
తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురి ప్రాణాలు పోయాయి. ఈ ఆలయానికి ఉన్న జాతీయ, అంత ర్జాతీయ పేరు ప్రఖ్యాతుల వల్ల ఈ సంఘటన మరింత సంచలనమైంది. దీనికి కొద్ది రోజుల ముందు ‘మా ఆలయాలను మాకే అప్పగించండి’ అని విజయవాడలో శంఖారావం పూరించిన పీఠాధిపతులు, మతాధిపతులు మాత్రం మరణించిన ఈ భక్తుల కుటుంబాల్లోని ఒక్కరిని కూడా పరామర్శించిన దాఖలా లేదు. వైకుంఠ దర్శనం కూడా వ్యాపారమేనా? వైకుంఠ దర్శనం కొద్దిమంది పూజారులు, అగ్రకులాల్లోని సంపన్నులు మాత్రమే చేసేదిగా ఉండేది. ప్రజలకు అంతగా తెలిసేది కాదు. అయితే ప్రచార ప్రభావంతో తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే రాష్ట్రంలో అనేక చిన్న, పెద్ద దేవాల యాల ముందు ఏడాదికేడాది భారీ క్యూలైన్లు పెరిగిపోతున్నాయి. దీనివల్ల ఆలయాలకు ఆదాయంతో పాటు అనేక వ్యాపారాలు పెరిగాయి. అందుకే ఒక్కరోజు జరగాల్సిన వైకుంఠ దర్శనాన్ని గత 25 ఏళ్లుగా ఆ మరుసటి రోజు ద్వాదశి రోజుకు పెంచి దేశ, విదేశాల్లో ప్రచారం చేశారు. మరింతగా రద్దీ పెరగడంతో ఈ ద్వారాన్ని ఏకంగా 10రోజుల వరకు తెరచివుంచాలని గత ప్రభుత్వ కాలంలో టిటిడి నిర్ణయించింది. అప్పటి వరకు రోజుకు 10వేల మందికి మాత్రమే ఉన్న దర్శన భాగ్యాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం 60 నుంచి 75వేల మందికి పెంచింది. అంటే 10 రోజుల్లో 7 లక్షల మంది వైకుంఠ ద్వారం ద్వార దర్శనం చేసుకోవచ్చు. ఒక్క వైకుంఠ దర్శనమే కాదు.. పుష్కరాలకు, కుంభ మేళాలకు, అయ్యప్ప, భవానీ, వేంకటేశ్వర మాలలు, ప్రవచన సభలకు, స్వస్థత సభలకు ఇలా ఒక్కటే మిటి భక్తి కార్యాలన్నింటికీ జనం పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. ప్రజల మనస్సుల్లో తరతరాలుగా నాటు కున్న విశ్వాసాన్ని వ్యాపార సరుకుగా మార్చి కంపెనీలు, రాజకీయాలకు వాడుకొని పాలక పార్టీలు లాభపడుతున్నాయి. ప్రత్యేక దర్శనాలు, పుష్కరాలు, మేళాలు, ఇస్తమాలు, స్వస్థత సభలకు లక్షల సంఖ్యలో జనాన్ని పోగేస్తున్నారు. అసౌకర్యాల నడుమ జరుగుతున్న తొక్కిసలాటల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు దేశంలో జరిగిన కొన్ని ప్రధాన తొక్కిసలాటల్లో చనిపోయిన వారిలో అత్యధికులు పేదలు, శూద్రులు, దళితులు, గిరిజనులు మాత్రమే. 1954 ఫిబ్రవరి 3న అలహాబాద్ కుంభమేళాలో దాదాపు 800 మంది, 1986 ఏప్రిల్ 14 హరిద్వార్‌లో 46 మంది, 1996 జులై 15న మధ్యప్రదేశ్ ఉజ్జయిని ఘటనలో 60మంది, 1999 జనవరి 14న శబరిమలై దుర్ఘటనలో 53మంది, 1996 సెప్టెంబరు 18న కోల్‌కతాలో 35 మంది, 2003 ఆగస్టు 27న నాసిక్ కుంభమేళాలో 29 మంది, 2005 జనవరి 25న మహారాష్ట్ర సతారాలో 300 మంది, 2008 సెప్టెంబరు 30న రాజ స్థాన్‌లోని చాముండి ఆలయ దుర్ఘటనలో 249 మంది, అదే ఏడాది ఆగస్టు 3న హిమాచల్‌ప్రదేశ్‌లో నైనాదేవి ఆలయం వద్ద 162 మంది, 2010 మార్చి 4న ఉత్తరప్రదేశ్ రాంజానకీ ఆలయంలో చోటు చేసుకున్న దుర్ఘటనలో 63 మంది, 2011 జనవరి 14న శబరిమలై సంఘటనలో 106 మంది మృత్యువాత పడ్డారు. 2013 అక్టోబరు 14న మధ్యప్రదేశ్‌లో దేవీ నవరాత్రుల సందర్భంగా 115 మంది, అదే ఏడాది అలహాబాద్ కుంభమేళాలో 37 మంది, 2015 జులై 14న రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో 28 మంది మరణించారు. ముస్లిం, క్రైస్తవ మత కార్యక్రమాల్లో కూడా ఇలాంటి మరణాలు అనేకం జరిగాయి. 2000 తర్వాత పూర్తిగా మతపరమైన కార్యక్రమాలు మాత్రమే ప్రసారం చేసే ఛానళ్లు దేశంలోనూ, రాష్ట్రంలోనూ పెరిగాయి. వ్యాపారానికి మతంతో పని లేదనేందుకు చక్కటి ఉదా హరణ ‘జీ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్’. ఈ సంస్థ 2003లో ‘జీ జాగరణ్’ అనే హిందూ మత భక్తి ఛానల్‌ని, 2010లో ‘జీ సలామ్’ అనే ఇస్లాం భక్తి ఛానల్‌ను ప్రారంభించింది. ఎవరికి ఏం కావాలో అది చూపించడం అందరికీ మాత్రం కంపెనీల ప్రకటనలను ప్రచారం చేసి దేశీయ చిన్న, మధ్యతరహా కంపెనీలను దివాళా తీయించడం. టీవీలు మాత్రమే కాదు, యూట్యూబ్ ఛానళ్లు, పత్రికలు అనేకం భక్తి పేరుతో అత్యధిక లాభాల్లో నడుస్తున్నాయి. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మరింతగా పెరిగింది. రాందేవ్ పతంజలి వ్యాపారం వేల కోట్లకు పెరిగింది. డేరా బాబా లాంటివారు శతకోటీశ్వరులయ్యారు. ప్రభుభక్తిని ప్రదర్శించుకోవడానికి అనేక మంది పెట్టుబడిదారులు ప్రత్యేక భక్తి ఛానళ్లు పెట్టడం లేదా ప్రజాదరణ పొందిన ఛానళ్లలో భక్తి కార్యక్రమాల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు. వీటి ద్వారా కార్పొరేట్ కంపెనీలకు, బిజెపికి ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి. తమ సరుకుల ప్రచారంతో పాటు, లాభాలు రావడం కంపెనీల ప్రయోజనమైతే, ప్రజల విశ్వాసాలను ఉప యోగించుకుని రాజ్యాధికారాన్ని కొనసాగించడం కేంద్ర ప్రభుత్వానికి ప్రయోజనం. వీరి మాయలో పడకుండా సాధారణ ప్రజలను కాపాడుకోవడం లౌకిక, ప్రజాతంత్రవాదుల బాధ్యత. లేకపోతే పండుగలు, ఉత్సవాలు, పుష్కరాలు, కుంభమేళాలు వ్యాపారంగా మారిపోతాయి.
Comments