top of page

భోగాపురంలో పొగడ్తల టేకాఫ్!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Aug 4
  • 3 min read

చూసేవన్నీ నిజాలు కావు.. అన్న నానుడి పూర్వకాలం నుంచే ఉంది. అలాగే చూసే కళ్లను బట్టే సంఘటనలు, వాటికి అర్థాలు కూడా మారిపోతుంటాయన్నది అనుభవైకవేద్యమే. మిగతా రంగాల సంగతి ఏమో గానీ.. రాజకీయాల్లో మాత్రం ఈ నానుడిలు అతికినట్లు సరిపోతాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. అలాగే శాశ్వత శత్రువులు కూడా ఉండరని తరచూ అంటుంటారు. దానికి తగినట్లే ఒక్క క్షణం ముందు వరకు మిత్రులుగా ఉన్నవారు అంతలోనే ప్లేటు ఫిరాయించేసి శత్రువులుగా మారిపోతుంటారు. ఆరోపణలు, విమర్శలతో కత్తులు నూరుతుంటారు. అదేవిధంగా నిన్నటివరకు శత్రువులుగా ఉన్నవారు టర్మ్స్ కుదిరితే మాత్రం అన్నింటినీ పక్కన పడేసి భాయి భాయి అనుకుంటూ షేక్‌హ్యాండ్లు ఇచ్చుకుంటుంటారు. రాష్ట్రంలో 2024 ఎన్నికల నుంచి అదే జరుగుతోంది. అవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంతవరకు కత్తులు దూసిన పక్షాలే.. పొత్తుల బేరం కుదరడంతో కత్తులు పారేసి కరచాలనాలు చేసుకున్నాయి. ఎన్నికల్లో విజయం కూడా సాధించి భాగస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాయి. సరే ఇదంతా తెలిసిందే కదా.. మరి ఇప్పుడ ఎందుకు ఈ ప్రస్తావన అంటే. ఈ మధ్యకాలంలో కూటమి పక్షాల మధ్య పరస్పర పొగడ్తలు, ఆకాశంలో విహరింపజేయడాలు మరీ శృతిమించిపోతున్నాయి. ఈ పోకడలకు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషల్ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ ఘట్టం తాజా ఉదంతంగా నిలిచింది. గతంలో తెగడ్తలతో తిట్టిపోసుకున్న కేంద్ర, రాష్ట్ర పాలక పార్టీలు పొత్తులు కుదరగానే తెగడ్తలను కాస్త పొగడ్తలుగా మార్చేశాయి. 2019 ఎన్నికల్లో ప్రధాని మోదీని, బీజేపీని తీవ్రంగా దూషించిన నోటితోనే చంద్రబాబు అండ్ కో 2024 ఎన్నికల్లో మోదీ భజన ప్రారంభించారు. అదే రీతిలో జనసేనాని పవనకల్యాణ్ పిడికెడు మట్టి, పాచిపోయిన లడ్లు ఇచ్చారని విమర్శించిన నోటితోనే నేడు అదే మోదీని దేవుడు, ఆపద్బాంధవుడు అని ఆకాశానికెత్తేస్తున్నారు. ఇక విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమమైతే మోదీ భజన కార్యక్రమంగా మారిపోయిందని సోషల్ మీడియా కోడై కూస్తున్నది. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి ప్రభుత్వ అధిపతులు రాష్ట్రాల్లో పర్యటించడం సాధారణాంశం. ఆయా సందర్భాల్లో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో అయితే ఏదో ప్రోటోకాల్ మర్యాదలు చేసి మమ అనిపిస్తారు. అదే సొంత పార్టీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో అతిథి మర్యాదలు పతాకస్థాయిలో ఉంటాయి. అలాగే మిత్రపక్షాల ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంటుంది. కానీ అన్నింటికీ కర్త కర్మ క్రియ.. ప్రధానే అన్నంత స్థాయిలో భజనలు మాత్రమే దాదాపు కనిపించవు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రధాని మోదీ ఈ స్థాయిలోనే స్వాగత సత్కారాలు, భుజకీర్తులు అందుకుంటున్నారు. ఏఎసఆర్ విమానాశ్రయ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రసంగాలు మోతాదుకు మించి పీక్ స్థాయిలో ఉన్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మోదీ సొంత పార్టీ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల పాలకులు కూడా ఈ స్థాయిలో ఆకాశానికి ఎత్తిన పరిస్థితి ఎప్పుడూ కనిపించలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పొగడ్తలు ఏ స్థాయికి చేరాయంటే ఉన్నతమైన రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబే స్వయంగా మోదీకి జై కొట్టడమే కాకుండా.. సభికుల చేత కూడా జై జై నినాదాలు చేయించడం బహుశా మరే రాష్ట్రంలోనూ కనిపించదేమో. మోదీ లేకపోతే ఆంధ్రప్రదేశ్‌కు మనుగడే లేదన్నట్లుగా ప్రసంగించారు. అలాగే మరో మిత్రపక్ష నేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పవన్‌కల్యాణ్ అయితే మరో అడుగు ముందుకేసి మోదీ పాదాలకు వందనాలు అని చెప్పడం, ఆయన్ను తిడితే తన గుండె తరుక్కుపోతుందని వ్యాఖ్యానించడం కాస్త ఎబ్బెట్టుగా అనిపించాయి. ప్రధానిగా మోదీ పడుతున్న కష్టం తనకు తప్ప ప్రజలతో సహా ఇంకెవరికీ తెలియదన్నట్లు మాట్లాడారు. అక్కడితో ఆగకుండా ఢిల్లీలో ఇటీవల జరిగిన నీట్ లీకేజీ వ్యతిరేక ఉద్యమంలో కాక్రోచ్ పార్టీ నేతలు ప్రధానిని వ్యక్తిగతంగా దూషించడం తనకు కన్నీళ్లు తెప్పించిందని ఆక్రోశించారు. ఈ మాటలును ఎద్దేవా చూస్తే సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఇదే నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా పదుల సంఖ్యలో విద్యార్థులు మనస్తాపానికి గురై ప్రాణాలు విడిచినప్పుడు ఒక్క చుక్క కన్నీరైనా.. చివరికి ఒక్క సానుభూతి మాటైనా పలకని పవన్‌కల్యాణ్.. మోదీని దూషించినంత మాత్రానే కన్నీళ్లు ఒలకబోయడం ఏమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేశ అత్యున్నత నాయకుడైన ప్రధానిని, ఆయన తల్లిని వ్యక్తిగతంగా నీచమైన పదజాలంతో దూషించడం పరమ నీచకృత్యం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ దుష్కృత్యానికి పాల్పడిన వారిని చీల్చి చెండాడల్సిందే.. కఠినంగా శిక్షించాల్సిందే. అందులో ఎటువంటి భిన్నాభిప్రాయానికి తావులేదు. కానీ అదే సమయంలో బాధిత విద్యార్థుల ఘోష కూడా పట్టించుకోవాలి కదా! అన్నదే ఇక్కడ ప్రశ్న. పాపం.. ఈ పొగడ్తల పోటీలో మోదీ సొంత పార్టీ నేతలే వెనుకబడిపోయారన్న భావనను ఆనాటి ప్రసంగాలు కల్పించాయి. కేంద్ర, రాష్ట్రాల మధ్య సుహృద్భావ సంబంధాలు ఉండాల్సిందే. వివాదాలు, గొడవలు, వివక్షలతో అభివృద్ధికి గండి కట్టేకంటే.. పరస్పర సహకారంతో పనిచేస్తే ప్రగతి పరుగులు తీస్తుందన్నది వాస్తవం. అదే సమయంలో దేశనాయకుడు రాష్ట్రానికి వచ్చి సగౌరవంగా ఆహ్వానించాలి, మర్యాదలు చేయాలి. అయితే అదే సమయంలో ఎవరికివారు తమ హుందాతనాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తెరిగి వ్యవహరించాలి. కూటమి ప్రభుత్వం ఉన్నందున కేంద్రం రాష్ట్రానికి విరివిగా ప్రాజెక్టులు, నిధులు ఇస్తుంది కదా.. ఆమాత్రం మర్యాద ఇవ్వడంలో తప్పులేదు కదా? అన్న ప్రశ్నలు కూడా తలెత్తవచ్చు. అయితే అవేవీ ఉత్తపుణ్యానికి ఇవ్వడం లేదు.. రాష్ట్రాల నుంచి అందే పన్ను ఆదాయంలో మన వాటా మాత్రమే ఇస్తున్నారన్నది గ్రహించాలి. అయితే నిధుల విడుదలలో జాప్యం లేకుండా ఇస్తున్నందుకు కృతజ్ఞతతో వ్యవహరించవచ్చేమో గానీ.. ఇలా సాగిలబడాల్సిన అవసరం మాత్రం లేదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page