపీ నాయకులే పట్టించుకోవడం లేదు.
మద్యం వ్యాపారాన్ని అన్ని పార్టీల నాయకులు కలిసి చేసుకుంటున్నారు. గ్రామాల్లో బెల్టుషాపుల నిర్వహణలో అందరూ భాగస్వామ్యం కావాలి కాబట్టి అనివార్యంగా కూటమి నాయకులు, వైకాపా నాయకులనూ కలుపుకుపోతున్నారు. గ్రామాలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లు, వీధి శివార్లలో పాన్‌షాపుల్లో మద్యం దుకాణాలకు సమాంతరంగా బెల్టుషాపులు నడుస్తున్నాయి. గ్రామాల్లోనూ బెల్ట్‌షాపులకు వేలం అవకాశం ఇచ్చి వేలం పాట నిర్వహించడం వల్ల గ్రామానికి ఆదాయం సమకూరుతుందన్న ఆలోచనతో గ్రామ పెద్దలు ఉన్నారు. గ్రామ జనాభా, మద్యం డిమాండ్, గ్రామ దేవత ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో ఏకంగా వేలం నిర్వహిస్తున్నారు. అమ్మకాలపై 20 శాతం మార్జిన్ అనుకుంటే చేతికి 9 శాతమే వస్తోందని తేలడంతో బెల్ట్‌షాపులు తెరవడం అనివార్యమంటున్నారు. అలాగే టెక్కలి, నరసన్నపేట, ఆమదాలవలస లాంటి చోట్ల బాటిల్‌పై అదనంగా రూ.20 పెంచి విక్రయిస్తున్నారు.
గార మండలం జొన్నలపాడులో బెల్టు షాపులకు వేలం పాటలు నిర్వహించిన వైనం సోషల్ మీడియా, పత్రికల్లో వైరల్ కావడంతో అక్కడకు వెళ్లిన ఎక్సైజ్ అధికారులు ఏడు బాటిళ్లతో ఒకరు పట్టుబడినట్లు ఒక కేసు నమోదుచేశారు. మద్యాన్ని ఆదాయవనరుగా చూస్తున్న ఏ ప్రభుత్వమైనా భారీగా అమ్మకాలు జరగాలనే కోరుకుంటుంది. ఇందుకోసం నిబంధనలను సైతం చూసీచూడనట్లు పక్కన పెడుతుంది. మద్యం దుకాణాలను కేవలం కాంక్రీట్ గదుల్లోనే ఏర్పాటు చేయాలన్న నిబంధనను సడలించి రేకుల షెడ్డులు, కంటైనర్లలో ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిచ్చింది. అలాగే రూ.కోట్ల ఖర్చు చేసి వ్యాపారాలు చేసేవారంతా అధిక మొత్తంలో ఆదాయం సమకూరాలనే ఆకాంక్షతోనే ఉంటారు. కేవలం దుకాణాల్లో జరిగే అమ్మకాలనే నమ్ముకుంటే ప్రభుత్వ నిర్ణయాల వల్ల పెద్దగా లాభాలు వచ్చే పరిస్థితి ఉండదని చెబుతున్నారు.
Commentaires