మొక్కు తీర్చుకున్న గొండు శంకర్
ఇండిపెండెంట్‌గా పోటీకి రెడ్డి చిరంజీవులు సిద్ధం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించిన గొండు శంకర్ అభ్యర్థిత్వంపై ఉన్న సందిగ్ధం మంగళవారం వీడిపోయింది. చంద్రబాబు పర్యటన వరకు తమ నిర్ణయాన్ని ప్రకటించని గుండ దంపతులు ఆయన్ను కలిసిన తర్వాత తాము ఈ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నామని ప్రకటించారు. చంద్రబాబు వద్ద కూడా ఎటువంటి ప్రతిపాదనను అంగీకరించకుండా, కేవలం లక్ష్మీదేవికి టిక్కెట్ కావాలన్న ఒకే ఒక్క డిమాండ్‌ను ఉంచి, అది కుదరకపోవడంతో శంకర్ కోసం పని చేసే ప్రసక్తే లేదని, ఏకంగా రాజకీయాల నుంచి సెలవు తీసుకుంటున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. సరిగ్గా అదే సమయానికి టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ బలగ 1వ వార్డులో ఉన్న భద్రమ్మతల్లి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కట్ చేస్తే.. అదే భద్రమ్మకు కొబ్బరికాయ కొట్టి టీడీపీ అభ్యర్థిగా తానూ బరిలో ఉంటానని బలగ నాయకుడు రెడ్డి చిరంజీవులు అమ్మవారి సాక్షిగా ప్రకటించారు. టీడీపీ తరఫునే తానూ ప్రచారం చేస్తానని, బి`ఫారం రాకపోతే ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని చెప్పుకొచ్చారు. తన ప్రచారానికి నగరంలో ఎటువంటి అవాంతరాలూ ఉండకూడదంటూ గొండు శంకర్ అమ్మవారికి మొక్కుకున్న వెంటనే రెడ్డి చిరంజీవులు ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని ప్రకటించారు. ఈ రెండిరటికీ సాక్షి బలగ భద్రమ్మతల్లే. ఎమ్మెల్యేగా ఓడుతానో, గెలుస్తానో పక్కన పెడితే నగరంలో తన బలమెంతో నిరూపించుకోడానికి ఇదో అవకాశమని రెడ్డి చిరంజీవులు ‘సత్యం’కు తెలిపారు. నగర రాజకీయాల్లో తన కుటుంబం రాణించాలనుకుంటున్న నేపధ్యంలో తనకున్న బలమేంటో తెలుసుకునేందుకు ఇండిపెండెంట్‌గా నిలబడుతున్నట్లు ఆయన ప్రకటించారు. సామాన్య కార్యకర్తగా వచ్చి గొండు శంకర్ తెలుగుదేశం టిక్కెట్ తెచ్చుకోవడం తనకు స్ఫూర్తినిచ్చిందని, భవిష్యత్తులో తన సత్తా తెలిస్తే పార్టీ గుర్తించే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. నిజంగా చిరంజీవి తన బలం నిరూపించుకోవడం కోసం ఇండిపెండెంట్‌గా నిలబడుతున్నారా? లేదూ అంటే.. ధర్మానకు పరోక్షంగా సహకరించడం కోసం పోటీ చేస్తున్నారా? అనేది తేలాలంటే చిరంజీవులుకు వచ్చే ఓటు ఎవరిదన్న విషయం ముందు స్పష్టం కావాలి. రెడ్డి చిరంజీవులు మేనకోడలి భర్తే ప్రస్తుతం నగర వైకాపా అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు గుండ కుటుంబం ఎన్నికల బరిలో లేకపోవడం వల్ల ఏ ఓటు ఎటు వెళ్తుందనేది మరికొద్ది రోజులు ఆగితే గాని తెలియదు. గుండ లక్ష్మీదేవి శంకర్‌కు సహకరించడంలేదు కాబట్టి ఆ ఓటు ధర్మాన వైపు వెళ్లకుండా రెడ్డి చిరంజీవులు తీసుకుంటే ధర్మానకు నష్టం జరుగుతుంది. లేదూ.. బలగ వెలమ వార్డుల్లో టీడీపీకి ఊపు ఉంది కాబట్టి దాన్ని చీల్చగలిగితే శంకర్‌కు నష్టం కలుగుతుంది. ఏది ఏమైనా నామినేషన్ల ప్రక్రియ పూర్తయి, ప్రచారం మొదలయ్యే వరకు దీనిపై సమగ్రమైన అవగాహన రావడం కష్టం.
Comments