భజనబృందాన్ని వెనక్కు పంపిన వైనం
అన్యమతాలవారి అభ్యంతరానికి స్పందించడం సరికాదు
అసలు ఈ కోవెల ఎలా ప్రాచుర్యంలోకి వచ్చిందో గుర్తెరగాలి
ఈవో తీరుపై భక్తులు సైతం విమర్శలు
పైఅధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన భజన బృందాలు
సాయంత్రం భజన చేసుకోండంటూ దిగివచ్చిన ఈవో
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
కొన్నవీధి భీమేశ్వర ఆలయానికి 25 ఏళ్ల క్రితం వరకు అంతంత మాత్రంగా వచ్చే భక్తుల సంఖ్య నేడు ఎంతగానో పెరగడానికి, ఈ కోవెల ప్రాచుర్యంలోకి రావడానికి కారణం ఇక్కడ పలు బృందాలు చేసే మేలుకొలుపులు, భజన కార్య క్రమాలే. అలాంటిది కేవలం ఎవరో అన్యమతస్తు లు ఫోన్ చేస్తున్నారని చెబుతూ కార్తీకంలో ప్రతీ సోమవారం చేసే భజనను ఇక్కడ పెట్టవద్దంటూ ఆపేయించారు ఈ ఆలయ ఈవో. ఈ విషయం పైఅధికారుల వరకు వెళ్లడంతో సాయంత్రం భజన పెట్టుకోవాలని ఈవో కోరారు.

కొన్నవీధి భీమేశ్వరాలయం, తుమ్మావీధి లక్ష్మీనరసింహస్వామివారి కోవెల, అలాగే దూదివారి కోవెల (చిన్నబజారు వేంకటేశ్వర ఆలయం) ఈవో మాధవి పరిధిలోకి వస్తాయి. ఈమె ఎప్పుడో చుట్టంచూపుగా ఈ ఆలయాలకు వచ్చి బయటి నుంచి చూసు కొని వెళ్లిపోవడమే తప్ప, ఈ ఆలయాల పరిసరాలను సైతం కనీసం పట్టించుకున్న దాఖలాలే లేవని ఆలయ పూజారులే ఆరోపి స్తున్నారు. కార్తీకంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటం, ఆలయానికి ఆదాయం వచ్చే సమయం కావడంతో భీమేశ్వరాలయానికి చుట్టంచూపుగా సోమవారాలు వచ్చి కొద్ది సేపు ఉండి వెళ్లిపోతుంటారు. గతంలో ఉండే ఈవోలు ఇక్కడ భజన జరిపే భక్త బృందాలను అభినందిస్తూ వారికి టీ, టిఫిన్ వంటి కనీస సౌకర్యాలు వారంతట వారే అందించేవారు. అయితే ప్రస్తుతం కొత్తగా (అంటే ఏడాది దాటిందిలెండి) వచ్చిన ఈవో మాధవి మాత్రం భజన బృందాలను కనీసం పట్టించుకోపోవడం శివుడెరుగు.. కార్తీక మొదటి వారమే భజన చేస్తుండగా మైకులు సౌండ్ తగ్గించేయడం, ఆపేయడం చేశారు. తీరా రెండోవారం ఎవరో కంప్లైంట్ ఇస్తున్నా రంటూ వచ్చి భజనే చేయొద్దని బృందాన్ని వెనక్కి పంపారు. కోవెల బయట నుంచి చూసుకుని వెళ్లిపోయే ఈమె భజన ఆపిం చేయడం పట్ల ఆలయానికి వచ్చే భక్తులు ప్రశ్నిస్తున్నారు. తమ మనోభావాలు దెబ్బతిం టున్నాయని, ఇది సరికాదని, ఎవరో ఒక అన్యమతస్తుడు ఫిర్యాదు చేశాడన్న నెపంతో ఈవో స్థాయి వ్యక్తి స్వామివారి సన్నిధిలో భజన ఆపించేయడం సరికాదంటున్నారు. గంటో రెండో గంటలో ఆలయ సన్నిధిలో చేసే భజనను ఆపే ఈవో మాధవి హిందువు కాదా అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై పలు భజన బృందాలతో కలిసి పైస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడానికి భీమేశ్వర భజన బృందం సభ్యులు సిద్ధమవుతున్నారు. దీనిపై పైస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భీమేశ్వర దర్శనానికి వచ్చే భక్తులకు ఆదాయం కోసం పలు మార్గాలు ఏర్పాటుచేసే ఆలోచన ఉన్న ఈవోకు ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేసినప్పుడు ఆమాత్రం సమాధానం చెప్పుకోలేరా అని భక్తులు విమర్శిస్తున్నారు.
25 సంవత్సరాలుగా..
గత 25 సంవత్సరాలుగా నిరంతరాయం గా ఆలయ విశిష్టత నగర చుట్టుపక్కల తెలిసేలా వివిధ భజన బృందాలను మిళితం చేసుకొని ధనుర్మాస మేలుకొలుపులు నిర్వ హించింది భీమేశ్వర భజన బృందం. అలాగే సంక్రాంతి నాడు 24 గంటలపాటు భజన (ఏకాహం) నిర్వహించడం, ప్రతీ శివరాత్రి నాడు, కార్తీక సోమవారాల్లో రూపాయి కూడా తీసుకోకుండా ఉదయంపూట రెండు మూడు గంటలు భజన చేసేవారు. ఈ మేలుకొలుపులతో పాటు నగరంలో తిరువీధి నిర్వహించడంతో రోడ్డుపక్కనే ఉన్న కొన్న వీధికి వెనుకవైపు జంగాలవీధిలో ఉన్న ఈ ఆలయం గురించి ప్రజలకు తెలిసిందన్న విషయాన్ని ఈవో మాధవి మర్చిపోకూడదు.
మారిన ఈవో మనసు
స్థానిక కొన్నవీధిలో కొలువై ఉన్న శ్రీ రాజ రాజేశ్వరి సహిత భీమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం ఉదయం 3 గంటల నుంచే భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఈ సందర్భంగా కొందరు ఉచిత ప్రసాదాలను అందజేశారు. కాగా భజన ఆపేయించిన విషయం పైఅధికారుల వరకు వెళ్లడంతో వారి సూచన మేరకు సాయంత్రం భజన చేయించుకోవాలని ఈవో కోరారు.
Comentarios