ఎన్‌హెచ్‌ఎం డీపీఎంవోదే అక్కడ హవా
సస్పెండ్ చేస్తానంటూ బెదిరింపులు
బేరం కుదిరాక పంపకాలు
అన్ని ప్రాజెక్టులపైనా ఆజమాయిషీ
పీజీ రిలీవ్ కోసం వసూళ్లు
కులం, రాజకీయం కలిపి సవారీ

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
‘‘మీ పీహెచ్‌సీలో ఇమ్యూనైజేషన్ శాతం ఎందుకు ఇంత తక్కువ ఉంది? ఆర్‌సీహెచ్ ప్రోగ్రాంలో చైల్డ్ హెల్త్‌కేర్ చూడమంటే మీ మండలంలో రక్తహీనత ఉన్న బాలికలు ఎందుకు కనిపిస్తున్నారు? కిశోర బాలిక సంరక్షణ కింద ఏం చేస్తున్నారు? టీబీ, లెప్రసీ, ఎయిడ్స్ కేసులకు సంబంధించిన రికార్డులు తీసుకురండి. ఒక్కరు కూడా సరిగ్గా పని చేయడంలేదు. మీ అందర్నీ సస్పెండ్ చేస్తా.. ఖబడ్దార్!’’ అంటూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఇటీవల రెచ్చిపోతున్న అధికారి కొత్తగా వచ్చిన డీఎంహెచ్‌వో అనుకుంటే తప్పులో కాలేసినట్టే. పోనీ ఈ బెదిరిస్తున్న అధికారైనా వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా.. అంటే అదీ లేదు. అటు డీఎంహెచ్‌వో, ఇటు ఈ హల్‌చల్ వైద్యుడు కలిసి క్విడ్ ప్రో కో పద్ధతిలో 30:70 నిష్పత్తిలో సొమ్ములు పంచుకోవడం కోసం కలిసి ఆడుతున్న నాటకమిది. ఇంతా చూస్తే జిల్లాలో అమలవుతున్న నాలుగు ప్రోగ్రామ్‌లకు నలుగురు అధికారులు ఉండగా, అందులో అర్బన్ పీహెచ్‌సీలను పర్యవేక్షించే డీపీఎంవో ఈయన. అలాగే ఇమ్యూనైజేషన్ ప్రాజెక్టుకు ఒకరు, ఆర్‌సీహెచ్ ప్రాజెక్టుకు మరొకరు, ఆర్‌బీఎస్‌కేకు ఇంకొకరు, టీబీ, లెప్రసీ, ఎయిడ్స్ కంట్రోల్‌కు మరొకరు ప్రోగ్రాం మేనేజింగ్ ఆఫీసర్లు ఉంటారు. వీరందరి పనితీరును పర్యవేక్షించాల్సింది జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి. కానీ నిండా 35 ఏళ్ల వయసు దాటని ఒక వైద్యాధికారి కుసిమి పీహెచ్‌సీలో వైద్యుడిగా పని చేస్తూ నాలుగున్నర సంవత్సరాలైన తర్వాత ఫారెన్ సర్వీస్ కింద డీఎంహెచ్‌వో ఆఫీసుకు ఎన్‌హెచ్‌ఎం ప్రాజెక్టుకు డీపీఎంవోగా జాయినయ్యారు. ఇప్పుడు ఆ డీపీఎంవో డాక్టర్ బి.రవీంద్ర కథే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. సాధారణంగా కుసిమిలో వైద్యుడిగానో, ఎన్‌హెచ్‌ఎం డీపీఎంవోగానో మాత్రమే వ్యవహరించివుంటే ఈ కథనం అవసరం వచ్చివుండేది కాదు. కానీ జిల్లాకు ఇటీవల బదిలీల్లో కొత్త డీఎంహెచ్‌వో వచ్చిన తర్వాత ఎన్‌హెచ్‌ఎం డీపీఎంవో డాక్టర్ బి.రవీంద్ర ఇప్పుడు వైద్య ఆరోగ్యశాఖలో షాడో డీఎంహెచ్‌వోగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ఈయన నగరంలో ఉన్న ఆరు అర్బన్ హెల్త్ సెంటర్లు, పలాసలో ఉన్న రెండు, ఇచ్ఛాపురంలో ఉన్న మరో రెండు అర్బన్ హెల్త్ సెంటర్లు కలిపి మొత్తం 10 అర్బన్ హెల్త్ సెంటర్లను పర్యవేక్షించాల్సి ఉంది. కానీ డీఎంహెచ్‌వో అండదండలు పుష్కలంగా ఉండటంతో ఆయన రూరల్ పీహెచ్‌సీలకు కూడా వెళ్లి ఆజమాయిషీ చెలాయిస్తున్నారు. అక్కడ జరిగే వివిధ కార్యక్రమాలను పరిశీలించినట్టు నటించి అందరి మీదా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేస్తానంటూ భయపెడుతున్నారు. సాధారణంగా వైద్య ఆరోగ్యశాఖ అంటేనే ఖర్చులు, టార్గెట్‌లు కాగితాల మీద నడిచే శాఖ. ఇక్కడ దేనికీ ఒక లెక్కాపత్రం ఉండదు. దీనికి తోడు జాతీయ స్థాయిలో నిధులు సమకూరుతుండటం వల్ల వాటికి ఖర్చు చూపించడం కోసం కిందిస్థాయిలో ఏదో ఒకటి చేస్తుంటారు. అటువంటి చోట అక్రమాలు బయటకు తీసి చర్యలకు సిఫార్సు చేస్తే బాగుండేది. అలా కాకుండా కేవలం వారిని భయపెట్టి, ఆ తర్వాత బేరం కుదుర్చుకుని తనకు 30 శాతం, డీఎంహెచ్‌వోకు 70 శాతం కింద డీపీఎంవో వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు ఆయన ఎన్ని పీహెచ్‌సీలు తనిఖీ చేశారో.. అన్నింటిలోనూ సస్పెన్షన్ బూచి చూపించారు. వీరంతా శ్రీకాకుళంలో డీఎంహెచ్‌వో కార్యాలయానికి రావడం, ఆయన చెప్పిన రేటుకు సెటిల్ చేసుకోవడం మామూలైపోయిందని వినికిడి. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో వివిధ పీహెచ్‌సీల్లో డాక్టర్లుగా పని చేస్తున్న 19 మంది మెడికల్ ఆఫీసర్లకు ఈమధ్య పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేయడానికి సీట్లు వచ్చాయి. వీరందర్నీ రిలీవ్ చేయాలి. అయితే వీరి నుంచి డీఎంహెచ్‌వోకు రూ.10వేలు, మెడికల్ డైరెక్టరేట్‌కు రూ.10వేలు, తనకు రూ.3వేలు ఇవ్వాలని చెప్పి ఈ 19 మంది నుంచి పెద్ద మొత్తంలో సొమ్ములు వసూలు చేసి వారి ఎస్‌ఆర్‌లతో ప్రస్తుతం డాక్టర్ బి.రవీంద్ర డైరెక్టరేట్‌కు వెళ్లినట్లు తెలుస్తుంది. డాక్టర్లు సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలంటే రూ.10వేలు స్వయంగా ఒక డాక్టరైవుండి రవీంద్రే వసూలు చేస్తున్నారట. మరీ విచిత్రమేమిటంటే.. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో మెడికల్ ఆఫీసర్లుగా పని చేస్తున్నవారికి యూనియన్ నాయకుడిగా ఉన్న వైద్యుడి నుంచే డాక్టర్ రవీంద్ర రూ.10వేలు ముక్కుపిండి వసూలు చేశారని భోగట్టా. కుసిమి పీహెచ్‌సీలో రెండవ మెడికల్ ఆఫీసర్‌గా పని చేసినప్పుడు అక్కడ ఫార్మసిస్ట్ నుంచి రూ.70వేలు, ఏఎన్‌ఎం నుంచి రూ.50వేలు అప్పు తీసుకోవడం వల్ల ఈయన్ను ఎల్‌హెచ్‌ఎం ప్రాజెక్టుకు డీపీఎంవోగా ఫారమ్ సర్వీస్‌కు వెళ్లినప్పుడు అక్కడ మొదటి మెడికల్ ఆఫీసర్ ఈయన్ను రిలీవ్ చేయలేదు. అప్పట్నుంచి తనకు రాజకీయ పలుకుబడి ఉందని, ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సామాజికవర్గానికే చెందినవారని రుబాబు చేస్తూ ఇక్కడ పబ్బం గడిపేస్తున్నారు. అసలు తనకు సంబంధం లేని ప్రాజెక్టులు, పీహెచ్‌సీలను తనిఖీలు చేసి సొమ్ములు వసూలు చేయడం వెనుక డీఎంహెచ్‌వో పాత్ర ప్రధానమైనది. డాక్టర్ రవీంద్ర అర్బన్ పీహెచ్‌సీలతో పాటు హెల్త్ వెల్‌నెస్ సెంటర్లను కూడా పర్యవేక్షిస్తుంటారు. దీన్నే పూర్వం హెల్త్ సబ్‌సెంటర్లనేవారు. దానికి పేరు మార్చడం వల్ల ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్ అయింది. ప్రస్తుతం జిల్లాలో 472 కేంద్రాలు ఉన్నాయి. వీటన్నింటికీ ఇప్పుడు కొత్త పేరుతో బోర్డు పెట్టాలి. దీనికోసం ఒక్కో కేంద్రానికి రూ.5వేలు కేటాయించారు. ఒక ఫ్లెక్సీ కట్టడానికి ఎంతవుతుందో వేరేగా చెప్పనక్కర్లేదు. అలాగే అర్బన్ హెల్త్ సెంటర్లకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అని ఒకటుంటుంది. గత ప్రభుత్వం దీన్ని నిర్వహించడానికి ఏడాదికి రూ.25వేలు బడ్జెట్ కేటాయించేది. దీన్ని కొత్తగా లక్షకు పెంచారు. అంతే.. డీపీఎంవో రవీంద్ర ఛాంబర్ ఖాళీ ఉండటంలేదు. అర్బన్ పీహెచ్‌సీ క్లీనింగ్‌కు రూ.400 అయిందని బిల్లు పెడితే, పక్కన ఒక సున్నా చేర్చి రూ.4వేలు, అర్జంట్ మెడిసిన్ కొనుగోలు కింద వేలకు వేలు, డ్రిరకింగ్ వాటర్ సదుపాయం కింద వేలకు వేలు దొంగబిల్లులు పెట్టించి వీటిని విత్‌డ్రా చేయించడంలో బిజీగా ఉన్నారు.
అసలు కొత్త డీఎంహెచ్‌వోకు, డీపీఎంవోకు లింక్ ఎలా కుదిరింది? జిల్లాలో అందరి మీదా ఈయనెందుకు రుబాబు చేస్తున్నాడు? ఫోన్‌పేల ద్వారా ఎవరికి సొమ్ములెస్తున్నాయ్? వంటి అంశాలతో మళ్లీ కలుద్దాం.
Kommentare